వలస పక్షులకు వరుస దాడులు

టప టపా ఆకులన్నీ రాల్తుంటే
గుండె మెలిపెట్టడమే కదా
రూపురేఖలు రంగుభేదాలు
చిక్కుల్ని తెస్తాయా  కన్నీటి
చుక్కల్ని రప్పిస్తాయా
అసాంఘిక వటవృక్షం కొమ్మవిరిగి కొండెక్కిన మరో దీపం
ఘాతుక పరంపర కొనసాగిస్తూ ఒక శార్దులం
వంచన నిచ్చెనెక్కి కలల్ని కడతేర్చిన చరిత్ర పునరావృతం
ఇది క్రూర పరిహాసం ఆగని ఘోర పరిహారం
మలిగిన పసిడి వెలుగు కథ
నలిగిన పసిమి తెలుగు కథ
చదువెప్పుడు
ఆయాచిత తీర్థం గానో
అనాయాస ఫలం గానో దొరకదు
అది ప్రయాసతో పాట్లని ప్రతిభతో మెట్లని
నేర చేతులకేం తెలుసు
స్వయంశక్తితో సరిహద్దులు దాటాడు
ఇరుగు పొరుగు కు ఆచరణీయం
స్వయంకృషితో తొలిపొద్దులు మీటాడు
ఇతరులకి అనుసరణీయం
అతనో
ప్రాతఃస్మరణీయ వ్యక్తి ప్రతిభాపాటవ స్ఫూర్తి
బడాయిపోకడల దేశమా సంస్కరణల చికిత్స ఏది
అసంబద్ధరీతుల దేశమా సమస్యల పరిష్కార దిశ ఏది
మతిలేని మితిమీరిన దేశమా
ఆటవికవైపు అడుగులేసే దేశమా
వలసపక్షులకు వరుస దాడులా
– కోటం చంద్రశేఖర్‌ 9492043348
(అమెరికాలో హైదరబాద్‌ ‌నివాసి రవితేజ పై కాల్పులు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *