“ఇప్పటికి ఇంకా జస్టిస్ పి సి ఘోష్ ఏమి రాశారో, ఆ 650 పేజీల తిలకాష్ఠమహిషబంధనం బైటపడలేదు గనుక ఆ నివేదిక మీద వ్యాఖ్యానించడం న్యాయం కాదు. ఆ నివేదికను అధ్యయనం చేసి సారాంశం వివరించమని ప్రభుత్వం ముగ్గురు అధికారుల బృందాన్ని నియమించగా, ఆ బృందం రెండంటే రెండు రోజుల్లో ఆ 650 పేజీలు చదివి, 60 పేజీల సారాంశం తయారు చేసింది. ప్రస్తుతానికి ఆ సారాంశం మీదనే వ్యాఖ్యానించే అవకాశం ఉంది.”
న్యాయమూ లేదు, విచారణా లేదు”!! – జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ న్యాయ విచారణ కమిషన్ నివేదిక సారాంశం చూడగానే ముప్పై ఏళ్ల కిందటి ఆ శీర్షిక గుర్తొచ్చింది. జర్నలిస్టు గులాం రసూల్ ను, ఆయనతో పాటు ఉన్నందువల్ల సాక్ష్యం చెపుతాడేమోనని విజయ ప్రసాద్ అనే స్నేహితుడిని బూటకపు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపిన సందర్భం అది. జర్నలిస్టుల ఆందోళన ఫలితంగా అప్పటి నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వం జస్టిస్ టి ఎల్ ఎన్ రెడ్డి న్యాయవిచారణ కమిషన్ ను నియమించింది. ఆ ఇద్దరినీ కాల్చి చంపిన ఎన్ కౌంటర్ నిజమైన ఎదురుకాల్పులేనా, వారిని పట్టుకుని కాల్చి చంపారా అని తేల్చవలసిన న్యాయ విచారణా కమిషన్, అసలు ఆ ప్రశ్న జోలికి వెళ్లకుండా, ఆ ఇద్దరూ నక్సలైట్లే అని నిర్ధారించడానికి విశ్వప్రయత్నం చేసింది. ఆ కమిషన్ నివేదిక వెలువడగానే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం సంయుక్తంగా వేసిన ఒక చిన్న విమర్శనాత్మక పుస్తకానికి బహుశా డా. కె బాలగోపాల్ పెట్టిన శీర్షిక అది: ‘న్యాయమూ లేదు, విచారణా లేదు!’
‘న్యాయ విచారణ కమిషన్’ అనగానే న్యాయం జరుగుతుందనీ, విచారణ సక్రమగా జరుగుతుందనీ ఏమీ లేదు. ప్రభుత్వం వైపు నుంచి ఏవైనా అక్రమాలు జరిగి, వాటి మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడనప్పుడు న్యాయవిచారణ కమిషన్ వేయమని అడగడం ప్రజా ఉద్యమాలకు ఒకప్పుడు పరిపాటిగా ఉండేది. న్యాయస్థానాల విచారణ కన్నా ఎక్కువ పారదర్శకంగా, బహిరంగంగా జరిగే న్యాయవిచారణ వల్ల ఆ సమస్యకు సంబంధించిన అన్ని కోణాలూ బైటికి వచ్చి, ప్రజా చైతన్యం పెరగడానికి అవకాశం వస్తుందనే ఆశ ఉండేది. అయితే న్యాయవిచారణ కమిషన్ల సిఫారసులను తప్పనిసరిగా అమలు చేయాలనే నిబంధనేదీ చట్టంలోనే లేదు. ఆ నివేదికను, దానితోపాటు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ నూ శాసనసభలో ప్రవేశపెడితే చాలు! అలా న్యాయవిచారణ డిమాండ్ కూడా నిష్ప్రయోజకంగా మారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎమర్జెన్సీ ఎన్ కౌంటర్ల మీద జస్టిస్ భార్గవా కమిషన్ వంటి సక్రమంగా జరిగిన న్యాయవిచారణ అయినా, రమీజాబీపై అత్యాచారం మీద జస్టిస్ ముక్తధర్, గులాం రసూలు ఎన్ కౌంటర్ మీద, విప్లవ కార్యకర్తల మిస్సింగ్స్ మీద జస్టిస్ టిఎల్ఎన్ రెడ్డి వంటి అన్యాయమైన నివేదికలు అయినా న్యాయవిచారణ వల్ల తేలేదేమీ లేదని రుజువు చేశాయి.
తెలంగాణ ఏర్పడ్డాక తొలి తొమ్మిదిన్నరేళ్లలో అనేకసార్లు ప్రజా ఉద్యమాల వైపు నుంచి ఆ డిమాండ్ వచ్చినప్పటికీ కెసిఆర్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క న్యాయ విచారణ కమిషన్ కూడా వేయలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిశ ఎన్ కౌంటర్ విషయంలో జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ వేసినప్పటికీ, కొన్ని అంశాలలో మంచి నివేదికే వచ్చినప్పటికీ, ఆ సిఫారసుల మేరకు చర్యలేమీ అమలులోకి రాలేదు.
ఈ న్యాయవిచారణల చరిత్ర ఎందుకంటే, ప్రస్తుత జస్టిస్ పి సి ఘోష్ నియామకం కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్, 1952 కింద జరిగింది గనుక సాంకేతికంగా న్యాయవిచారణే అనాలి గాని, ఇక్కడ కూడా న్యాయమూ లేదు, విచారణా లేదు. ఎక్కువలో ఎక్కువ చెప్పాలంటే ఇందులో కొన్ని నిజాలున్నాయి, ఎక్కువ రాజకీయాలున్నాయి. ఆ నిజాలు తప్పనిసరిగా తెలంగాణ తెలుసుకోవలసినవే. కాని ఆ రాజకీయాలు స్పష్టంగానే దురుద్దేశాల దుర్గంధం వీస్తున్నాయి.
పూర్తి నివేదిక శాసనసభలో ఎట్లాగూ సమర్పించాలి, శాసనసభా సమావేశాలు ఇంకొక పది రోజుల లోపల జరుగుతాయంటున్నారు. అటువంటప్పుడు, ఇప్పటికిప్పుడు హడావుడిగా, రెండు రోజుల్లోపల సారాంశం తయారు చేయించి పత్రికా సమావేశం పెట్టవలసినంత తొందర ఏమి వచ్చిందో తెలియదు. ప్రతీకార రాజకీయాలు నడపాలనీ, ప్రత్యర్థుల మీద నిత్యం వ్యతిరేక ప్రచారం చేయాలనీ కోరిక మాత్రమే అందుకు కారణం కావచ్చు. ఈ అరవై పేజీల సారాంశం తెరవగానే, ఆ లక్ష్యమే కనబడుతుంది.
ఇప్పటికి ఇంకా జస్టిస్ పి సి ఘోష్ ఏమి రాశారో, ఆ 650 పేజీల తిలకాష్ఠమహిషబంధనం బైటపడలేదు గనుక ఆ నివేదిక మీద వ్యాఖ్యానించడం న్యాయం కాదు. ఆ నివేదికను అధ్యయనం చేసి సారాంశం వివరించమని ప్రభుత్వం ముగ్గురు అధికారుల బృందాన్ని నియమించగా, ఆ బృందం రెండంటే రెండు రోజుల్లో ఆ 650 పేజీలు చదివి, 60 పేజీల సారాంశం తయారు చేసింది. ప్రస్తుతానికి ఆ సారాంశం మీదనే వ్యాఖ్యానించే అవకాశం ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదన ప్రారంభమైనప్పటి నుంచీ అది విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. ఆ ప్రాజెక్టు డిజైన్ మీద, ఎత్తిపోతల ఆలోచన మీద, ఆనకట్టల, జలాశయాల, కాలువల స్థలాల మీద, వ్యయం మీద, ప్రకటిత లక్ష్యాల మీద, పారదర్శకత లేమి మీద ఎందరో విమర్శలు ప్రకటించారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక, పాలనాపరమైన, పారదర్శకతా అంశాలలో సందేహించవలసినవి ఎన్నో ఉన్నాయి. నావరకు నేనే గడిచిన తొమ్మిది సంవత్సరాలలో కనీసం పది వ్యాసాలు రాశాను. ఇంకా ఎక్కువ చోట్ల ఉపన్యాసాలు ఇచ్చాను. అలా అభ్యంతరాలు వ్యక్తం చేసినవారందరినీ అప్పటి పాలకులు “తెలంగాణ ద్రోహులు” “అభివృద్ధి నిరోధకులు” అని ముద్రలు కొట్టి బదనాం చేయడానికి ప్రయత్నించారు. తమ పనిలో ఏదైనా పునరాలోచించుకోవలసింది ఉందా, విమర్శకుల అభిప్రాయాలలో ఏదైనా స్వీకరించవలసింది ఉందా అనే కనీస ఆలోచనను కూడా ఆనాటి పాలకులు దరి జేరనీయలేదు. తెలంగాణకు ఏమి కావాలో తాము తప్ప మరొకరు సూచించడానికి కూడా వీలులేదని, గుత్తాధిపత్యంతో తాము ఏది ఇస్తే అది తీసుకోవలసిందేనని ప్రగల్భించారు. మొత్తంగా అన్ని విషయాలలో ఎంతో కొంత వ్యక్తమైన ఈ ధోరణే కాళేశ్వరం ప్రాజెక్టులో మరింత ఎక్కువగా కనబడింది.
అయితే విమర్శకుల అభిప్రాయాలను పాలకులు ఎంతగా తోసివేసినా, తొక్కిపట్టినా, దూషించినా, స్వయంగా ప్రకృతే ఆ అభిప్రాయాలను బలపరిచింది. మొదట 2022 జూలైలో గోదావరి వరదలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలలో అవకతవకలున్నాయని బయట పెట్టాయి. తర్వాత 2023 అక్టోబర్ లో మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు మరొకసారి ఆ అవకతవకలను ప్రపంచానికి చూపాయి. ఈ ఘటన సరిగ్గా ఎన్నికలకు నెల ముందు జరగడంతో అప్పటి ప్రతిపక్షానికి అది అనుకోని అవకాశంగా కలిసివచ్చింది. ఈ మధ్యలో 2023 మేలో వ్యాప్కోస్ మాజీ సిఎండి అక్రమాస్తుల మీద జరిగిన దాడి వ్యాప్కోస్ నివేదికల బండారాన్ని బైటపెట్టింది.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారానికి వచ్చిన నాలుగు నెలల్లోనే కాళేశ్వరం అక్రమాలను విచారించడానికి 2024 మార్చ్ 14న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఏకసభ్య కమిషన్ వేసింది. ఈ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఆనకట్టల మీద, అక్రమాలు, ప్రజాధనం వృథా, అవినీతి కార్యకలాపాలు అనే మూడు అంశాలు విచారించవలసి ఉండింది. పద్ధతి ప్రకారం ఏడు విచారణాంశాలు (టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్) నిర్ణయమయ్యాయి. కమిషన్ 2024 ఏప్రిల్ 27న పని ప్రారంభించి, విచారణ క్రమంలో 119 మంది సాక్షులను విచారించి, 2025 జూలై 31న ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది.
ఈ నివేదిక సరిగ్గా రాసి ఉంటే తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, నమ్మకద్రోహాన్ని, ప్రజాధనం వృథాను, రాజకీయ నాయకత్వపు నిరంకుశత్వాన్ని, అధికార యంత్రాంగపు అవినీతి, జీహుజూర్ జోహుకుం ప్రవృత్తిని, కాంట్రాక్టర్ల లాబీ రాబందు తత్వాన్ని వివరించే మంచి నివేదిక అయి ఉండేది. కాని ప్రస్తుత అధికారపక్షానికి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని బైటపెట్టాలనో, సవరించాలనో కోరిక ఏమీ ఉన్నట్టు లేదు. ఈ విచారణను, నివేదికను కేవలం ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకునే మార్గంగా, ప్రత్యర్థులను దెబ్బతీసే మరొక ఆయుధంగా మాత్రమే చూస్తున్నట్టుంది.
“కమిషన్ ఏర్పడిన తీరు, అసలు నివేదికలోని విషయసూచిక, విచారణాంశాలు, పరిశోధనా పద్ధతి వంటి ఆనవాయితీ అంశాలు అయిపోగానే “లోపాలకు బాధ్యత వహించే రాజకీయ నాయకత్వంపై కమిషన్ నివేదికలో ఉన్న విమర్శనాత్మక పరిశీలనలు” అని పద్నాలుగు పేజీల ఎంపిక చేసిన ఉటంకింపులున్నాయి. సారాంశం పద్ధతి ప్రకారం తయారై ఉంటే, ఒక్కొక్క విచారణాంశం మీద ఏ విచారణ జరిగిందో, ఏ నిర్ధారణలు వచ్చాయో చెప్పాలి. బాధ్యులెవరో తేల్చడం విచారణాంశాల వరుస ప్రకారం చూసినా చిట్టచివరిది, ఏడోది. కాని ప్రత్యర్థి రాజకీయ నాయకుల మీద బురద జల్లడమే సారాంశ రచయితల ఉద్దేశం గనుక అదే అన్నిటికన్నా ముందుకు వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు, అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి టి హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ల మీద కమిషన్ ఏమి వ్యాఖ్యానించిందో కొన్ని వాక్యాలు తీసి ముద్ద అక్షరాలలో మరీ సారాంశ రచయితలు ఇచ్చారు. ఆ వ్యాఖ్యల నిజానిజాల సంగతి అలా ఉంచి, ఏదో వాదనా క్రమంలో ఎక్కడో ఒకచోట అన్న ఒకటి రెండు మాటలను విడిగా బైటికి తీసి, ఎక్కువచేసి చెప్పడం సరైన పద్ధతి కాదు.”
పూర్తి నివేదిక శాసనసభలో ఎట్లాగూ సమర్పించాలి, శాసనసభా సమావేశాలు ఇంకొక పది రోజుల లోపల జరుగుతాయంటున్నారు. అటువంటప్పుడు, ఇప్పటికిప్పుడు హడావుడిగా, రెండు రోజుల్లోపల సారాంశం తయారు చేయించి పత్రికా సమావేశం పెట్టవలసినంత తొందర ఏమి వచ్చిందో తెలియదు. ప్రతీకార రాజకీయాలు నడపాలనీ, ప్రత్యర్థుల మీద నిత్యం వ్యతిరేక ప్రచారం చేయాలనీ కోరిక మాత్రమే అందుకు కారణం కావచ్చు. ఈ అరవై పేజీల సారాంశం తెరవగానే, ఆ లక్ష్యమే కనబడుతుంది.
కమిషన్ ఏర్పడిన తీరు, అసలు నివేదికలోని విషయసూచిక, విచారణాంశాలు, పరిశోధనా పద్ధతి వంటి ఆనవాయితీ అంశాలు అయిపోగానే “లోపాలకు బాధ్యత వహించే రాజకీయ నాయకత్వంపై కమిషన్ నివేదికలో ఉన్న విమర్శనాత్మక పరిశీలనలు” అని పద్నాలుగు పేజీల ఎంపిక చేసిన ఉటంకింపులున్నాయి. సారాంశం పద్ధతి ప్రకారం తయారై ఉంటే, ఒక్కొక్క విచారణాంశం మీద ఏ విచారణ జరిగిందో, ఏ నిర్ధారణలు వచ్చాయో చెప్పాలి. బాధ్యులెవరో తేల్చడం విచారణాంశాల వరుస ప్రకారం చూసినా చిట్టచివరిది, ఏడోది. కాని ప్రత్యర్థి రాజకీయ నాయకుల మీద బురద జల్లడమే సారాంశ రచయితల ఉద్దేశం గనుక అదే అన్నిటికన్నా ముందుకు వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు, అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి టి హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ల మీద కమిషన్ ఏమి వ్యాఖ్యానించిందో కొన్ని వాక్యాలు తీసి ముద్ద అక్షరాలలో మరీ సారాంశ రచయితలు ఇచ్చారు. ఆ వ్యాఖ్యల నిజానిజాల సంగతి అలా ఉంచి, ఏదో వాదనా క్రమంలో ఎక్కడో ఒకచోట అన్న ఒకటి రెండు మాటలను విడిగా బైటికి తీసి, ఎక్కువచేసి చెప్పడం సరైన పద్ధతి కాదు.
అందులోనూ కెసిఆర్ మీద ఎ నుంచి యు వరకు ఇరవై వ్యాఖ్యలు (కొన్నిటికి ఉపవ్యాఖ్యలు ఉన్నాయి గనుక అవి కూడా కలిపితే మొత్తం ఇరవై ఎనిమిది), హరీష్ రావు మీద పందొమ్మిది వ్యాఖ్యలు, ఈటల రాజేందర్ మీద ఒక వ్యాఖ్య – ఇదంతా అనుచితమైన, అనవసరమైన, ప్రతీ కారపూరితమైన కసరత్తు. పూర్తి నివేదిక బహిరంగంగా ప్రజల పరిశీలనకు రాకముందే ఆ ముగ్గురి మీద దురభిప్రాయాలు కలిగించడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నం.
అసలు నివేదికలో ఏమి ఉన్నదో గాని, ముఖ్యమంత్రి ఒక్కరి నిర్ణయం మీద మాత్రమే పనులు జరిగాయని, 2015లో నియమించిన నిపుణుల బృందం నివేదికను తొక్కిపెట్టారని, స్థల మార్పు గురించి తప్పుడు సమర్థనలు ఇచ్చారని, పాలనాపరమైన అనుమతులకు మంత్రివర్గ ఆమోదాలు లేవని, సమగ్రమైన డిపిఆర్ లేకుండానే పనులు మొదలయ్యాయని, నిధుల సేకరణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటయిన కార్పొరేషన్ సక్రమంగా పని చేయలేదని, కాంట్రాక్టర్లకు టర్న్ కీ పద్ధతిలో కాకుండా గుండుగుత్త పద్ధతిలో పనులు అప్పగించారని, పరిపాలనా అనుమతులు సక్రమగా లేవని, డిజైన్ రూపకల్పనలో వ్యాప్కోస్ పాత్ర అనుమానాస్పదమని, ఆపరేషన్ అండ్ మేంటెనెన్స్ కార్యకలాపాల మీద అసలు దృష్టి పెట్టలేదని, ఆనకట్టలను నీటి మళ్లింపు కోసం కాక జలాశయాలుగా వాడుకున్నారని, బ్యాంకు హామీలు ముందుగానే విడుదల చేయడానికి తప్పుడు కంప్లీషన్ సర్టిఫికెట్లు ఇచ్చారని, ప్రాజెక్టు డిజైన్ లోనే లోపాలున్నాయని, నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, నాణ్యతా నియంత్రణ చర్యలు జరగలేదని కమిషన్ నివేదికలో నిర్ధారించారని సారాంశం చెపుతున్నది.
రాజకీయ నాయకులతో పాటు, ఐఎఎస్ అధికారులను, ఇంజనీర్లను ఈ లోపాలకు బాధ్యులుగా చూపారని సారాంశం చెపుతున్నది. అనకపోతే బాగుండదన్నట్టుగా, ఎల్ అండ్ టి, ఆఫ్కాన్స్, నవయుగ కంపెనీల మీద కూడా బాధ్యత పెట్టిందని సారాంశం చెపుతున్నది. ఈ మొత్తం వ్యవహారానికి వ్యయం పెరుగుదల, అనవసరమైన వ్యయం, బడ్జెటేతర రుణాల సేకరణ, వడ్డీ భారం పెరుగుదల వంటి ఆర్థిక పర్యవసానాలున్నాయని కూడా నివేదిక నిర్ధారించింది.
నిజానికి ఈ విమర్శలన్నీ నా వ్యాసాలు, ఉపన్యాసాలతో సహా మరెందరి రచనల్లోనూ ఉన్నవే. కొట్టవేమీ కావు. కానీ తేడా ఏమంటే, అవి తెలంగాణ మీద ప్రేమతో, తెలంగాణకూ, తెలంగాణ ప్రజాధనానికీ అన్యాయం జరగగూడదనీ ఆకాంక్షతో, తెలంగాణ ప్రజాజీవిత నిర్ణయాలను నిరంకుశంగా తీసుకోగూడదనే ప్రజాస్వామిక స్ఫూర్తితో చేసిన విమర్శలు. ఇప్పుడు సారాంశం మాత్రమే చూసినా, దాని మీద మంత్రివర్గ వ్యాఖ్యలు చూస్తున్నా, ఈ విమర్శలకు తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజాధనం దుర్వినియోగం పట్ల అటువంటి నెనరు ఏమీ ఉన్నట్టు కనబడడం లేదు. తమ ప్రత్యర్థుల మీద బురద జల్లాలనే పాలకుల దుగ్ధ న్యాయవిచారణ నివేదిక, అధికారుల సారాంశం అనే రూపాల్లో వెలువడుతున్నట్టుంది.





