రూ.400 కోట్లతో దేవాలయాల్లో మౌలిక వసతులు

దేవాదాయ భూముల్లో సోలార్‌ పవర్‌ ప్లాంట్లు
అటవీ, దేవాదాయశాఖ  మంత్రి  కొండా సురేఖ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 : కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత దేవాలయాలను అభివృద్ధి చేస్తూ సామాన్య భక్తులకు దృష్టిలో పెట్టుకుని కనీస సౌకర్యాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి  కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన -ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ సాధించిన వార్షిక ప్రగతి నివేదికను మంత్రి సురేఖ బుధవారంహైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆవిష్కరించారు.  ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఇక్కడ నిర్వహించిన సుదర్శన, గణపతి, నవగ్రహ చండీ హోమాల అనంతరం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అనేక పనులను పూర్తి చేసేందుకు తాము పటిష్ట కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. దేవాలయాలను భక్తులకు ప్రశాంతత, సాంత్వన చేకూచర్చే ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నదని తెలిపారు. సంవత్సర కాలంలో దేవాలయాల్లో పేరుకుపోయిన పెండిరగ్‌ పనులను పూర్తి చేస్తూ, దేవాలయాల అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

ప్రజల నమ్మకాలు, విశ్వాసాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రంలో ప్రధాన పండుగలైన సమ్మక్క, సారాలమ్మ జాతర, బోనాల జాతరను ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిందని తెలిపారు. తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన సమ్మక్క-సారాలమ్మ జాతరను నిర్వహణకు రూ.110.00 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ ఏడాది బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ.20 కోట్లు వెచ్చింగా గత ఏడాది ప్రభుత్వం రూ.15 వేల కోట్లను మాత్రమే కేటాయించిందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా దేవాదాయశాఖ కార్తీక మాసంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరివేసేలా సామూహిక కార్తీకమాస దీపోత్సవాలను 2 నవంబర్‌ 2024 నుంచి 1 డిసంబర్‌ 2024 వరకు ఈ వేడుకలను దేవాదాయ చేపట్టిందని మంత్రి తెలిపారు. ‘‘రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఉత్సవ కమిటీల ఏర్పాటుకు జీవో తీసుకొచ్చామని, పండుగలు, జాతరల సందర్భాల్లో దేవాలయాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కోసం దేవాలయాల్లో 126 ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. 408 దేవాలయాలకు ట్రస్ట్‌ బోర్డులను ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్‌  ఇచ్చామని, మంత్రి సురేఖ తెలిపారు.

దశాబ్దాలుగా పెండిరగ్‌ లో వున్న 33 మంది జూనియర్‌ అసిస్టెంట్లకు ప్రభుత్వం గ్రేడ్‌-%III% ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించి, వారి కలను నిజం చేసందని మంత్రి సురేఖ అన్నారు. ఈ సమయంలో వారు ఎంతో భావోద్వేగానికి గురైన తీరును తాను కళ్లారా చూశానని తెలిపారు. అంతేకాకుండా 16 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఆలయ ఉద్యోగులందరికీ బదిలీలు చేపట్టడంతో పాటు పదోన్నతులు కల్పించామని స్పష్టం చేశారు. భద్రాచలం, బాసర, అలంపూర్‌ జోగులాంబ దేవాలయాల్లో నదీ హారతి కార్యక్రమాన్ని దేదీప్యమానంగా చేపట్టామని మంత్రి తెలిపారు. దేవాదాయ భూముల్లో సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం పంచాయతీ రాజ్‌ శాఖకు చెందిన ఇందిరా మహిళా శక్తి గ్రూపులతో అవగాహన ఒప్పందాన్ని కుదర్చుకున్నామని తెలిపారు. పర్యాటక శాఖతో అనుసంధానమై 3 టెంపుల్‌ టూరిజం సర్క్యూట్‌లను తీర్చిదిద్దుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. సిజిఎఫ్‌ నిధులతో రూ. 10.37 కోట్ల అంచనాలతో 25 పనులు మంజూరు చేశామని తెలిపారు.

భక్తుల సౌకర్యాల నిమిత్తం ఐటీ శాఖ ఆధ్వర్యంలో మీ సేవ, టీయాప్‌ ఫోలియో ద్వారా పలు సేవలను అందుబాటులోకి తెచ్చామని మంత్రి సురేఖ అన్నారు. దాదాపు రూ. 400 కోట్లతో రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో దేవాలయ అభివృద్ధి పనులతో పాటు భక్తుల సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. వొచ్చే బ్రహ్మోత్సవాల వరకు యాదాద్రి దేవాలయ విమాన గోపురం పనులు పూర్తి చేస్తామని మంత్రి సురేఖ తెలిపారు. దేశంలోనే ఎత్తైన స్వర్ణ గోపురంగా యాదాద్రి దేవాలయం ఖ్యాతిగాంచనుందని మంత్రి సురేఖ అన్నారు. వేములవాడ, భద్రాచలం ఆలయాల అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ లతో కట్టుదిట్టంగా ముందుకుపోతున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. భక్తుల నమ్మకాలు, విశ్వసాలకు అనుగుణంగా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేలా దేవాలయాలను తీర్చిదిద్దుతున్నామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.  కార్యక్రమంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ శ్రీధర్‌, రీజనల్‌ జాయింగ్‌ కమిషనర్‌ రామకృష్ణారావు, అడిషనల్‌ కమిషనర్స్‌ జ్యోతి, కృష్ణవేణి, అసిస్టెంట్‌ కమిషనర్లు అంబుజ, లావణ్య, అంజానారెడ్డి, రామాంజనేయులు,సంధ్యారాణి, బాలాజి, రాష్ట్ర ఈవోల సంఘం అధక్షుడు నరేందర్‌, ఆలయ ఈవో శ్రీనివాస శర్మ, టెంపుల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *