“సాయుధ పోరాట పంధా ఎంచుకున్న పీపుల్స్ వార్, బీహార్ యం సి సి తో కలిసి 2007లో మావోయిస్టు పార్టీగా మార్పు చెందింది. తెలంగాణా క్యాడరే దండకారణ్యంలో మావోయిస్టు సిద్దాంతం అమలుకు పూనుకున్నారు. వ్యూహాత్మకంగా అటవీ ప్రాంతం కావడం,మూలవాసీ మూలాలు ఉన్న గిరిజన ప్రజల్లో పట్టు సాధించడం వలన ఉద్యమం తొలిదశలో విస్తరణ వేగంగానే జరిగింది. దానితో మావోయిస్టులు చైనా మూసలో దండకారణ్యం లో “జనతనసర్కార్”,”పీపుల్స్ గెరిల్లా ఆర్మీ”ఏర్పాటు లాంటి రాజకీయ నిర్మాణాలతో,స్థానిక ప్రజల పోరాట స్థాయి,వ్యూహత్మక అనుకూలత దృష్టి లో లేకుండా చేసిన నిర్ణయాల వలన దండకారణ్యం లో కూడా ప్రజల అనుకూలత మందగించింది.”

(సీనియర్ జర్నలిస్టు,సామాజిక కార్యకర్త)
సెల్:9441864514
మావోయిస్టు పార్టీ అగ్రశ్రేణి దళం పీపుల్స్ గెరిల్లా ఆర్మీ కమాండర్ హిడ్మా మరణం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ…మధ్య భారతం లో దండకారణ్యం నేర్పుతున్న పాఠం మావోయిస్టు లే కాదు, ఇప్పటికీ రకరకాల సూత్రీకరణలతో ఉనికిలో ఉన్న నక్సలైట్ గ్రూపులు,కమ్యూనిస్టులు, ప్రగతిశీల ఆలోచనాశీలురుకూడా ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది.మన ఆలోచన ప్రజలగురించి అయినప్పుడు మనం సామూహిక ప్రజా అభిప్రాయం గౌరవిస్తున్నామా? లేదా! కష్టాల్లో ఉన్న ప్రజలను మార్చడానికి మనకు నచ్చిన సైద్ధాంతిక వెలుగులో మనమే వెళ్ళి సాయుధం అయ్యామా? ప్రజలలో పనిచేసే క్రమంలో,అనివార్య స్థితిలో సాయుధులుగా మారామా? ఈ రెండింటిలో సమస్య ఒకటే కావచ్చును. పంథాలు మాత్రం వేర్వేరు. సారూప్యత ఆయుధం అయినప్పుడు, క్రియ కూడా ఒక్కటే అదిసాయుధచర్య,కర్త మనమే అయినా కర్మ మాత్రం ప్రజలనే విశాల జనసమూహం కు సంభందించినది.కనుక విశాల జనసమూహం అయిన ప్రజలను వేరుప రిచేదిగా “కర్మ”ఏరకంగానూ ఉండరాదు.అటు ప్రభుత్వాలు,ఇటు సమూహాలకు అది వర్తిస్తుంది..ఇదిప్రదానపాఠం.రెండు అంశాలు ప్రజలకు సంబంధించినవే అయినా ప్రజల సంసిద్దత,శాంతియుత జీవనం, ప్రజలు అబివృద్ధి అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన గుణపాఠం సాయుధ పోరాటానికి ఉంది.
భారతీయ సాయుధ గిరిజన తిరుగుబాట్లను గమనిస్తే కోయ, గోండు,కోలాం,సంతాల్,మూండ తదితర తిరుగుబాట్లలో వాళ్ళ మనుగడ కోసం,జాతి జీవనం కోసం,జాతి అభివృద్ధి కోసం,ఆ జాతి నేతలతోనే సాధారణ తిరుగుబాటుగా మొదలై శత్రువు దగ్గర ఆదునిక ఆయుధాలు అవసరార్థం గుంజుకొని ధైర్య సాహాసాలతో పోరాడినారు, ఓడినా వారి సమస్య ప్రపంచం దృష్టిలో పడేలా చేయగలిగారు. అడివిపై ఆధిపత్యం నిలబెట్టుకున్నారు. అలా తిరుగుబాటులో చనిపోయిన వారిని శతాబ్దాలుగా ఆరాధ్య దైవాలు గా ప్రజలు ఆరాధిస్తున్నారు. కొమరంభీం,బిర్సాముండా,సమ్మక్క సారక్క తదితర చారిత్రక ఉదాహరణలు ఎన్నో.. ఆ స్థాయిగౌరవం సాయుధ పోరాట అమరులకు ప్రజలనుండి ఎందుకు దక్కడంలేదు? తెలంగాణా సాయుధ పోరాటం కర్రలు,రాళ్ళు,వడిసెలు,బర్మార్ స్థాయిలో ప్రజలు సాముహిక సాయుధ పోరాటంగా ముందుకు వచ్చింది. ఇక్కడ కూడా శత్రృవు నుండే బర్మార్లు, తుపాకులు గుంజుకొని ప్రజలు పోరాడి తమ భూ హక్కులతో పాటు,భాషా వివక్షను రూపుమాపారు. “అవసరం అయినప్పుడు శత్రువు నుండే ప్రజలు ఆయుధాలు గుంజుకొని సాయుధ పోరాటం చేస్తారు”అన్న మార్క్సిస్టు ప్రాధమిక సూత్రానికి భిన్నంగా ప్రజాసమీకరణకు ముందే మావోయిస్టు లు ఆయుధాలు, సైన్యం సమకూర్చుకోవడం సమస్యగా మారింది.
శ్రీకాకుళం పోరాటం కోరన్న,మంగన్న మరణాలు తర్వాత సాయుధ పోరాట రూపం తీసుకుంది,ఒక దశలో ఓడినా ఆ పోరాటం గిరిజనుల భూ సమస్యను ఏజెండా మీదకు తెచ్చింది. భూసంస్కరణ చట్టం అవసరాన్ని ముందుకు తెచ్చింది. ఇకపోతే అదే స్ఫూర్తితో మావోయిస్టు సిద్ధాంతం, సాయుధ పోరాటమే, విముక్తికి మార్గం అని చెప్పి నమ్మి గిరిజన పునాదులు ఉన్న గోదావరి లోయ, భూస్వామ్య అవశేషాలు ఉన్న సిరిసిల్ల, జగిత్యాల పోరాటాలలో ప్రజలను సమీకరించారు.అవి కూడా చారిత్రక పాత్రనే నిర్వహించాయి. భూస్వాముల భూములు ప్రజాపరం అవ్వగా, ఏజెన్సీ లో గిరిజనుల పోడు సమస్య పరిష్కారం అయ్యింది. ఆ నేపథ్యం నుండే విస్తృత ప్రజా పునాదులు సాధించి ఇల్లెందు, సిరిసిల్ల అసెంబ్లీ స్థానాలు సైతం గెలుపొంద గలిగారు. ఇంత పట్టు సాధించిన ఉద్యమం ప్రాంతాల్లో ఆ పార్టీలు ఇప్పుడు నామమాత్రంగా ఎందుకు మారాయి? విప్లవాల గడ్డలో ఆయా పార్టీలు ప్రజల ఆదరణ,పునాది కోల్పోవడానికి కారణం ఏమిటి?
పొరాటాల్లో మరణించిన గిరిజన నేతలకు ఉన్న జనాదరణ, నక్సల్స్ త్యాగాలను ప్రజలెందుకు దీర్ఘ కాలం గుర్తించడం లేదు?
సాయుధ పోరాట పంధా ఎంచుకున్న పీపుల్స్ వార్, బీహార్ యం సి సి తో కలిసి 2007లో మావోయిస్టు పార్టీగా మార్పు చెందింది. తెలంగాణా క్యాడరే దండకారణ్యంలో మావోయిస్టు సిద్దాంతం అమలుకు పూనుకున్నారు. వ్యూహాత్మకంగా అటవీ ప్రాంతం కావడం,మూలవాసీ మూలాలు ఉన్న గిరిజన ప్రజల్లో పట్టు సాధించడం వలన ఉద్యమం తొలిదశలో విస్తరణ వేగంగానే జరిగింది. దానితో మావోయిస్టులు చైనా మూసలో దండకారణ్యం లో “జనతనసర్కార్”,”పీపుల్స్ గెరిల్లా ఆర్మీ”ఏర్పాటు లాంటి రాజకీయ నిర్మాణాలతో,స్థానిక ప్రజల పోరాట స్థాయి,వ్యూహత్మక అనుకూలత దృష్టి లో లేకుండా చేసిన నిర్ణయాల వలన దండకారణ్యం లో కూడా ప్రజల అనుకూలత మందగించింది. అటు ప్రభుత్వం ఇటు నక్సల్స్ మధ్య ప్రజలు ఎటూ తేల్చుకోలేని స్థితి నుండి క్రమంగా నక్సల్స్ వైపు, వారి సైనిక ఏర్పాట్లు నుండి ఎదురవుతున్న ఇబ్బందులు, భౌతిక స్థితి ప్రజలు దూరంగా జరగడం వలన సాధారణ ప్రజలు, సాయుధ దళాల మధ్య అగాధం పెరిగింది. భక్తితో కాకుండా ప్రజలు భయంతో అటూఇటూ ఉన్నట్లు కనిపించారు, అటు ప్రభుత్వం దాడులు, ఇటు నక్సల్స్ సాయుధ చర్యల మధ్య నలిగిపోయి వలస వెళ్ళిన ఛత్తీస్ గఢ్ ప్రజల సంఖ్య లక్షకు పైగానే ఉంటుంది.లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ సూత్రీకరణ అదే దృవీకరణ చేస్తుంది.
జనతనసర్కార్ పాఠశాల చదువులకు, గిరిజన ప్రజలు భూములకు చట్టబద్దత లేకపోవడం ప్రజలను ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వైపు చూసేలా చేసింది.ఈ దశలో మావోయిస్టులు ప్రజలకు సన్నిహితంగా నిర్ణయాలు మార్చుకొని,రహస్య పార్టీ నిర్మాణం, ప్రజా సంఘాల నిర్మాణం చేసి ఉంటే జనంలో మద్దతు లబించేది. కానీ,తాము సిద్దాంతీకరించిన అర్థవలస, అర్థం భూస్వామ్య స్థితి ఎన్నో ఏళ్ళ నాటి సామాజిక వ్యవస్థ ఈనాడు అనేక సామాజిక మార్పులు సంభవించాయి. వీటిని గుర్తించకుండా సాయుధ పోరాట సైద్ధాంతిక కోణం నుండి బయటపడేందుకు ఇష్టపడకపోవడం వలన గత పదేళ్ళుగా ప్రజలను కాపాడడం అటుంచి,తమను తాము కాపాడుకోవడమే మావోయిస్ట్ లకు సమస్య గా మారింది. మారిన సాంకేతిక పరిజ్ఞానం, వేగం పుంజుకున్న రవాణా సౌకర్యాలు , భౌతిక పరిస్థితి మావోయిస్టు పార్టీ ఉనికికి శత్రువుగా మారిపోయింది.పీపుల్స్ గెరిల్లా ఆర్మీ కూడా ఎక్కడా సైన్యం తో తలపడిందిలేదు. తలదాచుకునే స్థితిలో నే హిడ్మా లాంటి అగ్రనేత మరణించడం దాన్నే ధృవీకరిస్తూ ఉంది.
ఈ దశలో కీలకమైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ,ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన బీజేపీ రాజకీయంగా మావోయిస్టు పార్టీ తో ఉన్న వామపక్ష సైద్ధాంతిక వైరం. దీన్ని అవకాశం గా తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అణచివేత చర్యలు చేపట్టింది. అనేక ఆపరేషన్లు విఫలత అనంతరం కఠినమైన ఆపరేషన్” కగార్ “ద్వారా సైన్యాన్ని దించి తాడోపేడో తేల్చుకోవడానికి బిజెపి ప్రభుత్వం సిద్ధం అయ్యింది.బిజెపి మావోయిస్టు పార్టీ అణచివేత లో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అర్భన్ నక్సల్స్ పై కేసులు నుండి ఆపరేషన్ కగార్ వరకు అంతా పకడ్బందీ ప్రణాళికతోనే నడిపింది.సైన్యం చుట్టుముట్టిన దశలో మావోయిస్టు పార్టీ దిద్దుబాటు చర్యలేవీ సఫలం కాలేదు..! చర్చలు, కాల్పుల విరమణ లాంటివి ముందుకు తెచ్చి నప్పటికి ప్రతిపాదనలు ఏవీ కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు.
ఈ నేపథ్యంలోనే 600 మంది క్యాడర్తో పాటు కేంద్ర కార్యదర్శి సంబాల కేశవరావు తో సహా కేంద్ర కమిటీ సభ్యులు అనేక మంది చనిపోయారు.అమానుష మారణకాండ తో పాటు,శవాల ముందు నృత్యం చేసే పాల్పడింది. ఈదశలో వందల మంది క్యాడర్ తో సహా సాయుధ పోరాట విరమణ పేరుతో ఆయుధాలు అప్పగించి మల్లోజుల కోటేశ్వరరావు,తక్కేళ్ళపల్లి వాసుదేవరావు లాంటి కీలకనేతలు లొంగుబాటు, సాయుధ పోరాటం సమర్థించే మిగిలిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మధ్య చీలిక అణచివేత మరింత సులభతరం చేసింది. హిడ్మా మరణం తర్వాత మావోయిస్టు పార్టీ ఉనికి ప్రమాదం లో పడినట్లే.. ఇంకా చాలా మంది మావోయిస్టులు లొంగుబాటు లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎన్కౌంటర్స్ అన్నీ చాలా వరకు సజీవంగా పట్టుకొని చంపినవేనన్న పౌరహక్కుల సంఘాల ఆరోపణల్లో ఎంతోకొంత నిజం లేకపోలేదు? సిద్దాంతబలం ఉన్నప్పటికీ,మన దేశంలో ప్రజలు సంసిద్ధత కనపర్చని సాయుధ పోరాటాలు అన్నీ యాదృచ్ఛికంగానే అంతరించి పోయాయి. మనదేశంలో మావోయిస్టుల, శ్రీకాకుళం ,సిరిసిల్ల, జగిత్యాల,నల్లమల్ల పోరాటాలు సరసన ఇప్పుడు దండకారణ్యం చారిత్రక ప్రయోగంగా మాత్రమే మిగిలిపోనుంది. ఒకనాడు బలమైన ఉద్యమాలు జరిగిన చోట చరిత్రలో చోటు తప్ప, నేలమీద ఆ ప్రాంత ప్రజల్లో ఇప్పుడు ఆ పోరాటాల ఉనికి,విప్లవ పార్టీల కనీస ప్రభావం,ఆదరణ లేదు! ఇదో చిత్రమైన స్థితి.. దేశంలో అవకాశవాద, నీతిరహిత రాజకీయ వ్యవస్థ వ్రేళ్ళు ఊనుకుంటున్న దశలో నిజాయితీ కలిగిన రాజకీయ శక్తుల అవసరం నేడు ఎంతో ఉంది.
కానీ,మారిన పరిస్థితుల్లో ప్రజలకు వెన్నుదన్నుగా నిలబడే విప్లవ శక్తులు అపజయం, వెనకడుగు నష్టమే! కానీ,ప్రజల పక్షాన నిలిచే శక్తుల అర్థరహిత త్యాగాలు కూడా సరైనవి కాదు? ఏ ఉద్యమానికైనా ప్రజల సంసిద్ధత, పరిపక్వత, సామాజిక అనుకూలత ముఖ్యం.అప్పటివరకు ఆయుధాలకంటే ప్రజల పక్షాన నిలబడి పోరాడే నాయకుల అవసరమే ఎక్కువ ఉంది! ఏదో ఒకనాడు ఈ సామాజిక అంతరాలదొంతరలు,నిరుద్యోగం పెరిగి అంతర్యుద్ధంకు దారితీయవనీ చెప్పలేము? అట్లాంటి సమయంలో ప్రజల మెచ్చిన,నచ్చిన ఉద్యమాలకు ఊపిరి పోయడం, పాలకులు హరిస్తున్న హక్కులను పొందేదిశగా ప్రజలకు చైతన్యం, దృక్కోణం అందించే ప్రత్యామ్నాయ నాయకత్వం అప్పుడు,ఇప్పుడు, ఎప్పుడూ అవసరమే!
ప్రస్తుతం ప్రత్యామ్నాయ రాజకీయాల నిర్వాహణా అవసరం కూడా పెరిగింది! ప్రజల్లో గతం కంటే పాలకులు కుల వాదం,మత వాదం వృద్ధి చేసి ప్రజల ఐక్యతకు గండికొట్టి,మానసిక విభజన వైపుకు ప్రజల్ని పాలకులే కొన్నిఎత్తుగడలతో రెచ్చగొడుతున్నారు. మరోవైపు ప్రజల సొమ్ముతో నేరుగా వోట్లు కొనే వినూత్న పధకాలకు పాలకులు తెర తీస్తున్నారు.విభజన భావ జాలం, అధికారం అనబడే ఆయుధం రెంటిని పాలకవర్గం సమన్వయం చేసుకుంటూ అధికారం సుస్థిరం చేసుకుంటున్నది. ఈదశలో విప్లవ సిద్దాంతం, వ్యూహం కూడా సమీక్షించు కోవలసిన అవసరం మాత్రం ఉంది. నక్సలైటు పార్టీలలో తాజా రిక్రూట్మెంట్ లేదు.. నక్సలైట్ పార్టీ విషయంలోనే కాదు, కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ సమస్యను తీవ్రంగా నే ఎదుర్కొంటున్నాయి.వామపక్షవాదులు ఏర్పాటు చేసిన సమావేశాల్లో 50 ఏళ్లు దాటిన పాత కేడరే దర్శనం ఇస్తుంది తప్ప,యువత పెద్దగా కనిపించడం లేదు.. ఇట్లాంటి సమయంలో మార్క్సిజం వెలుగు లోనే నూతన మార్గాలు అన్వేషించాలసిన పరిస్థితి నేడు ముందుకు వచ్చింది.ప్రత్యామ్నాయ రాజకీయ ఐక్య పోరాటాలు అవసరం బలపడుతున్న మతోన్మాద శక్తులు వేగంగా ముందుకు తెచ్చాయి. ఈ దశలో విశాలమైన ఐక్య సంఘటన కు బదులు నేలవిడిచి సాము చేయడం కరెక్ట్ కాదేమో? ఈ దశలో ఏ రకమైన పోరాటం అయినా ప్రజల కోసమే అయినప్పుడు ప్రజలను ప్రేక్షకులుగా నిలబెట్టే త్యాగాలు అవసరమా అన్నదే నేటి ప్రదానప్రశ్న?.





