“జపాన్ రాజకీయ వేదిక మరోసారి అస్థిరతలో మునిగిపోయింది. ప్రధాని పదవీకాలం మధ్యలోనే ముగియడంతో, పార్టీ అంతర్గత విభేదాలు, ఆర్థిక సమస్యలు, ప్రజా విశ్వాసం కోల్పోవడం వంటివి దేశాన్ని అనిశ్చితిలోకి నెట్టాయి. ఈ సంక్షోభం చివరికి ఒక చారిత్రక ఘట్టానికి దారి తీసింది. జపాన్ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా సనే తకాయచి అధికారంలోకి రానున్నారు. ఈ రాజకీయ సంక్షోభంలో పదవిని కోల్పోయిన తొలి వ్యక్తి మాజీ ప్రధాని షిగేరు ఇషిబా. 2024 అక్టోబర్‌లో పదవి చేపట్టిన ఆయన కేవలం ఏడాదికే రాజీనామా చేయాల్సి వచ్చింది. అవినీతి ఆరోపణలు, ఎన్నికల్లో ఓటములు, ప్రజల్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డిపి) పట్ల పెరుగుతున్న అసంతృప్తి వంటి అంశాలు కలసి ఆయనను దారి తప్పించాయి. దశాబ్దాల తర్వాత తొలిసారి లిబరల్ డెమోక్రటిక్ పార్టీ పార్లమెంట్‌లో మెజారిటీ కోల్పోయింది. యెన్ విలువ పడిపోవడం, ధరల పెరుగుదల, జీతాలు పెరగకపోవడం వంటి అంశాల వల్ల ప్రజలు ఆగ్రహంతో ఓటేశారు. ఇషిబాపై పార్టీ అంతర్గత ఒత్తిడి కూడా పెరిగి ఆయన రాజీనామా చేయక తప్పలేదు.”

8247045230
ఇషిబా రాజీనామా చేసిన నేపథ్యంలో పార్టీలో కఠిన పోటీ మొదలైంది. ఆ పోటీలో సనే తకాయచి విజయం సాధించి, అక్టోబర్ మధ్య నాటికి పార్లమెంట్ ఆమెను ప్రధానిగా ఖరారు చేయనుంది. ఆమె గెలుపు చరిత్రాత్మకం. జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రి అవ్వడం మాత్రమే కాదు, రాజకీయంగా కఠిన సంప్రదాయవాద వైఖరిని ప్రతిబింబించే వ్యక్తి అధికారంలోకి రావడం కూడా. ఆమె దివంగత ప్రధానమంత్రి షింజో అబేకు సన్నిహితురాలు, ఆయన జాతీయవాద భావజాలాన్ని కొనసాగించాలనే సంకల్పం కలిగిన వ్యక్తి. దేశం మార్పు కోరుకునే సమయంలో తకాయచి గెలుపు మరింత కఠినమైన రాజకీయ దిశకు సంకేతంగా నిలుస్తోంది.
సవాళ్లతో నిండిన కొత్త మార్గం:
అయితే ఈ కొత్త నాయకురాలి ముందున్న సవాళ్లు సాధారణమైనవి కావు. ఒకవైపు దేశీయంగా రాజకీయ స్థిరత్వాన్ని నెలకొల్పడం, మరోవైపు ఆర్థిక ఒత్తిడి, సామాజిక అసమతుల్యత వంటి సమస్యలను ఎదుర్కోవడం ఆమెకు పెద్ద పరీక్ష. జపాన్ రాజకీయ చరిత్రలో ప్రధానులు తక్కువ కాలంలో పదవీ విరమణ చేయడం సాధారణం. ఇప్పుడు అదే దశ మళ్లీ వస్తుందేమోనని జపనీయులు ఆందోళన చెందుతున్నారు.
మొదటగా, పార్లమెంట్‌లో మెజారిటీ లేకపోవడం తకాయచికి పెద్ద సవాలు. ముఖ్యమైన చట్టాలు, బడ్జెట్ బిల్లులు ఆమోదం పొందాలంటే ప్రతిపక్షం మద్దతు తప్పనిసరి. ఆమె ప్రతిపక్షంతో సహకారం సాధించి, ప్రభుత్వాన్ని స్థిరంగా నడిపిస్తేనే ఆమె నాయకత్వం నిలబడగలదు. తరువాత, ఆర్థిక రంగం ఆమె ముందున్న ప్రధాన సవాలు. సంవత్సరాలుగా జపాన్ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండిపోయింది. యెన్ విలువ పడిపోవడంతో జీవన ఖర్చులు పెరిగాయి. అబే ఆర్థిక విధానాల మాదిరిగానే, తకాయచి కూడా ప్రభుత్వ ఖర్చులు పెంచాలని చెబుతున్నారు.
కానీ ప్రజల నిజమైన అవసరం జీతాలు పెరగడం, జీవన నాణ్యత మెరుగుపడడం. ఆమె ఆ దిశగా మార్గం కనుగొనగలదా అన్నది ఒక ప్రశ్నే కాకుండా ఆమె నాయకత్వాన్ని నిర్ణయించే ఒక ప్రధాన అంశం. వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం వల్ల సామాజిక సంక్షేమ వ్యయాలు పెరిగి, దేశానికి మరో ఆర్థిక భారంగా మారుతున్నాయి. చివరగా ఎల్‌డిపిలో అంతర్గత విభేదాలను సద్దుమణగించడం కూడా తకాయచికి తప్పనిసరిగా మారింది. ఎన్నికల్లో ఓటములు పార్టీ మూలవర్గం నమ్మకాన్ని దెబ్బతీశాయి. “జపాన్ ఫస్ట్” అనే వారు తమ స్వరాన్ని పెంచుతున్నారు. వలసలు, భద్రత, సైనిక బలోపేతం వంటి అంశాల్లో తకాయచి కఠిన వైఖరి ఆ వర్గాలకు దోహదపడుతుంది. కానీ ప్రజల్లో ఎల్‌డిపి పట్ల విసుగు తగ్గించాలంటే, ఆమె సమన్వయానికి దోహదపడే మృదుత్వాన్ని చూపించాల్సిందే.
విదేశాంగ దిశ – వాస్తవికతలో కఠినత్వం;
దేశీయ సవాళ్లతో పాటు, విదేశాంగ విధానం కూడా తకాయచికి కీలకం కానుంది. ఆమె దృష్టిలో జపాన్ భద్రత అంటే బలమైన సైన్యం, స్పష్టమైన అమెరికా భాగస్వామ్యం, చైనాపై కఠిన వైఖరి. అమెరికాతో సంబంధాల పరంగా, ఆమె వాస్తవికతను కొనసాగించవచ్చు. కానీ మళ్లీ అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ పాలన ఆమెకు కొత్త తలనొప్పిగా మారవచ్చు. ట్రంప్ జపాన్‌ను అధిక రక్షణ ఖర్చులు భరించాలని కోరుతున్నారు. జీడీపీలో 3.5% వరకు పెంచాలని ఆయన డిమాండ్. తకాయచి అమెరికా మద్దతు కొనసాగించడంలో, ఆర్థిక భారాన్ని నియంత్రించడంలో సమతుల్యతను పాటించాల్సి ఉంటుంది.
విదేశీ వ్యవహారాలు:
ఆసియా పొరుగు దేశాలతో సంబంధాలు కూడా కొత్త దిశలో కదలవచ్చు. చైనా, దక్షిణ కొరియాతో తకాయచి వైఖరి కఠినంగా ఉండే అవకాశం ఉంది. అబే తరహా జాతీయవాదానికి ఆమె మద్దతు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 9లో మార్పు సూచనలు, యాసుకుని మందిర సందర్శన వంటి చర్యలు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచవచ్చు. అయినప్పటికీ, చైనా జపాన్ ప్రధాన వ్యాపార భాగస్వామి కావడం వల్ల, తకాయచి తన మాటల్లో కొంత మృదుత్వాన్ని చూపించే అవకాశం ఉంది. ఆమె భారతదేశం, ఆస్ట్రేలియా వంటి దేశాలతో సన్నిహిత బంధాలను పెంచి, క్వాడ్ కూటమిలో జపాన్ పాత్రను బలపరచాలనుకుంటున్నారు.
ముగింపులో చెప్పాలంటే, సనే తకాయచి అధికారంలోకి రావడం ఒక రాజకీయ అనివార్యత. ఇది పాత సంప్రదాయవాద దృక్పథానికి కొత్త చరిత్రాత్మక మైలురాయిగా మారింది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తన మూలవర్గాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. కానీ అదే సమయంలో ఒక మహిళా నాయకురాలిని ప్రోత్సహించడం జపాన్ రాజకీయ మార్పుకు సంకేతమూ కావచ్చు.
తకాయచి ముందు ఉన్న పరీక్షలు కఠినమైనవే: ప్రతిపక్షంతో సఖ్యత, ఆర్థిక స్థిరత్వం, విదేశాంగ సమతుల్యత. ఈ పరీక్షల ఫలితమే ఆమెను జపాన్ “ఐరన్ లేడీ”గా నిలబెడుతుందా లేదా మరో తాత్కాలిక ప్రధానిగా చరిత్రలో మిగిలిపోతుందా అన్నది నిర్ణయిస్తుంది. జపాన్ యుద్ధానంతర రాజకీయ స్థిరత్వం ముగిసిన తర్వాత, ఇప్పుడు ప్రారంభమవుతున్న ఈ కొత్త అధ్యాయం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.





