ఊరికెనే వుండిపోయా

ఆకులు వాలిపోగా

కొమ్మలు పుల్లలౌతుంటే

పూలిక రావని తెలిసినా

ఊరికెనే ఉండిపోయా

ఆకాశం వాగ్ధానం యిచ్చి,  తప్పినా

వాన రానందుకు

చెరువు కాలువలో పారనందుకు

ఊరికెనే వుండిపోయా

విత్తనాల, మందుల

మల్టీనేషనల్ మర్మం తెలిసినా

పంట పెట్టుబడి రాబడి

నిష్పత్తి వైరం అనుభవించినా

నాగలి ధర్మంతో నడవక తప్పదనీ

ఊరికెనే వుండిపోయా

ఐదేళ్ళ కొకసారి బతికున్నట్లు

ఓటు హక్కు గుర్తు చేసినా

స్వర్గమేదో  కొంగుబంగారంగా

ముడివేసే హామీని తలదాల్చి,

విదిల్చి వేయబడినా

తొట్లెల్లోని కూనలకు

రేపటి ఆటలకు, పంటలకు

భూమి మిగలక సంతర్పణ అవుతున్నా

ఊరికెనే వుండిపోయా

శిక్షలెవరికో రక్షణలెవరికో చూస్తూ

రాజ్యాంగం పరిహసింప బడుతున్నా

ఆధునిక రాజకీయ మహాతంత్ర భారతంలో

ప్రజ పాచికలౌతున్నా

ప్రపంచ పటం చిత్రీకరణలో

సామాన్యుడు ఎక్కడా కనిపించకున్నా

ఊరికెనే వుండిపోయా

సిరివెన్నెల రాసిన పాటలోని

‘రక్తసైన్యం‘ ఉరకలెత్తని మనిషిలా

ఊరికెనే వుండిపోయా

దాసరాజు రామారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *