అధిక జనాభా శాపం అనుకునే రోజులు పోయి వరం అనుకున్న రోజులు వొచ్చేశాయి. ఈ అధిక జనాభాను ప్రయోజనకర రీతిలో ఉపయోగించుకుంటే ప్రపంచాన్నే శాసించే పరిస్థితులు వొస్తాయని మన పైతరాల వారు బహుశా కలలో కూడా ఊహించి ఉండరు . అనుకున్న ప్రయోజనం సిద్ధించడానికి అందరూ విద్యావంతులైతేనే సాధ్యం. కానీ ప్రస్తుత మన విద్యావ్యవస్థ పనితీరు అందుకు భిన్నంగా తిరోగమనంలో ఉండటం విచారకరం. భారతదేశం తన జనాభా సాంద్రతను ఒక వరంగా (Demographic Dividend) మార్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, గత దశాబ్ద కాలపు విద్యా గణాంకాలు ఒక భిన్నమైన, ఆందోళనకరమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయి. UDISE Unified District Information System for Education గణాంకాల ప్రకారం 154కోట్ల జనాభా పెరిగితే స్కూలుకు వెళ్లే పిల్లల సంఖ్య 2.41కోట్లు తగ్గడమే ఇందుకు గొప్ప ఉదాహరణ. 2015లో ప్రతి వందమందిలో 21 మంది బడికి వెళితే ఈ సంఖ్య 2025 నాటికి 17కు పడిపో యింది.
ఇదే పరిస్థితి కొనసాగితే ప్రపంచ స్థాయి అవసరాలకు తగిన నైపుణ్యం గల యువత అందుబాటులో లేకపోవడంతో దేశం అన్ని రకాలుగా నష్టపోక తప్పదు. జనాభా సంఖ్య పెరిగినప్పుడు పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య తదనుగుణంగా పెరగకపోగా 19శాతం క్షీణించడం భావి ప్రమాద సూచిక! దీనికితోడు పులిమీద పుట్రలా 93వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. అదేమంటే విద్యార్థుల సంఖ్య తగినంత లేకపోవడంతో సమీపంలోని పెద్ద పాఠశాలలో విలీనం చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. దీనికి పెట్టిన అందమైన పేరు “స్కూల్ రేషనలైజేషన్. ఫలితంగా వెనుకబడిన ప్రాంతాల్లో చదువు విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోయింది. ముఖ్యంగా బడులకు వెళ్లడానికి తగిన రవాణా సదుపాయాలు లేకపోవడంతో, మరోమార్గం లేక పిల్లలు చదువుకు స్వస్తి చెబుతుండటం వర్తమాన విషాదం.
ఒకపక్క జనాభా పెరుగుతుంటే మరోపక్క బడి మానేసేవారి సంఖ్య పెరుగుతూ పోతుండటానికి ప్రధాన కారణం ప్రభుత్వ పాఠశా లల్లో అరకొర మౌలిక సదుపాయాలతో పాటు వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత! దీన్ని సావకాశం గా తీసుకొని తామరతంపరగా ప్రైవేటు పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరగడం వీటిల్లో విద్యార్థుల చేరికలు కూడా పెరిగాయి. కానీ ఇక్కడ నడ్డివిరిచే రీతిలో ఫీజులభారం ఉండడంతో భరించలేక చదువు మానేసే వారి సంఖ్య పెరుగుతోంది. నిజం చెప్పాలంటే కోవిడ్ తర్వాత పరిస్థితులు దయనీయంగా మారాయి. ఆదాయం కోల్పోయిన సామాన్య కుటుంబాలు, ఆసరాకోసం తమ పిల్లలను బడి మాన్పించి పనులకు పంపడం మొదలైంది. దీంతో ప్రాథమిక విద్య తర్వాత డ్రాపౌట్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వొస్తుంది . దీనివల్ల రాబోయే కాలంలో దేశంలో పెరిగిన యువశక్తిలో తగిన నైపుణ్యాలు లేకపోవడంతో నిరుద్యోగం పెరిగి, ఉత్పాదకత తగ్గిపోతుంది. ఈ ప్రమాద ఘంటికలను కేంద్రం గుర్తించి తక్షణ చర్యలు తీసుకోకపోతే రాబోయే తరాల జీవితాలు అంధకార బంధురం కాకతప్పదు.





