• మెరుపు తీగెలు

మా అమ్మ నా చెయ్యి పట్టుకుందో… నేనే మా అమ్మ చెయ్యి పట్టుకున్నానో… తెలీదు. అదే విషయం అమ్మని అడిగాను.

          ముందుకు చూడమన్నట్టు కళ్ళతో సౌజ్ఞగా చూసింది.

          చూశాను. నల్లగా వుంది. ‘ఏమిటిది?’ అని గొణుక్కున్నాను.

‘తారు’ నా పక్కన వున్నవారెవరో కళ్ళకు కనిపించినదాన్ని గురించి చెబుతున్నట్టున్నారు. మరెవరో తమ అనుభవంలోంచి పిల్లలకి పాఠం చెప్పినట్టు నియమ నిబంధనలతోటి చెబుతున్నారు ‘రోడ్డును జాగ్రత్తగా దాటాలి’ అని.

‘చావు’ అన్నారెవరో, నా మాట విన్నట్టే. నాకు సమాధానం చెబుతున్నట్టే. బహుశా రోడ్డు దాటడం చచ్చే చావులా అనిపించేదేమో అనుకున్నాను.

‘రోడ్డుకు యెడమపక్కనే నడవాలి’ యింకెవరో యెవరికో చెపుతుంటే, ‘యేది యెడమ? యేది కుడి?’ నా అనుమానం నాది. ఇట్నుంచి నడిస్తే కుడి అట్నుంచి నడిస్తే యెడమ… సో కుడి యెడమలు అందరికీ వొకటి కావు.

‘ఎవరి నడక వాళ్ళే నడవాలి’ అంది మా అమ్మ.

నాకర్థం కాలేదు.

‘నడిచాను… నడుస్తున్నాను… నడుస్తాను…’ పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్… అని యెవరో కాలాన్ని గీతాలు గీసి విడదీసి చూపిస్తూ నేర్పిస్తున్నట్టున్నారు. కాలంలో గీసిన వొకరోజును కూడా మార్నింగ్, నూన్ అండ్ నైట్… అని మళ్ళీ మూడు భాగాలు చేసి చెప్పుకుంటున్నారు. అలాగే అన్నిరోజులనూ కలిపి రైనీ సీజన్, వింటర్, సమ్మర్… అని వొకే కాలాన్ని మూడు కాలాలు చేశారు. అది భాష నేర్పించడం కోసం చెబుతుంటే యెందుకో నేను భావానికి అతుక్కున్నట్టున్నాను.

‘అవన్నీ యెక్కడున్నాయి?’ అని అడిగాను.

‘అన్నీ వొక్కదానిలోనే వున్నాయి’ అని చెప్పింది అమ్మ.

అడుగులు వేస్తూ ఆలోచిస్తూ చూస్తున్నాను. కొందరు రోడ్డును సునాయాసంగా దాటేస్తుంటే, కొందరు ఆయాసంగా దాటడానికి ఆపసోపాలు పడుతున్నారు. నిజమే, రోడ్డు కూడా అందరికీ రోడ్డు కాదు. పూలూ ముళ్ళూ వొకటా? అసలు రోడ్డు దాటే లోపలే అర్ధాంతరంగా ఆగిపోయినవాళ్ళను చూశాను, ఆపదసాపదలతో. రోడ్డు చివర వుంటుందనుకున్న చావు రోడ్డు మధ్యలోనే. అసలు రోడ్డుకు చివర మధ్య మొదలు లేవేమో?, మనం దాటకపోతే రోడ్డే మనమీదుగా దాటిపోతున్నట్టుంది. అంతకుముందు నడిచినవాళ్ళ అడుగుల గురుతులు అందరూ గుర్తుపట్టడం లేదు, తామే మొదటిసారిగా నడుస్తున్నట్టు నడుస్తున్నారు?!

రోడ్డు దాటే సమయం కూడా అందరికీ వొకటిగా లేదు!

రోడ్డుకు యిటు అటు వున్నట్టు తోచింది. ఆవలి యీవలి అంచులు వున్నాయా? లేవా? రెండూ నిజమేనేమో?!

లేకపోతే, ఆవలి అంచునుండి వచ్చేటప్పుడు అమ్మ నా చెయ్యి పట్టుకు జాగ్రత్తగా నడిపించినట్టే వుంది, కాని యీవలి అంచునుండి వెళ్ళేటప్పుడు నేను అమ్మ చెయ్యి పట్టుకు జాగ్రత్తగా నడిపిస్తున్నాను… వడివడి నడకల వొడిదుడుకుల నడవడికలు… యింద్రజాలమే! సూర్యోదయమే కాదు, సూర్యాస్తమయమూ వుంది… దేని అందం దానిదే! వెలుగు నుండి చీకటే పుట్టిందో చీకటి నుండి వెలుగే పుట్టిందో గాని చీకటి వెలుగులు పొద్దుకు పొడిచిన బొమ్మా బోరుసులే!

‘రోడ్డుమీద పడ్డాక దాటి తీరాల్సిందే’ అంది అమ్మ, వణుకుతున్న గొంతుతో.

చూస్తే, అమ్మ లేదు? అమ్మ స్థానంలో నేను! నా స్థానంలో నా పిల్లలు?!

రోడ్డు మాత్రం తన స్థానంలో తానే కదలక మెదలక వుంది!

-బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *