ఆవిష్కరణల ముసుగులో మేధో చౌర్యం

భారతదేశం ‘ఏఐ’ సూపర్ పవర్‌గా ఎదగాలని కలలు కంటున్న తరుణంలో, దిల్లీ వేదికగా జరిగిన ఇండియా ఏఐ  ఇంపాక్ట్ సమ్మిట్ 2026′ లో చోటుచేసుకున్న ఘటన యావత్ విద్యా ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన రోబోటిక్ డాగ్‘ వివాదం కేవలం ఒక విద్యాసంస్థ చేసిన పొరపాటు మాత్రమే కాదుఅది మన దేశ పరిశోధనా రంగంలో వేళ్లూనుకున్న అనైతిక ధోరణులకు అద్దం పడుతోంది. న్యూదిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ   ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ లో గల్గోటియాస్ యూనివర్సిటీకి సంబంధించి తలెత్తిన వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారతదేశ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో నిర్వహించిన ఈ సదస్సులో, ఒక ప్రముఖ ప్రైవేట్ విద్యాసంస్థ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం దురదృష్టకరం.
మంగళ వారం  సమ్మిట్ ఎక్స్‌పోలో గల్గోటియాస్ యూనివర్సిటీ తమ స్టాల్‌లో ఒక రోబోటిక్ డాగ్  ను ప్రదర్శించింది. దానికి ‘ఓరియన్’  అని పేరు పెట్టారు. యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నేహా సింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఈ రోబోను తమ యూనివర్సిటీలోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ స్వయంగా అభివృద్ధి చేసిందని, ఇది సుమారు రూ .350 కోట్ల పెట్టుబడితో చేపట్టిన ఏఐ  ప్రాజెక్టులో భాగమని పేర్కొన్నారు. అయితే, సోషల్ మీడియా వినియోగదారులు ఆ రోబోను నిశితంగా గమనించగా, అది చైనాకు చెందిన ‘ యునిట్రీ రోబోటిక్స్ ‘ సంస్థ తయారు చేసిన యునిట్రీ జీఓ 2  మోడల్ అని తేలిపోయింది. దీని ధర మార్కెట్లో సుమారు రూ .2-3 లక్షలు మాత్రమే. చైనా వస్తువును తమ సొంత ఆవిష్కరణగా చెప్పుకోవడం తీవ్ర దుమారం రేపింది.
ఈ వివాదం వెలుగులోకి వొచ్చిన వెంటనే నెటిజన్లు యూనివర్సిటీని తీవ్రంగా ట్రోల్ చేశారు. దీనివల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటుందని విమర్శలు వచ్చాయి. కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ స్పందిస్తూ, ప్రదర్శనదారులు తాము తయారు చేయని వస్తువులను తమవని చెప్పుకోవడం సహించబోమని స్పష్టం చేశారు. వెనువెంటనే యూనివర్సిటీ స్టాల్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేసి, వారిని సదస్సు నుండి ఖాలీ  చేయమని ఆదేశించారు.     : గల్గోటియాస్ యూనివర్సిటీ తర్వాత క్షమాపణలు కోరింది. తమ ప్రతినిధి సరిగ్గా అవగాహన లేక అలా మాట్లాడిందని, ఆ రోబోను కేవలం విద్యార్థుల పరిశోధనల కోసం కొనుగోలు చేశామే తప్ప, మేమే తయారు చేశామని చెప్పాలనే ఉద్దేశ్యం లేదని వివరణ ఇచ్చింది. ప్రొఫెసర్ స్థాయి వ్యక్తులు మీడియా ముందు మాట్లాడేటప్పుడు వాస్తవాలను తనిఖీ చేయకపోవడం వారి బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుంది. ఇది కేవలం ఒక వ్యక్తి పొరపాటుగా చూడలేం, ఇది సంస్థాగత వైఫల్యం. ఒక ప్రసిద్ధ యూనివర్సిటీ అంతర్జాతీయ వేదికపై పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేయడం అకడమిక్ ఎథిక్స్‌కు విరుద్ధం. కేవలం మార్కెటింగ్ కోసం వేరొకరి మేధోసంపత్తిని తమదిగా క్లెయిమ్ చేసుకోవడం విద్యార్థులకు తప్పుడు సందేశాన్ని ఇస్తుంది.
    ఒక వైపు    ప్రస్తుతం ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదాలు బలంగా ఉన్న సమయంలో, విద్యాసంస్థలు విదేశీ పరికరాలను కొని, వాటికి కొత్త పేర్లు పెట్టి తమ సొంత ఆవిష్కరణలుగా చూపుతున్నాయి. ఇది నిజమైన ఆవిష్కర్తల ఉత్సాహాన్ని దెబ్బతీస్తుంది.  స్వదేశీ సాంకేతికతకు బదులు చైనా ఉత్పత్తులను భారత్ వేదికలపై ప్రమోట్ చేయడం దురదృష్టకరం.  ఈ ఘటన మన విద్యా వ్యవస్థ మరియు పరిశోధనా రంగంలోని కొన్ని లోపాలను ఎత్తిచూపుతోంది.  ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ వంటి గొప్ప వేదికలు మన దేశ సాంకేతిక ప్రతిభను ప్రపంచానికి చూపాలి. ఇలాంటి వివాదాలు ఆ లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తాయి. విద్యాసంస్థలు కేవలం బహుళ అంతస్తుల భవనాలు ..ఇతర విలాసవంతమైన సౌకర్యాలపైనే   కాకుండా, పరిశోధనల్లో పారదర్శకత మరియు నైతికతపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఈ సమ్మిట్‌ను ప్రభుత్వం కేవలం ప్రచారం  కోసం వాడుకున్నట్లు అనుమానించాల్సివొస్తుంది , క్షేత్రస్థాయిలో నిజమైన ఆవిష్కరణలు జరగడం లేదు . చైనా వస్తువులను ప్రదర్శిస్తూ “మేక్ ఇన్ ఇండియా” అని చెప్పుకోవడం దేశాన్ని వంచించడమే..!  కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం అనవసరమైన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల , తద్వారా ఇలాంటి తప్పుడు ప్రదర్శనలకు ఆస్కారం కలుగుతుంది.  సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న సమయంలో, ఒక భారతీయ సదస్సులో చైనా రోబోను “స్వదేశీ ఆవిష్కరణ”గా చూపడం జాతీయవాద కోణంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇది భారతీయ స్టార్టప్‌ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.  విశ్వవిద్యాలయాలు కేవలం ర్యాంకింగ్స్ మరియు అడ్మిషన్ల కోసం తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల అంతర్జాతీయంగా భారతీయ విద్యార్థుల డిగ్రీల విలువ తగ్గే ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *