కాకతీయ కలగూర గంప – 4
హైదరాబాద్ పాత ముచ్చట్లు అంటే ఎప్పటి గురించి చెప్పాలని అనుకున్నప్పుడు 1960 దశకం చివరి సంవత్సరాల గురించి అని నిశ్చయించుకున్నాము. ఎందుకంటే 1964 నుండి భారత ప్రభుత్వం అనేక భారీ పరిశ్రమలు (బి.హెచ్.ఇ.ఎల్, హెచ్.ఎం.టి, హెచ్.ఏ.ఎల్, ఈసీఐల్), దేశ రక్షణకు సంబంధించిన రీసెర్చ్ పరిశ్రమలు (డి.ఆర్.డి.ఎల్, డి.ఎం.ఆర్.ఎల్, బి.డి.ఎల్), ఇక్రిశాట్ లాంటి వ్యవసాయ పరిశోధన సంస్థలు నెలకొల్పి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి దిశగా అతి వేగంగా పయనించే బాటలు వేసింది. ఇదే సమయంలో 1965లో హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పడిరది. దీంతో హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు వొచ్చింది. 1967లో తార్నాకాలో ‘రైల్ నిలయం’ భవన నిర్మాణంతో బాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ మొదలైంది.1970కి ముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 3 ప్లాట్ ఫారంలు మాత్రమే వుండి నాంపల్లి స్టేషన్ (6 ప్లాట్ ఫారంలు) కంటే దిగువ (2వ) స్థానంలో వుండేది. సౌత్ సెంటర్ రైల్వే జోన్ ఏర్పడ్డాక సికింద్రాబాద్ స్టేషన్ ను త్వరితగతంగా అభివృద్ధి చేసి నంబర్ వన్ గా మార్చారు.

1960 లలో హైదరాబాద్ అంటే ఆబిడ్స్, కోఠీ, నాంపల్లి, నారాయణగూడ, కాచిగూడ, ముషీరాబాద్, మలక్ పేట (ముఖ్యంగా రేస్ కోర్స్), చిక్కడపల్లి, అశోక్ నగర్, హిమాయత్ నగర్, హైదర గూడ, బషీర్ బాగ్, ట్యాంక్ బండ్, మింట్ కాంపౌండ్, దోమలగూడ, లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్, మెహదీ పట్నం, శ్యాం రావ్ నగర్, శాంతి నగర్, యూసుఫ్ గూడ, విజయనగర్ కాలనీ, మల్లేపల్లి, ఇటు బర్కత్ పూర , కాచీగూడ, నల్ల కుంట, విద్యా నగర్, అంబర్ పేట్… ఇక కవాడి గూడ, రాణిగంజ్, పాట్నీ, కంటోన్మెంట్ ఏరియా, పద్మారావ్ నగర్, సీతాఫల మండి, రాంభూపాల్ పేట్, బేగంపేట, పంజగుట్ట, ఎర్రగడ్డ, సనత్ నగర్, మారేడుపల్లి సికింద్రాబాద్ గుర్తులు. ఇక ఇటు సనత్ నగర్ దాటిన తర్వాత బాంబే రూట్ లో రైల్వేగేటు వుండేది. అంటే సిటీ లిమిట్ సనత్ నగర్ దాకా మాత్రమే అని భావించ వొచ్చు. కూకట్ పల్లిలో కూడా అక్కడక్కడా విసిరేసినట్లు ఇండ్లు. హౌసింగ్ బోర్డ్ ఇండ్లు కట్టిన తర్వాతనే కూకట్ పల్లి అభివృద్ధి చెందింది. ఇక మియాపూర్, లింగంపల్లి వగైరాలు పటంచెరువు వరకు గ్రామాలే. బిహెచ్‌ఈఎల్ మూలంగా పటాన్ చెరువు గ్రామం కొద్దిగా బెటర్. దిల్‌సుఖ్‌నగర్ అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతోంది. అది సిటీ సరిహద్దు. అటు మెహదీ పట్నం సిటీ సరిహద్దు. తర్వాత గండిపేట దాకా గుట్టలు, మిలిటరీ టెంటులు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, నౌబత్ పహడ్ లు కేవలం గుట్టలు మాత్రమే. 1964 ప్రాంతాల్లో సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు బంజారాహిల్స్ లో ఇల్లు కట్టుకున్నాడు అని తెలిసి పెదవి విరిచినారెందరో..మాసాబ్ ట్యాంక్ నుండి పంజగుట్ట చౌరస్తాకు వున్న ఒకే ఒక రోడ్డు పై జన సంచారణ అంతంతమాత్రం! ఇక అసెంబ్లీ, సచివాలయం, రవీంద్ర భారతి ఇవి సందర్శకుల ఆకర్షణ. సాయంత్రం సేద దీరడానికి ట్యాంక్ బండ్, పబ్లిక్ గార్డెన్స్‌బీ శెలవు దినాలలో ఒకరోజు విహారయాత్రకు గండిపేట.
ఇక పోతే తాజమహల్ హోటల్ లాంటివి వున్నా మసాల, కారం తెలుగు జిహ్వ కు తాకాలి కాబట్టి చిక్కడపల్లి లో వున్న స్వరాజ్య హోటల్ మంచి గుర్తింపు వున్న ఆంధ్ర శాఖాహార భోజన హోటల్. లక్డీకాపూల్ సెంటర్ లో వున్న రవీంద్ర హోటల్ పేరున్న మాంసాహార భోజన హోటల్. ఏజీ ఆఫీసు కు ఎదురుగా వున్న గోపి హోటల్ ఇడ్లీ కి ఫేమస్. అదే విధంగా నాంపల్లి స్టేషన్ రోడ్డు పై గల నియో మైసూర్ కేఫ్ గూడ. సికిందరాబాద్ లోని ఆనంద్ భవన్, ప్యారడైజ్, రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ అత్యంత ప్రాచుర్యం గల హోటల్ లు. హైదరాబాద్ నగరంలో ఆ రోజుల్లో ‘కోఠీ’ ప్రముఖ ప్రదేశం. గత శతాబ్దపు చివరి వరకూ, అంటే 2000 సంవత్సరం వరకూ హైదరాబాద్ ముఖ్య కూడలి కోఠీ. ఉమెన్స్ కాలేజీ కి ముందు అర్ధ వృతాకారపు కోఠీ బస్ స్టాండూ, అక్కడి నుండి నగరపు అన్ని మూలలకూ పోయే ఆర్ టీ సీ బస్సులు నగర జీవితపు నిత్య దైనందిక చలనానికి ప్రతీక. కాంపౌండ్ గోడతో లోపల విశాలమైన బయలు ప్రదేశంతో పాత రకపు మెజస్టిక్ బిల్డింగ్ లో నడిచిన ఆ కోఠీ తాజ్ మహల్ హోటల్‌బీ దాని కాంపౌండ్ వాల్ లోపల మూలకు మెయిన్ గేట్ దగ్గరే వున్న పాన్ షాపూ, దాని దగ్గర ప్రతి సాయంత్రం పాన్ తింటూనో, సిగరెట్లు తాగుతూనో, అక్కడే కొన్న ‘బ్లిట్జ్’ పేపర్ తిరగేస్తూనో కనబడే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ఠులో, వివిధ ఆఫీస్ ఉద్యోగులో గంటల తరబడి హస్క్ కొట్టడం ప్రజల కదులుతున్న జీవన విధానానికి సూచిక.
-శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
-పాములపర్తి నిరంజన్ రావు





