చిన్నారి గుండెల్లో ఊహాశక్తి

  • కథ, నవల, బాల సాహిత్య రచయిత, సామాజిక కార్యకర్త
  • వి.శాంతిప్రబోధతో బాలల దినోత్సవం సందర్భంగా
  • బాలసాహిత్య తీరుతెన్నులపై ముఖాముఖి

బాల సాహిత్యం పరిధి అంటే ఏం చెపుతారు?
బాలసాహిత్యం అంటే కేవలం కాలక్షేపం కోసం చెప్పే కథలు, పాటలు మాత్రమే కాదు. ఇది పిల్లల మనసుకు పోషకాహారం లాంటిది. చిన్నారి గుండెల్లో ఊహాశక్తిని పెంచే, ఆలోచనలకు పదునుపెట్టే, సృజనాత్మకతకు గట్టి పునాది వేసే మహత్తరశక్తి బాలసాహిత్యానిది. కథలు, గేయాలద్వారా పిల్లలు కొత్తపదాలు నేర్చుకుంటారు, భాషానైపుణ్యాలు మెరుగుపరుచుకుంటారు. ముఖ్యంగా, విలువలు, సంస్కృతి, చరిత్ర, విజ్ఞానంవంటి ఎన్నోవిషయాలను తెలుసుకునే చక్కనివారధిగా ఇది ఉపయోగపడుతుంది.

మిమ్మల్ని ప్రభావితం చేసిన బాలసాహిత్య చరిత్ర?
మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు చెప్పిన కథలు, జోలపాటలు, సామెతలు మౌఖికంగా తరతరాలుగా వస్తూనే ఉన్నాయి. గురజాడ అప్పారావు, చింతా దీక్షితులు వంటివారు ‘లీలావాచకం’ లాంటి రచనలతో బాలల్లో దేశభక్తిని, వ్యక్తిత్వవికాసాన్ని ప్రోత్సహించారు. వేలసంఖ్యలో బాల గేయసాహిత్యం వెలువడింది. పురాణకథలు, నీతికథలతో మొదలైన బాలసాహిత్యం క్రమంగా ఫాంటసీ, సాహసకథల దిశగా అడుగులు వేసింది.  ప్రజాశక్తి, విశాలంధ్ర ఒకప్పుడు బాలసాహిత్యాన్ని బాగానే అందించాయి. ఆధునికంగా, ‘మంచి పుస్తకం’, ‘బాలచెలిమి’ వంటి ప్రచురణ సంస్థలు సైన్స్, అంతరిక్షం, పర్యావరణం, బాలలహక్కులు వంటి సమకాలీన అంశాలపై మంచిపుస్తకాలను, అనువాదాలను అందిస్తున్నాయి. తెలంగాణ సారస్వత పరిషత్ కూడా బాల సాహిత్యకృషి చేస్తున్నది. మరికొన్ని ప్రచురణసంస్థలు, వ్యక్తులు అడపాదడపా బాలసాహిత్యాన్ని అందిస్తున్నారు.

అసలు సమస్య ఎక్కడ?
పంచతంత్రం లాంటి పాతకథలు విలువలు నేర్పుతున్నప్పటికీ, మారుతున్న ప్రపంచంలో నేటిపిల్లల జ్ఞానతృష్ణ తీర్చడానికి ఆధునిక అంశాలు అవసరం. మరి వాటిని మనపిల్లలు అందుకోగలుగుతున్నారా అని చూస్తే లేదనే సమాధానం వస్తుంది. అందుకు కొన్నికారణాలు ఉన్నాయి. * నేటి పిల్లలు మొబైల్, కంప్యూటర్ యుగంలో ఉన్నారు. వారికి ఆడియో-విజువల్ కంటెంట్ అంటే చాలా ఇష్టం. కానీ తెలుగు బాలసాహిత్యం ఎక్కువగా ముద్రిత పుస్తకాలకే పరిమితమైంది. * ఆకర్షణీయమైన యానిమేషన్ వీడియోలు, ఇంటరాక్టివ్ ఈ-బుక్స్, పాడ్‌కాస్ట్‌లు సృష్టించడంలో వెనుకబడి ఉన్నాం.

దీంతో పిల్లలు ఆంగ్లం వంటి ఇతరభాషల కంటెంట్‌ వైపు మళ్లుతున్నారు. బాలల పుస్తకాల్లో నాణ్యమైన బొమ్మలు (ఇలస్ట్రేషన్స్), మంచి డిజైన్, కాగితం తక్కువగా ఉంటున్నాయి. * విదేశీ పుస్తకాలతో పోలిస్తే, గ్రాఫిక్స్ విషయంలో వెనుకబడి ఉన్నాం. ఇది పిల్లల ఆసక్తిని తగ్గిస్తుంది. * చిన్నపిల్లలకు (6-10 ఏళ్లు) రచనలు బాగానే ఉన్నా, కౌమారదశ (12-16 ఏళ్లు) పిల్లలకు అవసరమైన కథలు చాలా తక్కువ. వారికి ముఖ్యమైన కెరీర్, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగతమార్పులు వంటి అంశాలపై సైన్స్ ఫిక్షన్, నాన్-ఫిక్షన్ నవలలు అవసరం. * కొంతమంది రచయితలు పాత సాంప్రదాయవిలువలను మాత్రమే ప్రతిబింబిస్తున్నారు. సైన్స్, సమానత్వం, వైవిధ్యం, సైబర్ భద్రతవంటి నేటివిషయాలను కథల్లో చూపించాలంటే రచయితలకు ఆధునిక దృక్పథం అవసరం.

తెలుగు బాలసాహిత్యం పదికాలాలపాటు నిలబడాలంటే ఏమి చేయాలి?
డిజిటల్ వేదికలను వినియోగించుకోవడం, యానిమేషన్లు, క్విజ్‌లు, ఆటలతో కూడిన తెలుగు ఈ-బుక్స్, మొబైల్ యాప్‌లను తయారు చేయాలి. తెలుగుకథలను ఆటలరూపంలో అందించడం మంచిమార్గం. సంగీతం, సౌండ్ ఎఫెక్ట్స్‌తో కూడిన కథలను ఆడియోరూపంలో సృష్టించాలి. ఇవి ప్రయాణాల్లో లేదా పడుకునేముందు వినడానికి బాగుంటాయి. కథలు, గేయాలు, సైన్స్ విషయాలను యానిమేటెడ్ వీడియోల రూపంలో అందించే ఛానెల్స్‌ను అభివృద్ధిచేయాలి.  ఇవి పిల్లలను ఆకర్షించడమే కాకుండా, తెలుగుభాషను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయగలవు. వయస్సుకు తగిన రచనలు: 0-5, 6-12 వయసువారి కోసం రచనలతో పాటు కౌమారదశ (12-16 ఏళ్లు) పిల్లలకోసం సైన్స్ ఫిక్షన్, సైబర్ భద్రత, సామాజికన్యాయం, మానసిక ఆరోగ్యం, కెరీర్ ఎంపికలు వంటి అంశాలపై నవలలు రాయాలి.

లింగవివక్ష లేని, అన్నిప్రాంతాల, విభిన్ననేపథ్యాల నుండి వచ్చేపాత్రలు సృష్టించాలి. శాస్త్రవేత్తలు, దివ్యాంగుల కథలు వంటివి పిల్లలకు స్ఫూర్తినిస్తాయి. పర్యావరణ పరిరక్షణ, టెక్నాలజీ, సమానత్వం, ఆరోగ్యం వంటి నేటిసమస్యలను కథల్లో చర్చించాలి. ఇవి పిల్లలకు వారిచుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునేలా చేస్తాయి. నాణ్యమైన బొమ్మలు (ఇలస్ట్రేషన్స్), ఆకర్షణీయమైన డిజైన్‌లు, మంచి కాగితం ఉపయోగించాలి. పుస్తకాలు రంగులమయంగా, పిల్లలను వెంటనే ఆకర్షించేలా ఉండాలి. కేవలం నీతి చెప్పడం కాకుండా, పిల్లల విమర్శనాత్మక ఆలోచన, ఆసక్తి పెంచే, హాస్యాన్ని పండించే కథలు రాయాలి.

సామాజిక ప్రోత్సాహం ఎలా ఉండాలి?
రచయితలను పాఠశాలలకు ఆహ్వానించి, పిల్లలతో మాట్లాడించాలి. పాఠశాలల్లో ‘రీడింగ్ కార్నర్లు’ ఏర్పాటు చేసి, పిల్లలు ఇష్టమైన పుస్తకాలను ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వడం. తల్లిదండ్రులు ప్రతిరోజూ 15-20 నిమిషాల పాటు పిల్లలకు కథలు చదివి వినిపించే ‘కుటుంబ పఠనసమయం’ ప్రోత్సహించడం. బాలసాహిత్యాన్ని ప్రభుత్వ పాఠశాలల పాఠ్యాంశంలో భాగం చేయాలి. గ్రంథాలయాలను బలోపేతం చేయాలి.  రచయితలకు, చిత్రకారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు, అవార్డులు ఇవ్వడం. ఏప్రిల్ 2న అంతర్జాతీయ బాలల పుస్తకదినోత్సవం సందర్భంగా పుస్తకప్రదర్శనలు, కథలపోటీలు, రచనా వర్క్‌షాప్‌లు నిర్వహించడం. బాలసాహిత్యాన్ని ప్రోత్సహించడానికి సినిమా, యానిమేషన్, గేమింగ్ ఇండస్ట్రీల సహకారం తీసుకోవచ్చు. ఉదాహరణకు, తెలుగుకథల ఆధారంగా యానిమేటెడ్ సిరీస్‌లు లేదా గేమ్‌లు సృష్టించడం. బాలసాహిత్య రచనపై పరిశోధనను ప్రోత్సహించడం. ఉదాహరణకు, పిల్లల మనస్తత్వం, వారి ఆసక్తులను అర్థం చేసుకోవడానికి అధ్యయనాలు నిర్వహించడం. రచయితలకు, ఇలస్ట్రేటర్లకు ఆధునిక రచనాశైలులు, డిజిటల్ టూల్స్‌పై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేయడం.

బాల రచయితలను ప్రోత్సహించే మార్గాలు?
పిల్లలు సొంతంగా కథలు, కవితలు రాసేందుకు పోటీలు నిర్వహించి, వారి ఉత్తమరచనలను ప్రచురించాలి. బాలసాహిత్య పత్రికల్లో వారికి ప్రత్యేకస్థానం కల్పించాలి. ‘హ్యారీపాటర్’ లాంటి అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన బాలలరచనలను తెలుగులోకి అనువదించాలి. అదేసమయంలో, తెలుగుకథలను ఇతరభాషల్లోకి అనువదించి, ప్రపంచానికి పరిచయం చేయాలి.

బాలసాహిత్యం నిలబడాలంటే రచయితలు, ప్రచురణకర్తలు, చిత్రకారులు, విద్యాసంస్థలు, ప్రభుత్వం, తల్లిదండ్రులు అందరూ కలిసికట్టుగా కృషిచేయాలి. పిల్లల ఆలోచనలను, జ్ఞానతృష్ణను గౌరవిస్తూ, వారి ప్రపంచానికి అనుగుణంగా కథలు, డిజిటల్ కంటెంట్‌ను అందిస్తే, బాలసాహిత్యం భవిష్యత్ తరాలకు గొప్పకానుక అవుతుంది.

కె ఎన్ మల్లీశ్వరి  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page