ఆవిష్కరణల హాబ్‌గా హైదరాబాద్

భ‌విష్య‌త్ భరోసాతో  పెట్టుబడుల జాత‌ర..!

దేశం ఆధునిక సాంకేతిక రంగంలో అభివృద్ధి చెంది ఎన్నో ఉద్యోగాల కల్పనకు పునాది వేసింది. రానురాను మారుతున్న కాలానికి అనుగుణంగా ఊహించినంత అభివృద్ధి లేక చతికిలపడిన పరిస్థితిలో లక్షల మందికి, ప్రత్యక్షంగా, పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తున్నది. భారత సాఫ్ట్ వేర్ సంస్థల యాజమాన్యం తమను ఎటువైపు నడిపిస్తున్నాయో తెలియ‌ని అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నారు. కాలం చెల్లిన టెక్నాలజీ కోసం పోటీపడి అందిస్తూ వొచ్చారు. భవిష్యత్ అవసరాలను గుర్తించి అవసరాలకనుగుణంగా శిక్షణ ఇచ్చి,ఉద్యోగాలను సిద్ధంగా ఉంచాల్సిన దిగ్గజాలు తమ స్వార్థంతో విస్మరించి, అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా నవీకరించడం లేదు. వర్క్ ఫ్రం హోం అలవాటు పడిన ఉద్యోగులను అప్డేట్ పేరుతో తొలగించడం యాజమాన్యాల బాధ్యతారాహిత్యం కండ్లకు కన్పిస్తున్నది.

క్లౌడ్ ఆధారిత సేవలు, బిగ్ డేటా, కృత్రిమ మేధ, బ్లాక్ చైన్, వర్చువల్ రియాలిటీ ,అగ్మెంటెడ్ రియాల్టీ, వంటి నూతన సాంకేతికతలను ఉపయోగిస్తూ అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలను సరళతరం చేస్తూ, నిర్వహణ ఖర్చులను మరింత తగ్గించాల్సిన ఆవశ్యకతను భారత సాఫ్ట్ వేర్ కంపెనీలు చాలా ఆలస్యంగా గుర్తించాయి. ఇప్పటికి ఈ టెక్నాలజీలను ఉపయోగిస్తున్న ప్రతి ప్రాజెక్టులోనూ విదేశీ కంపెనీల టెక్నాలజీ సహకారం లేనిదే ఒక్క అడుగు కూడా మన కంపెనీలు ముందుకు వేయలేదంటే అతిశయోక్తి కాదు. భారత్ కంటే చిన్న దేశాలు కూడా ఐటీ, పారిశ్రామిక విధానాలను ఒక విజన్ అమలు చేస్తున్నాయి. ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధిపై తనకున్న విజన్ తో ప్రపంచ దిగ్గజ కంపెనీలను తెలంగాణ సీఎం రేవంత్ నేతృత్వంలోని రైజింగ్ టీం రాష్ట్రానికి తెప్పించడంలో సఫలీకృతుల‌య్యారు.

ఐటీ ఆవిష్కరణల కోసం మార్గాలన్నీ రోమ్ కే దారితీస్తాయనేది యూరప్‌లో మధ్యయుగాల నాటి నానుడి.. కానీ ఇప్పుడు పరిశ్రమలన్నీ హైదరాబాద్ కు మళ్లాయి. నాడు చంద్రబాబు కాలంలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి. భాగ్యనగరం కేంద్రంగా ఆశ్చ్యర్యం కల్గించేలా అభివృద్ధి జరిగింది. ఐరోపా, ఆగ్నేయాసియా దేశాలకు తీసిపోకుండా దేశంలోని ప్రధాన మెట్రో నగరం హైదరాబాద్ అభివృద్ధి జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ మహానగరం జాతీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్శించడంలో అగ్రగామిగా నిలిచింది. ప్రపంచంలోని ఏ దిగ్గజ సంస్థ అయినా సరే భారత్ లో పెట్టుబడి పెట్టాలంటే హైదరాబాద్ తర్వాతనే రెండవ అప్షన్ ఇచ్చే పరిస్థితికి వొచ్చింది. నేడు ప్రపంచ దేశాలు హైదరాబాద్ విజయాల గురించి మాట్లాడుకునే పరిస్థితి వొచ్చింది. నాడు ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ కు ప్రశంసలు కురిపించారు. గూగుల్ లాంటి సంస్థ హైదరాబాద్ లో కార్యాలయం ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికార మార్పిడి జరిగిన తర్వాత ఐటీ రంగం సవాళ్ల‌ను ఎదుర్కొంటుందనే ప్రచారం జరిగింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సీఎం రేవంత్,  ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరణలపై దృష్టిపెట్టారు. రాష్ట్ర పురోగతిలో కీలకంగా భావించే ఐటీ శాఖకు దుద్దిళ్ల శ్రీధర్ బాబు న్యాయం చేస్తారా? తెలంగాణ తొలి ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ లాగా మాట్లాడే నాయకుడు ఎవరు? అనే సవా లక్ష ప్రశ్నలకు ఎంవోయూ చేసుకున్నపెట్టుబడులే సజీవసాక్ష్యాలు. అయినా కష్టాల నుంచి సరికొత్త ఆలోచనలు అనేవి ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు అది పుట్టుకతో, చదువుతో సంబంధంలేదు. కేవలం ఇంగ్లీష్ మాట్లాడేవారు మాత్రమే నూతన ఆవిష్కరణలు చేయగలరు అనుకుంటే అది పొరపాటే.. మొదటి ధపాలోనే వెల్లువలా పెట్టుబడులు తెచ్చి, మనదేశ ప్రతిష్ట, భౌగోళిక, రాజకీయ ప్రాధాన్యతను ప్రపంచపటంలో నిలబెట్టారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏమాత్రం గిట్టని అదానీతో సహా అనేక బడా కంపెనీలు, దేశీ, విదేశీ దిగ్గజ సంస్థలతో రూ.40,232 కోట్ల పెట్టుబడులతో ఎంవోయూ చేసుకుంది. మొట్ట మొదటిసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కృషి చేసి, విపక్షాల నోరు మూయించింది.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో తెలంగాణ రైజింగ్ బ్రాండ్ రేవంత్ ప్రభుత్వం సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో వన్ టూ వన్ సంభాషణలు చేసింది. వారి  అనుమానాలు నివృత్తి చేసి, ప్రభుత్వ విధానాలు, ఇక్క‌డి సానుకూల‌త‌ల‌ను వివ‌రించింది. రేవంత్ కలల ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలి మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకొచ్చింది. రూ.3,500 కోట్లతో ఎంఓయూ చేసుకుంది. క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ హైదరాబాద్ లో రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు  ఆస‌క్తి క‌న‌బ‌రిచింది. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం వరల్డ్ ఎకనామిక్ ఫోరం నాలుగురోజుల పాటు నిర్వహించిన దావోస్ సదస్సులో 2050 విజన్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించి 1,78,950 భారీస్థాయిలో పెట్టుబడులకు ఎంవోయూ చేసుకొని తెలంగాణ చరిత్రలో అత్యధిక పెట్టుబడులు సాధించిన ముఖ్యమంత్రిగా నిలిచారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఎంతో ఆసక్తి కనబరిచాయి.

అమెజాన్, గ్లోబల్స్ డేటా సెంటర్, సోలార్ యూనిట్, ఏఐ, బ్లాక్ స్టోన్ లాంటి కంపెనీలో దాదాపు 49,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్లిన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ లక్ష్యసాధనలో దోహదపడుతుంది. పామ్ఆయిల్ ఫ్యాక్టరీ బాటిల్ క్యాప్ తయారీ యూనిట్ ఏర్పాటుకు యూనిలివర్ కంపెనీ ముందుకొచ్చింది. ఇన్పోసిస్ విస్తరణ , క్యాపిటల్ ల్యాండ్ చేపట్టే నూతన ఆవిష్కరణ సాఫ్ట్ వేర్ హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మునుపెన్నడూ జరగని రీతిలో దావోస్ పెట్టుబడుల కుంభమేలాతో కంగుతిన్న ప్రతిపక్షం మాత్రం గత ఏడాదిలో చేసుకున్న ఏ ఒక్క ప్రాజెక్టు ప్రారంభంకాలేదని ఆరోపణలు చేస్తోంది .పైగా అనేక ఒప్పందాలు గత ప్రభుత్వం కాలంలోనినేనంటూ విమర్శలు చేయడం గమనార్హం.

image.png
డా. సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్-9866255355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *