పుస్తకాలు ప్రజల సంపత్తి అనీ, జ్ఞానం పంచుకోవాల్సిన ధర్మం అని విశ్వసించిన మహోన్నత గ్రంథాలయ తపస్వి, డాక్టర్ ఎస్. ఆర్. రంగనాథన్ గారు తన జీవితాన్ని గ్రంథాలయాల అభివృద్ధికి అంకితం చేశారు. షియాలి రామామృత రంగనాథన్, నామామృత అయ్యర్, సీతాలక్ష్మి అమ్మాళ్ లా తొలి సంతానం. దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం నాగపట్నం గా పిలువబడుతున్న తంజావూరు లోని ఇప్పుడు షిర్కాజి అంటున్న షియాళి అనే చిన్న పట్టణంలో 1892 ఆగస్టు 9వ తేదీన జన్మించారు కానీ అధికార పత్రాలలో ఎస్ ఆర్ .రంగనాథన్ జన్మదినం ఆగస్టు 12 అని ఉండడంతో ఆ తేదీనే “జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవం” గా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
భారతదేశంలో గ్రంధాలయ శాస్త్రంలో ఎన్నెన్నో నూతన విధానాలను ప్రవేశపెట్టి తన జీవితాన్ని గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి అంకితం చేసిన గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎస్సార్ రంగనాథన్ 133 వ జయంతి సందర్భంగా వారు గ్రంథాలయ శాస్త్రానికి అందించిన తోడ్పాటును ఒకసారి స్పందించుకుందాం.
గణితంలో పట్టభద్రుడిగా విద్యను పూర్తి చేసిన రంగనాథన్ గారు, మొదట ఒక గణిత శాస్త్రవేత్తగా తన జీవితం ప్రారంభించారు. 1921లో మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో గణిత శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలందించాడు. బోధనను ఎంతో అభిమానించే రంగనాథన్ మంచి ఉపాధ్యాయునిగా పేరు తెచ్చుకున్నారు 1924 జనవరిలో మద్రాస్ విశ్వవిద్యాలయ తొలి గ్రంథా భాండాగారిగా రంగనాథన్ ను నియమించారు. బోధన ఇష్టపడే రంగనాథన్ కు పరిపాలన వేత్తగా బాధ్యతలు స్వీకరించడం ఎంత మాత్రం ఇష్టం లేదు. ఒక్క వారంలో ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లి తన బోధనా పనిని తనకు ఇప్పించమని కోరారు . అయితే ప్రిన్సిపాల్ ఇంగ్లాండ్ వెళ్లి వచ్చిన తర్వాత కూడా అదే అభిప్రాయం ఉంటే తప్పకుండా అతనికి పాత ఉద్యోగం ఇస్తానని నచ్చ చెప్పారు.
1924లో 9 నెలల పాటు చదువుతోపాటు గ్రంథాలయాల పరిశీలన కొరకు లండన్ వెళ్ళారు అక్కడ క్రేడాన్( CROYDON) పౌర గ్రంథాలయ ప్రధాన గ్రంథ పాలకుడు, విశ్వవిద్యాలయ గ్రంథాలయ శాస్త్ర స్కూల్లో అధ్యాపకుడైన డబ్ల్యూ సి బేర్విక్ సియర్స్ వద్ద అప్రెంటిస్ గా చేరి లైబ్రేరియన్ షిప్ లో ఆనర్స్ సర్టిఫికెట్ లండన్ లోని విశ్వవిద్యాలయ కాలేజీ నుండి పొందారు .
1924 -1944 మధ్యలో మద్రాస్ విశ్వవిద్యాలయ గ్రంథ పాలకునిగా పనిచేశారు . 1945లో స్వచ్ఛందంగా పదవి విరమణ చేశారు. కానీ ఎస్ఆర్ రంగనాథన్ కు పని విరమణ జరగలేదు. బెనారస్ విశ్వవిద్యాలయ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేశారు అదేవిధంగా దిల్లీ విశ్వవిద్యాలయంలో గ్రంథాలయ శాస్త్ర బోధన చేశారు అదేవిధంగా విక్రమ్ ఉజ్జయిని విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ అధ్యాపకునిగా పనిచేశారు గ్రంథాలయాల అభివృద్ధిలో అపార అనుభవం ఉన్న ఎస్ ఆర్ రంగనాథన్ కు దిల్లీ, నాగపూర్, బాంబే, బెంగళూరు మైసూర్, అలహాబాద్ విశ్వవిద్యాలయాలు తమ తమ గ్రంథాలయాల అభివృద్ధికి సలహా సంప్రదింపులకు రంగనాథన్ ను ఆహ్వానించేవారు 1931లో మద్రాస్ విశ్వవిద్యాలయంలో గ్రంథాలయ శాస్త్ర విభాగాన్ని ప్రారంభించారు . అనేక జాతీయ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో గౌరవ అధ్యాపకునిగా, ఆచార్యునిగా సేవలందించాడు.
రంగనాథన్ గ్రంథాలయ అధికారిగా, గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకునిగా, రచయితగా సంపాదకుడిగా వివిధ పాత్రలు పోషించారు . అన్నింటికీ మించి భారత దేశ గ్రంథాలయాల అభివృద్ధికి పునాదులు వేశారు . ప్రతి చోటా గ్రంథాలయం ఉండాలనే దృష్టితో ఉద్యమం నడిపించారు. “Public Library Act” ని అనేక రాష్ట్రాల్లో ప్రవేశపెట్టేందుకు సలహాలు, మద్దతులు ఇచ్చారు. ఇతడి కృషి పట్టుదల మూలంగా మొట్టమొదటి గ్రంథాలయ చట్టం 1948 లో మద్రాస్ రాష్ట్రంలో వచ్చింది.
గ్రంథాలయ శాస్త్రం పైన ఎస్ఆర్ రంగనాథన్ 60 పుస్తకాలు మరియు రెండువేల పరిశోధక వ్యాసాలు రాసినారు . ఐదు పత్రికలకు సంపాదకత్వం వహించారు . 1931లో గ్రంథాలయ శాస్త్రానికి ఎస్సార్ రంగనాథన్ ఫైవ్ లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ (The FiveLaws of Library Science) అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పంచ సూత్రాలు(The FiveLaws of Library Science) చాలా ముఖ్యమైనవి. 1. అధ్యయనం కొరకు పుస్తకాలు 2. ప్రతి చదివరికి తన పుస్తకం 3.ప్రతి పుస్తకానికి తన చదవరి, 4. చదువరి సమయం ఆదా చేయాలి 5. గ్రంథాలయము ఒక సజీవ సంస్థ. ఈ పంచ సూత్రాలు గ్రంధాలయాలను సేవా సంస్థలు గా మలిచాయి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో గ్రంథాలయ శాస్త్రజ్ఞులను ఆకట్టుకున్నాయి.
రంగనాథన్ గ్రంథాలయ శాస్త్రానికి అందించిన మరొక విశిష్ట గ్రంథం (Colon Classification) కొలను క్లాసిఫికేషన్ 1933లో ప్రచురించిన ఈ వర్గీకరణ పథకము మొట్టమొదటి విశ్లేషణ సంయోజనాత్మక పథకం దీనిని మద్రాస్ గ్రంథాలయ సంఘం ప్రచురించింది. భారతదేశంలో 18 గ్రంథాలయాలలో సీసీ వర్గీకరణ పథకాన్ని వినియోగిస్తున్నారు.
1928లో మద్రాస్ గ్రంథాలయ సంఘాన్ని స్థాపించి మొదటి కార్యదర్శిగా ఉన్నారు 1931లో రెండు చక్రాల బండి మీద సంచార గ్రంధాలయాన్ని నిర్వహించి గ్రామీణ ప్రాంతాలకు పుస్తక సేవలు అందించారు. భారతదేశంలో గ్రంధాలయ శాస్త్రాన్ని ఒక వృత్తి విద్యా కోర్సుగా రూపుదిద్దున ఘనత ఎస్సార్ రంగనాథన్ కు దక్కుతుంది. రంగనాథన్ గారు గ్రంథాలయ శాస్త్రాన్ని బోధించే పద్ధతిని అభివృద్ధి చేశారు. భారతదేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా ఎస్సార్ రంగనాథన్ తన ప్రభావాన్ని విస్తరించారు . రంగనాథన్ భారతదేశంలోనూ, అమెరికా, పశ్చిమ ఐరోపా, జర్మనీ, కెనడా జపాన్, పోలాండ్, రష్యా మొదలగు ఎన్నో దేశాలలోని గ్రంథాలయాలను దర్శించారు .
రంగనాథన్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమైనది వారి వ్యక్తిత్వం చాలా శ్రేష్ఠమైనది వారి సేవలకు మెచ్చి భారత ప్రభుత్వం 1935లో రావు సాహెబ్ అవార్డుతో సత్కరించింది గ్రంథాలయ శాస్త్రానికి వారిచ్చిన సహకారానికి 1957లో పద్మశ్రీ తో 1965లో జాతీయ ఆచార్యునిగా సత్కరించింది. 1992 లో రంగనాథన్ గౌరవార్థం భారత ప్రభుత్వ తపాలా శాఖ ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఎస్సార్ రంగనాథన్ అనారోగ్యంతో 1972 సెప్టెంబర్ 27న మరణించారు.
ఎస్సార్ రంగనాథన్ నుండి నేటి గ్రంథ పాలకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది చిన్న పట్టణము నుండి వచ్చి ఎన్నో కష్టాలు అనుభవించిన, ఆయన ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. ఆయన సాధారణ జీవన విధానం, ఆలోచనల నుండి నేర్చుకోవాల్సింది మనము ఎంతైనా ఉంది. వృత్తి పట్ల అంకితభావం, తెలివైన విద్యార్థులను ప్రోత్సహించేవాడు చర్చల ద్వారా నూతన ఆలోచనలను సృష్టించేవారు . రంగనాథన్ వ్యక్తిత్వము నేటి గ్రంథ పాలకులకు అంతగా తెలియదు .. వారి పై ఉన్న గౌరవాన్ని తెలపడానికి ఆయన పుట్టినరోజు సందర్భంగా “జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం” జరుపుకుంటున్నాం.
ఈ రోజున ఎస్సార్ రంగనాథన్ చేసిన సేవలను స్మరించుకుంటూ గ్రంథాలయ ఉద్యోగులు, పుస్తక ప్రియులు, విద్యార్థులు అందరూ కలిసి భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో గ్రంథాలయ చట్టాన్ని సమర్థవంతంగా అమలుపరచడం, నాణ్యమైన పరిశోధనా గ్రంథాలయ ప్రచురణ, పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతో గ్రంథాలయాలను ప్రారంభించడం, సమాచార సమాజాన్ని స్థాపించడం ఇవే ఎస్ ఆర్ రంగనాథన్ కు నిజమైన నివాళులు.
(12 ఆగస్ట్,డా. ఎస్ ఆర్ రంగనాథన్ జన్మదినం సందర్భంగా)






