20. జనధర్మో విజయతే
పేర్వారం జగన్నాథం గారుచేసిన జరిపిన ఇంటర్వ్యూలలో ముఖ్యమైనది రావి నారాయణ రెడ్డి గారిది. రావి నారాయణ రెడ్డి (జూన్ 5, 1908 – సెప్టెంబర్ 7, 1991) కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాట వీరుడు. సంఘ సంస్కర్త, ఉదార ప్రజాస్వామ్యవాది. ఆంధ్రమహాసభ ప్రారంభించిన సాంస్కృతికోద్యమాన్ని క్రమానుగుణంగా వామపక్ష సాయుధ పోరాటంగా
పరివర్తన చేసిన గొప్ప నాయకుడు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యుడు. హైదరాబాదు సంస్థానంపై పోలీసు యాక్షన్ జరిగి, 17 సెప్టెంబరు 1948 నాడు నిజాం నిరంకుశ పరిపాలన
నుండి వీరతెలంగాణా విముక్తమై, నలభైరెండు సంవత్సరాలు నిండినాయి. ఈ సందర్భంలో వీరోచితమైన ఆనాటి తెలంగాణా పోరాటపుటనుభవాల్నీ, మూగబాధల్నీ స్మరిస్తూ, దేశ ప్రగతినీ,
ప్రజాభ్యుదయాన్నీ అంచనవేస్తూ ఒక విప్లవ వీరయోధుడు పలికించిన అగ్నివీణాతరంగాలివి అని పేర్వారం జగన్నాథం గారు ఈ విధంగా రాసారు.
తెలంగాణా విముక్తి కోసం సాయుధ పోరాటానికి సారథ్యం వహించి గుండెను కాగడాగా వెలిగించి గెరిల్లా సైనికులకు వెలుగుదారి చూపించి నిజాం రాచరికాన్ని తుదముట్టించడానికి
ఉప్పెనలా పైకెగసి విజయఢంకా మ్రోగించి పల్లె పల్లెలో రైతాంగపోరాటాన్ని పెనుతుఫానులా హోరెత్తించిన విప్లవ యోధుడు కర్మ వీరుడుపద్మవిభూషణ్ కళాప్రపూర్ణ కామ్రేడ్ శ్రీ రావి నారాయణ రెడ్డితో జరిపిన ఇంటర్వ్యూ ఇది. ఫ్యూడల్ దోపిడిని వ్యతిరేకించిన ఆంధ్రమహాసభ ఆంధ్రమహాసభలో చేరడానికిగలేమిటి? అని పేర్వారం జగన్నాథం ప్రశ్నకు రావిగారి జవాబు: నేను నిజాం కాలేజి విద్యార్థిగా ఉన్న రోజుల్లో రెడ్డి హాస్టల్లో ఉంటూ ఉండేవాణ్ణి. అంతకుముందే శ్రీ మాడపాటి హనుమంతరావు ఆంధ్ర భాషా సంస్కృతుల సముద్ధరణ కోసం 'ఆంధ్రజన సంఘం' అనే పేరుతో ఒక సంస్థను స్థాపించి ఉండిరి.
ఆ తరువాత కొన్నాళ్లకే ఆది ఆంధ్రజన కేంద్ర సంఘం గా మారింది. కార్యక్రమాలు కూడ విస్తృతమైనాయి. మాడపాటి వారే దానికి కార్యదర్శిగా ఉండేవారు. అప్పట్లో ఈ సంఘం తరపున వెట్టిచాకిరి, సర్బరాహీని వ్యతిరేకిస్తూ, రెండుపుస్తకాలు అచ్చు అయినాయి. ఆ సభల్లో ఫ్యూడల్ దోపిడిని వ్యతిరేకిస్తూ, ప్రసంగాలూ, తీర్మానాలూ చేసేవాళ్లు. ప్రారంభంలో వర్తకులు ఈ సభల్ని బాగా ప్రోత్సహించేవాళ్లు. వాళ్ల ప్రేరణతోనే నల్లగొండ జిల్లా చండూరు గ్రామంలో ఒక సభ జరిగింది. మాడపాటి వారు పంపించగా ఈ సభకు నేను హాజరైనాను. సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షుడిగా ఆ తరువాత 1930లో మెదకు జిల్లాలోని జోగిపేటలో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన ప్రథమ ఆంధ్రమహాసభ జరిగింది. సుమారు పాతికమంది కాలేజి విద్యార్థులమంతా కలిసి సైకిళ్ల మీద ప్రయాణం చేసి ఆ సభకు హాజరైనాము. అంతేకాక అప్పుడు వలంటీరు దళానికి నేను కెప్టెన్గా కూడ వ్యవహరించినాను. ప్రజల కష్టాలు, దొరల దోపిడి చూసి, నాలో కసిరగులుతూ ఉండేది.
ప్రజల మూగబాధలు చూసి ఆవేదనపడుతూ ఉండేవాణ్ణి. బాధల నుండి వారికి విముక్తి కలిపించాలని వారికి సేవ చేయాలని ఆలోచిస్తూ, అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉండేవాణ్ణి. అట్టి తరుణంలో నిజాం రాష్ట్రంలోనే ఈ ఆంధ్రమహాసభ అవతరించి, తన కార్యక్రమాల్ని క్రమంగా విస్తృతపరచింది. గాడాంధకారంలో చిరుదివ్వెను వెలిగించినట్లు మాడపాటివారు ఈ ఆంధ్రమహాసభను ప్రారంభించినారు. అట్లా నేను 1928 ప్రాంతంలో ఆంధ్రమహాసభవైపు ఆకర్షింపబడి అందులో చేరినాను. మా కొద్దీ తెల్లదొరతనం జగన్నాథం ప్రశ్న: మీరు హైదరాబాదు స్టేటు కాంగ్రెసులో కొంతకాలం పనిచేసిన పిదప మ్యూనిస్టు పార్టీలో చేరినట్లు తెలుస్తున్నది. అందుకుగల కారణాలు, కలిగిన ప్రేరణ ఎలాంటివో వివరిస్తారా? జ. నేను కాలేజి విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే అంటే 1930కి పూర్వమే గాంధీజీ రచనలు చదవడం ప్రారంభించినాను. ఆయన ఆత్మకథ నాకు బాగా నచ్చింది.

ఆయన సామ్రాజ్యవాద వ్యతిరేక భావాలు నన్నెంతో ఆకర్షించినాయి. అందువల్ల నేను కాంగ్రెసువైపు మొగ్గినాను. అప్పట్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెసు నాయకత్వాన సత్యాగ్రహ పోరాటాలు సాగుతున్నాయి. హైదరాబాదు రాష్ట్రంలో మాత్రం అలాంటి ఉద్యమాలేవీ లేకుండెను. అదే సమయంలో హైదరాబాదు సంస్థానానికి వెలుపల, కాకినాడలో, 1930లో జరిగిన సత్యాగ్రహ క్యాంపులో పాల్గొని వచ్చినాను. అప్పుడు గరిమెళ్ల వారి మా కొద్దీ తెల్లదొరతనం' వంటి పాటలు మమ్మల్ని ఎంతో ఉత్తేజపరచినాయి. అక్కడ పొందిన ఉత్తేజంతో మా గ్రామంలో ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించినాను. గాంధీగారు చేపట్టిన హరిజన ఉద్యమంలో కూడా చేరి హైదరాబాదు సంస్థానశాఖకు కార్యదర్శిగానూ నియమింపబడి, స్పృశ్యతా నివారణ కోసం పాటుపడినాను. ఈ రోజుల్లోనే నాకు స్వామి రామానంద తీర్థతో పరిచయం ఏర్పడింది.
అందరం కలిసి స్టేట్ కాంగ్రెస్ సంస్థాపన కోసం అవసరమైతే సత్యాగ్రహం చేయాలని నిశ్చయించుకున్నాం. మత తత్వం అంటకుండా 1938లో జరిగిన సత్యాగ్రహంలో తెలంగాణా తరఫున నేను మొదటి సత్యాగ్రహిని. సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లి, విడుదల కాగానే, వార్థాకు రమ్మని గాంధీజీ నుంచి పిలుపు వచ్చింది. సత్యాగ్రహ ఉద్యమంలో ఆర్యసమాజం హిందూ మహాసభ' వంటి సంస్థలు కూడా పాల్గొనడం వల్ల, ఉద్యమానికి మతతత్త్వం అంటుకున్నదని భావించి, వెంటనే ఉద్యమాన్ని విరమించవలసిందిగా గాంధీగారు ఆదేశించినారు. మేమెంత కాదన్నా, ఆయన మాటకు తిరుగులేదు, కనుక ఉద్యమాన్ని విరమించినాం. చాలా మంది యువకులం నిరాశ నిస్పృహలకు గురైనాము. గాంధీవాద ప్రభావంలో ఉన్న నాకు ఒక దశలో నెహ్రూ రచనలు ఆకర్షించినాయి. ఫాసిజానికి వ్యతిరేకంగా నెహ్రూ వెల్లడించిన భావాలు నాలో సోషలిస్టు భావాలకు అంకురార్పణ కలిగించినాయి.
జయప్రకాశ్ నారాయణ రచించిన 'సోషలిజం ఎందుకు? వంటి గ్రంథాలు కూడ, నన్నెంతో ప్రభావితం చేసినాయి. వందేమాతరం ఉద్యమంలోనూ, ఆంధ్రమహాసభల్లోనూ
చురుకుగా పాల్గొంటున్న కొందరు యువకులకు సోషలిస్టు భావాలుండేవి. అలాంటి వారిలో దేవులపల్లి వెంకటేశ్వరరావు, సర్వదేవభట్ల రామనాథం, బద్దం ఎల్లా రెడ్డి, ఆరుట్ల సోదరులూ,
మగ్దూం, రాజ్ బహదూర్ గౌడ్, నేనూ, వగైరాల మున్నాము. ఈ అందరం కలిసి 1939 లో నిజాం సంస్థాన కమ్యూనిస్టు కమిటీని స్థాపించుకున్నాం. ఈ విధంగా నేను మొదట కాంగ్రెస్నై ఉండి,
తరువాత కమ్యూనిస్టు పార్టీలో చేరడమైనది. ఐతే నేను కమ్యూనిస్టునైనప్పటికినీ జాతీయవాదిని కూడ. జాతీయ వాదానికి, కమ్యూనిజానికి వైరుధ్యం లేదనీ, ఉండకూడదనీ నేను భావిస్తుంటాను.





