“పాకిస్థాన్ లో వలె మన రాజ్యాంగంలో మతచట్టాలు లేవు. మనది మతాతీత రాజ్యాంగం.ఆర్టికల్ 25 మన రాజ్యాంగ లౌకిక లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది.ఆర్టికల్ 26,27,28 చెప్పే విషయాలను గమనించినా మన రాజ్యాంగం ఒక మతానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వలేదని స్పష్టమవుతుంది. ప్రభుత్వ వ్యవహారాలలో మతం తాలూకు జోక్యాన్ని మన రాజ్యాంగం అనుమతించదు. కానీ దుగ్గరాజు వారి కళ్ళకు మాత్రం మన రాజ్యాంగంలో మతచట్టాలు కనిపించటం విశేషాలలోకెల్లా విశేషం!ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు విషయాలను స్పష్టం చేస్తున్నాయి. ఒకటి నెహ్రూ పట్ల ఆయనలోని వ్యతిరేకత. రెండు రాజ్యాంగం మీద ఆయనకు గల అవగాహనా రాహిత్యం.”
‘నెహ్రూ సెక్యులరిస్టు కాదు” అనే శీర్షికతో ఫిబ్రవరి 10 నాడు డా:దుగ్గరాజు శ్రీనివాసరావు గారు ఒక తెలుగు దినపత్రికలో రాసిన వ్యాసం అభ్యంతరకరంగా సాగింది.ఈ వ్యాసం ఫిబ్రవరి 07 నాడు “మత జాతీయవాదం భారత్ కి మేలు చేసేనా” పేరుతో రామచంద్ర గుహ రాసిన వ్యాసంలోని కొన్ని విషయాలను ఖండిస్తూ రాసిన వ్యాసం. గుహ గారు తన వ్యాసంలో చెప్పిన విషయాలను సమర్థించుకునేందుకు నెహ్రూను వెనకేసుకురావటం అభ్యంతరకరమన్నారు. ఈ రచయిత.రామచంద్ర గారు తన వ్యాసంలో అభూత కల్పనలేమి చేయలేదు.తాను చెప్పే విషయాలను సమర్థించుకునేందుకు ఆయన నెహ్రూను వెనకేసుకు రాలేదు.
మరి ఏం చేశాడు? రామచంద్ర గుహ తన వ్యాసంలో నెహ్రూ దార్శనికతను మాత్రమే ప్రస్తావించారు. ఆయన పాలనకు ప్రస్తుత పాలనకు మధ్య వైరుధ్యం ఎక్కడుందో చెప్పే ప్రయత్నం చేశారు. దానికోసం 1947 అక్టోబర్15 న ప్రధానిగా నెహ్రూ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన ఒక లేఖను ఉదహరించారు.’పాకిస్తాన్ తన ముస్లిమేతర పౌరులను ఎంతగా దురవస్థలకు గురిచేసినా మనం మన మైనారిటీ మతస్థుల పట్ల నాగరీకరీతిలో వ్యవహరించాలి. మన అల్పసంఖ్యాక వర్గాలకు పూర్తి భద్రత కల్పించి, ఒక ప్రజాస్వామిక రాజ్యంలో పౌరులకు ఉండే హక్కులు అన్నిటినీ మన ముస్లిం మైనారిటీలకు ఇవ్వాలి’ అని ఆ లేఖలో నెహ్రూ చెప్పినట్లు రామచంద్ర గుహ పేర్కొన్నారు.ఈ లేఖలో మహానుభావుడు నెహ్రూ ఎంత నాగరికంగా ఆలోచించాడు? ఆయన ఆలోచనలు ఎంత ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నాయి? ఇందులో మైనార్టీల హక్కులను కాపాడటం కోసం ప్రధానిగా తాను పడుతున్న తపన కనిపిస్తుంది.ఇప్పుడున్న పరిస్థితుల్లోనయితే ఆ మాటలకు చాలా విలువ ఉంది.
ప్రస్తుతం మనదేశంలో మైనార్టీల పట్ల ఎట్లాంటి వివక్ష కొనసాగుతున్నదో అందరం చూస్తున్నాం. ప్రభుత్వాధినేతలే స్వయంగా మైనార్టీలను ఎలా ఇబ్బంది పెట్టాలో ప్రజలకు వివరిస్తున్న దుర్మార్గమైన పరిస్థితులు మన దేశపు గత సంస్కృతికి భిన్నంగా ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామచంద్ర గుహ రాసిన వ్యాసానికి గానీ అందులో పేర్కొన్న విషయానికి గానీ రాజ్యాంగస్ఫూర్తితో ఏకీభావం ఉంది. కానీ దుగ్గరాజు వారికి మాత్రం ఆ మాటల్లో విచిత్రంగా కుహనా లౌకికవాదం కనిపించింది. లౌకికవాదమంటే ముస్లిం ద్వేషమని దుగ్గరాజు అవగాహనగా అర్థం చేసుకోవచ్చు.తన వ్యాసంలో దుగ్గరాజు గారు ఒకడుగు ముందుకు వేసి ఒకపెద్ద ఆరోపణ కూడా చేసారు.అది కూడా మనదేశ అత్యున్నత రాజ్యాంగం మీద.”రాజ్యాంగంలో మత చట్టాలను అనుమతించినపుడే తేలిపోయింది ఆయన సెక్యులరిజం”అని నెహ్రూని ఉద్దేశిస్తూ రాజ్యాంగ స్పూర్తిని కూడా వక్రీకరించారు.రాజ్యాంగం గురించి,దాని విలువ గురించి ఓనమాలు కూడా తెలియని వాళ్లే ఇలా మాట్లాడుతారు.’మైనారిటీ’అనే భావన పట్ల, రాజ్యాంగం దాన్ని నిర్వచించిన,గుర్తించిన విధాసం పట్ల కూడా దుగ్గరాజు గారికి స్పష్టత కొరవడినట్టుంది.అయితే రాజ్యాంగం రచన నెహ్రూ ఇష్టాయిష్టాలను అనుసరించి జరిగినట్టు భావించటానికి మించిన అమాయకత్వం మరొకటి ఉండదు.
పాకిస్థాన్ లో వలె మన రాజ్యాంగంలో మతచట్టాలు లేవు. మనది మతాతీత రాజ్యాంగం.ఆర్టికల్ 25 మన రాజ్యాంగ లౌకిక లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది.ఆర్టికల్ 26,27,28 చెప్పే విషయాలను గమనించినా మన రాజ్యాంగం ఒక మతానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వలేదని స్పష్టమవుతుంది.ప్రభుత్వ వ్యవహారాలలో మతం తాలూకు జోక్యాన్ని మన రాజ్యాంగం అనుమతించదు. కానీ దుగ్గరాజు వారి కళ్ళకు మాత్రం మన రాజ్యాంగంలో మతచట్టాలు కనిపించటం విశేషాలలోకెల్లా విశేషం!ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు విషయాలను స్పష్టం చేస్తున్నాయి. ఒకటి నెహ్రూ పట్ల ఆయనలోని వ్యతిరేకత. రెండు రాజ్యాంగం మీద ఆయనకు గల అవగాహనా రాహిత్యం.
నెహ్రూ మీద,భారత రాజ్యాంగం మీద,అలాగే రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ మీద ఈ రోజుల్లో సోషల్ మీడియా వేదికగా ఎలాంటి దుష్ప్రచారాలు,అవాస్తవాలు ప్రసారమవుతున్నాయో ఏమాత్రం ఇంగితజ్ఞానం ఉన్నవాళ్ళకైనా తెలిసిన సత్యమే.దాని వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో ఎవ్వరికీ తెలియని రహస్యమేమి కాదు. అలాంటి దుష్ప్రచారాలకు ప్రజల్లో మేధావుల్లా ఫోజులు కొట్టే కొందరు స్వయం ప్రకటిత విశ్లేషకులు కూడా ఇటీవల తోడై నానా హంగామా చేస్తున్నారు. ఆ గుంపులోని వారే ఈ దుగ్గరాజు శ్రీనివాసరావు. అయితే ఇంతపెద్ద రాజకీయ విశ్లేషకునికి తేదీల గురించి కూడా తెలియకపోవడం మరో అతిపెద్ద లోపం.
“ప్రధానిగా నెహ్రూ ఉన్న 1959 లోనే తొలిసారి అయోధ్య రామమందిర వివాదం తలెత్తింది”అన్నారు దుగ్గరాజు.అది 1959 కాదు.1949,డిసెంబరు 22,23 తేదీలలో గుర్తుతెలియని వ్యక్తి ఒకరు సీతారాముల విగ్రహాలను బాబ్రీ మసీదులో ప్రతిష్ఠించటంతో ఈ వివాదం తలెత్తింది. అయితే స్థానిక జిల్లా మేజిస్ట్రేట్ ఈ విషయాన్ని అప్పటి రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంతో ఆ ప్రదేశాన్ని’వివాదాస్పద స్థలం’గా ప్రకటించింది. ఆ మేజిస్ట్రేట్ జనసంఘ్ భావజాలం కలిగినవాడు. దానితో ఆ విగ్రహాలను అక్కడినుంచి తరలించడానికి ఒప్పుకోలేదు. స్వయంగా ప్రధానమంత్రి నెహ్రూ విజ్ఞప్తిని సైతం తోసిపుచ్చాడు.మేజిస్ట్రేట్ న్యాయాధికారం ముందు ప్రధాని కూడా ఏం చేయలేకపోయాడు.తన అధికార బలాన్ని ఉపయోగించుకోకపోవటం,న్యాయ వ్యవస్థకు స్వేచ్ఛనివ్వటం ఆయన గొప్పతనమే కానీ బలహీనత కాదు.అయితే కుటిల బుద్ధితో మేజిస్ట్రేట్ చేసిన ఈ పనికి ప్రతిఫలంగా జన సంఘ్ ఆయనను పార్లమెంటుకి పంపింది.చరిత్ర ఇలా సాగితే “ఆ సమయంలో ఆ విగ్రహం తొలగించే ఉత్తర్వులు నెహ్రూ ఇచ్చివుంటే అది బాబ్రీ మసీదుగానే ఉండిపోయేది.అది చేయకుండా మందిర-మసీదు వివాదానికి నెహ్రూ పునాది వేశారు”అంటున్నారు దుగ్గరాజు.
ఇది ఖచ్చితంగా చరిత్ర వక్రీకరణనే.చేయని తప్పుకు నెహ్రూను దోషిని చేయటం, అసలు దోషులను మరుగుపరచటం దుగ్గరాజు వారి వ్యూహం.ఇలా రాజ్యాంగం గురించి,చరిత్ర గురించి ఎవరెన్ని వక్రభాష్యాలు రాసినా వాటికి ఆవగింజంత విలువ కూడా ఉండదని దుగ్గరాజు గారు గుర్తించాలి.చరిత్ర మన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి నడవదన్న సంగతిని కూడా ఆయన గుర్తెరగాలి.అయితే నెహ్రూ సెక్యులరిస్టు కాదని తీర్పులిస్తున్న దుగ్గరాజు గారు తన పాలనాకాలంలో ఆయన మతాన్ని ఎక్కడ నెత్తిన పెట్టుకొని ఊరేగాడో నిరూపిస్తే ఆయన వాదనకు విలువ ఉంటుంది.
-తోకల రాజేశం
మొబైల్ : 9676761415





