యూనివర్శిటీల్లో కూడా వోట్ చోరీ జరుగుతోందా ?

వోట్ల చోరీపై రాహుల్‌గాంధీ చేస్తున్న ఆరోపణ భారత రాజకీయాలను కుదిపేస్తున్నాయి. నిజంగానే వోట్ల చోరీ జరుగుతున్నదా ? ఇంతకాలంగా దీన్ని గుర్తించలేకపోయామా అన్న మీమాంస రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనాయాంశంగా మారింది. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ఎన్నికల ప్రక్రియ అన్నది అత్యంత ప్రధానమైన అంశం. దానికున్న నియమనిబంధనల్లో అధికారపార్టీతోసహా ఏ ఇతర రాజకీయపార్టీలుగాని, నాయకులుగాని వేలుపెట్టలేనిది. అలాంటి స్వతంత్ర ప్రతిపత్తికలిగిన ఎన్నికల కమిషన్ ఆయన ఆరోపణలు సవాల్‌గా మారాయి. ప్రధానంగా బిజెపి గెలుపు పరంపరకు వోట్ చోరీనే కారణంగా ఆయన ఆరోపిస్తున్నారు. అందుకు సెంట్రల్‌ ఎలక్షన్‌ ‌కమిటీ సహకరిస్తున్నదన్నది ఆయన వాదన. ఇటీవల పలు మీడియా సమావేశాల్లో అందుకు సంబంధించిన ఆధారాలను ఆయన మీడియాద్వారా దేశప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. ఇంకా అనేక ఆధారాలు తనవద్ద ఉన్నాయంటూ త్వరలో హైడ్రోజన్‌ ‌బాంబు పేలుస్తానంటున్నాడు. డూప్లికేట్‌ ‌వోటర్లు, ఫేక్‌ ‌లేదా డూప్లికేట్‌ అ‌డ్రస్‌లు, ఒకే చిరునామాతో అనేకమంది వోటర్లు ఉండడం, డూప్లికేట్‌ ‌ఫోటోలు, ఫారం ఆరు దుర్వినియోగం లాంటి పలురకాలుగా వోట్ చోరీ జరుగుతున్నదన్నది ఆయన ఆరోపణ. ఈ వోట్ల చోరీ అన్నది ఒకపద్దతి ప్రకారం జరుగుతున్న క్రియగా చెబుతున్న రాహుల్‌, ‌ముఖ్యంగా మైనార్టీ దళిత వోటర్ల ను ఉద్దేశ్యపూర్వకంగా తొలగిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

దరఖాస్తు చేసుకోవడంవల్లే తొలగించామని ఎలక్షన్‌ ‌కమిషన్ ‌ ‌చెబుతున్నదానిలో వాస్తవంలేదన్నది ఆయన వాదన. అందుకు ఇటీవల ఒక సమావేశంలో వోట్ల తొలగింపుకు తాము దరఖాస్తుచేసుకోకున్నా చేసుకున్నట్లు వొస్తున్న వార్తలకు సంబంధించిన వ్యక్తులను ఆయన ప్రజలముందుంచడం ద్వారా ఎన్నికల కమిషన్ కు సవాల్‌ ‌విసిరారు. కేవలం ఒకే రోజు రాత్రి కొన్ని సెకండ్లలో తాము అనుకున్న వోటర్ల పేర్లను తొలగించేవిదంగా సెంట్రల్‌ ‌సాఫ్ట్‌వేర్‌ ‌వినియోగిస్తున్నారని రాహుల్‌ ‌విరుచుకుపడుతున్నారు. కర్ణాటకలోని మహదేవపురాలో జరిగినట్లుగా హర్యాన, ఉత్తర ప్రదేశ్‌లో కూడా జరిగిఉంటాయంటున్న రాహుల్‌, ఇప్పుడు బీహార్‌లో స్పెషల్‌ ఇం‌టెన్సివ్‌ ‌రివిజన్‌(ఎస్ఐఆర్‌) ‌పేరిట వోట్లను దోంగలించేందుకు వ్యవస్థీకృతమైన ఏర్పాట్లు జరిగాయన్నది ఆయన వాదన. అయితే ఎన్నికల కమిషన్ ‌ ‌మాత్రం దాన్ని కొట్టివేస్తున్నది. అయితే వోట్ల విషయంలో రాహుల్‌ ‌చేస్తున్న ఆరోపణలో నిజానిజాలు ఎలా ఉన్నా, దీనిపై యువతతో కలిసి పోరాటం చేస్తానంటూ రాహుల్‌ ‌పేర్కొనడంపైన బిజెపి పార్టీ నేతలు వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నారు.

కేంద్రం ఇలానే వ్యవహరిస్తే త్వరలో నేపాల్‌మాదిరిగా భారత్‌లోకూడా జన్‌ ‌జీ ఉద్యమం వస్తుందని రాహుల్‌ ‌హెచ్చరికను వారు తేలిగ్గా తీసిపారేస్తున్నారు. కాని రాహుల్‌ ‌మాత్రం రాజ్యాంగాన్ని కాపాడవల్సిన బాధ్యతను విద్యార్ధులు, యువకులకు గుర్తుచేస్తున్నారు. ఒక పక్క ఆయన రాజ్యాంగంపేరున యువతను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే, యువత మాత్రం తాము బిజెపి వైపే అని చెప్పకనే చెబుతున్నారు. దేశంలోని పలు యూనివర్శిటీల్లో ఇటీవల కాలంలో జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికల్లో తాము బిజెపి పక్షమే అన్నట్లుగా ఏబివిపి ప్యానల్‌ను గెలిపించుకోవడం గమనార్హం. ఉదాహరణకు తాజాగా అంటే ఈ నెల 19న రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్శిటీలో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో బిజెపి అనుబంధ ఏబివిపి ప్యానల్‌ ‌మొత్తం గెలువడం. దాదాపు ఆరేండ్ల కాలంగా కాంగ్రెస్‌, ‌వామపక్ష కూటమి నిలయంగా ఉన్న ఈ యూనివర్శిటీ ఏబివిపి వశమైంది.

విచిత్రమేమంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదంటూ యువతను పోరాటానికి సిద్ధం చేస్తున్న రాహుల్‌కు ఒక విధంగా ఇది ఎదురుదెబ్బే. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే ఉన్నప్పటికీ హెచ్‌సియు విద్యార్థి లోకాన్ని రాహుల్‌గాంధీ మాటలు ప్రభావితం చేయలేకపోయాయన్నది దీనివల్ల స్పష్టమవుతున్నది. కేవలం హెచ్‌సియు మాత్రమేకాదు ఇటీవల కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పలు విశ్వవిద్యాలయాల్లో జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికలన్నిటిలోనూ బిజెపి అనుబంధ ఏబివిపి విజయపరంపరను మోగించిందంటే ప్రజలు నరేంద్రమోదీ నాయకత్వానికి పట్టం కడుతున్నారన్నది కాదనలేని నిజం. సాధారణ యూనివర్శిటీల్లో వామపక్ష భావజాలం ఉన్న విద్యార్ధుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. అలాంటిది పాట్నా యూనివర్శిటీ మొదలు పంజాబ్‌, ‌జెఎన్‌యు, దిల్లీ, గౌహతి, మణిపూర్‌ ‌విశ్వవిద్యాలయాలతోపాటు ఉత్తరాఖండ్‌లోని పలు యూనివర్శిటీలను ఏబివిపి కైవసం చేసుకుంది. ఇది కాంగ్రెస్‌, ‌వామపక్షాలకు ఒక విధంగా ఎదురుదెబ్బనే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *