మేడి పండులా కాంగ్రెస్ కొలువుల భర్తీ?

ఇచ్చింది కొంత, చెప్పుకునేది కొండంత?

మన దేశంలో మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే, నీళ్లు, నిధులు, నియామ‌కాలే ల‌క్ష్యంగా ఎంతో మంది అమ‌ర‌వీరుల త్యాగాల ఫ‌లితంగా ద‌శాబ్దాల త‌ర్వాత‌ తెలంగాణ క‌ల సాకార‌మైంది. తెలంగాణ ఒక భావోద్వేగ‌ రాష్ట్రం, నీళ్లు, నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కొలమానంగా తొలి ద‌శ‌, మ‌లి ద‌శ‌ ఉద్యమాల్లో కొట్లాడింది విద్యార్థులే.. తెలంగాణ వొస్తే కోరుకున్న కొలువు వొస్తుంద‌ని, గొప్పగా బతుకుతామ‌ని విద్యార్థులు తమ జీవితాలను లెక్క చేయకుండా, ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు. వారి త్యాగాల పునాదులపై తెలంగాణ పురుడుపోసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ఫలితం కూడా విద్యార్థులకే దక్కాలి. అది వారి హక్కు కూడా.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగుల అసంతృప్తిని, ఆందోళనను అర్థం చేసుకోవాలి. ప్రజా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించి, ఉద్యోగాల భర్తీ వైపు అడుగులు పడాలని నిరుద్యోగులు ప్రజా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

కాంగ్రెస్ పై నిరుద్యోగుల ఆశ‌లు
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగులదే కీ రోల్ అని ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా ప్రభుత్వం గుర్తించడం నిజంగా గొప్ప విషయం. ఇది నిరుద్యోగుల గౌరవాన్ని పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే మాది నిరుద్యోగుల ప్రభుత్వమ‌ని, మా ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల బాధలు ,సమస్యలు వినడానికి సిద్ధంగా ఉందని ప్రకటించడం అంటే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై సీరియస్ గా ఉందనే విశ్వాసాన్ని నిరుద్యోగులకు కల్పించింది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అనేది ఒక సంచలనం.పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలను శరవేగంగా భర్తీ చేసి కొత్త సంవత్సరంలో పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ అమలు చేసే దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు పడుతున్నాయని యువ‌త భావించింది.  టీజీపిఎస్సీ చైర్మన్ పదవి కాలం పూర్తి కాకముందే కొత్త చైర్మన్ ని నియమించడం మంచి పరిణామం. కోచింగ్ సెంటర్ల దోపిడీ నుంచి గ్రామీణ పేద విద్యార్థులకు విముక్తి కల్పించి, తల్లిదండ్రులకు లక్షల రూపాయల కోచింగ్ ఫీజు భారం తగ్గించేలా అంబేడ్క‌ర్ నాలెడ్జ్ సెంటర్ ప్రతీ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామ‌ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత జాబ్ క్యాలెండర్ అమలుకు ముందే అంబేడ్క‌ర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఖరీదైన కోచింగ్ ని ఉచితంగా అందించడంతో పాటు వసతి సౌకర్యం కల్పించాల్సి ఉంది. అయితే  కమ్మటి మాటలతో కడుపు నింపుతున్నదని, కానీ కొలువులు ఇవ్వకుండా కాంగ్రెస్ నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తున్నదని  నిరుద్యోగులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సంవత్సరం తిరిగేలోపే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుద్యోగులని నమ్మించి మోసం చేసిందని నిరుద్యోగులంతా భగ్గుమంటున్నారు.

సంవత్సరం తిరిగేలోగా 2 లక్షల ఉద్యోగాలు – నింపింది 12 వేలే?
కొలువుల కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై కోటి ఆశలు నిరుద్యోగులు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వొచ్చి ఏడాది  పూర్తయ్యింది. 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు.. 12వేల ఉద్యోగాలు ఇచ్చి 55 వేల ఉద్యోగాలిచ్చామ‌ని ప్రభుత్వం చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. ఇచ్చింది లేదు ఇచ్చేది లేదు అయినా నాయకులు పోటా పోటీగా కృతజ్ఞత సభలు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదు. నిరుద్యోగులంటే నిరక్షరాస్యులు కాదు.  చదువుకున్నవారిని కూడా సునాయసంగా మోసం చేస్తామంటే ఎలా? ఉద్యోగాల ఊసే లేదు, ఉద్యోగాలు నింపడంలో ఎక్కడ మీ చిత్తశుద్ధి? స్వయానా కాంగ్రెస్ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీ ఇది నా గ్యారంటీ అని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఎక్కడ? 2లక్షల ఉద్యోగాల భర్తీ ఎక్కడ? ముఖ్యమంత్రి ఇంత పచ్చి అబద్దాలు చె బుతాడ‌ని అస్సలు ఊహించలేదు. కనీసం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడైనా హుందాగా, గౌరవంగా మాట్లాడుతారని అనుకున్నాం..

కానీ రాజకీయాలనీ రోజు రోజుకు దిగజార్చుతున్నారు. ప్రతిపక్షంలో ఉంటే ఎదో మంచోడిలా నటిస్తున్నారు. అధికారంలోకి వొచ్చిన తర్వాతే వారి అస్సలు రంగు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నా 55,000 ఉద్యోగాల రికార్డు గురించి పరీక్ష రాసిన నిరుద్యోగులకు, పరీక్ష పట్టిన  ప్రభుత్వనికి తెలుసు కానీ సామాన్య ప్రజలకు తెలియదు. ఇదే వాళ్ల‌ బలం, పదే పదే రికార్డు స్థాయిలో ఉద్యోగాలని భర్తీ చేస్తున్నామ‌ని చెబుతూ ఇటు ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ, అటు జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాలని తొక్కిపెడుతున్నారు. చివరికి అప్పులంటూ, ఎస్సీ వర్గీకరణ అంటూ కాలయాపన చేస్తున్నారని నిరుద్యోగులంతా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఎస్సీ వర్గీకరణ అడ్డంకి కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామంటూనే జాబ్ క్యాలెండర్‌ని ఇటీవల విడుదల చేసింది. జాబ్ క్యాలెండర్‌ అమలులో, ఉద్యోగాల భర్తీ విషయంలో ఆంధ్రప్రదేశ్ కు  రాని అడ్డంకి తెలంగాణలో ఎందుకు వొస్తున్నదని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

అప్పులతో నిరుద్యోగుల జీవితాలతో ముడిపెట్టడం న్యాయమేనా? నిరుద్యోగులంటే అంత చిన్న చూపా, అవమానకారంగా అప్పులతో నిరుద్యోగుల జీవితాలని తీసిపడేయడం ఇది ఏ విధంగా ప్రజా ప్రభుత్వ గౌరవాన్ని పెంచుతుంది. మేం ఎన్నో కలలు కన్నాం, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొస్తే 2లక్షల ఉద్యోగాలని, జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తుందని అనుకున్నాం. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు 10 యేండ్లు అధికారంలో లేరు అంటే మీరు రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నారు.. తప్పకుండా వారికి మా బాధలు తెలుసు కాబట్టి ఉద్యోగాల భర్తీనే ప్రధాన ఎజెండాగా ప్రజా ప్రభుత్వం శరవేగంగా కొలువుల భర్తీ చేయాలనీ నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నారు. అంతేకాని అప్పులతో నిరుద్యోగుల జీవితాలని ముడి వేయడం నిజంగా బాధాకరం. ప్రస్తుతం ఉన్న అప్పులు గత ప్రభుత్వం చేసిన అప్పులే.. అయినా అప్పటి ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు పోరాడారు కదా?  అప్పుడు మీరు అప్పుల‌తో ఉద్యోగాలని ఎందుకు ముదిపెట్టలేదు? మేనిఫెస్టోలో పెట్టిన రెండు లక్షల ఉద్యోగాలని భర్తీ చేయాలనీ నిరుద్యోగులంతా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రిటైర్మెంట్ వయస్సు పెంపు నిరుద్యోగుల కలలకి ఉరితాడే? కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సు పెంపు చేస్తున్నట్టు, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఉద్యోగుల వయస్సు పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించడంతో మళ్లీ నిరుద్యోగులలో తీవ్ర నిరాశ నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా కొలువు వస్తదనీ అనుకున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్టే..  ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకుండా రిటైర్మెంట్ వయస్సు పెంపు అనేది నిరుద్యోగుల కలలకు మరణ శాసనమే. యేండ్లకేండ్లు కుటుంబాలకి దూరంగా, అర్ధాకలితో, అగ్గిపెట్టె సైజు గదిలో ఉంటూ అప్పులు చేస్తూ పోటీ పరీక్షలకు ప్రాణం పెట్టి చదివే నిరుద్యోగులపై కోలుకోలేని విధంగా కాంగ్రెస్ చేస్తున్న మోసంపై పోరాటం చేయాలని నిరుద్యోగులంతా నిర్ణయం తీసుకున్నారు.

కేవలం ఆర్ధిక ఇబ్బందులు అనే సాకుతో ప్రభుత్వం రిటైర్ ఉద్యోగులకు అన్ని రకాల బెనిఫిట్స్ చెల్లించకుండా తాత్కాలిక ఉపశమనం కోసం ఇలా ప్రభుత్వమే నిరుద్యోగుల కలలని సమాధి చేస్తుంద‌ని ఊహించలేదు.పేదరికం కారణంగా తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదనే కారణంతో ట్యూషన్ చెప్పడమో, రోజంతా క్యాటరింగ్ వెళ్లడమో, కర పత్రాలు పంచడమో, రాపిడో, జొమాటో, స్విగ్గి వంటి పనులు చేస్తూ దయనీయ‌ పరిస్థితిలోబాధని భరిస్తూ దుఃఖన్ని దిగమింగుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమ‌వుతున్నారు. ప్రభుత్వం నిరంకుశంగా ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచడంపై రానున్న రోజుల్లో ఈ సమస్యపై మరో తెలంగాణ తరహా ఉద్యమం చేయాలనే ఆలోచనలో నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకి ఇచ్చిన హామీని నెరవేర్చకుండా, ఇలా ఉద్యోగాల వయస్సు పెంచుకుంటూ ఉన్న ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్  అమలు చేయకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, అవసరమయితే త్వరలో దిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో దిల్లీ వోటర్లకి వివరించాలని నిరుద్యోగులు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల వయస్సు పెంపుతో ప్రజాప్రభుత్వం తన బాధ్యతను మరిచి, బరువు దించుకోవాలని, నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టాలనే యత్నం చేస్తున్నది. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా కుటుంబసభ్యులతో బ‌తకాల్సిన ఉద్యోగులని ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచి బలవంతంగా ఉద్యోగులని కొనసాగించాల్సిన అవసరం ఏముంది? ఎక్కడ ఉద్యోగుల తమ రిటైర్మెంట్ వయస్సు పెంచమని ధర్నాలు,నిరసన కార్యక్రమాలు చేయలే! ప్రభుత్వం సంవత్సరం తిరిగేలోగా ఇస్తా అన్న 2లక్షల ఉద్యోగాలు ఇచ్చింది లేదు, కానీ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంపు వల్ల దాదాపు 50వేల ఉద్యోగాలనీ నిరుద్యోగులు కోల్పోనున్నారు.

జీఓ 29 తో సామాజిక తెలంగాణకు తూట్లు?
ప్రతిష్టాత్మకమైన గ్రూప్ -1 ఉద్యోగాలని ప్రభుత్వం ఎదో తప్పుడు జీఓ 29 తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీల ఉద్యోగాలని లాక్కోవాలని చూస్తున్నది. ఇది నాన్ లోకల్స్ అయిన ఆంధ్రా వారికి,  కొన్ని వర్గాల ప్రజల మెప్పుకోసం ప్రభుత్వం ఇ రాజ్యాంగ విరుద్ధమైన జీఓ 29 తీసుకొచ్చిందని నిరుద్యోగులంతా ప్రభుత్వంపై పోరాడారు. ఈ జీఓ 29 ప్రత్యేకత ఏమిటంటే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ పాటించకుండా కేవలం మెరిట్‌కేప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బలహీన వర్గాల వారి కలలకు మరణ శాసనం జీఓ 29. గతంలో దీపేందర్ యాదవ్, కిషోర్ చౌదరి, సౌరవ్ యాదవ్,ఇందిరా సహాని వంటి కేసులలో సుప్రీంకోర్టు అన్ని దశలలో (ప్రిలిమ్స్,మెయిన్స్, ఇంటర్వ్యూ )సామాజిక రిజర్వేషన్స్ పాటించాలని స్పష్టంగా చెప్పినప్పటికీ ప్రభుత్వం మొండిగా సుప్రీం కోర్ట్ తీర్పులకి వ్యతిరేకంగా రిజర్వేషన్ కి వ్యతిరేకమైన జీఓ 29 ని బలవంతంగా అమలు చేస్తున్నది. తెలంగాణ ఏర్పడ్డదే 90శాతానికి పైగా తెలంగాణలో ఉన్నా బలహీన వర్గాల ప్రయోజనాల కోసము కానీ ఈ తప్పుడు జీఓ 29 తో సామిజిక తెలంగాణకు తూట్లు పొడుస్తున్నదని నిరుద్యోగులంతా భావిస్తున్నారు.ఇప్పటికి జీఓ 29 రాజ్యాంగబద్ధ‌మని హై కోర్టు కానీ, ఏ న్యాయ స్థానం తెల్చలేదు కేవలం సాంకేతిక కారణంతో, కేసు వేయడంలో జాప్యం అనే కారణంతో హై కోర్టు  జీఓ29 పై ఉన్న కేసులన్నింటినీ కొట్టివేసింది. హై కోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూనే జీఓ 29 పై సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేయాలని నిరుద్యోగులంతా నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగమే లేని తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేయాలి. ఎప్పటికప్పుడు ఖాలీ అయ్యే ప్రతి ఉద్యోగాన్ని, ఖాలీ అయ్యే ముందు రోజు వరకే ఆ ఉద్యోగం భర్తీ అయ్యేలా ప్రభుత్వం కృషి చేయాలి.ప్రభుత్వం ఇచ్చే వందల ఉద్యోగాలకు లక్షలాది నిరుద్యోగులు పోటీ పడుతుండడం, ఆ వందల ఉద్యోగాలని భర్తీ చేయడాన్ని ప్రభుత్వం గొప్పగా భావించడం నిజంగా సిగ్గుచేటు. మిగ‌తా నిరుద్యోగులు ఏమైపోవాలి?

ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగానే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాల భర్తీపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహాకాలు అందించాలి. తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డదే నియామకాల కోసం కాబట్టి,  ప్రైవేట్ ఉద్యోగాల్లో 75% ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. పరిశ్రమలకు కావాల్సింది నైపుణ్యం ఉన్న మానవ వనరులే కాబట్టి  అవసరమైన సాంకేతిక నైపుణ్యం ప్రభుత్వమే అందివ్వాలి. పరిశ్రమలు కోరుకుంటున్న, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా విద్య వ్యవస్థని మార్చాలి. అదేవిధంగా బిజినెస్ చేసుకునేందుకు తెలంగాణ బిడ్డలకి ఉదారంగా రుణాల‌ను ప్రభుత్వం అందించినప్పుడే కొలువుల తెలంగాణ అవతరిస్తుంది.

శ్రవణ్ కుమార్,
నిరుద్యోగి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *