కెటిఆర్‌కు హైకోర్టులో మరోమారు చుక్కెదురు

  • లాయర్‌తో విచారణ కుదరదన్న ధర్మాసనం
  • కనుచూపు మేరలో లాయర్‌ ఉం‌డేలా అనుమతి
  • ఎసిబి విచారణకు సహకరించాలని సూచన

హైదరాబాద్‌, జనవరి 8(ఆర్‌ఎన్‌ఎ): ‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో మ‌రోసారి చుక్కెదురయ్యింది. ఎసిబి విచారణలో లాయర్‌ను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అయితే లాయర్‌ ‌కనుచూపు మేరలో ఉండేలా మాత్రం హైకోర్టు అనుమతించింది. కేటీఆర్‌ ‌వేసిన లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై బుధవారం మధ్యాహ్నం 4 గంటలకు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫార్ములా-ఈ కార్‌ ‌రేస్‌ ‌వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు విచారణలో తనతోపాటు న్యాయవాది ఉండాలంటూ కేటీఆర్‌ ‌కోరడాన్ని కోర్టు ఆక్షేపించింది. కేటీఆర్‌తో పాటు లాయర్‌ ఉం‌డేందుకు హైకోర్టు నిరాకరించింది. విచారణ సమయంలో లాయర్‌తో కలిసి కూర్చునే అవకాశం లేదని స్ప‌ష్టం చేసింది. సీసీ టీవీ పర్యవేక్షణ లేదా కేటీఆర్‌ ‌కనిపించేంత దూరంలో న్యాయవాది ఉండేందుకు అనుమతిచ్చింది.

ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నప్పుడు న్యాయవాది రాంచందర్‌రావు విజిబుల్‌ ‌డిస్టెన్స్‌లో ఉండేందుకు హైకోర్టు అంగీకరించింది. నేరుగా కేటీఆర్‌ ‌పక్కన విచారణలో పాల్గొనేందుకు నిరాకరించింది. రేపు ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణపై అభ్యంతరాలు ఉంటే మళ్లీ కోర్టుకు రావొచ్చని తెలిపింది. విచారణ  సందర్భంగా న్యాయమూర్తికి కేటీఆర్‌ ‌వెంట వెళ్లే లాయర్‌ ‌పేరును న్యాయవాది ప్రభాకర్‌ ‌రావు తెలిపారు.

కేటీఆర్‌ ‌వెంట మాజీ అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌జే రామచంద్రరావు వెళ్తారని న్యాయమూర్తికి తెలిపారు. కేటీఆర్‌కు కనిపించే దూరంలో న్యాయవాది ఉంటారని జడ్జి చెప్పారు. కేటీఆర్‌ను ఒక గదిలో, లాయర్‌ను ఒక గదిలో కూర్చోబెట్టి.. విచారణ కనిపించేలా చర్యలు తీసుకోవాలని కోర్టు ఏఏజీకి సూచించింది. లైబ్రరీ విండో నుంచి కేటీఆర్‌ ‌విచారణను చూడొచ్చని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఇక కేటీఆర్‌ ‌విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇందుకు హైకోర్టు నిరాకరించింది. సీసీటీవీ పర్యవేక్షణలో కేటీఆర్‌ను విచారించాలని కోర్టు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *