వెలుగుమట్ల వెలుగులు ఆర్పినదెవరు? ఎందుకు?

“భూదాన భూములు దేశవ్యాప్తంగానూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అతి ఎక్కువగా అత్యంత దారుణమైన కబ్జాలకు, ఆక్రమణలకు, అన్యాక్రాంతానికి బలి అయిపోయాయి. ఎక్కడైనా భూదాన భూమి ఉందని తెలిస్తే చాలు, రాజకీయ నాయకులు, అధికారులు, సంపన్నులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి దాన్ని స్వాహా చేయడం ఎట్లా అని ఎత్తులకు పై ఎత్తులు వేశారు. భూములను ఆక్రమించారు. తమ ఆశ్రితుల పేర్ల మీద పట్టాలు పుట్టించి తమ బేనామీ ఆస్తులు పెంచుకున్నారు. భూదాన యజ్ఞ బోర్డు ప్రభుత్వ, రాజకీయ నియామకాలే గనుక, బోర్డును కూడా ప్రభావితం చేసి, వ్యక్తులకు, సంస్థలకు, ప్రభుత్వ శాఖలకు ఇప్పించుకున్నారు. “భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేయడం” అనే వినోబా భావే ఆశయం ఎప్పుడో ధ్వంసమైపోయింది.”

telanganardham venugopal ఒక వేకువ జామున, అది ఆహ్లాదంగా ఉందో లేదో కూడా గుర్తించలేనంత ఘర్షణలో, నిద్రమత్తు వదిలించుకుని, దైనందిన గానుగెద్దు జీవితంలో పడిపోయేందుకు సిద్ధపడుతున్న తరుణంలో మీ ఇంటి ముందు తలుపు తెరిచేసరికి, ఎదురుగా వీథంతా వందలాది సాయుధులైన పోలీసులు కమ్ముకొని ఉన్నారనుకొండి. వారి రక్షణలో, పర్యవేక్షణలో లెక్కలేనన్ని బుల్డోజర్లు కవాతు చేస్తున్నాయనుకొండి. వీథుల్లో ఇరుగు పొరుగు ఇళ్ల వాళ్లందరూ పిల్లా జెల్లా ముసలీ ముతకా గగ్గోలు పెడుతూ చేతికందిన సామాను పట్టుకుని బైటికి పరుగుపెడుతున్న దృశ్యం కనబడిందనుకొండి. ముందురోజు రాత్రి కటిక చీకటిలో ఏదో భూకంపమో, ప్రళయమో, మరేదో ఉత్పాతమో వచ్చి, జనమందరూ కకావికలై, అసహాయులై హాహాకారాలు పెడుతుంటే, పాపం జనాన్ని రక్షించడానికి రక్షకభటులూ, శిథిలాల నుంచి మనుషులను తవ్వితీసి కాపాడడానికి బుల్డోజర్లూ వచ్చాయని మీకు ఒక్క క్షణం అనిపించవచ్చు.

కాని వాళ్లు అభాగ్యులైన ప్రజలను రక్షించే రక్షకభటులు కాదు, వెయ్యి కుటుంబాల జీవితాలను ఒక్కుమ్మడిగా పెకలించే ఒక మహా విధ్వంసక, దుర్మార్గ శక్తికి రక్షణ కల్పించడానికి వచ్చిన భటులు. అవి మనుషులను కొనప్రాణాలతో కాపాడే ఆర్తత్రాణ యంత్రాలు కావు, మనుషులనూ, వారి జీవితాలనూ, వారి కలలనూ ఆశలనూ, చిన్నపాటి ఆస్తులనూ నేలమట్టం చేసి పారేసే అరివీర భయంకర రాక్షస హస్తాలు.

ఇదంతా ఏదో సినిమా కాదు, కల్పనా కాదు. గత ఆదివారం ముసిముసి వేకువ ఖమ్మం శివార్లలోని వెలుగుమట్ల గ్రామంలో నవోదయ కాలనీ, వినోబా నగర్ లలో స్వయంగా ప్రభుత్వమే, అధికారులే జరిపించిన దుర్మార్గంలో ఒకానొక దృశ్యం. వెయ్యి కుటుంబాల భవిష్యత్తును ఉక్కుపాదం కింద చిదిమేసిన బీభత్సం. ప్రభుత్వమూ, మంత్రులూ, అధికారులూ, వారి ప్రత్యక్ష, పరోక్ష సమర్థకులూ ఆ బీభత్సాన్ని సహజమైనదిగా, చట్టబద్ధమైనదిగా, న్యాయమైనదిగా చూపడానికి చేస్తున్న వాదనలూ, లేవనెత్తుతున్న సందేహాలూ చూస్తుంటే, మన సమాజం ఎంతగా పుచ్చిపోయిందో మరొకసారి కనబడుతున్నది. ఒక అన్యాయాన్ని ఖండించడానికి అవసరమైన నైతిక దృతి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కాని కళ్ల ఎదుట కనబడుతున్న అసహాయుల హాహాకారాలను తోసివేసి, జరిగిన పని జరగవలసినదే అని అనడం, బాధితులు ఏదో తప్పు చేశారని, చేసి ఉంటారని, ప్రభుత్వ దుర్మార్గాన్ని సమర్థించడం, ప్రభుత్వ చర్య వెనుక ఉన్న రాజకీయ స్వార్థాన్ని విస్మరించడం కనీస మానవ స్పందనేనా అని అడగవలసి ఉన్నది.

“భూదాన్ భూములలో భూమిలేని నిరుపేదలకు దక్కిన ఎంతో కొంత భూమి మినహా మిగిలినదంతా కొత్తగా అన్యాక్రాంతం కావడానికి, కబ్జాదార్లు స్వాహా చేయడానికి మార్గం సిద్ధమయింది. ఎక్కడైనా నిరుపేదలకు దక్కిన భూమిని కూడా సంపన్నులు, రాజకీయవేత్తలు, అధికారులు కలిసి భోంచేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. వెలుగుమట్ల భూదాన్ భూమిలో, భూదాన్ యజ్ఞ బోర్డు చేసిన పంపిణీలో భూమి పొంది, చిన్నవో పెద్దవో ఇళ్లు నిర్మించుకుని పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఏర్పాటు చేసుకున్న కాలనీల మీద బుల్డోజర్ దాడిని ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి.”

అటువంటి అన్యాయమైన సమర్థనలు కూడా వస్తున్నాయి గనుక ఈ బీభత్సానికి సంబంధించిన పూర్వాపరాలన్నీ కూలంకషంగా చర్చించాలి. ఇప్పటికి దొరుకుతున్న ఆధారాలను బట్టి 1954-55 పహణీలో వెలుగుమట్లలోని 147, 148, 149 సర్వే నంబర్లలో 62 ఎకరాల ఏడు గుంటల భూమి వినోబా భావే పేరు మీద ఉంది. ఇరుగు పొరుగు సర్వే నంబర్లలో కాల్వ వెంకట రంగారావు అనే భూయజమాని పేరు ఉంది గనుక బహుశా ఈ భూమి ఆయన వినోబా భావేకు దానం చేసి ఉంటారని అనుకోవచ్చు.

వినోబా భావే అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో భూదాన యజ్ఞాన్ని ప్రారంభించారని అందరికీ తెలుసు. తెలంగాణలో భూయాజమాన్యంలో విపరీతమైన అసమానతల వల్ల, ఒకవైపు కొద్ది మంది వందల, వేల ఎకరాల భూస్వాములు, మరొకవైపు లక్షలాది భూమి లేని నిరుపేద రైతాంగం ఉండడం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికీ, రక్తపాతానికీ దారి తీసిందని గుర్తించి, వినోబా భావే దానికి పరిష్కారం కనిపెట్టాలనుకున్నారు. ఆ భూఅసమానతలను రక్తరహిత విప్లవంతో పరిష్కరిస్తానని 1951లో, ఇంకా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ జరగకముందే ఆలోచన ప్రారంభించారు. వందలాది, వేలాది ఎకరాల భూయజమానులను కలిసి, వారికి నచ్చజెప్పి, హృదయ పరివర్తన కలిగించి, వారి నుంచి భూమిని దానంగా పొంది, దాన్ని భూమిలేని నిరుపేదలకు పంచుతానని అన్నారు.

ఆ ఆలోచనతో మొదటిసారిగా అప్పటి నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో మూడున్నర వేల ఎకరాల భూస్వామి వెదిరె రామచంద్రా రెడ్డి 1951 ఏప్రిల్ 18న మొదట వంద ఎకరాల భూమిని దానం చేయడంతో భూదాన యజ్ఞం ప్రారంభమయింది. ఆ తర్వాత ఆయనే మరొక 800 ఎకరాలు దానం చేశారు. స్వయంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పద్నాలుగు వేల ఎకరాలు దానం చేశారని వార్తలున్నాయి గాని, 1949లో సర్ఫ్ ఎ ఖాస్ రద్దు అయింది గనుక నిజాంకు అంత సొంత భూమి ఉండిందా తెలియదు. భూదానానికి తర్వాతి కాలంలో గ్రామ దానాన్ని కూడా కలిపి, ప్రచారం చేస్తూ వినోబా దేశమంతా పాదయాత్ర జరిపారు. మొత్తంగా హైదరాబాద్ రాష్ట్రంలో, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా కలిపి వినోబా భావే ఒక లక్ష ఎకరాలు సేకరించారు. ఆ భూములన్నీ వెంటనే పహణీల్లో వినోబా భావే పేరు మీదికి మారిపోయాయి.

ఆ భూదాన భూముల పంపిణీని క్రమబద్ధం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1965లో ఆంధ్రప్రదేశ్ భూదాన, గ్రామ దాన చట్టం తీసుకువచ్చింది. భూదాన యజ్ఞ బోర్డును ఏర్పాటు చేసింది. అర్హులైన భూమిలేని నిరుపేదలను ఎంపిక చేసి, తక్కువ పరిమాణంలో వ్యవసాయానికి గాని, ఇంటి స్థలంగా గాని మంజూరు చేయడం భూదాన యజ్ఞ బోర్డు పని. అలా మంజూరు చేసిన ప్రొసీడింగ్స్ ప్రతిని లబ్ధిదారుకు ఇవ్వడంతో పాటు, సంబంధిత తాలూకా, మండల రెవెన్యూ అధికారికి కూడా పంపి, చట్టప్రకారం ఆ లబ్ధిదారుకు పట్టా ఇమ్మనీ, రెవెన్యూ రికార్డులలో లబ్ధిదారు పేరు చేర్చమనీ బోర్డు సిఫారసు చేస్తుంది.

అయితే భూదాన భూములు దేశవ్యాప్తంగానూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అతి ఎక్కువగా అత్యంత దారుణమైన కబ్జాలకు, ఆక్రమణలకు, అన్యాక్రాంతానికి బలి అయిపోయాయి. ఎక్కడైనా భూదాన భూమి ఉందని తెలిస్తే చాలు, రాజకీయ నాయకులు, అధికారులు, సంపన్నులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి దాన్ని స్వాహా చేయడం ఎట్లా అని ఎత్తులకు పై ఎత్తులు వేశారు. భూములను ఆక్రమించారు. తమ ఆశ్రితుల పేర్ల మీద పట్టాలు పుట్టించి తమ బేనామీ ఆస్తులు పెంచుకున్నారు. భూదాన యజ్ఞ బోర్డు ప్రభుత్వ, రాజకీయ నియామకాలే గనుక, బోర్డును కూడా ప్రభావితం చేసి, వ్యక్తులకు, సంస్థలకు, ప్రభుత్వ శాఖలకు ఇప్పించుకున్నారు. “భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేయడం” అనే వినోబా భావే ఆశయం ఎప్పుడో ధ్వంసమైపోయింది.

వెలుగుమట్లలో ఉండవలసిన 62 ఎకరాల ఏడు గుంటల భూమిలో కూడా ఇప్పుడు బుల్డోజర్ న్యాయం ద్వారా ప్రభుత్వం పునరాక్రమించిన భూమి 31 ఎకరాలు మాత్రమే. మిగిలిన 31 ఎకరాలకు పట్టాదారులైన యజమానులున్నారని, ఆ భూమి వ్యవసాయేతర భూవినియోగంగా బదలాయింపు కూడా జరిగిపోయిందనీ భూభారతి చెపుతున్నది. అసలు భూదాన్ భూమిలో ఐదు ఎకరాలు, పది ఎకరాలు ఎవరికీ ఇవ్వడానికే వీలు లేదు. కాని భూభారతి ప్రకారం కొందరు యజమానులకు అలా హెచ్చు విస్తీర్ణపు భూదాన్ భూమి కూడా ఉన్నది. అంటే అదంతా స్థానిక రాజకీయ నాయకుల బేనామీ ఆస్తిగా మారిపోయిందన్నమాట.

ఈ భూమి ఉన్న చోటు వల్లనే ఈ సమస్యంతా వస్తున్నది కావచ్చు. ఖమ్మం కలెక్టరేట్ ను శివార్లలోని కొత్త కాంప్లెక్స్ లోకి మార్చిన తర్వాత, మార్చాలనే ఆలోచన వచ్చిననాటి నుంచే ఆ చుట్టుపక్కల స్థలాలన్నీ కోట్లకు పడగలెత్తి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల, వారికి అండదండగా ఉండే రాజకీయ నాయకుల కళ్లు కుట్టడం మొదలయింది. అక్కడ తెరాస పాలనా కాలం నుంచి ప్రస్తుతం వరకూ పాత మంత్రులూ, కొత్త మంత్రులూ, శాసన సభ్యులూ సొంతంగానో, బేనామీలతోనో వందల ఎకరాలు ఆక్రమించి సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు.

అందులో భాగమే అయిన వెలుగుమట్ల భూదాన్ భూమిలో సరిగ్గా సగాన్ని ఇప్పటికే కైంకర్యం చేసి ఉన్నారు గాని, మిగిలిన సగం వారికి కొరకరాని కొయ్య అయింది. ఈ భూమిలో ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ భోర్డు 2014 ఏప్రిల్ లో తలా వంద చదరపు గజాల చొప్పున కొన్ని వందల మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. పన్నెండు సంవత్సరాలుగా అక్కడ ఇళ్లు కట్టుకుని స్థిరపడినవారు, తమకు న్యాయంగా రావలసిన పట్టాల కోసం, ఇతర సౌకర్యాల కోసం అభ్యర్థిస్తూనే ఉన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

ఈలోగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం 2015లో భూదాన యజ్ఞ బోర్డునే రద్దు చేసింది. రాష్ట్రంలో భూయాజమాన్యాన్ని సంపన్నవర్గాలకు, పాత భూస్వామ్య వర్గాలకు స్థిరీకరించడానికి, ఊరుమ్మడి భూముల మీద కబ్జాదార్ల అధికారాన్ని బలోపేతం చేయడానికి కెసిఆర్ ప్రభుత్వం చేసిన అనేక చర్యల్లో అది ఒకటి. ఆ రద్దు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లగా, మొదటి ఒక న్యాయమూర్తి ప్రభుత్వ చర్యను సమర్థించారు. దాని మీద అప్పీల్ కు వెళ్లగా ద్విసభ్య ధర్మాసనం కూడా ప్రభుత్వాన్నే సమర్థించింది. ఆ బోర్డును రద్దు చేసినప్పుడు దాని దగ్గర ఉన్న సమాచారమంతా చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ ఎ) కు బదిలీ చేయాలన్నారు. ఇప్పుడు ఆ సమాచారమే ఎక్కడా లేదంటున్నారు. ధరణి ప్రారంభించినప్పుడు, అంతకు ముందు ఉన్న రెవెన్యూ రికార్డులన్నీ డిజిటైజ్ అవుతాయని, ఇక నుంచి అది మాత్రమే ప్రామాణికంగా ఉంటుందని అన్నారు. ఇప్పుడసలు సమాచారమే లేకుండా పోయింది.

అంటే భూదాన్ భూములలో భూమిలేని నిరుపేదలకు దక్కిన ఎంతో కొంత భూమి మినహా మిగిలినదంతా కొత్తగా అన్యాక్రాంతం కావడానికి, కబ్జాదార్లు స్వాహా చేయడానికి మార్గం సిద్ధమయింది. ఎక్కడైనా నిరుపేదలకు దక్కిన భూమిని కూడా సంపన్నులు, రాజకీయవేత్తలు, అధికారులు కలిసి భోంచేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. వెలుగుమట్ల భూదాన్ భూమిలో, భూదాన్ యజ్ఞ బోర్డు చేసిన పంపిణీలో భూమి పొంది, చిన్నవో పెద్దవో ఇళ్లు నిర్మించుకుని పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఏర్పాటు చేసుకున్న కాలనీల మీద బుల్డోజర్ దాడిని ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి.

ఒక విస్తరిస్తున్న నగరం శివార్లలో వెయ్యి ఇళ్ల స్థలం ఉన్నదనీ, దాన్ని భూదాన బోర్డు పంపిణీ చేయనున్నదనీ వార్త రాగానే ఇళ్లులేని నిరుపేదల మధ్య తొక్కిసలాట జరిగి ఉంటుంది. దలారులు, స్థలం ఇప్పించలేకపోయినా, ఇస్తామని భ్రమలు కల్పించి డబ్బులు వసూలు చేసేవారూ, ఒకరి పేరు మీద సాధించిన స్థలాన్ని ఇతరులకు బదలాయించేవారూ రాజ్యం చలాయించి ఉంటారు. డబ్బు సంపాదించి ఉంటారు. అక్రమాలకు పాల్పడి ఉంటారు. అటువంటివేవీ జరగలేదని ఎవరూ హామీ ఇవ్వలేరు. అయితే అటువంటి పనులు ఏవి జరిగినా అవి అక్రమమైన, చట్టవ్యతిరేకమైన, విచారణార్హమైన, శిక్షార్హమైన పనులు. ప్రభుత్వానికీ, అధికారులకూ నిజంగా సదుద్దేశమే ఉంటే అటువంటి దళారీల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కాని ప్రభుత్వం ఇప్పుడు అలా దళారీల మీద పడలేదు, నేరుగా అక్కడ నివాసం ఉంటున్నవారి మీద పడింది. బహుశా కొత్త దళారీలకు భూమిని సిద్ధం చేసి అప్పనంగా అప్పగించదలచింది.

పేదలు చట్టబద్ధంగా సాధించిన భూమిని పోలీసులను ఉపయోగించి దురాక్రమించడం, అదే భూదాన్ భూమిలో అన్యాక్రాంతమైన సగం విస్తీర్ణం గురించి పట్టించుకోకపోవడం, పుల్లా పుడకా పోగేసుకుని కట్టుకున్న పేద, మధ్యతరగతి ఇళ్లను ఒక్క దెబ్బకు కూలదోయడం, ఇప్పుడు వివాదం ముదిరినాక మరెక్కడైనా పునరావాసం కల్పిస్తామని అనడం, ఈ విధ్వంసపు వార్తలు చూపడానికి ప్రయత్నించిన జర్నలిస్టుల మీద విరుచుకుపడడం, వాగ్దానం చేస్తున్న పునరావాస, పునఃస్థిరీకరణ కార్యక్రమాల గురించి అడిగిన వారి మీదికి పోలీసులను ఉసిగొల్పడం – ప్రభుత్వం సాగిస్తున్న ప్రతి ఒక్క చర్యా అన్యాయమైనది, అక్రమమైనది, చట్టవ్యతిరేకమైనది, దౌర్జన్యపూరితమైనది.

ఇది కేవలం వెలుగుమట్ల విధ్వంస బాధితుల ఇళ్ల సమస్య మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న, అనుసరించదలచిన అభివృద్ధి నమూనా సమస్య. ఈ అభివృద్ధి నమూనాలో సంపన్నులు, రాజకీయ నాయకులు, అధికారులు, ఆశ్రితులు చేసే అక్రమాలను బారాఖూన్ మాఫ్ అంటారు. పేదలను, మధ్యతరగతిని, అణగారినవర్గాలను మరింతగా అణచివేయడానికి, వారి వనరులు కొల్లగొట్టడానికి, వారికి సామాజిక వనరులు దక్కకుండా చూడడానికి ప్రయత్నిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *