“ఆపరేషన్ కగార్ ప్రకటించిన తర్వాత ఆ పార్టీ అధినాయకత్వం సమావేశమే కాలేక పోయిందని, సమీక్ష జరపడం కూడా వీలు కాలేదని ప్రచారం జరుగుతున్న సమయంలో వచ్చిన ప్రకటన గందరగోళానికి గురిచేసింది. అందరితో చర్చ చేయకుండానే, విధివిధానాలను ప్రకటించే అధికారం ఈ కొద్దిమందికి ఎక్కడిదని కొంతమంది అంటే, పార్టీని నమ్ముకుని ప్రాణాలు కోల్పోయిన వారి పరిస్థితి..జైళ్ళ పాలైన వారి పరిస్థితి.. ఉద్యమంలో మిగిలిన వారి పరిస్థితి ఏమిటన్నది ప్రధానాంశంగా మారింది.”
దేశ అంతర్గత భద్రతకు సవాల్ గా ప్రకటించబడి, సమాంతరంగా ఆదర్శ ప్రభుత్వాన్ని నడిపిన, గ్రామరాజ్య కమిటీలతో 13 రాష్ట్రాలకు విస్తరించిన మావోయిస్టు పార్టీ మనుగడ పైన చర్చ జరగడం చూస్తుంటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు రహిత భారత్ 2026 మార్చి గడువు ప్రకటించిన నేపధ్యంలో ప్రజలలో, బుద్ధి జీవులలో, ప్రజాస్వామిక వాదులలో జరుగుతున్న ఆసక్తికర చర్చ కొత్త మలుపు తీసుకుంది. ప్రపంచ దేశాల విప్లవకారులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా అవగతం అవుతోంది. ఈ విషయం పాతదే అయినప్పటికీ సమస్య పైన చర్చ కొత్తది.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్తగా ప్రకటించిన లొంగుబాట్లతో విషయం అన్ని రంగాల్లోకి చర్చగా వ్యాపించిదనడంలో ఎలాంటి సందేహం లేదు. సుమారు నాలుగు దశాబ్దాలపాటు పలు రాజకీయ పార్టీల ప్రభుత్వాలకు సవాల్ గా నిలిచిన ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అంతర్ధాన మవుతోందా? అన్నదే ప్రధాన అంశం. మరీ ప్రధానంగా సంవత్సర కాలంగా ఆ పార్టీ నాయకత్వాన్ని కోల్పోవడం (ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లతో), ప్రభుత్వ నిఘా, కోవర్ట్ ఆపరేషన్లు, సాంకేతికత వినియోగం, భారీ పోలీసు బలగాలతో అడుగడునా గాలింపు చర్యలతో ఉద్యమాన్ని బలమైన దెబ్బ తీయగలిగింది. శక్తివంతమైన సైనిక శక్తి గల భారత ప్రభుత్వ దాడిని సరైన సమయంలో అంచనా వేయడంలో వైఫల్యం, సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవడం – అమలు చేయడంలో ఆ పార్టీ నాయకత్వం వైఫల్యం కారణంగా అతి తక్కువ కాలంలోనే ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందన్నది పచ్చి నిజం. దీనికి తోడుగా ఈ యుద్ధంలో ఇజ్రాయిల్, అమెరికా టెక్నాలజీ ఉపయోగించు కున్నారన్న ప్రచారం కూడా ఉంది.
ఒక రాజకీయ పార్టీగా ఏర్పడి, ఆయుధాలు వీడి ప్రజా పోరాటాల జరపాలని, ఇక యుద్ధం చేసి గెలవలేమని చాలా కాలంగా పార్టీ నేతలు కొందరు బహిరంగంగానే చర్చకు దిగారు. ఇది రెండు పంధాల మధ్య వైరుధ్యంలా కొనసాగింది. అనేకమంది సీనియర్ నేతలతోపాటు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న బసవరాజు ఎన్ కౌంటర్లో అమరుడవడంతో పార్టీలో అంతర్గత వైరుధ్యంగా ఉన్న ఆ విషయం బహిర్గతమైంది. ఆదివాసి యోధుడు, పి.ఎల్.జి.ఏ. నేత హిడ్మా మరణం ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి వచ్చినా ఆ పార్టీ నిలదొక్కుకోలేక పోతోంది. ప్రధానంగా తెలంగాణ ప్రాంతాల నుంచి ఉద్యమ నిర్మాణంలోకి వెళ్లి దీర్ఘకాలం పనిచేసిన నాయకత్వం కోల్పోవడం వలన ఈ పరిస్థితి దాపురించిందని చెప్పవచ్చు.
ఆదివాసీల జీవన స్థితిగతుల మెరుగు కోసం, నిర్వాసితుల సమస్య పైన, అటవీ ప్రాంతాల నుంచి అపార ఖనిజ సంపద కార్పొరేట్ శక్తుల నుంచి రక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటవీ సంపద రక్షణ కోసం, తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేసిన నేతలు ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఉద్యమకారులు నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. జైళ్ళ పాలయ్యారు. ఈ త్యాగాల, గాయాల కారణంగానే ప్రజల నుంచి, బుద్ధి జీవుల నుంచి, ప్రజాస్వామికవాదుల నుంచి మద్దతు పొందగలిగారు. ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలననే డిమాండ్ కు ప్రాధాన్యత తేగలిగారు. కానీ, ప్రభుత్వం జరిపిన అలుపెరుగని దాడితో ఉద్యమం అతలాకుతలమైంది. అన్నిటికంటే ప్రధానంగా లేటెస్ట్ గా ప్రకటించబడినట్లు చెబుతున్న నాయకత్వ లొంగుబాటు సామాజిక మాధ్యమాలలో, మీడియాలో భారీ చర్చకు తెర లేపింది. విశ్లేషకులలో అనేక సంశయాలకు తావిచ్చింది. ప్రధానంగా వారు లొంగిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చల సందర్భంగా రాజకీయ పార్టీగా ఏర్పడతామని, కేంద్రం సహకరిస్తే పి.ఎల్.జి.ఎ. ను రద్దు చేస్తామని అన్నట్టు/ ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఉద్యమ సానుభూతిపరులు, పరిశీలకులు, రాజకీయ విశ్లేషకులు సైతం ఖంగుతిన్నారు.
ఆపరేషన్ కగార్ ప్రకటించిన తర్వాత ఆ పార్టీ అధినాయకత్వం సమావేశమే కాలేక పోయిందని, సమీక్ష జరపడం కూడా వీలు కాలేదని ప్రచారం జరుగుతున్న సమయంలో వచ్చిన ప్రకటన గందరగోళానికి గురిచేసింది. అందరితో చర్చ చేయకుండానే, విధివిధానాలను ప్రకటించే అధికారం ఈ కొద్దిమందికి ఎక్కడిదని కొంతమంది అంటే, పార్టీని నమ్ముకుని ప్రాణాలు కోల్పోయిన వారి పరిస్థితి..జైళ్ళ పాలైన వారి పరిస్థితి.. ఉద్యమంలో మిగిలిన వారి పరిస్థితి ఏమిటన్నది ప్రధానాంశంగా మారింది. ఈ ప్రకటన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్న కాలంలో, పార్టీలో ఎలాంటి చర్చ జరపకుండా సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు బొంబాయి నుండి రావి నారాయణరెడ్డి ప్రకటించడం వివాదాస్పదంగా మారిందన్న చరిత్రిక నేపధ్యాన్ని గుర్తు చేస్తున్నది. వెనువెంటనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఇక అర్బన్ నక్సలైట్ల పని పడతామని ప్రకటించడం మరో విశేషం. రాహుల్ గాంధీని సైతం అర్బన్ నక్సలైట్ అంటున్న తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నది అగమ్య గోచరం. ఈ అంశాన్ని మానవ హక్కుల, పౌర హక్కుల సంఘాలు మాత్రమే గొంతు విప్పుతున్నాయి. గట్టిగా ఖండిస్తున్నాయి. రాజకీయ పార్టీల విషయానికొస్తే ప్రధానంగా టి.ఆర్. ఎస్., సి. పి.ఐ., నక్సలైట్ పార్టీ లు ఆదివాసీలపై దాడిని, ఆపరేషన్ కగార్ ను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వం విధించిన గడువుకు మాసం ముందుగానే ఇంతటి విపత్కర పరిస్థితులు ఏర్పడడం నిజంగానే ఆశ్చర్యం కలిగించక మానదు.
మావోయిస్టు పార్టీ ఇక చరిత్రగానే మిగిలిపోతుందా? సాయుధపోరాటం అనే అంశం కనుమరుగైనట్లేనా? అంటే నిజమేనా?అనిపిస్తోంది. కానీ, మావోయిస్టు పార్టీ పీడిత తాడిత ప్రజల కోసం సుదీర్ఘ కాలం సాగించిన ఉద్యమాలు, వారు నిర్మించిన పత్యామ్నాయ ప్రభుత్వ రూపు రేఖలు – విశేషాలు, అసమాన త్యాగాలు, తిరుగుబాటు సిద్ధాంతం చరిత్రలో, పీడిత ప్రజల హృదయాల్లో నిలిచి పోతాయి.భాష లిపి నేర్పి, వ్యవసాయం, సంస్కృతి సంప్రదాయం, విద్యా వైద్య రంగాలలో చేసిన కృషి, ఆత్మగౌరవ పోరాటాలు, జల్ జంగల్ జమీన్ నినాదానికి ఇచ్చిన బలం మధ్యభారత దేశంలోని దండకారణ్య ఆదివాసీ ప్రజల గుండెల్లో అజరామరంగా నిలుస్తాయన్నది చెరిపి వేయలేని వాస్తవమే కదా! సుదీర్ఘ కాలం పాటు మధ్య భారత ప్రాంతానికి,ఆ పార్టీ అందించిన రాజకీయ చైతన్యం, పోరాటస్ఫూర్తి ప్రభావం భవిష్యత్ లో ఎలా ఉంటుదనేది ఎవరూ చెప్పలేరు.చరిత్రను తన దృష్టితో కాకుండా, వాస్తవిక దృష్టితో చూస్తే కనిపించేదంతా నిష్టుర సత్యం.
రమణాచారి





