చెఱ!.. అతను జైల్లోకి వచ్చిపడ్డాడు

మెరుపు తీగెలు 

జైల్లోకి రావడానికి ముందు కోర్టులో బోనెక్కాడు. అతను చెయ్యని నేరాలకు పోలీసులు ఆధారాలు చూపిస్తుంటే, చేసిన నేరాలు గుర్తుకు వచ్చాయి. కోర్టు సమయాన్ని లాయర్లూ జడ్జీలకన్నా యెవ్వరూ దుర్వినియోగం చేయలేరని కేసు మళ్ళీ వాయిదా పడ్డప్పుడు అనుకున్నాడు. శిక్ష తేలకుండా అతను అంత ఆనందంగా యెందుకు వున్నాడో జైలు సిబ్బందికి అర్థం కాలేదు. అదే విషయం అడిగితే నవ్వేసి, ‘నేను అరెస్టయి జైలుకు యే తారీఖున వచ్చాను?’ అని తిరిగి అడిగాడు. మార్చి ఆరు, రెండువేల పదహారు’ ఫైల్ చూసి చెపితే, తనలో తానే గొణుక్కుని తృప్తిగా చూశాడు. ‘వీడికి రేపు వురిశిక్ష పడ్డా యిలాగే వుంటాడేమో?’ ఆశ్చర్యపోయారు సిబ్బంది.

నాలుగు వాయిదాల తర్వాత అతనికి వూహించినట్టు వురిశిక్ష పడకపోయినా యేడేళ్ళ సాధారణ జైలుశిక్ష, రెండేళ్ళ కఠిన కారాగారశిక్ష కలిపి మొత్తం తొమ్మిదేళ్ళు పడింది. జడ్జిగారు చెప్పినప్పుడు విని కూడా నమ్మలేనట్టు మళ్ళీ బోను దిగుతూ అడిగాడు. ‘తొమ్మిదేళ్ళు’ అని లాయర్లు చెప్పినా, వేన్లో తీసుకువెళుతున్నప్పుడు పోలీసులను మళ్ళీ అడిగాడు. ‘తొమ్మిదేళ్ళు’ అని చెప్పించుకున్నప్పుడు అతని కళ్ళలో వెలుగు తొంగిచూసింది.అతనికి ఖైదీగా నెంబర్ యిచ్చారు. ఆత్రంగా చూశాడు. ‘త్రీ వన్ ఫోర్ వన్’ చెప్పాడు వార్డెన్. తన సర్వీసులోనే మొదటిసారి ‘థాంక్స్’ చెప్పిన అతణ్ణి చూసి నివ్వెరపోయాడు. ‘ఫాన్సీ నెంబర్ దొరికిందనేమో?’ అని తోటి సిబ్బంది జోకులు వేసుకున్నారు. ‘పిచ్చానాకొడుకు’ అని తిట్టుకున్నారు.

అతనికి రూమ్ అలాట్ చేసినప్పుడూ అదే జరిగింది. ‘రూమ్ నెంబర్ త్రీనాట్ సిక్స్… మూడువందల ఆరు’ అన్నప్పుడూ యెగిరి గంతేశాడు. తోటి ఖైదీలు జుట్టు పీక్కున్నారు. జైలు సిబ్బంది నిట్టూర్చారు. అతని ఆనందంలో అతను వుండి జైలు నియమాల ప్రకారం నడుచుకున్నాడు. క్రమశిక్షణ పాటించాడు. ‘వీడు జైలుకి వచ్చి అత్తారింటికి వచ్చినట్టు ఫీలవుతున్నాడు’ అని వార్డెన్లు నవ్వుకొనేవారు.

ఓ రాజకీయ ఖైదీని విడిపించడంలో భాగంగా ప్రభుత్వం సత్ప్రవర్తన కనబరిచిన ఖైదీలకి రెండేళ్ళ జైలుశిక్ష తగ్గింపుని ప్రకటించి విడుదల చేయాలని జీవో పాస్ చేసింది. దాంతో తొమ్మిదేళ్ళ జైలు శిక్ష యేడేళ్ళయిన విషయం జైలు సిబ్బంది చెప్పేసరికి అతను బోరున యేడ్చాడు.

‘జైలు వదిలి వెళ్ళలేకయేమో’ అని కొందరు, ‘బయట తనకి యెవరూ లేరేమో’ అని మరికొందరు తోటి ఖైదీలు వూహించారు. ఇన్నాళ్ళూ యింత ఆనందంగా వున్న అతను యెందుకు యేడుస్తున్నాడో జైలు సిబ్బందికి కాదు కదా, జైలరుకూ అర్థం కాలేదు. అదే విషయం అడిగారు. ‘ఏడు నా లక్కీనంబరు కాదు’ అని అతను మళ్ళీ కుమిలిపోయాడు. చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ ‘కొన్ని నమ్మకాలు వుండాలి’ అన్నారు తన సిబ్బందితో జైలరు. ఆ నమ్మకం వల్లే అతను యిన్నాళ్ళూ ఆనందంగా వున్నాడని ఆ అధికారి నమ్మకం.
-బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *