సామరస్యం లేక‌పోతే ఇద్దరికీ అనర్థమే

shankaraiah

కోర్టులో కేసు ఓడిన వాడు కోర్టు వద్ద ఏడ్చితే కేసు గెలిచిన‌వాడు అప్పుల పాలైనందుకు ఇంటి వద్దకు వచ్చిన తర్వాత ఏడ్చినాడనే సామెత అందరికీ తెలుసు. ఈ సామెత అంతర్ రాష్ట్ర జల వివాదాలకూ అన్వయింపచ‌వ‌చ్చు. ప్రస్తుతం విచారణ జరుపుతున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తుది నిర్ణయంగా ఎవరైనా భావించగలరా? ఎవరికి నచ్చ కున్నా సుప్రీంకోర్టు తలుపు తట్టరనే గ్యారంటీ ఏంటి? 1956 అంతర్ రాష్ట్ర జల వివాదాల చట్టం వచ్చిన తర్వాత ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులు కోర్టు మెట్లెక్కనివి తక్కువగా వున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో 2004 లో నియమించిన‌ ఇదే బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 2013 లో ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా స్టే లభించింది. ఇన్నేళ్లు గడిచినా అతీ గతీ లేదు. అదే విధంగా ఒడిషా ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రాల మధ్య మహానది జల వివాదం ఏళ్ల తరబడి నలుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఒడిషా ఆంధ్ర ప్రదేశ్ మధ్య వంశధార నది జలాల వివాదంపై నియ‌మించిన‌ ట్రిబ్యునల్ 2017 లో మధ్యంతర తీర్పు ఇచ్చింది. వంశధారపై నేరెడి వద్ద బ్యారేజీ తో పాటు సైడ్ వేర్ ను ఆంధ్ర ప్రదేశ్ నిర్మించుకోవచ్చని ట్రిబ్యునల్ అనుమతించింది.

దీనిపై 2019 లో ఒడిషా సుప్రీంకోర్టు కెక్కింది. అయినా స్టే ఇవ్వలేదు. ట్రిబ్యునల్ తిరిగి మధ్యంతర తీర్పునే 2021 లో తుది తీర్పుగా ఇచ్చింది. సుప్రీంకోర్టు స్టే లేకున్నా ఈ కేసుకు సంబంధించిన‌ తీర్పును ఇప్ప‌టివ‌ర‌కు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయ లేదు. కేవలం రూ.40 కోట్లు వ్యయం చేస్తే వంశధార నాగావళి నదులు అనుసంధానం జరుగుతుంది. అదే విధంగా కావేరి ట్రిబ్యునల్ తీర్పును కూడా చాలా కాలం నాన బెట్టి చివ‌రికి నోటిఫై చేశారు. ఇంత‌గా ఎందుకు చెప్పాల్సి వ‌స్తున్న‌దంటే ఏ రాష్ట్రానికా రాష్ట్రం తమ ప్రయోజనాలు అవసరాలు దృష్టిలో పెట్టుకుని పలు డిమాండ్లు పెడుతున్నందున ట్రిబ్యునల్ తీర్పులు వెలువడినా కోర్టు కేసుల్లో చిక్కుకొని అమలు కావడం లేదు. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ పరిస్థితి వాంఛనీయమా? తెలంగాణ ప్రభుత్వం వైఖరి చూస్తుంటే ట్రిబ్యునల్ తీర్పు తమకు అనుకూలంగా వుంటుందని భావించి జూరాల ప్రాజెక్టు ఆధారంగా పలు పథకాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ కారం చుట్టారు.

ట్రిబ్యునల్ తీర్పుతో దక్షిణ తెలంగాణ సాగునీటి సమస్యలు పరిష్కారమౌతాయనే అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో క‌లిగేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నట్లు వెయ్యి టీఎంసీల్లో 904 టీఎంసీలు తెలంగాణకు కేటాయిస్తే ఆంధ్ర ప్రదేశ్ సుప్రీంకోర్టు తలుపుతట్ట కుండా వుంటుందా? రేపు ట్రిబ్యునల్ ఏం తీర్పు ఇస్తుంద‌నేది పక్కన పెడితే వాణి వీణ కవల పిల్లలు లాగా విడదీయ లేని అనుబంధం కలిగి ఉన్న ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య సామరస్యం ఏర్పడితే తప్ప రెండు రాష్ట్రాల్లోని దక్షిణ తెలంగాణ, రాయలసీమల్లోని సాగునీటి ప్రాజెక్టులు గట్టెక్కడానికి చాలా తక్కువ అవకాశాలు వున్నాయి. రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో వ్యవహరించితేనే సంపూర్ణ పరిష్కారం లభిస్తుంది .ఎవరి మానాన వాళ్లు బతుకు తారు. బనకచర్ల అనుసంధానం కోసం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సానుకూల ధోరణిలో వుండటం మరో విశేషం. ఎంత‌టి జటిల సమస్యల‌ను సైతం చర్చల ద్వారా పరిష్కరించుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. చర్చల సందర్భంగా రెండు రాష్ట్రాలు తమ తమ డిమాండ్లను కొన్నింటిని వదులు కోవాల్సి వుంటుంది.

ఇది అంతర్జాతీయంగా కూడా అనుస‌రిస్తున్న సాంప్రదాయమే. కాని దురదృష్టమేమంటే రెండు రాష్ట్రాలు ఒక వేళ సామరస్య ఒప్పందానికి వచ్చే సమయంలో ఎంతో కొంత వదులుకొంటే ఆయా రాష్ట్రాల్లోని ప్రతి పక్షాలు పొగ బట్టే అవాంఛనీయ మైన పరిస్థితి నెలకొని వుండ‌టం! ప్రధానంగా ఇది తెలంగాణలో సుడి గాలిలా విస్తరించి వుంది. ఈ రాజకీయ సంఘర్షణలో అంతిమంగా న‌ష్ట‌పోయేది గొంతెండి పోతున్న ప్రజలు మాత్ర‌మే. అంతెందుకు? ఆ మధ్య ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెల‌కొన్న‌ వివాదాల పరిష్కారానికి అధికారులతో కమిటి ఏర్పాటు చేయ‌డానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించి వచ్చారు. కాని బిఆర్ఎస్ పార్టీ ముప్పేట దాడి మొదలు పెట్టడంతో ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు. ఈ పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సామరస్యంగా నదీ జలాల వివాదం పరిష్కారం నోచుకుంటుందని భావించడం అత్యాశే అవుతుంది. అయితే బేసిన్‌ల ప‌రిష్కారం కూడా ట్రిబ్యున‌ల్స్ తో సాధ్యం కాదు.

ప్రస్తుత పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల మధ్య మరీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం మాత్రం లేదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తను ప్రతిపాదించిన బనకచర్ల అనుసంధానానికి తెలంగాణ వేపు నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో బ్రేక్ పడింది. ఏమైనా సంప్రదింపులు ద్వారా సాధించాలని రెచ్చగొట్టే ప్రకటనలు పార్టీ నేతలు చేయ వద్దని కట్టడి చేశారు. ఫలితంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణలో తమ వాటాగా 904 టియంసిలు కేటాయించాలని చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ ఆంధ్ర‌ ప్రదేశ్ మంత్రులు ఎవరూ ప్రకటనలు చేయ లేదు. లేకుంటే ఒక చిన్న సైజ్ ప్రకటనల యుద్ధం జరిగేది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తాత్కాలిక సామరస్యం కూడా లేక‌పోవ‌డంతో విలువైన నీళ్లు సముద్రం పాలౌతున్నాయి. గత నీటి సంవత్సరంలో శ్రీ శైలం జలాశయానికి 1600 టియంసిలు నీళ్లు వచ్చాయి.

అదే సమయంలో ప్రకాశం బ్యారేజీ నుండి 860 టియంసిలు నీళ్లు సముద్రం పాల‌య్యాయి. విచారకరమైన అంశమేమంటే మార్చి నెలకే సాగర్ ఖాళీ అయింది. హైదరాబాద్ తాగు నీటి గురించి మల్ల గుల్లాలు పడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య సామరస్యం వుండి వుంటే బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 150 టియంసిలు అటు సాగర్ ఇటు శ్రీ శైలంలో క్యారీ ఓవర్ కింద నిల్వ చేసుకొని వుంటే మార్చి నెలకే వెంపర్లాడ వలసి వుండేది కాదు కదా? ఈ నీటి సంవత్సరంలో కూడా ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నుండి 700 పై చిలుకు టియంసిలు నీళ్లు సముద్రం చేరాయి. ఈ రోజు కూడా లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయి. దురదృష్టమేమంటే సముద్రంలో కలసి పోతున్న నీళ్ల గురించి పట్టించుకోకుండా ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ నీళ్లు దోచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించడమే విచిత్రం. గత నాలుగైదు నీటి సంవత్సరాల్లో ప్రకాశం బ్యారేజీ నుండి ఏటాస‌ముద్రం పాలైన నీళ్ల వివ‌రాలీవిధంగా వున్నాయి. సంవత్సరం టియంసీలు.

2018-19 39.45
2019-20 718. 16
2020-21 1278.00
2021-22 501.00
2022-23 1331.55
2023-24 53.60
2024-25 870. 00
2025-26 850.00

ఇన్ని నీళ్లు ఏటా సముద్రం పాలౌతుంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తాత్కాలికంగా నైనా సామరస్యం లేనందువ‌ల్ల తెలంగాణలో దక్షిణ ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ లో రాయల సీమ గుక్కెడు నీటికి వెంపర్లాడ వలసి వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *