“రాష్ట్రంలో జూబ్లీహిల్స్‌తోపాటు మరో పది శాసనససభ స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యమని విస్తృత చర్చ జరుగుతున్నది. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తమకే అనుకూలమైన తీర్పు ఇస్తారని అధికార కాంగ్రెస్‌తోపాటు, గతంలో ఆ స్థానాలను గెలుచుకున్న భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్)లు ప్రచారం చేసుకుంటున్నాయి. కాగా రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఏపీలో మాదిరిగా కూటమి పార్టీలతో కలిసి బిజెపి తలపడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయాన్ని బిజెపి రాష్ట్ర అగ్రనేతలు కొట్టిపారేస్తున్నా లోపాయికారిగా నైనా కూటమి కట్టపోవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే ఈ ఎన్నికల ద్వారా మరోసారి సీమాంధ్ర పార్టీలు తెలంగాణ రాజకీయ రంగప్రవేశం చేసినట్లవుతుందంటూ స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.”
రాష్ట్రంలో జూబ్లీహిల్స్‌తోపాటు మరో పది శాసనససభ స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యమని విస్తృత చర్చ జరుగుతున్నది. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తమకే అనుకూలమైన తీర్పు ఇస్తారని అధికార కాంగ్రెస్‌తోపాటు, గతంలో ఆ స్థానాలను గెలుచుకున్న భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్)లు ప్రచారం చేసుకుంటున్నాయి. కాగా రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఏపీలో మాదిరిగా కూటమి పార్టీలతో కలిసి బిజెపి తలపడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయాన్ని బిజెపి రాష్ట్ర అగ్రనేతలు కొట్టిపారేస్తున్నా లోపాయికారిగా నైనా కూటమి కట్టపోవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే ఈ ఎన్నికల ద్వారా మరోసారి సీమాంధ్ర పార్టీలు తెలంగాణ రాజకీయ రంగప్రవేశం చేసినట్లవుతుందంటూ స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉపఎన్నికలు అనివార్యం అనుకుంటున్న ఈ పదకొండు స్థానాలను గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ గెలుచుకున్నవే. అయితే తొమ్మిదిన్నర ఏండ్ల బిఆర్‌ఎస్ పాలనను కాదని ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టడంతో పదిమంది ఎంఎల్‌ఏలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో పార్టీ మారిన పదిమంది ఎంఎల్‌ఏలపై అనర్హత వేటు వేయాలని బిఆర్‌ఎస్ నాయకత్వం న్యాయస్థానాలను ఆశ్రయించగా, మూడు నెలల్లో దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు సూచించిన విషయం విదితమే.
సుప్రీం న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ఎట్టి పరిస్థితిలో పార్టీమారిన పదిమందిపై అనర్హతవేటు ఖాయమని, ఆ స్థానాల్లో ఉపఎన్నికలకు సిద్దం కావాలని రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు తమ క్యాడర్‌ను సన్నద్దం చేస్తున్నాయి. అయితే నిజంగానే మూడు నెలల్లో కాంగ్రెస్ కండువ కప్పుకున్న ఎంఎల్‌ఏలపై అనర్హత వేటు పడుతుందా అన్న అనుమానం కూడా లేకపోలేదు. ఒకవేళ మూడు నెలల్లోపు స్పీకర్ ఏనిర్ణయం తీసుకోనిపక్షంలో ఏం జరుగుతుందన్న విషయం పైన కూడా రాష్ట్రంలో తీవ్రస్థాయి చర్చ జరుగుతున్నది. సభాపతి ఈ విషయాన్ని మరికొంతకాలం నాన్చే అవకాశాలు లేకపోలేదని ఇప్పటికే బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడినట్లు ఆ వర్గాలద్వారా తెలుస్తున్నది. దీంతో మళ్ళీ సుప్రీంకోర్టు జోక్యం అనివార్యమవుతుందని, ఇదంతా పూర్తి కావడానికి కనీసం ఆరు మాసాలైన పడుతుందని ఆయన ఆభిప్రాయపడినట్లు తెలుస్తున్నది. దీంతో దాదాపు ఏడాది కాలంగా నలుగుతున్న ఈ విషయంపైన గురువారం సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ స్పీకర్ నిర్ణయం తీసుకునేవరకు మరికొంత కాలయాపన జరుగే అవకాశాలు లేకపోలేదు.
చివరకు నిజంగానే ఈ పదిమంది ఎంఎల్‌ఏలపైన అర్హత వేటు పడినట్లైతే, ఆ స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. జూబ్లీహిల్ నియోజకవర్గంతోపాటు పార్టీ మారిన పదిమంది ఎంఎల్‌ఏలకు సంబంధించి బిఆర్‌ఎస్ గతంలో గెలుచుకున్న స్థానాలన్నిటినీ తామే తిరిగి గెలుచుకుంటామని ఆ పార్టీ నాయకులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఆయా నియోజకవర్గ ప్రజలు పార్టీమారిన ఎంఎల్‌ఏ పట్ల కోపంగా ఉన్నారని, ఉప ఎన్నికల్లో తమ నిరసనను తెలిపేందుకు వారు సిద్దంగా ఉన్నారంటున్నారు. కాగా బిఆర్‌ఎస్‌ను నామరూపాలు లేకుండా చేయాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికలతోపాటు జిహెచ్‌ఎంసీ, స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుండే ప్రజల మధ్య ఉండేందుకు సన్నద్దమవుతున్నది. అందులో భాగంగానే ‘జనహిత’ పేరున గత మూడు రోజులుగా పాదయాత్రలు ప్రారంభించింది. ఇంతవరకు బాగానే ఉన్నా రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న బిజెపి ఎత్తుగడ ఏమిటన్నది అంతుపట్టకుండా ఉంది.
రాష్ట్రంలో పదకొండు స్థానాల్లో జరిగే ఉపఎన్నికల్లో టిడిపి కూటమి పార్టీలు అరంగేట్రం చేసే అవకాశాలపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది. ఆంధ్ర నాయకత్వంలోని ఏ పార్టీలనైతే వద్దని తెలంగాణ ఉద్యమం సాగిందో ఆ పార్టీలు ఈ ఉప ఎన్నికల వేళ రంగప్రవేశం చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు గతంలోనే తమ అభిప్రాయాలను పలు సందర్భాల్లో బయటపెట్టిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, బిజెపి కూటమి గత ఎన్నికల్లో ఏపిలో విజయం సాధించిన దరిమిలా తెలంగాణలో కూడా అదే ప్రయోగాన్ని అమలుపరచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణలో కాషాయ జండా ఎగురవేయాలన్న సంకల్పంతో ఉన్న బిజెపి ఏపీలో మాదిరిగా ఇక్కడ కూటమి కడుతుందా లేదా అన్నది అస్పష్టం. ఎందుకంటే ఆంధ్రపార్టీలతో బిజెపి కలిసిందంటూ బిఆర్‌ఎస్ ప్రచారం చేయకపోదు.
అది బిజెపి గెలుపుకు మైనస్ అవుతుందన్న ఆలోచన ఆ పార్టీకి ఉన్నట్లు తెలుస్తున్నది. అవునన్నా కాదన్న తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఇంకా కొంత బలం లేకపోలేదు. అలాగే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పట్ల ఇక్కడి యువకుల్లో అభిమానముంది. అందుకు నేరుగా కాకుండా లోపాయికారిగానైనా ఆ పార్టీలతో బిజెపి సంబంధాలు పెట్టుకునే ఆవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పదిమంది ఎంఎల్‌ఏల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం అయ్యే పరిస్థితిలో ముందుగా జూబ్లీహిల్ నియోజకవర్గం ఉప ఎన్నికలోనే కూటమి పార్టీలు తమ స్టాటజీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా, ఉప ఎన్నికలు అనివార్యమైన పక్షంలో ఆ పదిస్థానాలు, జిహెచ్‌ఎంసి, పంచాయితీ ఎన్నికల్లో కూడా పట్టుసాధించాలన్నది బిజెపి ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈమేరకు నిజంగానే ఆంధ్ర నాయకత్వపు పార్టీలు రంగప్రవేశంచేస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సమూలంగా మార్పులు జరుగకపోవు.





