అక్షరాల్లో రికార్డ్ చెయ్యటం అవసరం

సమూహాలకి హక్కులని కలిపిస్తూ చట్టం రాకముందు వీరికి హక్కులు యెందుకు  వుండాలో నే ‘మౌన’ కథ రాసినప్పుడు ముఖ్యంగా స్త్రీలనుంచి వచ్చిన స్పందన యేమిటంటే యింతకు ముందు అటువంటి రిలేషన్ షిప్స్ గురించి  విన్నప్పుడు, చదివినప్పుడు వ్యతిరేకత వుండేది.

కానీ యీ కథ చదువుతుంటే  ‘అవునుకదా యిద్దరిమధ్యా పొద్దస్తమానూ శారీరక సంబంధం మాత్రమే  కాకుండా రోజువారి జీవితం, భవిష్యత్ జీవితప్రణాళికలు, ఆకాంక్షలూ వుంటాయనే ఆలోచన కలిగింది. అన్ని సంబంధాల్లో  వున్నట్టే వాళ్ళకికూడా చట్టబద్దత, హక్కులూ వుండాలని, వారిని సమాజంలో  అందరిలానే గుర్తించాల్సిందేనని తమ అభిప్రాయాల్ని పంచుకుంటూ అసలు అలా బతకాలని  యెందుకనిపిస్తుందని కొందరు అడిగారు. వీలైనంతమందికి వివరించాను.

ఆ తరువాత లైంగిక వైవిధ్యాలమీద  బిట్టూ కెఆర్ గారు రాసిన పుస్తకాన్ని  పి. వరలక్ష్మి గారు ‘రెయిన్ బో’గా చేసిన  అనువాదం విలువైనది. ఆ పుస్తక పరిచయాన్ని రాసి, ఆ  పుస్తకాన్ని పూర్తిగా చదవమని పాఠకులకి సూచించాను. ‘రెయిన్ బో’ చాలమంది పాఠకుల సందేహాల్ని నివృత్తి  చేసింది. అన్నిప్రక్రియలలో వచ్చిన సాహిత్యమంతా కలిపి రెండుగుప్పెళ్ళు వుంటుందనుకుంటాను.

వారు సమాజంలో విభిన్నరంగాల్లోకి  ప్రవేశిస్తున్నట్టు, సాహిత్యంలో తమ జీవితానుభవాల్ని రికార్డ్ చెయ్యటం అవసరం. తొలినాళ్లలో చిక్కని సాహిత్యప్రక్రియతో  రాకపోవచ్చు. అస్తిత్వవాద సాహిత్యం వస్తున్న  ప్రారంభదశలో అనుభవ ప్రాధాన్యతని మాత్రమే చూడమనే ప్రతిపాదన మనందరికీ తెలుసు. క్రియేటివ్ ప్రొసెస్ లోని మెలకువల కోసం సమావేశాల్ని నిర్వహిస్తూ, భిన్నఆస్తిత్వాల పరస్పర సంభాషణ  వుంటే మరింత సాహిత్యం వచ్చే అవకాశం వుంటుంది.

కుప్పిలి పద్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *