యువత పోటీ చేయాల్సిందే

చిన్నతనంలోనే సర్పంచ్ గా గెలిచి అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకువెళ్తూ మనలాంటి యువతకు ఆదర్శంగా ఉండాలి,వాళ్ళు కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేలా ఆదర్శంగా నిలవాలి. గ్రామాల్లో ప్రతి సమస్యను ఎలా పరిష్కరించాలో సమగ్రంగా తెలుసుకొని మిగతా యువతకు తెలియజెప్పుతూ ఉండాలి.
వెంగల రణధీర్
(MA-జర్నలిజం)

ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు అతి త్వరలో జరుగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే ప్రథమ బాధ్యత సర్పంచ్ దే అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.కాబట్టి మనం ఎన్నుకునే ముందు ఒకటి నాలుగు సార్లు ఆలోచించి గ్రామ అధిపతిని ఎన్నుకోవాలి. స్థానిక సంస్థల్లో యువతీ,యువకులు పోటీ చేసి రాజకీయంగా అభివృద్ధి చెందుతూ గ్రామాలను కూడా ముందు వరుసలో ఉంచడంతో ప్రముఖ పాత్రను పోషించాలి. వార్డు మెంబర్ గా కూడా పోటీ చేసి రాజకీయంలో రాణిస్తూ ముందుకు వెళ్లాలి.

యువత ముందడుగు వేయాల్సిందే 
గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పి,గెలిచాక ప్లేట్ ఫిరాయించే నాయకులకు నమ్మి మోసపోయిన ప్రజలు కోకొల్లలుగా ఉన్నారు. నమ్మించి మోసం చేసే నాయకులకు పుల్ స్టాప్ పెట్టి, గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చి దిద్దడంలో యువత ముందుండాలి. రాజకీయంగా ఎదుగుతూ గ్రామానికి చిన్న వయసులోనే సర్పంచ్ గా ఎన్నికైతే ఎంతో మందికి ఆదర్శంగా తయారవుతారు.నిన్ను చూసే ఎంతో మంది రాజకీయంగా ముందుకి వచ్చి పేద ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు ముందుకు వస్తారు.
ప్రజలు మెచ్చేలా మేనిఫెస్టో ఉండాలి 
ప్రజలు మనల్ని ఎన్నుకోవాలంటే గెలిచాక ఏం చేయబోతున్నామనేది క్లియర్ కట్ గా ఒక మేనిఫెస్టో రూపొందించి వారికి అందించి,అవసరమైతే రోజుకో కాలనీలో మీటింగ్  పెట్టి ప్రజలకు తెలియజెప్పాలి. గ్రామ పంచాయతీకి వచ్చే ప్రతి రూపాయిని రిజిస్టర్ లో రాసి,ఏ పనికి ఎంత ఖర్చు చేస్తున్నామో గ్రామ సభలో చెప్పే బాధ్యత తీసుకుంటామని మేనిఫెస్టోలో వివరంగా రాయాలి. గెలిచిన పిమ్మట ఒక్కో హామీని నెరవేరుస్తూ ఉంటూ,తాము వేసిన వోటు వృధా  కాలేదు అని ప్రజలు గర్వంగా చెప్పుకునేలా పరిపాలన ఉండాలి. అప్పుడే నీవు నాయకుడిగా సెట్ అయినట్లు మొదటి హింట్. అక్కడి నుండే నీ ఎదుగుదల స్టార్ట్ అవుతుంది.వార్డు మెంబర్ నుండి మొదలుకొని సర్పంచ్, ఎంపీపీ,జడ్పీటీసీ,ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి పదవులను అధిరోహించేలా కార్యాచరణ ఉండాలి.
యువతకు ఆదర్శంగా ఉండాలి 
చిన్నతనంలోనే సర్పంచ్ గా గెలిచి అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకువెళ్తూ మనలాంటి యువతకు ఆదర్శంగా ఉండాలి,వాళ్ళు కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేలా ఆదర్శంగా నిలవాలి. గ్రామాల్లో ప్రతి సమస్యను ఎలా పరిష్కరించాలో సమగ్రంగా తెలుసుకొని మిగతా యువతకు తెలియజెప్పుతూ ఉండాలి.
పారదర్శకత మెయింటైన్ చేయాలి 
ఏదైనా పని చేపడుతున్న దృష్ట్యా పలువురు పలు ప్రశ్నలు లేవనెత్తుతారు, పార్టీలకతీతంగా పారదర్శకంగా సమాధానం చెప్తూ ఉండాలి.  కోప ద్వేషాలు లేకుండా ఉంటూ పాలనను సాఫీగా చేసుకుంటూ వెళ్లాలి. గ్రామాల మీద పడి అభివృద్ధి పేరిట దోచుకొని తిన్న వాళ్ళకి మన పాలనతో బుద్ధి రావాలి. అధికారులకు,ప్రజలకు పక్కాగా పారదర్శకంగా ఉంటే మనల్ని అడ్డుకునే వారే ఉండరు. ఎందుకంటే మన సర్పంచ్ అర్థం చేసుకునే వ్యక్తి అని ప్రజలకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది.
వోటుకు నోటు బై,వోటుకు అభివృద్ధి సై 
కొంతమంది నాయకులు చూపెట్టే డబ్బుకు ప్రజలు లొంగిపోయి వోటు వేసి వాళ్ళని గెలిపిస్తున్నారు. కేవలం ఎలక్షన్స్ ఉన్న రోజుల్లో మన చుట్టూ తిరిగితే మిగతా 5 సంవత్సరాలు వాళ్ళ చుట్టూ చెప్పులు అరిగేలా ఏదో ఒక పనికి తిరగాల్సిన దుస్థితికి మనం చెక్ పెట్టాలి.వోటు వేస్తే అభివృద్ధితో పాటు ప్రతి ఒక్కరికీ అండగా ఉంటా అని కష్టాల్లో పాలు పంచుకుంటానని చెప్పుతూ,ఆ మాట మీద నిలబడి వాళ్ళకి వోటు విలువేంటో అవగాహన కల్పించాలి. వోటుకు నోటుకు ఇకపై గుడ్ బై చెప్పి,వోటుకు అభివృద్ధి సై అన్నవాళ్ళకే పట్టం కట్టేలా సమాజంలో అక్రమంగా దొబ్బితింటున్న నాయకుల గురించి చెప్తూ అవగాహన కల్పించాలి.
సంక్షేమ పథకాలు అందేలా చర్యలు
ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా,పేద వాళ్లకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను అందేలా చొరవ తీసుకోవాలి.ఎందుకంటే వోటు వేసిన ప్రజల రుణాన్ని ఈ రకంగానైనా తీర్చుకోవచ్చు. ఏదో ఒక రకంగా అండగా ఉంటూ ఇలాంటి నాయకుడు ఉండాలి అని ప్రజలు మెచ్చుకుంటే ఆస్కార్ అవార్డు వచ్చినంత సంతోషంగా ఉంటుంది.
ఫైనల్ గా యువత వెనుకడుగు వేయకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వస్తేనే సమాజం మారుతుంది. ప్రజాధనాన్ని వృధా చేసేవాళ్లకి,అక్రమంగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించే వాళ్ళకి మీతోనే చెక్ పడాలి. రాజకీయం అంటే రప్పా రప్పా దోచుకోవడం కాదు ప్రజలకు సేవ చేసే గొప్ప భాగ్యం అని చెప్పుకునేలా చాటిచెప్పాలి. ఆదర్శ నాయకుడిగా పేరు తెచ్చుకంటే ఇంతకన్నా భాగ్యం ఏముంటుంది. కావున మన గ్రామాలను మనమే అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టి ముందడుగు వేసి రానున్న ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో నీ గుర్తుకు ప్రజలు వోట్లు వేసేలా మీ కార్యాచరణను నేటి నుండే ప్రారంభించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *