హైదరాబాద్ రాష్ట్రానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం రాలేదు

18.జనధర్మో విజయతే

భారతదేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం వచ్చిందని అందరికీ తెలుసు. చరిత్ర తెలియని చాలా చాలా తరాల వారికి తెలియదు. కాని 1948 సెప్టెంబర్ 17 దాకా తెలంగాణకు, హైదరాబాద్ రాష్ట్రాలనికి స్వాతంత్ర్యం రాలేదు. యం యస్ ఆచార్యకు, ఆయన కుటుంబానికి, మిత్రులకు, చాలామంది స్వాతంత్ర్య సమరయోధులకు స్వాతంత్ర్యం రాలేదు. ఆచార్యవంటి లక్షల మందికి హైదరాబాద్ విముక్తి ఆ రోజే లభించింది. ఈ పోరాటం గురించి జర్నలిస్టు పి. బాలకృష్ణ తెలంగాణ చరిత్రలో పరిశోధించి రాసిన వాక్యాలు చదివి చెప్పాల్సిందే.

‘‘నైజాం సంస్థానంలో ప్రజలకి కనీస హక్కులు కూడా ఉండేవి కావు. గుడి కట్టాలన్నా, బడి పెట్టుకోవాలన్నా నవాబుగారి అనుమతి పొందాలి. ఒక్క సభ పెట్టుకోవాలన్నా ముందుగా నిజాం అనుమతి కావాలి. సభలో ఎవరెవరు ఏం మాట్లాడేది ముందుగానే రాసి ఇవ్వాలి. ఆ ఉపన్యాసాల్లో నిజాంకి వ్యతిరేకంగా గానీ, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా గానీ ఒక చిన్నమాట ఉన్నా సభని అనుమతించేవారు కాదు. నిజాం నోట్లోంచి వచ్చే ప్రతిమాటా ఫర్మానా అయ్యేది. నిజాంని కీర్తిస్తూ, “ఈ లోకానికి చంద్రుడూ, సూర్యుడు నైజాం నవాబే” అనే గీతాలు విద్యాలయాల్లో విద్యార్థుల చేత పాడించేవారు. విద్యాలయాలపై కూడా మిగులు ఆదాయం పొందేవారు. ప్రజల్లో విద్యావ్యాప్తి జరిగితే వారిలో చైతన్యం వస్తుంది. అన్యాయాలకీ, అక్రమాలకీ స్పందించి తిరగబడతారు. అందుకే విద్యావ్యాప్తిని ఎన్ని విధాలుగా అరికట్టాలో అన్ని విధాలుగా అరికట్టారు. విద్య అంతా ఉర్దూ భాషలోనే.

తెలుగు భాషనీ, సంస్కృతినీ నైజాం అధికారులు చులకన చేసేవాళ్ళు. ‘తెలంగి భేదంగి’ (ముక్కూ మొహం లేనిది) అని వెక్కిరించేవాళ్ళు. నైజాం కన్నా రెండాకులు ఎక్కువ చదివిన జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు కట్టాల్సిన పన్ను కన్నా రెట్టింపు చెప్పి రైతులను పీడించి పన్ను వసూలు చేసేవారు. ఆడామగ భేదం లేకుండా రైతు కుటుంబాలను చిత్రహింసల పాలుచేసేవారు. చెవులకు బరువులు కట్టేవారు. ఛాతీపై బండలు పెట్టేవారు. కాగే నూనెలో వేళ్ళు ముంచేవారు. ఆ బాధలు తట్టుకోలేక, పన్నుకట్టుకోలేక, భూమిని వాళ్ళపరం చేసేవారు రైతులు. ఇలా జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు, వేలకు వేల ఎకరాల భూమి సంపాదించారు. విసునూరు రామచంద్రారెడ్డి, జానారెడ్డి ప్రతాపరెడ్డి వంటి దేశ్ ముఖ్ ల వద్ద 30, 40 వేల ఎకరాల సాగుభూమి ఉండేది. బ్రాహ్మణులు కూడా వెట్టి నుంచి తప్పించుకోలేక పోయారు. బ్రాహ్మణులు విస్తర్లు కుట్టి జాగీర్దార్లకు ఇవ్వాల్సి వచ్చేది. ఇక ఇతర కులాల సంగతి చెప్పుకోనవసరమే లేదు….

నిజాం నవాబు సైనికులైన రజాకార్లు లెక్కలేనన్ని దుర్మార్గాలు చేశారు. ఖాసిం రజ్వి అనే ఎం. ఐ. ఎం అధిపతి, పచ్చినెత్తురు తాగిన రాక్షసుడు వీళ్ళ నాయకుడు. రజాకార్లు గ్రామాల్లో ఇళ్లల్లో చొరబడేవాళ్ళు. మానభంగాలు చేయడం ఒక నిత్యకృత్యం. టీ పెట్టాలని ఆదేశించేవాళ్ళు, పాలులేవని చెబితే ఆడాళ్ళ చనుబాలతో టీ పెట్టాలని చెప్పేవాళ్ళు’’.

1948 ఆగస్ట్ 27: నల్గొండ జిల్లా బైరాన్ పల్లి గ్రామాన్ని 400మంది రజాకార్లు చుట్టుముట్టారు. దాడులూ, హత్యాకాండ ముగిశాక దొరికిన అమాయకులైన 90మంది పిల్లలూ, యువకులు, వృద్ధుల్ని నాలుగు వరసల్లో నిలబెట్టి కాల్చి చంపేశారు. ఆ రోజున మొత్తం120మందిని వాళ్ళు హతమార్చారు.

  • నిజాంకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడని షోయబుల్లా ఖాన్ అనే జర్నలిస్టు రెండు చేతులూ నరికేశారు. తర్వాత ఆయన్ని కాల్చి చంపారు.
  • దయాళువైన ధనరాసులతో తులతూగిన నిజాం ప్రభువుల వారికి భార్యలూ, ఉంపుడుగత్తెలు, కేవలం100మంది మాత్రమే, ఇంకా ఎక్కువేనేమో!

ఈ వివరాలను ‘‘1987 నవంబర్ 9 న ‘ఉదయం’ వీక్లీ తెలంగాణ స్పెషల్ ఇష్యూగా వచ్చింది. చిత్తప్రసాద్, ఆర్టిస్ట్ మోహన్ బొమ్మలతో, పి. బాలకృష్ణ పరిశోధనా వ్యాసంతో ఆర్టిస్ట్ లేపాక్షి డిజైన్ చేసిన ఆ సంచికని పాఠకులు కొని దాచుకున్నారు. మోహన్ చొరవతోనే ఆ issue బాగా వచ్చింది. దానికి ముందుమాటగా మోహన్ ఇలా రాసాడు…. ఐదువేల మంది మన తెలుగుగడ్డ విముక్తి కోసం పోరాడి నేలకొరిగారంటే, ఈనాడు వింతగా వినేవారు కూడా ఉన్నారు అని మా ఉదయం పత్రిక జర్నలిస్టు, (ఉదయం మూసిన తరువాత అసెంబ్లీ డిపార్ట్ మెంట్ లో చేరి అంచలెంచలుగా అసెంబ్లీ సెక్రటరీ స్థానానికి పెరిగారు) శ్రీ పి. బాలకృష్ణ, వివరించారు.

బానిసలుగా బతికేది లేదని, ఎదురుతిరిగి, తుపాకీ పట్టి నేలకొరిగిన మన తండ్రులు, తాతలు, అక్కలు, అన్నలను ఈ వార్షికోత్సవ సందర్భంగా మరోసారి మనందరం తలుచుకుందాం’’. అని ఉదయం మిత్రుడు, జర్నలిస్టు తాడి ప్రకాశ్ ఉటంకించారు. (విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని నినదించిన, గర్జించిన, ఉద్యమించిన, ప్రాణాలకు తెగించిన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, మక్దుం మొహియుద్దీన్, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్యల కోసం తాడి ప్రకాశ్ రచన కోసం ఎదురుచూస్తున్నాం).

మరో జనకవి, సుద్దాల హనుమంతు రాసిన గీతం

దేశ్‌ముఖ్‌లు, జమీందారులకు వెట్టి చాకిరి చేస్తూ పసిమొగ్గలు వాడిపోతున్న బాల కార్మికుల కష్టాలను కళ్లకు కడుతూ ‘‘పల్లెటూరి పిల్లగాడా, పసులగాసే పోరగాడ అంటూ సుద్దాల హనుమంతు (డిసెంబర్, 1910 – అక్టోబర్ 10‎, 1982) రాసిన గీతం నాడు ఎన్నాళ్లో నోళ్లు పాడింది. ఉర్దూ, హిందీ, తెలుగులో ఎన్నో గీతాలు ఉద్యమానికి బాసటగా నిలిచాయి. విద్య పెద్దగా లేదు, ఆనాడు చదువుకు అవకాశాల్లేవు. వీధిబడిలో ఉర్దూ, తెలుగు భాషలు నేర్చుకున్నాడు. శతకాలు, కీర్తనలు, సీస, కంద పద్యాలు కంఠస్థం చేశాడు. బాల్యంలో యక్షగానాలు, కీర్తనలు, భజనల్లాంటి కళారూపాలంటే ఆసక్తి వుండేది. అందుకే యక్షగానాల్లో పాత్రలు ధరించారు. గొంతెత్తి పాడటం నేర్చుకున్నాడు.

చిన్నతనం నుండే నాటకాల పై ఆసక్తిని పెంచుకున్న హనుమంతుకు ప్రజా కళారూపాలైన హరికథ, బురక్రథ, యక్షగానాలే తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రచారాసాధనాలుగా ఉపయోగపడ్డాయి. ఆయన బురక్రథ చెబితే ఆనాడు గడ్డిపోచ కూడా యుద్ధానికి సిద్ధమయ్యేదని జనంలో ప్రచారం బలంగా ఉండేది. హైదరాబాద్‌ సంస్థానంలో జరిగిన అనేక అక్రమాలను, భూస్వాముల దురాగతాలను, దొరల దౌర్జన్యాలను బురక్రథల రూపంలో చాటి చెప్పారు.

ప్రజాకవి. కవిగా, కళాకారుడిగా, అంతకుమించి క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టుగా జీవితమంతా కష్టజీవుల కోసం, కమ్యూనిస్టు ఉద్యమం కోసం అంకితం చేసిన వ్యక్తి. తెలంగాణ జాతి యావత్తుని తన కవితలతో మేల్కొలిపిన మహా కవి సుద్దాల హనుమంతు. ఆయన కవితలో ఆవేశం ఉంటుంది. ఆలోచన ఉంటుంది. సామాజిక స్పృహ ఉంటుంది. ఆవేశంగా అర్థవంతంగా చేసే ఆలోచనే సుద్దాల కవిత, కవి, రవి. హనుమంతు పాటల్లో యతిప్రాసలు అచేతనంగా పడేవి. పల్లెటూరి పిల్లగాడ (మాభూమి), రణభేరి మ్రోగింది తెలుగోడ, వేయ్‌ వేయ్‌ దెబ్బ, ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, కన్నులో భగా భగా కడ్పుల్లో ధడా ధడా, భళిరె తెలంగాణ వహరె తెలంగాణ ఇలా ఎన్నో పాటలు ఆయనకు పేరు తెచ్చాయి. హనుమంతు రాసిన 22 పాటల పుస్తకం సాహితీ సర్కిల్‌ వారు ప్రచురించారు.

సుప్రసిద్ధ రచయిత, వారి కుమారుడు సుద్దాల అశోక్ తేజ 2010 అక్టోబర్ 13లో సుద్దాల ఫౌండేషన్ నడిపిస్తున్నారు. తల్లిదండ్రుల పేరుతో సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారంను ఏర్పాటుచేసి ప్రతి ఏటా ఒకరికి పురస్కారాన్ని రచయిత సుద్దాల అశోక్ తేజ. ఇది దివ్యంగా భోజనం చేసి ఇంపైన తాంబూలం తిని రాసుకున్న కవితలు కావు ఇది. కడుపులో కదిలి కోపం ఆకలి, దుర్మార్గాల మీద ఆవేశంతో సహజంగా రగిలి పుట్టిన తూటాల వంటి మాటలు ఇవి. సుద్దాల నాన్న నుంచి వచ్చిన వారసత్వం ఈ కసి కవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *