ప్రకృతి వైపరీత్యాలు

గిరియానం – 3

giriyanam girija” హిమాలయాలు “.. ఆ పేరు అటు ఆధ్యాత్మికతకు, ఇటు ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఆ అద్భుతమైన ఆకర్షణ ప్రకృతి ప్రేమికులను మళ్ళీ మళ్ళీ ఆ దిశగా పిలుస్తూ ఉంటుంది. నేపాల్, భూటాన్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, లేహ్ లడఖ్ ,కాశ్మీర్, చార్ ధాం, ఇలా చాలా సార్లు హిమాలయాల్లోకి వెళ్ళాను. అయినా మనసు అటువైపుగా పరుగులు తీస్తూనే ఉంటుంది. హిమాలయాల ప్రాంతాలలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం సర్వసాధారణమే అయినా నాకు ఎప్పుడూ ఆ అనుభవం ఎదురు కాలేదు. కానీ ఈ సారి వెళ్ళినప్పుడు అలాంటి అనుభవం ఎదురైంది. రెండు పగళ్ళు, ఒక రాత్రి ఎలా గడిపామో మీతో పంచు కుంటాను.

ఘంఘారియా నుంచి ఆనందంగా గోవిందఘాట్ కు చేరుకున్నాం. అక్కడినుంచి బద్రీనాథ్ కు మా ప్రయాణం. కేవలం 25 కి మీ దూరం. ఘాట్ రోడ్డు కావడం వలన ఒక గంట ప్రయాణం. సాయంత్రం బస్ బయలుదేరుతుందనగా మా బృంద నాయకుడిలో ఆందోళన మొదలైంది. కారణం ఆయన ఫోన్ కు, మరికొందరు ఫోనులలోకి వస్తున్న ప్రమాద వీడియోలు. ఉత్తరాఖండ్ లో సంభవిస్తున్న వరద ఉద్ధృతి, మేఘ విస్ఫోటన ప్రమాద చిత్రాలు, వీడియోలు, వార్తలు .. డ్రైవర్ రామ్ నివాస్ ను సంప్రదించగా .. ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదంటూ బద్రినాథ్ వెళ్లి పోవాలంటూ బస్ స్టార్ట్ చేసాడు. బిక్కు బిక్కు మంటూ ఆరుగంటలకు బద్రినాథ్ కు క్షేమంగా చేరుకున్నాం. భోరున వర్షం కురుస్తోంది. అప్పటికే మా ముందు బ్యాచి అక్కడ ఉంది . వాళ్ళు తెల్లవారి ఉదయం రిషీకేష్ వెళ్ళి పోతారట.

‘ మన ‘ గ్రామాన్ని భారతదేశం మొదటి గ్రామంగా చెపుతారు. దేశంలోకి పలు సరిహద్దులు ఉండగా ఈ గ్రామాన్ని మొదటిదిగా చెప్పడానికి గల కారణాలు తెలియదు. టిబెట్ కు 26 కి మీ దూరంలో 10,500 అడుగుల ఎత్తులో వుంది. సుమారు 500 ఇళ్ళలో 1250 జనాభాతో కూడిన చిన్న గ్రామం. భోటియా, మార్చా తెగలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తారు. సంవత్సరంలో ఆరు నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. అప్పుడు ప్రజలు దిగువ ప్రాంతాలకు వలస వెళతారు. ఇక్కడ చేతితో చేసిన పలురకాల ఉన్ని వస్త్రాలు ప్రసిద్ధి. అక్కడ గణేశ్, వ్యాస గుహలున్నాయి. సరస్వతీ నది జన్మ స్థానం కూడా యిక్కడే వుంది. పర్వత గుహల్లో ఉద్ధృతంగా ఉద్భవించిన సరస్వతీనది కొంత దూరం ప్రవహించి అలకనందానదిలో కలిసిపోతుంది.

ఉదయమే రుషికేశ్ కు బయలు దేరిన మా ముందు బ్యాచ్ రోడ్లు బ్లాక్ కావడం వలన వెనక్కి వచ్చారు. బయట వర్షం, మదిలో ఆందోళన .. నిద్ర లేచేసరికి వర్షం తగ్గిపోయింది. ఆకాశం నిర్మలంగా ఉంది . నిన్న మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిన మా ముందు బ్యాచ్ రాత్రి 11.30 ని లకు క్షేమంగా రుషికేశ్ చేరుకున్నారనే వార్త మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. మేం కూడా ఏ ఆటంకాలు లేకుండా సాయంత్రం నాలుగింటికల్లా రుషికేశ్ చేరుకుంటామనే నిర్ణయానికి వచ్చాం. ఉదయం 5.30. ని లకు బస్ బయలుదేరింది. వాతావరణం అనుకూలంగా వుంది. 9.30. వరకు జోషిమట్ దాటేశాం. అప్పుడు మొదలైంది అసలు కథ.

డ్రైవర్ బస్ ఆపేసాడు. వరుసగా వాహనాలున్నాయి. ట్రాఫిక్ జామ్ అనుకున్నాం. డ్రైవర్ ను అడిగితే.. ముందర కొండచరియలు విరిగిపడి రోడ్డు బ్లాక్ అయిందని, అది బాగవడానికి రెండు గంటలు పడుతుందని చెప్పాడు. గంటలు దొర్లి పోతున్నాయి. ఆందోళన పెరిగి పోతోంది. సాయంత్రం దాకా ఏమీ చెప్పలేమని పోలీసులు చేతులెత్తేశారు. 400 ఆర్మీ వచ్చిందని, బాగై పోతుందని మరోవైపు వార్తలు వస్తున్నాయి. ఇంకా రోడ్డు మార్గం బాగోలేదని, ఆ రాత్రికి సురక్షిత ప్రాంతాలలో ఉండే ఏర్పాట్లు చేసుకోవాలనీ తెల్లవారి ఉదయం పది గంటలకు రోడ్డు బాగయ్యే అవకాశం ఉందని సాయంత్రం ఆరు గంటలకు ఆర్మీవాళ్ళు హెచ్చరికలు జారీ చేసారు. అప్పటికే మా ముందున్న చిన్న వాహనాలన్నీ ఖాలీ అయిపోయాయి. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో

ఉన్న ‘ గరుడగంగ ‘ అనే చిన్న గ్రామానికి వెళ్ళాం. అదృష్టవశాత్తు ఆ రాత్రి తల దాచుకోవడానికి ఒక హాలులాంటిది దొరికింది. అది ప్రమాదం జరిగిన చోటుకు 13 కిమీ దూరంలో ఉంది . తెల్లవారి ఉదయమే వెళ్ళి పోవచ్చనే ఆశాభావంతో ఆ రాత్రి గడిపేసాం. ఉదయం అనుకున్న సమయానికి రోడ్డు మరమ్మత్తు కాలేదు. పెద్ద పెద్ద బండ రాళ్ళను బ్లాస్ట్ చేస్తున్నా కొద్దీ పై నుంచి మళ్ళీ బండరాళ్లు జారి పడుతున్నాయట. “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *