భార‌త్‌-ర‌ష్యాల వ్యూహాత్మ‌క దౌత్యం!!

ట్రంప్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అమెరికాతో సంబంధాలు కొంత‌మేర దెబ్బ‌తిన్న త‌రుణంలో, మ‌న‌దేశం ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడుకుంటూనే వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఇదే.  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అమెరికాతో పూర్తిగా విభేదించ‌డంవ‌ల్ల ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు మ‌రింత‌గా దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉన్న  నేప‌థ్యంలో లౌక్య రాజ‌కీయానికే మ‌న‌దేశం ప్రాధాన్య‌మిస్తోంది. చిర‌కాల మిత్రుడు ర‌ష్యాతో స్నేహ‌బంధానికి ఎటువంటి ఆటంకం లేకుండా, అమెరికాతో వ్య‌వ‌హ‌రించ‌డంలో మ‌న‌దేశం ప్ర‌ద‌ర్శిస్తున్న వ్యూహ‌త్మ‌క చాక‌చ‌క్యాన్ని ప్ర‌పంచ దేశాలు నిశితంగా గ‌మ‌నిస్తున్నాయి. ఇన్ని కార‌ణాల నేప‌థ్యంలోనే మౌనంగానే అవ‌స‌ర‌మైన కార్య‌క‌లాపాల‌ను ఇరు దేశాలు చ‌క్క‌బెట్టేశాయ‌నుకోవాలి. 
ప్ర‌పంచ‌మంతా ఆస‌క్తిగా ఎదురుచూసిన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ మ‌న‌దేశంలో ప‌ర్య‌ట‌న పూర్త‌యింది. 23వ భార‌త్‌-ర‌ష్యా వార్షిక స‌మావేశంలో పాల్గొన్న ఆయ‌న స్వ‌దేశానికి తిరిగి వెళ్లారు. ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభానికి ముందు ఆయ‌న మ‌న‌దేశానికి వ‌చ్చి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని క‌లిసి వెళ్లిన త‌ర్వాత భార‌త్‌కు రావ‌డం ఇదే ప్ర‌థ‌మం. అదీకాకుండా యుక్రెయిన్ యుద్ధం మొద‌లైన త‌ర్వాత ఆయ‌న చేసిన అధికార ప‌ర్య‌ట‌న కూడా ఇదే కావ‌డం విశేషం. మ‌న‌దేశంలో 27 గంట‌లు గ‌డిపిన ర‌ష్యా అధినేతను మ‌న ప్ర‌భుత్వం ఇచ్చిన ఆతిథ్యం సమ్మోహితుడిని చేసింద‌ని చెప్ప‌డానికి ఆయ‌న‌లో వ్య‌క్త‌మైన హావ‌భావాలే నిద‌ర్శ‌నం.
పుతిన్ డిసెంబ‌ర్ 4 సాయంత్రం 7.30 గంట‌ల‌కు మ‌న‌దేశంలోకి అడుగుపెట్టారు. ప్ర‌ధాని మోదీ ప్రొటోకాల్‌ను ప‌క్క‌న‌బెట్టి మ‌రీ పుతిన్‌ను స్వాగ‌తించ‌డానికి విమానాశ్ర‌యానికి వెళ్ల‌డం ఒక విశేష‌మైతే, వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌ను ఖాత‌రు చేయ‌కుండా పుతిన్‌, తెల్ల‌టి టోయ‌టా ఫార్చూన‌ర్ కారులో మ‌న ప్ర‌ధాని మోదీతో పాటు ప్ర‌యాణించ డం విశేషం.  నిజానికి ప్ర‌ధాని మోదీ ఈ కారును పెద్ద‌గా ఉప‌యోగించ‌రు. ఆయ‌న మెర్సిడెజ్ బెంజ్ లేదా రేజ్‌రోవ‌ర్ లేదా బీఎండ‌బ్ల్యు కార్ల‌లో ప్ర‌యాణిస్తారు. కానీ జ‌పాన్‌కు చెందిన టోయ‌టా కంపెనీ త‌యారీ ఫార్చూన‌ర్ కారులో ప్ర‌యాణించ‌డం వెనుక ఒక ప్ర‌ధాన కార‌ణ‌ముంది. ప్ర‌ధాని ఉప‌యోగించే ల‌గ్జ‌రీ కార్లు రెండూ ప్ర‌ధానంగా యూర‌ప్ దేశాల డిజైన్ల‌కు చెందిన‌వి. ఇప్ప‌టికే అమెరికా నేతృత్వంలోని యూర‌ప్ దేశాలు ర‌ష్యాపై 20వేల‌కు పైగా ఆంక్ష‌లు విధించి ఉన్నాయి.
ఈ నేప‌థ్యంలో ఆయా దేశాల త‌యారీ కార్ల‌లో ప్ర‌యాణించ‌డం పుతిన్‌కు ఎంత‌మాత్రం ఇష్టం ఉండ‌దు. అదీకాకుండా ఆయ‌న పూర్తి భ‌ద్ర‌త‌తో కూడిన త‌న సొంత‌కారులోనే ప్ర‌యాణి స్తారు. కానీ ప్ర‌పంచంలో అత్యంత‌ శ‌క్తివంత‌మైన నేత‌లు ఈ టోయ్‌టా కారులో ప్ర‌యాణించ‌డం యాదృచ్ఛికం అనుకోవ‌డానికి వీల్లేదు. ఎందుకంటే ఆసియాలో అత్యున్న‌త స్థాయి సాంకేతిక ప‌రిజ్ఞానానికి కేంద్రంగా వున్న జ‌పాన్ ఇప్పుడు అమెరికాలో ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ల మేర పెట్టుబ‌డులు పెడుతోంది. ఈవిధంగా పెట్టుబ‌డులు పెట్ట‌డం వెనుక ట్రంప్ తీవ్ర స్థాయి వ‌త్తిడే కార‌ణ‌మ‌నేది సుస్ప‌ష్టం.
అంతేకాదు టోయ్‌టా కంపెనీని త‌మ‌దేశంలో నెల‌కొల్పాల‌ని కూడా ట్రంప్ కోరుతున్నారు. స‌రిగ్గా ఇదే త‌రుణంలో మోదీ, పుతిన్‌లు టోయ్‌టా కారులో ప్ర‌యాణించ‌డంతో ఆ కారు బ్రాండ్ వ్యాల్యూ ఒక్క‌సారిగా పెరిగిపోయింది.  మ‌న‌దేశీయ బ్రాండ్ కార్ల‌ను ఎంచుకోక‌పోవ‌డం వెనుక, ఆసియా దేశాలు ఒక్క‌టైతే అమెరికా ఒత్తిళ్ల‌కు లొంగాల్సిన అవ‌స‌రం లేద‌న్న సంకేతాన్ని జ‌పాన్‌కు పంప‌డానికే ఉద్దేశ‌పూర్వ‌కంగా మోదీ ఈ కారును ఎంచుకున్నారా? అన్న అభిప్రాయాలున్నాయి. ఎందుకంటే త‌న‌ ప్ర‌తిచ‌ర్య వెనుక క‌చ్చితంగా ఒక కార‌ణంతో పాటు, సంబంధితుల‌కు ఒక బ‌ల‌మైన సంకేతాన్ని పంప‌డానికి య‌త్నిస్తుండ‌టం ప్ర‌ధాని మోదీ ప్ర‌త్యేక‌త‌. యు.ఎస్‌. ఒత్తిళ్ల‌కు మేం భ‌య‌ప‌డ‌టం లేదు, మీరు కూడా లొంగిపోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న సంకేతం ఇందులో ఇమిడివున్న‌దా అని అనుకోవాల్సి వ‌స్తున్న‌ది. అయితే ర‌ష్యాకు, జ‌పాన్‌కు మ‌ధ్య కురిల్‌ ద్వీపాల విష‌యంలో విభేదాలు కొన‌సాగుతుండ‌టం గ‌మ‌నార్హం.
ఇక పుతిన్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఎస్‌.యు-57, ఎస్‌-500, చ‌మురు స‌ర‌ఫ‌రా వంటి అంశాల‌పై ఒప్పందాలు కుదిరిన‌ట్టు అధికారికంగా ఏవిధ‌మైన ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. రొటీన్ ఒప్పందాల కొన‌సాగింపు జ‌రిగిన‌ట్టు మ‌న‌కు పైకి క‌నిపిస్తోంది. ముఖ్యంగా వైద్యం, ఆరోగ్యం, అణుశ‌క్తి, సాంస్కృతిక త‌దిత‌ర రంగాల్లో మాత్ర‌మే ఒప్పందాలు కుదిరిన‌ట్టు తెలుస్తోంది. అక్ర‌మ వ‌ల‌స‌ల‌పై ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవ‌డానికి కూడా ఇరు దేశాలు అంగీకారానికి వ‌చ్చాయి.  అయితే  చ‌మురు స‌ర‌ఫ‌రా నిరంత‌రాయంగా కొన‌సాగిస్తామ‌ని పుతిన్ స్ప‌ష్టం చేశారు. ఈమ‌ధ్య‌కాలంలో ర‌ష్యానుంచి చ‌మురు కొనుగోళ్లు త‌గ్గించినా, మ‌ళ్లీ భారీయెత్తున కొనుగోళ్ల‌ను మ‌న‌దేశం ప్రారంభించ‌డం గ‌మ‌నార్హం. కాగా ప్రస్తుతం ఇరుదేశాల మ‌ధ్య ఉన్న  65 బిలియ‌న్ డాల‌ర్ల వాణిజ్యాన్ని 2030 నాటికి వంద బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెంచాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాయి. ఇవ‌న్నీ మ‌న‌కు పైకి క‌నిపిస్తున్నవి మాత్ర‌మే. పుతిన్‌తో త‌న‌తో పాటు 80 మంది ఆ దేశంలోని వివిధ రంగాల‌కు చెందిన దిగ్గ‌జ‌ నిపుణులు, వివిధ శాఖ‌ల‌కు చెందిన మంత్రులను తీసుకొచ్చారు. క్ష‌ణం తీరిక‌లేకుండా గ‌డిపే ఇటువంటి నిపుణులు మ‌న‌దేశానికి వూరికే వ‌స్తార‌నుకుంటే అంత‌క‌న్నా అమాయ‌క‌త్వం ఏమీ ఉండదు. వీరంతా మ‌న‌దేశానికి చెందిన మంత్రులు వివిధ రంగాల నిపుణుల‌తో కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు. పైకి మీడియాకు మోదీ-పుతిన్‌లు క‌నిపిస్తున్నా తెర‌వెనుక వీరంతా త‌మ‌కు నిర్దేశించిన ప‌నుల‌ను పూర్తి చేసేవుంటారు.  కాక‌పోతే ఇవ‌న్నీ ఇప్పుడే బ‌య‌ట‌కు వెల్ల‌డికావు.  రాబోయే కాలంలో ఒక్కొక్క‌టిగా వెల్ల‌డ‌వు తాయి.
ముఖ్యంగా కీల‌కమైన ర‌క్ష‌ణ రంగం, సాంకేతిక ప‌రిజ్ఞానం, యుద్ధ విమానాలు, ఎస్‌-500 వంటి వాటిపై ఏమైనా ఒప్పందాలు కుదిరిన‌ట్టున‌ట్టు బ‌హిర్గ‌త‌మైతే, ఇప్ప‌టికే ర‌ష్యా అధ్య‌క్షుడి ప‌ర్య‌ట‌న‌పై ఆగ్ర‌హావేశాల‌తో ఉన్న  అమెరికా స‌హా ప‌శ్చిమ దేశాలు మ‌న‌దేశంపై మ‌రిన్ని ఆంక్ష‌లు విధించే అవ‌కాశాలే ఎక్కువ. ఇప్ప‌టికే అమెరికా మ‌న‌పై 50 శాతం టారిఫ్ విధించింది. దీన్ని స‌రిద్ద‌డానికి యు.ఎస్‌.తో తెర‌వెనుక చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మ‌న‌దేశంతో వైరం అమెరికాకే న‌ష్ట‌మ‌న్న సంగ‌తి ట్రంప్‌కు ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది.  ట్రంప్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అమెరికాతో సంబంధాలు కొంత‌మేర దెబ్బ‌తిన్న త‌రుణంలో, మ‌న‌దేశం ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడుకుంటూనే వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఇదే.  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అమెరికాతో పూర్తిగా విభేదించ‌డంవ‌ల్ల ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు మ‌రింత‌గా దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉన్న  నేప‌థ్యంలో లౌక్య రాజ‌కీయానికే మ‌న‌దేశం ప్రాధాన్య‌మిస్తోంది.
చిర‌కాల మిత్రుడు ర‌ష్యాతో స్నేహ‌బంధానికి ఎటువంటి ఆటంకం లేకుండా, అమెరికాతో వ్య‌వ‌హ‌రించ‌డంలో మ‌న‌దేశం ప్ర‌ద‌ర్శిస్తున్న వ్యూహ‌త్మ‌క చాక‌చ‌క్యాన్ని ప్ర‌పంచ దేశాలు నిశితంగా గ‌మ‌నిస్తున్నాయి. ఇన్ని కార‌ణాల నేప‌థ్యంలోనే మౌనంగానే అవ‌స‌ర‌మైన కార్య‌క‌లాపాల‌ను ఇరు దేశాలు చ‌క్క‌బెట్టేశాయ‌నుకోవాలి. ఇక చైనా విష‌యానికి వ‌స్తే ర‌ష్యా మ‌న‌దేశంతో స‌న్నిహితంగా ఉండటం  అంత‌గా ఇస్టం ఉండదు . 1962 యుద్ధంలో ర‌ష్యా,  చైనావైపే కొంత‌మేర మొగ్గు చూపింది. త‌ర్వాత కాల‌క్ర‌మంలో ర‌ష్యా మ‌న‌దేశానికి స‌న్నిహిత‌మైంది. అటువంట‌ప్పుడు ర‌ష్యా మ‌న‌దేశానికి ప్రాధాన్యం ఇచ్చే ఏ అంశ‌మైనా చైనాకు ఇష్ట‌ముండ‌దు. ఈ కార‌ణంగానే పుతిన్ ప‌ర్య‌ట‌న‌కు చైనా మీడియా పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు. అదీకాకుండా భార‌త్‌, చైనాలు రెండూ త‌న‌కు అత్యంత స‌న్నిహిత దేశాల‌ని ప్ర‌క‌టించ‌డం కూడా చైనాకు కొరుకుడు ప‌డ‌నిది. ఎంత‌గా స్నేహ‌గీతం ఆలాపించినా చైనాను, ర‌ష్యా ఎంత‌మాత్రం న‌మ్మ‌దు. ఇదే స‌మ‌యంలో భార‌త్ ఎప్పుడూ ర‌ష్యాకు న‌మ్మ‌క‌మైన మిత్రుడిగా కొన‌సాగుతోంది. ఇక అమెరికా విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్‌లో పుతిన్ ప‌ర్య‌ట‌నపై ఎటువంటి గంభీర ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ‌లేదు. ముఖ్యంగా ఎప్పుడూ వాచాల‌త్వం ప్ర‌ద‌ర్శించే ట్రంప్ ఇప్ప‌టివ‌ర‌కు మౌనంగా ఉన్నారంటే, ర‌ష్యాతో మ‌నం అనుస‌రించి వ్యూహం ఫ‌లించిన‌ట్టే.
ఇదిలావుండ‌గా మ‌న‌దేశ ప‌ర్య‌ట‌న‌కు రావ‌డానికి ముందు పుతిన్ యంత్రాంగం, యు.ఎస్‌.తో దాదాపు ఐదుగంట‌ల‌పాటు యుక్రెయిన్ యుద్ధం ముగింపుపై చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. డాన్‌బాస్కో ప్రాంతాన్ని క‌లిపేసు కున్నాన‌ని, ఇక యుక్రెయిన్ తో త‌న‌కు యుద్ధం అవ‌స‌రం లేద‌ని పుతిన్ స్ప‌ష్టం చేసిన‌ట్టు వార్త‌లు వెలువ‌డ్డాయి. రాజ‌కీయం కంటే వ్యాపార‌మే ముఖ్య‌మైన ట్రంప్ ఇప్పుడు మాట‌మార్చి యుక్రెయిన్ అధ్య‌క్షుడు జెల‌న్‌స్కీపై యుద్ధ విర‌మ‌ణ‌పై వ‌త్తిడి తీసుకొస్తుండ‌టం వెనుక‌, పుతిన్ వాణిజ్య తంత్రం ఉన్న‌ద‌నుకోవాలి. ర‌ష్యా, నాటో దేశాల మ‌ధ్య రాజ‌కీయ చ‌ద‌రంగంలో జ‌ల‌న్‌స్కీ ఒక పావుగా మారిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.  ఒక‌వేళ యుద్ధం ఆగిపోతే, ర‌ష్యా మ‌న‌కు ఇప్ప‌టివ‌ర‌కు ఇస్తున్న మాదిరిగానే రాయితీపై చ‌మురు ఎంత‌వ‌ర‌కు స‌ర‌ఫ‌రాచేస్తుంద‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌! చ‌మురు కొన‌డం మ‌న‌కెంత అవ‌స‌ర‌మో, ఆంక్ష‌ల న‌డుమ ఆర్థిక ద‌న్ను కూడా ర‌ష్యాకు అంతే ముఖ్యం! ర‌ష్యా-యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతే, యూర‌ప్ దేశాల‌కు ర‌ష్యా చ‌మురు, గ్యాస్ ఎగుమ‌తులు పెరుగుతాయి. అప్పుడు మ‌న‌కు రాయితీపై చ‌మురు స‌ర‌ఫ‌రా చేస్తుందా లేదా అనేది కాల‌మే నిర్ణ‌యించాలి!
-జమలాపురం విఠల్ రావు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *