న్యాయవ్యవస్థపై నమ్మకమెట్లా కుదిరేది!?

 గత మార్చి నెలలో దిల్లీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికార నివాసంలో భారీ స్థాయిలో కాలిపోయిన నోట్ల కట్టల ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ దృశ్యాలన్నీ ప్రముఖ టీవీ ఛానళ్ల లో ప్రసారమవ్వడమే కాకుండా అన్ని పత్రికలు పతాక శీర్షికన ఆ వార్తను ప్రచురించడంతో న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై నీలి నీడలు కమ్ముకున్నాయని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక అపనమ్మకం కలిగించే ఇలాంటి సంఘటనల గురించి ప్రజలు పలు విధాలుగా చర్చించుకునేందుకు తావివ్వడంతో పాటు ఇలాంటి సంఘటనలు అన్ని వ్యవస్థల్ని అసంతృప్తికి గురిచేస్తాయని వారు వాపోతున్నారు. సగటు పౌరుని అనుమానాన్ని నివృత్తి చేయడం ద్వారా న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని కలిగించేందుకు కేంద్రం దిద్దుబాటు చర్యలకు పూనుకుంటోంది. దానికోసం వడివడిగా అడుగులు వేస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను సంధించి జస్టిస్ వర్మను సాగనంపడానికి సిద్ధపడుతోంది.
 
       జస్టిస్ వర్మ ఇంట్లోకి ఆ నోట్లకట్టలు ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? అనే దానిపై విచారణ చేపట్టడానికి కోర్టులు అనుమతించలేదు. ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయనప్పటికీ సుప్రీంకోర్టుయే చొరవ తీసుకుని ఇన్ హౌస్ కమిటీని వేసి విచారణ చేపట్టి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. వర్మకు కీలక సూచనలు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు జస్టిస్ వర్మను దిల్లీ నుండి అలహాబాద్ కోర్టుకు బదిలీ చేసింది. ఆయన అలహాబాద్ కు వస్తే బహిష్కరిస్తామని అక్కడి బార్ కౌన్సిల్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన రావడం రిపోర్టు చేయడం జరిగిపోయినప్పటికీ కేసులు అసైన్ చేయలేదు. అలా చేయడం న్యాయవ్యవస్థపై  ప్రజల మనసులలో తొలుస్తున్న అనుమానాలకు సమాధానం కాదని పలువురు న్యాయకోవిదులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే అంశంపై ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ కూడా రెండోసారి వ్యాఖ్యానించడం ఈ సంఘటన ఎంత ప్రాధాన్యతను సంతరించుకున్నదో అవగతం అవుతున్నది.
 
     వ్యవస్థలను ప్రజలకు జవాబుదారీగా ఉంచాలనే ఉద్దేశంతోనే అభిశంసన తీర్మానం అనేది రాజ్యాంగంలో ప్రవేశపెట్టబడింది. ఈ అభిశంసన అనేది హైకోర్టు,సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పారదర్శకతపై అనుమానాలు, విమర్శలు, ఆరోపణలు తలెత్తినప్పుడు వారిని తొలగించేందుకు చేపట్టే ప్రక్రియ. ఇది చట్టపరంగా పార్లమెంటుకు ఉన్న ప్రత్యేకమైన వెసులుబాటు. ఈ ప్రక్రియను జడ్జెస్ ఎంక్వయిరీ యాక్ట్ 1968 ద్వారా చేపడతారు. లోక్ సభలో అయితే కనీసం 100మంది, రాజ్యసభ అయితే 50 మంది సభ్యులు ఈ తీర్మానం మీద సంతకం చేయాలి. రాజ్యసభ చైర్మన్ లేదా లోక్ సభ స్పీకర్ చేత నియమించబడ్డ విచారణ కమిటీ ద్వారా నివేదిక ఇవ్వబడుతుంది.  ఆ నివేదిక ద్వారా న్యాయమూర్తి దోషిగా తేలితే అది పార్లమెంటు ఉభయ సభలలో ప్రవేశపెట్టబడి మూడింట రెండో వంతు మెజారిటీతో  ఆమోదించబడితే రాష్ట్రపతి సదరు న్యాయమూర్తిని తొలగిస్తారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆ మెజారిటీ సాధించడం అధికార పక్షానికి పెద్ద కష్టమేమీ కాదని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. విపక్షాలపై ఆధారపడకుండానే అభిశంసన ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ వర్మ తీరును విపక్షాలు సైతం తప్పు పడుతుండడంతో అభిశంసనకు మరింత బలం చేకూరడం తథ్యమని విమర్శకులు సైతం విశ్లేషిస్తున్నారు. యశ్వంత్ వర్మ కేసు విషయంలో సుప్రీంకోర్టు నియమించిన ఇన్ హౌస్ కమిటీ నివేదికలో భారీ మొత్తంలో కాలిపోయిన నోట్ల కట్టల ఆధారాన్ని బలంగా పేర్కొనడంతో అభిశంసనకు మరింత మద్దతు పెరగడం ఖాయమని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
వ్యవస్థలను ప్రజలకు జవాబుదారీగా ఉంచాలనే ఉద్దేశంతోనే అభిశంసన తీర్మానం అనేది రాజ్యాంగంలో ప్రవేశపెట్టబడింది. ఈ అభిశంసన అనేది హైకోర్టు,సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పారదర్శకతపై అనుమానాలు, విమర్శలు, ఆరోపణలు తలెత్తినప్పుడు వారిని తొలగించేందుకు చేపట్టే ప్రక్రియ. ఇది చట్టపరంగా పార్లమెంటుకు ఉన్న ప్రత్యేకమైన వెసులుబాటు. ఈ ప్రక్రియను జడ్జెస్ ఎంక్వయిరీ యాక్ట్ 1968 ద్వారా చేపడతారు. లోక్ సభలో అయితే కనీసం 100మంది, రాజ్యసభ అయితే 50 మంది సభ్యులు ఈ తీర్మానం మీద సంతకం చేయాలి. రాజ్యసభ చైర్మన్ లేదా లోక్ సభ స్పీకర్ చేత నియమించబడ్డ విచారణ కమిటీ ద్వారా నివేదిక ఇవ్వబడుతుంది.  ఆ నివేదిక ద్వారా న్యాయమూర్తి దోషిగా తేలితే అది పార్లమెంటు ఉభయ సభలలో ప్రవేశపెట్టబడి మూడింట రెండో వంతు మెజారిటీతో  ఆమోదించబడితే రాష్ట్రపతి సదరు న్యాయమూర్తిని తొలగిస్తారు.
 
     ఇదిలా ఉండగా ఇప్పటివరకు అభిశంసన ప్రక్రియలు చాలా అరుదుగానే జరిగాయి. 1991లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ వి రామస్వామిపై ఆర్థిక అవకతవకల ఆరోపణలతో లోక్ సభలో 108 మంది సభ్యులచే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టబడినప్పటికీ కాంగ్రెస్  గైర్హాజరు కావడంతో ఈ తీర్మానం వీగిపోయింది.  ఆయన పూర్తి కాలం కొనసాగినప్పటికీ ఆయనకు కేసులు మాత్రం అసైన్ చేయలేదు. ఇక 2011 లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్రా సేన్ పై ఆర్థిక అవకతవకలపై రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టబడి ఆమోదించబడింది. లోక్ సభలో వోటింగ్ కు ముందే ఆయన రాజీనామా చేయడంతో ఆ వివాదం అంతటితో ముగిసిపోయింది. 2017లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి వి నాగార్జున్ రెడ్డిపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టబడినప్పటికీ కొంతమంది ఎంపీలు తమ సంతకాలను ఉపసంహరించడంతో అది కూడా వీగిపోయింది. 2018లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై రాజ్యసభలో విపక్షాలన్నీ ఏకమై రాజకీయపరమైన అభిప్రాయాలతో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టబడినప్పటికీ రాజ్యసభ చైర్మన్ దాన్ని ప్రాథమిక దశలోనే తిరస్కరించడంతో తీర్మానం ముందుకు పోలేదు.
 
ఇలా వెలుగులోకి వచ్చిన సంఘటనలు కొన్ని మాత్రమేనని చీకట్లో ఇంకా ఎన్ని ఉన్నాయోనని ప్రజాస్వామికవాదులు గుసగుస లాడుకుంటున్నారు. రాజ్యాంగ పరమైన అంశాలపై ఇటీవల దాఖలైన పలు పిటిషన్లను నామమాత్రమైనా పరిశీలించకుండానే ఆదిలోనే కొట్టివేయడాన్ని ఈ సందర్భంగా ఉటంకిస్తున్నారు. ప్రజాభిప్రాయానికి ప్రతిబింబంగా నిలిచే పార్లమెంటును సైతం న్యాయమూర్తుల నియామకంలో భాగస్వామ్యం చేయకపోవడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క స్వయం ప్రతిపత్తి అనే పేరున న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకాన్ని న్యాయమూర్తులే చేపట్టడం వల్ల పారదర్శకత లోపిస్తున్నదని, జవాబుదారితనం అడుగంటుతుండడమేకాక “అంకుల్ జడ్జ్ సిండ్రోమ్”వల్ల తమ అనుయాయులకే పెద్దపీట వేసే అవకాశం ఉన్నదని న్యాయ కోవిదులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని అధిగమించడానికి 99 వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకువచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్  తరహాలో సరికొత్త కమిషన్ ను ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉన్నదని రాజ్యాంగ నిపుణులు సైతం కోరుతున్నారు. మొత్తం మీద పూర్తిస్థాయిలో న్యాయవ్యవస్థను ప్రక్షాళన చేసి సగటు భారతీయునిలో రాజ్యాంగం పట్ల న్యాయవ్యవస్థ పట్ల గౌరవాన్ని పెంపొందించే విధంగా అడుగులు పడతాయని ఆశిద్దాం!
 
వ్యాసకర్త: భాస్కర్ యలకంటి 
సోషల్ ఎనలిస్ట్ 
చరవాణి: 8919464488

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *