జాజులు నవ్విన రాత్రి

జాజులు నవ్విన
ఏ జావళీల జానపదుల్లో
నిన్ను వెతుక్కొంటూ
వేణుగానమై రవళిస్తుంటాను

పవళించే నీ ఊహల రాత్రుల్లో
వెండి వెన్నెల రంగుల కలల్ని నెమరేస్తూ
నెమ్మదిగా నన్ను నేను మైమరచిపోతాను
జాగురూకతో జాబిలి రాత్రుల్ని
నీకై అన్వేషణ సాగిస్తాను

మంద్రంగా మీటే
మిణుగురు రాగాల్ని వింటూ
నీ కోసం సాహిత్య చకోరినై
ఏ గగన తీరాన్నో వాలి
తన్మయత్నపు తుమ్మెద ఝుంకార
నిఘంటువుల్ని పూరిస్తుంటాను

వెన్నెల విరియని రాత్రుల్లో
మది ఆకాశం
ఒంటరి ఒడ్డులా విలవిలలాడుతుంది
చీకటి కూడా చిరునవ్వులకు
పరదాను చుట్టుకుంటుంది
నువ్వున్నావన్న స్పర్శ
చుట్టూ కొత్త కాంతుల్ని విరబూయిస్తుంది
పొలమారిన మనసు నిత్యం
నీ చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది

• మహబూబ్ బాషా చిల్లెం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *