“సిబిఐ విచారణలో ఏమితేలనున్నప్పటికీ దాదాపు లక్షకోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకోకపోవడంపై చర్చ జరుగుతున్నది. మేడిగడ్డ దగ్గర కుంగిన రెండు పిల్లర్లను మరమ్మతు చేసి, ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటుందా లేదా అన్న విషయంపైన స్పష్టత ఇవ్వాలని నీటి పారుదల రంగ నిపుణులు , తెలంగాణ పౌర సమాజం అడుగుతున్నారు . ఎంతకాలం దాన్ని రిపేర్ చేయకుండా ఉంచుతారని వారు ప్రశ్నిస్తున్నారు. అంతకన్నా తక్కువ ఖర్చుతో గోదావరి నీటిని మళ్లించుకునే అవకాశం ఉందన్న దానిపైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల పవర్‌పాయింట్ ప్రజంటేషన్ చేయడం, సిఎం తుమ్మిడిహట్టి దగ్గర బరాజ్ నిర్మాణం చేసితీరుతామని శపథం చేయడం ఈ అనుమానాలకు తావిస్తున్నది. అంతేగాక కాళేశ్వరంలోని ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బరాజ్‌ల డిజైన్, నిర్మాణ లోపాలవల్ల వాటిని నీటితో నింపే అవకాశాలులేవని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా చెప్పడాన్నిబట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టునే పక్కకు పెట్టాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు … “
‘కాళేశ్వరం’… రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక బ్రహ్మపదార్థం గా మారింది. దాదాపు రెండున్నర సంవత్సరాల నుండి రాష్ట్రంలో కాళేశ్వరం మాట ఎత్తకుండా రాజకీయ పార్టీలకు రోజు గడవడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు, దాని నిర్మాణం, నిల్వ సామర్ధ్యం, టీఎంసీలు ఇవన్నీ తెలియని వారు కూడా విమర్శలు, ప్రతివిమర్శల్లో భాగస్వాములవుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటున్నది కాంగ్రెస్. దాని నిర్మాణ వ్యయమే లక్ష కోట్లు కానప్పుడు లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని బిఆర్‌ఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఏదిఏమైనా ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగంలేదన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. ఇప్పటివరకు ఒక్క చుక్క నీటిని ఇందులో నుండి వాడకుండానే లక్షలాది ఎకరాల్లో బ్రహ్మాండమైన పంటలు పండాయంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ మాటలను బిఆర్‌ఎస్ నాయకత్వం కొట్టిపారేస్తున్నది. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగడానికి ముందు, రాష్ట్ర వ్యాప్తంగా పలు చెరువులు, కుంటల్లో నీరు సమృద్దిగా నింపటం ఒకటికాగా, ఈ సంవత్సరం వరుణుడు కరుణించడంవల్ల విపరీతంగా వర్షాలు పడడంకూడా విస్తారంగా పంటలు పండేందుకు దోహదపడిందని బిఆర్‌ఎస్ అంటోంది. నిత్య ఎపిసోడ్‌గా సాగుతున్న ఈ వాదనల పరంపరకు కాళేశ్వరంపై వేసిన జస్టీస్ పీసీ ఘోష్ కమిషన్ స్పష్టత ఇవ్వలేక పోయిందన్న విమర్శలు కూడా తలెత్తాయి.
ఫలితంగా ఈ కేసును కేంద్రం ఆధీనంలో సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. కాళేశ్వరాన్ని ఒక ఫేల్యూర్ ప్రాజెక్టుగా పేర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన విధంగా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీని నిర్మించి తీరుతామని శపథం చేసింది. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టును నిర్మించి రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు అందించడమే తమ లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా పేర్కొన్న విషయం తెలిసిందే. వాస్తవంగా కాంగ్రెస్ పాలనాకాలంలోనే దీని రచన జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు అందించేందుకు ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. అయితే బిఆర్‌ఎస్ ప్రభుత్వం దాన్ని పక్కనపెట్టి, అత్యంత వ్యయంతో కూడుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్‌లకోసం నిర్మించిందన్నది రేవంత్‌రెడ్డి ఆరోపణ. వాస్తవంగా గత శాసనసభ ఎన్నికలకు ముందునుండే రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపైన దుమ్మెత్తిపోయడం ప్రారంభించింది. కాంగ్రెస్‌పార్టీ పెడుతున్న శాపనార్ధాలకు తోడు ఎన్నికలకు ముందు కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బరాజ్‌లోని రెండు పిల్లర్లు కుంగిపోవడం కాంగ్రెస్ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చినట్లు అయింది. అది బిఆర్‌ఎస్ ప్రభుత్వ పతనానికి కారణంగా మారింది.
కాగా కాంగ్రెస్ అధికారం చేపట్టి ఇరవై నెలలు దాటింది. ఈ ఇరవై నెలలకాలంలో కుంగిన బరాజ్ పిల్లర్లను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నదన్న విమర్శను ఎదుర్కుంటున్నది. ఈ ఇరవై నెలల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు, ఇతర మంత్రివర్గం ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కాళేశ్వరం పేరెత్తకుండా మాట్లాడలేకపోతున్నారు. బిఆర్‌ఎస్ ఎంత డిఫెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించినా కాంగ్రెస్ దాడిని తట్టుకోలేకపోతున్నది. చివరకు కాళేశ్వరంపై వేసిన కమిషన్‌కూడా మేడిగడ్డ అనర్ధానికి కారణం నాటి ముఖ్యమంత్రి కెసిఆర్‌నే వేలెత్తి చూపేదిగా ఉందన్న విషయం అసెంబ్లీ సాక్షిగా 665 పేజీలను 65 పేజీలకు కుదించిన నివేదిక ద్వారా బహిర్గతమైంది. అయితే నివేదికపై బిఆర్‌ఎస్ న్యాయస్థానం మెట్లెక్కగా. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై మరింత విస్తార పరిశీలనకు సిబిఐకి అప్పగించింది. విచారణలో ఏమితేలనున్నప్పటికీ దాదాపు లక్షకోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకోకపోవడంపై చర్చ జరుగుతున్నది.
మేడిగడ్డదగ్గర కుంగిన రెండు పిల్లర్లను మరమ్మతు చేసి, ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటుందా లేదా అన్న విషయంపైన స్పష్టత ఇవ్వాలని నీటి పారుదల రంగ నిపుణులు , తెలంగాణ పౌర సమాజం అడుగుతున్నారు . ఎంతకాలం దాన్ని రిపేర్ చేయకుండా ఉంచుతారని వారు ప్రశ్నిస్తున్నారు. అంతకన్నా తక్కువ ఖర్చుతో గోదావరి నీటిని మళ్లించుకునే అవకాశం ఉందన్న దానిపైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల పవర్‌పాయింట్ ప్రజంటేషన్ చేయడం, సిఎం తుమ్మిడిహట్టి దగ్గర బరాజ్ నిర్మాణం చేసితీరుతామని శపథం చేయడం ఈ అనుమానాలకు తావిస్తున్నది. అంతేగాక కాళేశ్వరంలోని ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బరాజ్‌ల డిజైన్, నిర్మాణ లోపాలవల్ల వాటిని నీటితో నింపే అవకాశాలులేవని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా చెప్పడాన్నిబట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టునే పక్కకు పెట్టాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ బరాజ్‌లను నీటితో నింపితే ప్రమాదమన్న విషయాన్ని ఎన్‌డిఎస్‌ఏ చెప్పిందన్న విషయాన్ని ఉత్తమ్ ప్రస్తావించారు. కాదని నింపితే 44 గ్రామాలతోపాటు సమ్మక్క-సారమ్మ బరాజ్ కొట్టుకుపోతుందని, భద్రాచలం ఆలయం, పట్టణం ప్రమాదాన్ని ఎదుర్కుంటుందని అందుకు ఎవరు బాధ్యత వహిస్తారన్నది ఆయన ప్రశ్న.
ఇదిలాఉంటే కాళేశ్వరాన్ని కాంగ్రెస్ బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నదని బిఆర్‌ఎస్ ఆరోపిస్తున్నది. వాస్తవానికి మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్లను మరమ్మతు చేస్తే సరిపోయేదానికి కాంగ్రెస్ దాన్ని భూతద్దంలో చూపిస్తున్నదన్నది బిఆర్‌ఎస్ వాదన. మరమ్మతు విషయంలోకూడా బరాజ్ నిర్మించిన కాంట్రాక్టరే తన సొంత ఖర్చుతో బాగుచేస్తానంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ బిఆర్‌ఎస్ ఆరోపిస్తున్నది. దీనిపై వాస్తవాలను నాటి ఇరిగేషన్ మంత్రి తన్నీరు హరీష్‌రావు శాసనసభలో సభ్యులకు అర్థమయ్యే రీతిలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ చేస్తానంటే స్పీకర్ అనుమతించలేదు.
అయితే అంతకు ముందు తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన ఆరోపణలన్నిటిపైన ఆధారాలతోకూడిన వివరణ ఇచ్చారు హరీష్‌రావు. తుమ్మడిహెట్టి నుండి మేడిగడ్డకు ఎందుకు మార్చారన్న విషయాన్ని ఆధారాలతో వివరించడం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టు అన్నది కేవలం మేడిగడ్డ ఒక్కటేకాదని మొదటినుండీ బిఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు. మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌స్టేషన్‌లు, 21 పంప్ హౌజ్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలో మీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రైజర్ మేయిన్స్, 141 టిఎంసీల స్టోరేజి కెపాసిటీ, 530 కిలోమీటర్ల ఎత్తు లిఫ్ట్, 240 టిఎంసీల నీటి వినియోగంతో కూడుకున్నదని, అందులో మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగినంత మాత్రాన మొత్తం ప్రాజెక్టే పనికిరాదనడం కాంగ్రెస్ అవగాహన లోపంగా బిఆర్‌ఎస్ పేర్కొంటున్నది.
మేడిగడ్డ బర్యాజ్ 85 పిల్లర్లతో నిర్మాణమైంది. అందులో రెండు మాత్రమే కుంగాయి. అయితే ముందు జాగ్రత్తగా ఏడు బ్లాక్‌లుగా ఈ పిల్లర్ల నిర్మాణం జరిగింది. ఒక బ్లాక్ డిస్‌మాంటిల్ చేసినా మిగతా బ్లాక్‌లకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ హరీష్‌రావుతోపాటు, కెసిఆర్ ఇతర సాంకేతిక నిపుణులు చెబుతున్నదాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని బిఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. మిగతా ప్రాజెక్టు అంతా బాగా ఉండటం వల్ల ముఖ్యమంత్రి నీటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్నారన్నది వారి ఆరోపణ. మల్లన్నసాగర్ ద్వారా గోదావరి నీటిని మూసీకి తరలించేందుకు గందమల్ల రిజర్వాయర్ వద్ద సిఎం రేవంత్ కొబ్బరికాయ కొట్టడాన్ని ప్రస్తావిస్తూ మల్లన్నసాగర్ కాళేశ్వరంలో భాగమేకదా, అంటే కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకోవడమేకదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క నీరు ఇవ్వలేదన్నదానిలో ఏ మాత్రం వాస్తవంలేదు. ఇప్పటివరకు 20 లక్షలకు పైగా ఎకరాలకు నీరందించిన ఘనత ఈ ప్రాజెక్టుకు దక్కుతుందన్నది వారి వాదన. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కాళేశ్వరం తెలంగాణకు కల్పతరువు, కామధేనువంటున్నాయి బిఆర్‌ఎస్ వర్గాలు. చివరగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఏం నిర్ణయం తీసుకుంటుందోనని తెలంగాణ ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.