వోటర్లలో జాబితాలో అవకతవకలు

భారీ సంఖ్యలో వోటర్ల నమోదు వెనుక కుట్ర
•ఈసీకి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు..
•కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌గాంధీ

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి7: వోటర్ల జాబితాలో ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. వోటు కోసం నమోదుచేసుకున్న వారిసంఖ్య కంటే ఎక్కువ మందిని ఎన్నికల సంఘం చూపిస్తోందన్నారు. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి వోటర్ల జాబితాపై తాము అధ్యయనం చేశామని, ఎన్నో అవకతవకలు బయటపడ్డాయన్నారు. ఎన్సీపీ(శరద్‌ ‌పవార్‌), ‌శివసేన(ఉద్దవ్‌) ‌పార్టీ నేతలతో కలిసి రాహుల్‌ ‌గాంధీ దిల్లీలో మీడియాతో మాట్లాడారు. నమోదు చేసుకున్న వోటర్లతో పోలిస్తే ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా ఎక్కువగా ఉందన్నారు. వోటర్ల జాబితాలో అవకతవకలపై తాము ఎన్నికల సంఘానికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం స్పందించి మహారాష్ట్రలో వోటర్ల జాబితాలో అక్రమాలపై పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు జరిగిన తర్వాత భారీ సంఖ్యలో కొత్త వోటర్లు నమోదయ్యారన్నారు.

లోక్‌సభ ఎన్నికలు జరిగిన ఐదు నెలలకు శాసనసభ ఎన్నికలు జరగ్గా.. ఈ ఐదు నెలల్లో మహారాష్ట్రలో 39 లక్షల మంది వోటర్లు కొత్తగా నమోదయ్యారన్నారు. 2019 విధానసభ ఎన్నికల తర్వాత నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల వరకు 32 లక్షల మంది వోటర్లు కొత్తగా నమోదుకాగా.. కేవలం ఐదు నెలల్లో 39 లక్షల మంది వోటర్లు నమోదు కావడం ఏమిటని ప్రశ్నించారు. వోటర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచిన నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త వోటర్లు అధికంగా నమోదయ్యారన్నారు.

కేవలం ఇండియా కూటమిని ఓడించడానికి బీజేపీ ఎన్నికల సంఘం సహాయంతో సరికొత్త కుట్రకు తెరలేపిందన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఇదే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోందన్నారు. భారీ సంఖ్యలో వోటర్ల నమోదు వెనుక కుట్ర దాగి ఉందని రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు. మహారాష్ట్రలో గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కవు సీట్లు గెలుచుకున్న ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. తాజాగా మహారాష్ట్రలో ఎన్నికల జాబితాలో అవకతవకలు జరిగాయని రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు. దిల్లీ ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు రాహుల్‌ ఈ ‌వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది. ఇండియా కూటమి ఆరోపణలపై బీజేపీ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *