“వీరిలో ఒక్కొక్కరిదీ ఒక విషాద గాథ. కొన్ని గాథలు మిగిలినవాటికన్నా ఎక్కువ ప్రచారంలోకి వచ్చి ఉండవచ్చు. అసలు నమోదే కాని, వార్తలకెక్కని ఘటనలు మరెన్ని ఉన్నాయో తెలియదు. కాని ఇంకా ఇరవైల్లో ప్రవేశించని, లేదా ఇరవైల తొలిరోజుల్లోని ఈ యువతీ యువకులు ఒక్కొక్కరూ తమ హృదయం చెప్పిన మాట విన్నారు. సామాజిక కట్టుబాట్లను లెక్కచేయగూడదనుకున్నారు. కుల అసమానతల అవరోధాలను తొలగించి ఒక మానవీయ బంధాన్ని కోరుకున్నందుకే వాళ్లు ప్రేమించదగినవాళ్లు. సామాజిక దురన్యాయం తమ ప్రాణాలు తీసేంత క్రూరమైనదని తెలియని అమాయకులు వాళ్లు. ఇంకా ఎన్నో ఏళ్లు బతకవలసినవాళ్లు, అర్ధాంతరంగా హత్యకు గురైనవాళ్లు.”
తెలంగాణలో ఇటీవలి కాలంలో కుల దురహంకార హత్యల పరంపర పెరిగిపోతున్నది. ప్రధానంగా కులాంతర వివాహం కారణంగా తమ కంటె కింది కులం అని భావించే యువతీ యువకులను తాము పై కులం అని భావించే వారు, ఆ యువతీ యువకుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేస్తున్నారు. లేదా కిరాయి హంతకుల చేత హత్య చేయిస్తున్నారు. ఈ హత్యా పరంపరను, అది కల్పిస్తున్న భీతావహ వాతావరణాన్ని చూసిన కులాంతర ప్రేమికులు వివాహం చేసుకుంటే తాము కూడా హత్యకు గురవుతామనే భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లేదా ఆ యువతీ యువకులు ఆత్మహత్య చేసుకునే దిశగా వారి కుటుంబ సభ్యులు నెడుతున్నారు, బెదరగొడుతున్నారు.
మంథని మధుకర్ (2017), భువనగిరి అంబోజి నరేష్ (2017), లింగరాజుపల్లి తుమ్మల స్వాతి (2017), పెరుమాళ్ల ప్రణయ్ (2018), విజయలక్ష్మి (2018), ఘట్కేసర్ సుశ్రుత-దేవర్ష్ (2019), సంగారెడ్డి చింతా హేమంత్ కుమార్ (2020), సంగారెడ్డి నారాయణ (2022), సరూర్ నగర్ బిల్లిపురం నాగరాజు (2022), కుకునూరుపల్లి ఎరుకల రామకృష్ణ గౌడ్ (2022), బేగం బజార్ నీరజ్ పన్వార్ (2022), ఇబ్రహీంపట్నం కొంగర నాగమణి (2024), పిల్లలమర్రి వడ్లకొండ కృష్ణ (మాల బంటీ) (2025), జగిత్యాల – సల్లూరి మల్లేష్ (2025) వంటి ప్రధానమైన పద్నాలుగు కుల హత్యల ఘటనలు గత ఎనిమిది సంవత్సరాల కాలంలో నమోదయ్యాయంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా మారుతున్నదో తెలుస్తుంది.
వీరిలో ఒక్కొక్కరిదీ ఒక విషాద గాథ. కొన్ని గాథలు మిగిలినవాటికన్నా ఎక్కువ ప్రచారంలోకి వచ్చి ఉండవచ్చు. అసలు నమోదే కాని, వార్తలకెక్కని ఘటనలు మరెన్ని ఉన్నాయో తెలియదు. కాని ఇంకా ఇరవైల్లో ప్రవేశించని, లేదా ఇరవైల తొలిరోజుల్లోని ఈ యువతీ యువకులు ఒక్కొక్కరూ తమ హృదయం చెప్పిన మాట విన్నారు. సామాజిక కట్టుబాట్లను లెక్కచేయగూడదనుకున్నారు. కుల అసమానతల అవరోధాలను తొలగించి ఒక మానవీయ బంధాన్ని కోరుకున్నందుకే వాళ్లు ప్రేమించదగినవాళ్లు. సామాజిక దురన్యాయం తమ ప్రాణాలు తీసేంత క్రూరమైనదని తెలియని అమాయకులు వాళ్లు. ఇంకా ఎన్నో ఏళ్లు బతకవలసినవాళ్లు, అర్ధాంతరంగా హత్యకు గురైనవాళ్లు.
ఈ హత్యలను ప్రచారసాధనాలు సాధారణంగా “పరువు హత్యలు” అనే తలకిందుల పేరుతో పిలుస్తున్నాయి. హతులు వారి కుటుంబాల “పరువు” పోగొట్టే పని చేశారు గనుక, వారికి ఈ శిక్ష సరైనదే అనే ఒక సాధారణ అభిపాయాన్ని, సమ్మతిని తయారు చేసే క్రమంలోనే ఈ తప్పుడు పేరు వచ్చింది. ఒక కులానికి చెందిన వ్యక్తి, మరొక కులానికి చెందిన వ్యక్తి ప్రేమించుకోవడం, వివాహం చేసుకుని సహజీవనం చేయాలనుకోవడం మరొకరి పరువుకు, కుటుంబం పరువుకు, కులం పరువుకు సంబంధించిన వ్యవహారం కాదు. అది ఇద్దరు పరిణత వయస్కుల స్వచ్ఛంద, ప్రేమపూర్వక నిర్ణయం. ఆ ఇద్దరూ వేరువేరు కులాలలో పుట్టడం వారు కోరుకుని చేసినది కాదు.
“నిజానికి దళితుల మీద అత్యాచారాల ఘటనలు ఏడాదికేడాదికీ పెరిగిపోతున్నాయి. దేశంలో కేసులుగా నమోదవుతున్న దళితుల మీద అత్యాచారాల సంఖ్యే ఏడాదికి అరవై వేల దాకా, అంటే రోజుకు 164, గంటకు ఆరుగా ఉందని, ఇది తెలంగాణలో ఏడాదికి 1800, రోజుకు నాలుగు ఘటనలుగా ఉందని జాతీయ నేఱ గణాంకాలు చెపుతున్నాయి. రాజకీయ పక్షాలన్నీ పైకి ఏ మాటలు చెప్పినప్పటికీ ఆధిపత్య కులాల అధీనంలో, కుల అసమానతలను బలపరిచే భావజాలంలో మునిగి ఉన్నాయి. సామాజిక సంస్కృతిలో ఇంకా సమానత్వ భావనలకు కనీస స్థానం కూడా దొరకడం లేదు. అణగారిన వర్గాల నుంచి ఏ కొందరు వ్యక్తులకో, కుటుంబాలకో ఆర్థిక వెసులుబాటు వచ్చినా, సామాజికంగా వారి పట్ల చిన్నచూపు, అసమానత, వివక్ష తరిగిపోవడం లేదు. అంటే ఈ సమస్య పరిష్కారం ఒక చట్టం తోనో, ఒక రాజకీయ నిర్ణయంతోనో జరగడం అసాధ్యం. అందుకు మొత్తంగా సామాజిక, సాంస్కృతిక, భావజాల రంగాలలో అంతర్మథనం జరగాలి. సమానత్వ భావనల ప్రచారం, వ్యాప్తి, ఆచరణ ఒక నిరంతర కృషి కావాలి.”
కులాల మధ్య అసమానత ఉంది గనుక, కులాల నిచ్చెనమెట్ల వ్యవస్థలో “పై కులాలు” అనబడేవాటికి “కింది కులాలు” అనబడేవాటి మీద చిన్నచూపు ఉంది గనుక, ఒక కులానికీ మరొక కులానికీ మధ్య, చివరికి ఒక ఉపకులానికీ మరొక ఉపకులానికీ మధ్య సహపంక్తి భోజనాలను, వివాహ సంబంధాలను కుల కట్టుబాట్లు నిషేధించాయి గనుక ఒక కులం వ్యక్తి మరొక కులం వ్యక్తిని ప్రేమించడం, వివాహం చేసుకోవడం తమ “పరువు” పోయినట్టుగా “పై కులపు” కుటుంబాలు భావిస్తున్నాయి. సహజమైన స్త్రీ పురుష సంబంధం వారు ఏ కులంలో పుట్టారో చూసి ఏర్పడదు, దానివల్ల ఎవరి పరువూ పోదు. ఒక సహజమైన మానవానుబంధం ఏర్పడుతుంది. కాని సమాజంలో బలంగా ఉన్న తప్పుడు భావజాలం వల్ల, కుల భావనల వల్ల, పుట్టిన కులంతోనే ఆధిక్యత, న్యూనత వస్తాయనే అసహజ అభిప్రాయం వల్ల ఈ “పరువు హత్య” అనే మాట చలామణీలో ఉంది. వాస్తవానికి “పరువు హత్యలు” అనబడేవన్నీ కుల దురహంకార, కులోన్మాద హత్యలు.
నిజానికి నమోదై, ప్రచార సాధనాలకు ఎక్కిన ఈ పద్నాలుగు హత్యా ఘటనలు వాస్తవంగా జరుగుతున్నవాటిలో, హత్య, ఆత్మహత్య దాకా రాకుండా సాగే బెదిరింపుల, బలవంతాల, నిర్బంధాల, కుటుంబాల మీద ఒత్తిడుల, వేదనల సంఖ్యతో పోలిస్తే చాలా చాలా తక్కువ. ఈ ఘటనలలో అతి ఎక్కువ శాతం హతులు, బాధితులు దళిత వర్గాల నుంచి, వెనుకబడిన కులాలలో పేద వర్గాల నుంచి వచ్చినవారు. హంతకులు సాధారణంగా ఆధిపత్య కులాల నుంచి మాత్రమే కాక, ఇటీవల ఆర్థికంగా బాగుపడిన వెనుకబడిన కులాల నుంచి కూడా ఉన్నారు. ఈ హత్యలలో ఆర్థిక స్థాయి కోణం కూడా కొంత ఉన్నప్పటికీ, ప్రధానమైనది కుల అసమానత, కుల ఆభిజాత్య, కుల అహంకార భావనలు. “కుల సంకరం” జరగగూడదనే మతగ్రంథాల, మత పెద్దల, కుల పెద్దల ప్రబోధాల ఫలితం ఇది.
ఇటువంటి హత్యలు, దళితుల మీద ప్రత్యేకించి వివక్ష, హత్యాకాండలు తెలంగాణ సమాజంలో గతంలో ఇంతగా ఉండేవా చెప్పలేం. పాదిరికుప్పం, కారంచేడు, చుండూరు, వేంపెంట, లక్షింపేట వంటి మారణకాండలుగా వ్యక్తమైన తీవ్రమైన వివక్ష తెలంగాణ ప్రాంతంలో అంత పెద్ద ఎత్తున జరిగిన దాఖలాలు తక్కువ. సబ్బండకులాల మధ్య సంపూర్ణ సామరస్య సహజీవనం సాగిందనేది అబద్ధం గాని ఉండిన అసమానత, వైమనస్యం కూడా హత్యాకాండల దాకా రాలేదు. కాని ఇటీవలి కాలంలో ఆ పరిస్థితి క్రమక్రమంగా మారుతూ వస్తున్నదనడానికి ఈ వ్యక్తుల హత్యలు ఒక సూచన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కనీసం అరడజనైనా సామూహిక దాడుల వార్తలు వచ్చాయి. వ్యక్తిగత స్థాయిలో “పరువు హత్యల” పేరుతో జరిగిన హత్యలు ఏడాదికి ఒకటి రెండైనా ప్రచారంలోకి వచ్చాయి. వార్తలకెక్కని ఘటనలు ఎన్నో లెక్కలేదు. ఉత్తరాది రాష్ట్రాలలోలాగా ఊరి ఘర్షణ ఊళ్లోనే మూసేసే ఖాప్ పంచాయత్ తెలంగాణలో లేకపోవచ్చు గాని, నేరెళ్ల వంటి పెద్ద ఘటననే మాసిపూసి మారేడుకాయ చేసిన ఉదాహరణ మన కళ్లముందే ఉంది.
దళితులు, అట్టడుగు వర్గాల, కులాల యువకులు చదువుకుని, చిన్నా చితకా ఉద్యోగం సంపాదించుకుని, ఆత్మగౌరవంతో తలెత్తుకుని ఊళ్లో తిరగడమే కంటగింపు అయ్యే మానసిక స్థితి నుంచి గ్రామీణ ఆధిపత్య కులాలు, పెత్తందారీ శక్తులు బైటపడలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అటువంటి పెత్తందారీ శక్తుల బలం పెరిగింది. దళిత, ఇతర వెనుకబడిన కులాల యువకుల ఆత్మగౌరవ ప్రదర్శనల్లో ఒకటిగానే వారికీ, గ్రామంలోని ఆధిపత్య కులాల, ఎగువ కులాల యువతులకూ మధ్య స్నేహ సంబంధాలు ఏర్పడే స్థితి వచ్చింది. ఆ స్నేహం ప్రేమగా, సహజీవనాకాంక్షగా మారే స్థితి రావడంలోనూ ఆశ్చర్యం లేదు. అట్టడుగు వర్గాల చదువును, ఉద్యోగాలను, ఆత్మగౌరవాన్ని, ఆర్థికస్థితి మెరుగుదలను ఆమోదించడానికి ఇబ్బందిపడే ఆధిపత్య కులాల మానసిక స్థితే ఇంకా రాజ్యం చేస్తున్నందు వల్ల ఈ యువతీయువకుల స్నేహం, ప్రేమ తప్పనిసరిగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి.
బహిరంగ సామూహిక భోజనాల వల్ల, హోటళ్లు, రెస్టారెంట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరగడం వల్ల సహపంక్తి భోజన నిషేధం లేనట్టు కనబడుతున్నది గాని, అప్పుడప్పుడు రాజకీయ నాయకులు ప్రదర్శన కోసం దళితుల ఇళ్లకు వెళ్లి భోజనాలు చేయడం కూడా పత్రికల వార్తలు, ఫొటోలుగా మారుతున్నది గాని, ఆధిపత్య కులాల ఇళ్లలోపలికి రానిచ్చి, తమతో పాటు డైనింగ్ టేబుళ్ల మీద కూచోనిచ్చేదాకా రాలేదు. సహభోజనం విషయంలో ఏ మాత్రమైనా వెసులుబాటు కనిపించినా, వివాహ సంబంధాలలో మాత్రం కనీసమైన వెసులుబాటు కూడా రాలేదు. చదువుల దగ్గర అన్ని కులాల యువతీ యువకులు కలుసుకుంటున్నప్పటికీ, స్నేహాలు, ప్రేమలు కూడా ఏర్పడుతున్నప్పటికీ, అవి వివాహ సంబంధాల దాకా రాకుండా ఆగిపోతున్నాయి. వివాహం దాకా, సహజీవనం దాకా తీసుకుపోగలిగిన సాహసులు ఒకరో ఇద్దరో ఎక్కడైనా ఉంటే వారికోసం ఈ కులాహంకార హత్యలు ఎదురు చూస్తున్నాయి.
కారంచేడు మారణకాండ తర్వాత దళితుల మీద సాగుతున్న వివక్ష గురించీ, అత్యాచారాల గురించీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగి షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నిరోధ చట్టం 1989 ఉనికిలోకి వచ్చింది. ఆ చట్టం “అత్యాచారం” అనే మాటను ఎంత నిర్దిష్టంగా, ఎంత వివరంగా, ఎంత సూక్ష్మంగా నిర్వచించినా, ఎంత కఠినమైన శిక్షలు ప్రతిపాదించినా, వాస్తవంగా గడిచిన నాలుగు దశాబ్దాలలో ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం జరగనేలేదు. ఆ చట్టం వల్ల, శిక్షల వల్ల దళితుల మీద అత్యాచారాలు ఆగిపోయాయనడానికి వీలు లేదు. నిజానికి దళితుల మీద అత్యాచారాల ఘటనలు ఏడాదికేడాదికీ పెరిగిపోతున్నాయి. దేశంలో కేసులుగా నమోదవుతున్న దళితుల మీద అత్యాచారాల సంఖ్యే ఏడాదికి అరవై వేల దాకా, అంటే రోజుకు 164, గంటకు ఆరుగా ఉందని, ఇది తెలంగాణలో ఏడాదికి 1800, రోజుకు నాలుగు ఘటనలుగా ఉందని జాతీయ నేఱ గణాంకాలు చెపుతున్నాయి. రాజకీయ పక్షాలన్నీ పైకి ఏ మాటలు చెప్పినప్పటికీ ఆధిపత్య కులాల అధీనంలో, కుల అసమానతలను బలపరిచే భావజాలంలో మునిగి ఉన్నాయి. సామాజిక సంస్కృతిలో ఇంకా సమానత్వ భావనలకు కనీస స్థానం కూడా దొరకడం లేదు. అణగారిన వర్గాల నుంచి ఏ కొందరు వ్యక్తులకో, కుటుంబాలకో ఆర్థిక వెసులుబాటు వచ్చినా, సామాజికంగా వారి పట్ల చిన్నచూపు, అసమానత, వివక్ష తరిగిపోవడం లేదు. అంటే ఈ సమస్య పరిష్కారం ఒక చట్టం తోనో, ఒక రాజకీయ నిర్ణయంతోనో జరగడం అసాధ్యం. అందుకు మొత్తంగా సామాజిక, సాంస్కృతిక, భావజాల రంగాలలో అంతర్మథనం జరగాలి. సమానత్వ భావనల ప్రచారం, వ్యాప్తి, ఆచరణ ఒక నిరంతర కృషి కావాలి.
కాని సరిగ్గా వ్యతిరేక దిశలో మొత్తంగానే సమాజంలో కుల భావనలు ఘనీభవిస్తూ, స్థిరపడుతూ ఉన్న కాలంలో మనం ఉన్నాం. పార్లమెంటరీ రాజకీయాలు, పార్లమెంటరీ వ్యవస్థలు, మతవాద ప్రచారాలు కుల సరిహద్దులను మరింత కట్టుదిట్టం, బలోపేతం చేస్తున్నాయి. కుల నిర్మూలన జరగాలని రెండు వేల సంవత్సరాల కిందటి బుద్దుడి నుంచి వంద సంవత్సరాల కిందటి బాబాసాహెబ్ వరకూ సమాజంలో వ్యక్తమైన ప్రగతిశీల ఆకాంక్షల నుంచి సమాజం చాలా చాలా దూరంలో ఉన్నది. బహుశా ఇంకా దూరం కావడానికి వెనక్కి నడుస్తున్నది. సమాజంలో నెలకొని ఉన్న, హిందూ పవిత్ర గ్రంథాలు, ముఖ్యంగా మనుస్మృతి దృఢంగా సమర్థించిన ఒక అసహజ, అసమాన, దుర్మార్గ సంస్కృతీ చిహ్నం కులం. అసమానతకూ, అన్యాయానికీ, అవకాశాల నిరాకరణకూ, వివక్షకూ భూమికగా ఉన్న కులం రద్దు కావాలని మన సమాజంలో శతాబ్దాలుగా జరిగిన సంస్కరణ ఉద్యమాల, ఆలోచనల స్ఫూర్తి ప్రతి ఒక్కరి మనసులలో నిండితే గాని ఈ హత్యా అపసంస్కృతి సమసిపోదు.





ప్రజాస్వామ్యం అంటే కప్పల తక్కెడ కోతి కొమ్మచ్చి!