- అండగా ఉంటామన్న బిఆర్‌ఎస్
- రేవంత్‌రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్ అంటూ విమర్శలు
- ప్రతీఒక్కరూ కెసిఆర్ కావాలని పిలుపు
(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి )
బిఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చుట్టూ కేసుల ఉచ్చు బిగిస్తుండగా, ఆ కేసులకు ఎట్టి పరిస్థితిలో భయపడేది లేదని, తమ నాయకుడికి అండగా తామున్నామని బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అభయమిస్తున్నారు. బుధవారం బిఆర్‌ఎస్‌పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ సందర్భంగా నాయకులంతా ఏకతాటిపై నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ఎదుర్కొంటామని అధినాయకత్వానికి హామీ ఇచ్చారు. బిఆర్‌ఎస్ పార్టీ మొదటి నుంచి ఒక కుటుంబంగా కొనసాగుతున్నదని, కుటుంబంలోని ఏ వ్యక్తికి కష్టం వొచ్చినా యావత్ కుటుంబం ఆ వ్యక్తిని అన్నివిధాలా అండగా ఉంటున్న విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చిన తర్వాత తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేసినప్పుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కెటిఆర్ అందించిన సహకారాన్ని వారీ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చినప్పటి నుంచి బిఆర్‌ఎస్ నాయకులపై అనేక ఆరోపణలు చేయడంతోపాటు, పలుకేసుల్లో కోర్టుల చుట్టు తిప్పుతున్న విషయం తెలిసిందే. కెసిఆర్‌పైన కూడా ఫార్ములా ఈ రేస్‌కు సంబందించిన అక్రమాలపై ఇడి, ఏసిబి కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో కెటిఆర్ ఎట్టి పరిస్థితుల్లోనైనా జైలు ఊచలు లెక్కబెడతాడంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి విపరీత ప్రచారం జరుగుతున్నది. జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఈ కేసు విషయంలో గత రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో ఉద్విఘ్న వాతావరణం చోటుచేసుకుంది. విచారణకు హాజరుకావాలని ఇడి, ఏసిబిలు నోటీసులు ఇచ్చినప్పటికీ, కెటిఆర్‌ను ఏ నిమిషంలోనైనా అరెస్టు చేయొచ్చన్న అంశం ప్రజల మధ్య చర్చగా మారింది. ఈనెల 6న తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఏసిబి ఇచ్చిన నోటీసుకు హాజరైనప్పటికీ అది ఒక హైడ్రామాగా మారింది. తన న్యాయవాదిని కూడా తనతో పాటు లోనికి రానివ్వాలంటూ పట్టుబట్టిన కెటిఆర్ విచారణకు ప్రత్యక్షంగా హాజరుకాకుండానే వెనుదిరిగారు. దీంతో ఏసిబి ఈనెల 9న ఒంటరిగానే హాజరుకావాల్సిందిగా మరో నోటీసు జారీ చేసింది. అలాగే తమ ఎదుట ఈనెల 8న హాజరుకావాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)ఇచ్చిన నోటీసుపై తనకు పది రోజుల గడువు ఇవ్వాల్సిందిగా కెటిఆర్ కోరడంతో 16న హాజరుకు ఇడి అనుమతిచ్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే కెటిఆర్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో కెటిఆర్ అరెస్టు ఖాయమన్న వార్తలు వ్యాపించాయి. అయితే తనతోపాటు లాయర్‌ను అనుమతించాలన్న విషయంలో మాత్రం కెటిఆర్‌కు కొంత వెసులుబాటు లభించింది. గురువారం ఎసిబి ఎదుట హాజరు కావాల్సి ఉండగా, బుధవారం కోర్టు లాయర్‌ను తీసుకువెళ్ళేందుకు అనుమతిచ్చింది. అయితే కెటిఆర్‌తోపాటు కాకుండా, ఆయనకు కనుచూపు మేరలో దూరంగా కూర్చోవచ్చని సూచించింది. అదికూడా కెటిఆర్ సూచించే ముగ్గురు లాయర్‌లలో ఒకరికి మాత్రమే అనుమతివ్వనున్నట్లు పేర్కొంది. దీంతో తన లాయర్‌తోపాటు గురువారం కెటిఆర్ ఎసిబి విచారణకు హాజరయ్యేందుకు సిద్దమవుతున్నారు. ఇదిలా ఉంటే ఏసిబి, ఇడి విచారణ క్రమంలోనే కెటిఆర్‌ను అరెస్టు చేస్తే పార్టీ ఎలా స్పందించాలన్న విషయాన్ని డైరీ ఆవిష్కరణ సందర్భంగా నాయకులు కార్యకర్తలకు హితబోధ చేసినట్లు తెలుస్తోంది .పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది ఏర్పడినప్పుడు కెటిఆర్ ఎలా వారికి, వారి కుటుంబానికి అండగా నిలబడి న్యాయపోరాటం చేశారో, అలాగే కెటిఆర్ వెంట పార్టీ శ్రేణులుంటారన్న విషయంపైనే ప్రసంగాలు సాగడం గమనార్హం.
అయితే ఈ ప్రసంగాల్లో కెటిఆర్‌ను ఇబ్బంది పెట్టాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చూస్తోందనడాన్ని కెటిఆర్ కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమకాలంలో పడిన ఇబ్బందులతో పోల్చిచూస్తే ఇది ఇబ్బందే కాదని పార్టీ కార్యకర్తల భయాన్ని పారదోలేలా మాట్లాడారు. అయితే కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ పాలకులను ప్రశ్నించడాన్ని కొనసాగించాలంటూ ఆయన హితబోధ చేయడం చూస్తుంటే, ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఆందోళనను కొనాసాగించాలంటూ ఆయన చెప్పకనే చెప్పినట్లు ఉంది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డిసెప్షన్, డిస్ట్రాక్షన్, డిస్ట్రిక్షన్ (మోసం, దృష్టిని ఇతరవిషయాలపై మళ్ళించడం, విధ్వంసం) అని త్రీడీ పాలసీని అవలంబిస్తున్నదన్నారు. అందుకే ఈ సంవత్సరకాలం జాగరూకతతో ప్రభుత్వం నెరవేర్చలేకపోయిన హామీలపై పోరాటం చేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్ పార్టీ అన్నది తెలంగాణ ప్రజల నుంచి పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతూ, రక్షణ కవచంగా ఉంటుందన్న విషయాన్ని ఆయన మరోసారి కార్యకర్తలకు గుర్తుచేస్తూ, పార్టీని మరో ఉద్యమానికి సన్నద్దం చేస్తున్నట్లనిపించింది. అలాగే గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకునే కార్యక్రమాన్ని కొనసాగించాలన్న సూచన చేయడంతో కార్యకర్తల నుంచి అనుకూల స్పందన కనిపించింది.





