- 19న కాళోజీ కళాక్షేత్రానికి ముహూర్తం
- నెరవేరబోతున్న దశాబ్దాల కల
- ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- ప్రజాకవి కాళోజీకి ప్రతినిత్యం నిలువెత్తు నివాళి
(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
ఓరుగల్లు అంటేనే కళలు, కళాకారులకు పుట్టినిల్లు. కాని, వారి కళా ప్రదర్శనకు నేటికీ సరైన ఆడిటోరియం లేకపోవడంతో వేలాది మంది కళాకారులు దశాబ్దాలుగా తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వాలకు అనేక విజ్ఞప్తులు చేసినా పట్టించుకునేవారు లేరు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని ఓపెన్ ఆడిటోరియం, ఒకటికిరెంటికి సౌకర్యాలు సరిగా లేని కళాశాలల ఆడిటోరియాలు తప్ప కళాప్రదర్శనలకు అనువైన ప్రాంగణాలు లేవు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తున్న ప్రకటన వెలువడడంతో కళాకారుల్లో ఉత్సాహం ఉరకలేసింది. 2014 సెప్టెంబర్ 9న నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హనుమకొండ బాలసముద్రం (హయగ్రీవాచారి గ్రౌండ్)లో కాళోజీ పేరున కళాక్షేత్రానికి శంకుస్థాపన చేసినప్పుడు, వొచ్చే జయంతి నాటికి దాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
కానీ, సుమారు రూ.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి పదేళ్ళు పట్టింది. దాంతో వ్యయభారం కూడా పెరిగింది. రాష్ట్ర రాజధానిలో సెక్రెటరేట్‌తోపాటు, కొత్త జిల్లాల్లో అనేక ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం జరిగినప్పటికీ, కళాక్షేత్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి గురైంది. 11 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత అ భవన పనులు చురుగ్గా సాగుతూ వొచ్చాయి. గత సెప్టెంబర్‌లో కాళోజీ జయంతి రోజున్నే దీన్ని సిఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారనుకున్నారు. కాని, నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. అసంపూర్తిగా ఉన్న పనులు కనిపించకుండా కర్టెన్స్ కట్టి ఏదో విధంగా మేనేజ్ చేసేప్రయత్నం చేశారు.
కానీ అసంపూర్తి పనులతో దీన్ని ప్రారంభించడాన్ని సిఎం రేవంత్‌రెడ్డి అయిష్టతను వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. ఏది ఏమైనా ఈ నెల 19న ముఖ్యమంత్రితో దీన్ని ప్రారంభింపజేసేందుకు అధికారులు సర్వ సన్నాహాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావొస్తున్న సందర్భంగా తమ ‘ప్రజాపాలన విజయోత్సవ’ కార్యక్రమాల్లో భాగంగా ఈ కళాక్షేత్రాన్ని ప్రారంభించి, ప్రజలకు అంకితమివ్వనున్నారు. ఈ నెల 14 నుంచి సెప్టెంబర్ 9వరకు విజయోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. అందులో తొలిసభకు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణం వేదిక కాబోవటం విశేషం. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ పథకాలకు ఇక్కడినుండే ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్బంగా నిర్వహించే బహిరంగ సభ వేదికగా రాష్ట్రంలో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి సిఎం శంకుస్థాపన చేయనున్నారు
ఓరుగల్లుకే తలమానికం.. ఏదియేమైనా దాదాపు ఏడు దశాబ్దాలకుపైగా వరంగల్ కళాకారులు, కళాభిమానుల కల ఈనెల 9న కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించడంతో నెరవేరనుంది. సుమారు 95 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణమైన ఈ కళాక్షేత్రం కేవలం కళల ప్రదర్శనకే కాదు, ఉద్యమాలే జీవితంగా, ఉద్యమమే ఊపిరిగా, ప్రజలకోసం తన జీవితాంతం పోరాడిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఈ ప్రాంతం కోసం ఏమేరకు తపించారన్నది, పోరాడారన్నది నిత్యం గుర్తుచేస్తూ ప్రజలకు స్ఫూర్తినిచ్చేదిగా ఉండబోతున్నది. ఆయనకు నిత్యం నిలువెత్తు నివాళిని అందించే విధంగా ఈ భవనం ముందు ఆయన నిలువెత్తు విగ్రహం మనకు దర్శనమిస్తుంది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కన్నా మిన్నగా, విశాలంగా దీని నిర్మాణం జరిగింది.
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ భవనం కోసం వివిధ ప్రాంతాల్లోని భవనాల శైలిని నాటి కెసిఆర్ ప్రభుత్వం పరిశీలించి అనేక సదుపాయాలను సమకూర్చే విధంగా చేపట్టిన నిర్మాణమిది. నాలుగు అంతస్తుల ఈ భవనం ముందుభాగం అత్యంత ఆకర్షణీయంగా వరంగల్‌కే తలమానికంగా కనిపిస్తుంది. సుమారు పదమూడు వందల మంది ఒకేసారి కూర్చుని కార్యక్రమాలను తిలకించే విధంగా సుందరమైన ఆడిటోరియం, అందులో అత్యాధునిక సౌండ్, లైట్‌లను అమర్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో కాళోజీ జీవిత వృత్తాంతాన్ని తెలిపుతూ, ఆయన పోరాటాలను ప్రతిభింబించే విధంగా ఫోటో ప్రదర్శన ( ఆర్ట్ గ్యాలరీ), మొదటి అంతస్తులో కార్యాలయ గదులు, ఫుడ్ కోర్టు, రెండవ అంతస్తులో గ్రంథాలయం, మూడు- నాలుగు అంతస్తుల్లో ఆడిటోరియాన్ని నిర్మించారు. ఎంతో కాలంగా సభలు, సమావేశాలు, కళా ప్రదర్శనలకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వరంగల్ ప్రజలకు ఈ భవన ప్రారంభంతో ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి.




