“తెలంగాణ ఆయన ఊపిరి. ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొనకపోయినా తన రచనల ద్వారా, చర్చల ద్వారా ఉద్యమకారులను కార్యోన్ముఖులను చేయడంలో తన వంతు పాత్ర నిర్వహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన తెలంగాణ సాహిత్య చరిత్రను వెలుగులోకి తేవాలన్నది ఆచార్యుల అభిలాష. అదే సమయంలో సహృదయ సాహిత్య సాంస్కృతిక కార్యదర్శి గిరిజామనోహర్‌బాబు షష్టిపూర్తి కలిసివచ్చింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీభాష్యం విజయసారథి గారి తో కూడిన సంపాదకత్వంలో ‘సత్కృతి’ పేర సుమారు డెబ్భై మంది వ్యాసకర్తలతో ఏడువందల పేజీలకు పైగా వెలువరించిన సంచిక నిండా తెలంగాణ భావజాలానికి సంబంధించిన వ్యాసాలే ఉండడం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే..”
(26న వరంగల్‌లో ‘నవతి పూర్తి అభినందన సభ’ను నిర్వహిస్తున్న సందర్భంగా….)
చేతనావర్తన కవుల్లో ఒకరైన కోవెల సుప్రసన్నాచార్యులు ఆక్షర తపస్వి. అక్షర లోకంలో అనేక శిఖరాలు అధిరోహించిన వ్యక్తి. సాహితీ కృషీవలుడు. సాహితీ స్రష్ట. చక్కని సాహితీ విమర్శకులు. పద్యం, గేయం, వ్యాసం ఏ ప్రక్రియలో నైనా తనదైన శైలిని నిలుపుకున్న వ్యక్తి. ఒక విధంగా తెలంగాణ ప్రాంతంలోనే అరుదైన సాహితీ మూర్తుల్లో ఒకరు. సంప్రదాయ చ్ఛందస్సులో ఎన్నో ప్రయోగాలు చేసి పుంభావ సరస్వతిగా గుర్తింపు పొందినవారు. అయినా పదవుల కోసమో, బిరుదుల కోసం, గుర్తింపు కోసమో తన సిద్ధాంతాన్ని వీడని నికార్సైన వ్యక్తి.
పుట్టిన ఓరుగల్లు పైన అవ్యాజమైన ప్రేమ. తెలంగాణ ఆయన ఊపిరి. ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొనకపోయినా తన రచనల ద్వారా, చర్చల ద్వారా ఉద్యమకారులను కార్యోన్ముఖులను చేయడంలో తన వంతు పాత్ర నిర్వహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన తెలంగాణ సాహిత్య చరిత్రను వెలుగులోకి తేవాలన్నది ఆచార్యుల అభిలాష. అదే సమయంలో సహృదయ సాహిత్య సాంస్కృతిక కార్యదర్శి గిరిజామనోహర్‌బాబు షష్టిపూర్తి కలిసివచ్చింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీభాష్యం విజయసారథి గారి తో కూడిన సంపాదకత్వంలో ‘సత్కృతి’ పేర సుమారు డెబ్భై మంది వ్యాసకర్తలతో ఏడువందల పేజీలకు పైగా వెలువరించిన సంచిక నిండా తెలంగాణ భావజాలానికి సంబంధించిన వ్యాసాలే ఉండడం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఆ సంచికలో ‘ప్రత్యేక ప్రస్థానం’పేర రాసిన ఎనిమిది పేజీల ముందుమాటలో తెలంగాణ సాహిత్యం అన్యపాలకుల వల్ల ఎంతటి నిరాదరణకు గురైందన్న వాస్తవాన్ని వారు విస్తారించారు.
పండిత కుటుంబంలో జన్మించడం వల్ల సుప్రసన్నాచార్యకు ఓనమాలతోనే కవిత్వం ఒంటబట్టిందనే చెప్పాలె. ప్రాథమిక విద్యాభ్యాసంలో కొంత అవరోధం ఏర్పడినా, తొమ్మిదవ ఏటనే గజేంద్రమోక్షం, రుక్మిణీ కళ్యాణం, వామన చరిత్రలు కంఠస్థం చేసి పండితుల అభినందనలు పొందారు. హైస్కూల్ చదువుతున్న రోజుల్లో ‘ఆనంద లహరి’ కావ్యాన్ని రచించి ప్రముఖ కవిపండితుడు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారికి అంకితమిచ్చి ఆయన ప్రశంసలను అందుకున్నారు. 1947లో తన పదకొండేళ్ళ ప్రాయంలో వ్రాసిన ‘సూర్యవంశాబ్ధి కుల ప్రదీప’ గ్రంథం ద్వారా జాతీయోద్యమ స్ఫూర్తి రగిలించారాయన. దాదాపు ఏడు దశాబ్దాల క్రితం అంటే 1954లో ఆయన వ్రాసిన ‘హృద్గీత’ గ్రంథానికి విశ్వనాథ సత్యనారాయణగారు విలక్షణమైన పీఠిక రాయడం గొప్ప విషయం. ఆ కాలంలోనే తన అధ్యక్షతన ‘సాహితీ బంధు బృందం’పేర సాహితీ సంస్థను స్థాపించి, ఆ సంస్థ ద్వారా తెలంగాణ సాహితీకారులకు సంబందించిన పలు గ్రంథాలను వెలువరించారు. ఇంచుమించు ఆయన వయస్సు, రూపం కూడా కలిగిన చిన్నాన్న కోవెల సంపత్కుమారాచార్య తో కలిసి అనేక కవితలు, రచనలతో పాటు సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు. ఒక విధంగా వీరిద్దరిని జంటకవులుగా సాహితీలోకం కొనియాడింది.
ఆచార్య సుప్రసన్నాచార్య సుమారు యాబ్భైకి పైగా గ్రంథాలను రచించారు. వాటిల్లో కవిత్వం, పద్యం, శతకం, నాటకం, నాటికలు, వ్యాసాలు అనేకమున్నాయి. భావసంధ్య, సయర్పణ, సమర్చన, దర్పణం, కావ్యప్రమితి, చందనశాఖి, రసరాజధానిలాంటి వ్యాస సంకలనాలెన్నో పండితాదరణ పొందాయి. అలాగే అనేక గ్రంథాలకు రాసిన పీఠికలతో ‘అంతరంగం’ సంపుటాన్ని చదివితే ఆచార్య ఎంతటి విజ్ఞానఖనియో అర్థమవుతుంది. అగ్నిగర్భ, వసుచరిత్ర, చేతనావర్త 1, హిరణ్యగర్భలాంటి పలు గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. ఆచార్యులు భారతీయ సంస్కృతికి నిలువుటద్దం. వారి రచనల్లో వేదాలు, ఉపనిషత్తులు, సూక్తములు, కాళీదాసాది మహాకవుల కావ్యాలు, నన్నయాదుల ప్రభావంతోపాటు ఆర్షధర్మ మకుటాయమైన భారతీయ సంస్కృతి యొక్క ఆత్మ నేపథ్యంలో ప్రతిబింబిస్తుంది.
ప్రాచీన సాహితీ సంపదను ఒడిసిపట్టినప్పటికీ మారుతున్న సమాజానికి అనుగుణంగా అధునిక సాహిత్యానికి వారధిగా నిలిచిన వ్యక్తి సుప్రసన్నాచార్యులు. ప్రజాకవి కాళోజీ మా•ల్లో చెప్పాలంటే ‘పూర్వ సంప్రదాయంతోపాటు ఆధునిక విచారాన్ని జోడించిన వ్యక్తి ఆచార్య’ అని మెచ్చుకున్నారు. సరిగ్గా దశాబ్దం క్రితం ఆచార్యగారి 80వ (అశీతి) జన్మదినం సందర్భంగా తెలంగాణతోపాటు ఆంధ్ర ప్రాంతానికి చెందిన సుమారు 80 మంది కవి పండతుల వ్యాసాలతో కూడిన నాలుగు వందల పేజీల ‘సన్నుతి’ అభినందన సంచిక ఆచార్య పాండిత్యానికి అద్దం పడుతున్నది. దానికి సంపాదకత్వం వహించిన డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తిగారు ‘‘ ఆధునిక మానసిక విజ్ఞాన అధ్యయనం, అధివాస్తవికత, తాత్విక అన్వేషణ, ప్రాగ్రూప చింతన, కొత్త వెలుతురులో పాత చరిత్రల పరిశీలన సుప్రసన్నగారి ఆధునికరీతికి సంకేతాలంటూ’ ప్రశంసించారు.
‘‘ సుప్రసన్నగారిని ఏ విషయంలోనైనా సంప్రదిస్తే, దాన్ని కూలంకషంగా పరిశీలించనిదే తాత్కాలోచిత సమాధానంతో సరిపెట్టుకునే వ్యక్తి కాదంటారు దివంగత ఆచార్య లక్ష్మణమూర్తి. నిశితమైన పరిశీలన దృక్పథంకల మనీషిగా పేర్కొంటూ, ఉభయ వేదాంత పరిజ్ఞానమేకాదు శైవంతో, శాక్తంతో, తంత్రశాస్త్రంతో సమగ్ర పరిణితికలిగిన వివేకిగా లక్ష్మణమూర్తి, ఆచార్యను అభివర్ణించారు. ‘‘సుప్రసన్న పాశ్చాత్య పరిభాషలో విమర్శకుడు అనడంకంటే భారతీయ సౌందర్యశాస్త్ర పరిభాషలో సహృదయుడు అనడం సముచితం అంటారు ఆచార్య మాడభూషణం రాజగోపాలాచార్యులు. సహృద్విమర్షకు మార్గదర్శి అయిన సుప్రసన్నాచార్యులు సహజ మితభాషి. అయినా ఆయన ప్రతీకావ్యం ప్రతిభాదర్శనం నుంచే ఆవిష్కృమైంది. తన కవితా జైత్రయాత్ర గురించి ‘పరిక్రమ’ పుస్తకంలో స్వయంగా ఆయన రాసుకున్న మాటలు గమనార్హం. ‘‘జీవన సహచరికంటే ముందుగానే కవిత్వ సహచరి తన గుండెల్లో నెలకొందని’ చెప్పటం ఆయన ఎంతటి సాహిత్యాభిమానో అర్థమవుతుంది. ఇంతటి మహా విద్వాంసులు ఓరుగల్లు వాసి కావడం ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టం. వరంగల్ ఏవివి హైస్కూల్‌లో ఉన్నత విద్యను అభ్యసించి, ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి తెలుగు సాహిత్యంలో 1959లో పట్టా తీసుకున్నారు. ‘రామరాజ భూషణుని కృతులు’ అంశంపై పరిశోధనచేసి 1962లో పిహెచ్‌డి డిగ్రీ పొందారు. హైదరాబాద్ సిటీకాలేజీ, సాయం కళాశాలల్లో పార్ట్‌టైం లెక్చరర్‌గా, 1961లో ఉస్మానియా, ఆ తర్వాత పదవీవిరమణ చేసేవరకు కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.
రచనా వ్యాసంగం తో పాటు ‘అవధాన’కళకూడా వారికి అబ్బింది. 1973లో మొదటిసారిగా అవధానం చేసింది మొదలు సుమారు డెబ్భై వరకు అవధానాలు చేశారు. కాగా పలు సాహిత్య సంస్థలతో వారికి సాన్నిహిత్యం ఉంది. మిత్రమండలి, రసధుని, జాతీయ సాహిత్యపరిషత్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి లాంటి వేదికలు , 1960లో కులపతి సమితిని ఆయన స్వయంగా స్థాపించారు. చాలాకాలం వరంగల్‌లోని పోతన విజ్ఞాన సమితి కార్యదర్శిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్‌లో బ్రహ్మాండంగా నిర్వహించిన పోతన పంచశతి (1982) ఉత్సవాల్లో ఆచార్య క్రియాశీల పాత్ర పోషించారు. వీరి అద్వర్యంలో 20 పిహెచ్‌డి, 16 ఎంఫిల్ పరిశోధనలు జరిగినాయి. విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ అరవిందులు, భగవాన్ రమణ మహర్షి, సద్గురు శివానందమూర్తి ప్రభావమున్న ఆచార్యకు జరిగిన సన్మానాలు, లభించిన అవార్డులకు కొదవలేదు.
తాజాగా 2024లో శలాక విద్యత్ సమర్చన ‘విద్వన్మణి’ పురస్కారాన్ని ఆచార్య అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శృంగేరి శంకరాచార్య ముఖ్య అతిథిగా పాల్గొనటం విశేషం. కాగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకుని 2016 లో రాష్ట్ర ప్రభుత్వం ‘ఆవిర్భావ పురస్కారాన్ని’ అందజేసింది.
కాగా 2002 లోనే ఆంధ్ర సారస్వత సమితి శ్రీ నృసింహప్రపత్తి గ్రంథానికి ఉత్తమ కవితా పురస్కారాన్నిచ్చి గౌరవించారు. అలాగే 2007లో సనాతనధర్మ చారిటబుల్ ట్రస్ట్, 2009లో ఆచార్య గంగప్ప సాహిత్య పురస్కారాన్ని అందుకున్న ఆచార్య, 2010లో కేంద్ర సాహిత్య అకాడమినుండి టాకూర్ సాహిత్య పురస్కారాన్ని, 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘హంస కళారత్న’ పురస్కారాన్ని అందుకున్నారు. 1955లో తెలంగాణ లిటరరీ ఫోరం ఉత్తమ కవితా పురస్కారాన్ని అందించగా, తెలుగు విశ్వవిద్యాలయం 1997లో ఉత్తమ పరిశోధకుడిగా ఆచార్యను సత్కరించింది. అలాగే ఆయన రచించిన సాహిత్య వివేచన గ్రంథానికి 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన గురువు ‘పోలూరి హనుమజ్జానాకీ రామశర్మ’పేరిట ఏర్పాటుచేసిన పురస్కారాన్ని 2021 అక్టోబర్ 13న వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా పేరున్న ఓరుగల్లుకు సాహిత్య గౌరవాన్ని ఇనుమడింపజేసిన ఆచార్య సుప్రసన్నాచార్యులు మరింతకాలం సాహిత్యసేవ అందించే విధంగా భగవంతుడు వారికి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
—– మండువ రవీందర్‌రావు





