“ఏపీ ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారనీ .. కృష్ణ, గోదావరి జలాల్లో తెలంగాణ నీటి హక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోందని మరో సారి స్పష్టం అయింది అని బిఆర్ఎస్ తీవ్ర ఆరోపణ చేస్తున్నది. ఈ తాజా ఎపిసోడ్ పై బిజెపి సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. కేంద్ర ప్రభుత్వం అండతో ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న నల్లమల సాగర్ ప్రాజెక్టు పై విచారణకు అర్హత లేని రిట్ పిటిషన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేయడంపై సర్వత్ర చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ముదిరి పాకాన పడి ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే అవకాశం ఎంతో దూరంలో లేదు. వచ్చే ఎన్నికల నాటికి ఇది ఒక పొలిటికల్ ఎజెండాగా మారబోతోంది.”
కొండను తవ్వి ఎలుక ను పట్టినట్లంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన . ఏ అనుమతులు లేకుండానే… పోలవరం – మల్లన్న సాగర్ ప్రాజెక్టు కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెండర్లు పిలవడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు పోయిన తెలంగాణ సర్కార్ కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. మీరు వేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న సుప్రీం ధర్మాసనం… రిట్ ను డిస్మిస్ చేస్తామని పేర్కొంది. డిస్మిస్ వద్దు… డిస్పోజ్ చేస్తున్నట్లు ప్రకటించామని ప్రభుత్వ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అత్యంత సున్నితమైన రాజకీయ జలవివాదం. డిస్మిస్ అనే పదం వాడితే..మా వాదనలో పస లేకనే కోర్టు కొట్టేసిందనే తప్పుడు సంకేతాలు వెళతాయని అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు విన్నవించారు. అంటే… రాష్ట్ర ప్రభుత్వం బలహీనమైన రిట్ పిటిషన్ ను వేసినట్లు సుప్రీం కోర్టు సాక్షిగా తేటతెల్లం అయింది. కొండను తవ్వి ఎలుకను పట్టిన సామెత రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకాన్ని స్పష్టం చేసింది.
నాడు పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై రైతులతో రిట్ పిటిషన్ వేయించి మరీ ప్రాజెక్టుపై స్టే తెచ్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఆ కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లేడ్ అయి.. స్టే సాధించుకోగా.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకుని ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ వేసేందుకు రెడీ అవుతోంది. అసలు సివిల్ సూట్ తెలేదెప్పుడు… ఈ పంచాయితీ తెగేదెప్పుడు.. ఈ లోగా ఏపీ ప్రభుత్వం పోలవరం – నల్లమల సాగర్ పూర్తి చేస్తే… తెలంగాణ నీటి వాటాలను శాశ్వతంగా వదులు కోవాల్సిందే. బచావత్ ట్రిబ్యునల్ 1979 – 80 అవార్డు ప్రకారం, ఏపీకి 484.5 టీఎంసీలను కేటాయించింది. వరద నీరు అనో.. మరోకటనో.. చెప్పి ఎక్కువ నీటిని మళ్లించడానికి ప్రయత్నిస్తే అది చట్ట విరుద్ధం అవుతుంది. ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం అటు గోదావరి ఇటు కృష్ణా నదుల జలాలను వాడుకోవడానికి అవసరం అయిన మౌలిక వసతులను సమకూర్చుకునే పనులపై దృష్టి కేంద్రీకరించింది.
ఈ ప్రాక్టులు పూర్తయితే.. తెలంగాణకు నీళ్ల వాటా తగ్గిపోతుంది. ఆరు నెలల కిందట దిల్లీ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో జరిగిన భేటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు కీలక విషయాలపై చర్చించారు. ఆ విషయాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అసలు ఏపీ గోదావరి-బనకచర్ల విషయాన్ని మీటింగ్ లో పెట్టలేదు. బనకచర్ల కడుతామని ఏపీ మీటింగ్ లో చెప్పలేదు. అలాంటప్పుడు అది కట్టొద్దని మేం మీటింగ్ లో ఎలా అంటాం అన్నారు కదా. అబ్బే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినదాంట్లో వాస్తవం లేదని ఆనాడే ఏపీ మంత్రి చెప్పారు కదా… అంటే… లోపల జరిగింది ఒకటయితే… బయటికి చెప్పిన విషయం మరోటి.. ఇంత అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎందుకు అని ఆనాడే తెలంగాణ వాదులు విమర్శించారు.
ఆనాడు సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినవి ప్రధానంగా నాలుగు అంశాలు అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు గోదావరి, కృష్ణా నదుల నీటి వాటాల్లో ఉన్న సమస్యలపై ముందుగా ఇంజినీర్లు, అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించాం. ఆ కమిటీలో సమస్యలను గుర్తించి అక్కడ వాటిపై చర్చించిన తర్వాత మిగతా వాటిని సీఎంల స్థాయిలో చర్చిస్తాం అని అన్నారు. రెండోది కృష్ణా నదిలో ఏపీ, తెలంగాణ నీటి వాటాల విషయంలో టెలిమెట్రో పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. మూడోది శ్రీశైలం ప్రాజెక్ట్ కొంత డ్యామేజ్ అయింది. దాన్ని రిపేర్ చేయించడానికి ఏపీ ముందుకు వచ్చింది. నాలుగోది గోదావరి రివర్ మానేజ్ మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఏపీలో ఒకటి, తెలంగాణలో ఒకటి ఉండాలని విభజన చట్టంలో ఉంది. దాన్ని ఇప్పుడు ప్రతిపాదించాం. ఈ అంశాలన్నీ ఇంజినీర్ల కమిటీలో కచ్చితంగా చర్చిస్తారు అని ఆనాడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరి ఇప్పుడు జరుగుతున్నదేమిటి… బనకచర్ల స్థానంలో నల్లమల సాగర్ వచ్చి చేరింది. పేరు మార్పు జరిగింది అంతే.
దక్షిణ భారతావనికి కృష్ణా, గోదావరి నీళ్ళే ఆధారం. 1969లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బచావత్ ట్రిబ్యునల్ 1973లో తీర్పునిచ్చింది. ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం మొత్తం 2060 టీఎంసీల కృష్ణా, గోదావరి జలాల్లో మహారాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటక 700 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 800 టీఎంసీల నీటిని వాడుకోవాలి. ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటిలో ఏపీ 484.5 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలను వాడుకోవాలని స్పష్టంగా ట్రిబ్యునల్ చెప్పింది. ఇక గోదావరి జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 1486 టీఎంసీలు. ఇందులో తెలంగాణ 968 టీఎంసీలు, ఏపీ 518 టీఎంసీలు… ఈ కేటాయింపులు సరిపోవని, 775 టీఎంసీలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అలాగే కృష్ణా జలాల పంపిణీ కోసం ఏర్పాటయిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013లో ఉమ్మడి ఏపీకి మరో 11 టీఎంసీలను నికర జలాలను కేటాయించింది. దీంతో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించినట్లయింది. ఈ ప్రకారమే జలాలను వాడుకోవాలి ఉన్నా ఆచరణలో మాత్రం వేరుగా ఉంది. జల వివాదాలు అంత త్వరగా పరిష్కారం కావు అన్న విషయం తెలిసిందే. రాజకీయపరమైన లాభం కోసం ఆయా రాష్ట్రాలు తమ వాదనలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన సూచన ప్రకారం తెలంగాణ ప్రభుత్వం సివిల్ సూట్ వేస్తే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఏపీ రాష్ట్ర వాదనను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణకు హక్కు భుక్తంగా రావలసిన నీటి వాటా విషయంలో మాకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ అంటోంది తప్ప ఆరు నెలల కిందట కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం నీటి వాడకం లెక్కింపు కోసం టెలిమెట్రీలను ఏర్పాటు చేయాల్సి ఉండేది. ఇప్పటికీ ఆ పని జరగకపోవడం వల్ల అసలు ఆంధ్రప్రదేశ్ ఎంత నీటిని వినియోగించుకుంటున్నది అనే విషయాన్ని తెలంగాణ స్పష్టంగా కోర్టుకు చెప్పలేక పోయింది. ఇది తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్పక తప్పదు. మరోవైపు ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అన్న ఆలోచనను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తపరిచిన కొన్ని గంటల్లోనే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకుని సివిల్ సూట్ వేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనంకు స్పష్టం చేసిన నేపథ్యంలో ఏదో జరుగుతుందన్న అనుమానాలకు తావిస్తోంది.
ఏపీ ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారనీ .. కృష్ణ, గోదావరి జలాల్లో తెలంగాణ నీటి హక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోందని మరో సారి స్పష్టం అయింది అని బిఆర్ఎస్ తీవ్ర ఆరోపణ చేస్తున్నది. ఈ తాజా ఎపిసోడ్ పై బిజెపి సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. కేంద్ర ప్రభుత్వం అండతో ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న నల్లమల సాగర్ ప్రాజెక్టు పై విచారణకు అర్హత లేని రిట్ పిటిషన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేయడంపై సర్వత్ర చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ముదిరి పాకాన పడి ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే అవకాశం ఎంతో దూరంలో లేదు. వచ్చే ఎన్నికల నాటికి ఇది ఒక పొలిటికల్ ఎజెండాగా మారబోతోంది.
-వంగ మహేందర్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్