మెరుపు తీగెలు

హీరోయిన్‌కు సంగీతమే ప్రపంచం. తనకిష్టమైన వయోలిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో సీటు సంపాదించింది. కాని ఆ అమ్మాయి తండ్రి పెళ్ళి చెయ్యాలని నిర్ణయించాడు. హీరోయిన్ చదువు పూర్తిచేశాక పెళ్ళిచేసుకుంటానని తండ్రికి మాట యిచ్చి హైదరాబాదు వచ్చింది. హీరోకు సౌండ్ అంటే అలర్జీ. చిన్న సౌండ్ వచ్చినా భూకంపం వచ్చినట్టు ఫీలవుతాడు. సౌండ్ రాని యింజను తయారుచేయడమే అతని లక్ష్యం. సెంట్రల్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డి చేస్తున్నాడు.

సంగీతమే ప్రాణమైన అమ్మాయికీ సౌండ్ అంటే పడని వో అబ్బాయికీ మధ్య ప్రేమ యెలా పుట్టి, వొకరి బలహీనతలు మరొకరికి బలంగా యెలా మారాయో మిగతా సినిమాకథ. ఒకరినివొకరు చూసుకోకుండా దూరంగా వుంటున్న వాళ్ళమధ్య దగ్గరితనంతో వొక జంట, సహజీవనం చేస్తూ దగ్గరగా వుంటున్న వాళ్ళమధ్య దూరంతో యింకో జంట, అసలు ప్రేమ మీదే నమ్మకంలేని వాళ్ళు ప్రేమలో పడిన మరో జంట, జమిలిగా సినిమా పూర్తయ్యింది.

ఒకరి రుచులు మరొకరివి కావడం, వొకరి అభిరుచులు మరొకరివి కావడం యిదంతా సెన్సిటివ్‌గా వుంది, యిప్పటి ప్రేక్షకులకు డోస్ సరిపోదు, కామెడీ లేదు, పైగా ‘హీరోయిక్’గా చూపించడానికి యేమీ లేదని ప్రొడ్యూసర్లు అసంతృప్తిని వెళ్ళగక్కారు. హీరోకి కూడా చివరిమాట మాబాగా నచ్చింది. ఎలివేషన్ వుంటేనే తను యెలివేట్ అవుతాడని అతనూ నమ్మాడు. అందరూ కలిసి ఆ కొత్త దర్శకుణ్ణి దూరం పెట్టారు.

సినిమాలో చాలా మార్పులు వచ్చాయి. పేచీలు వేశారు. ఉన్నది తీసేశారు. లేనిది పెట్టేశారు. హీరోని ఎలివేట్ చెయ్యడానికి పాట కూడా కుట్టేశారు. సౌండ్ అంటే అలర్జీగల హీరో తన క్యారక్టరుకు విరుద్దంగా షెడ్లో గ్యాంగుతో చేరి కర్ణభేరులు చిట్లిపోయేలా తనే డ్రమ్స్ వాయిస్తాడు. ‘అదేంటి? తన క్యారక్టరుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు?’ అని ప్రివ్యూలో విమర్శ వస్తే, మొదట సినిమాటిక్కూ అవన్నీ చూడకూడదన్నారు. ఆపై సినిమా లిబర్టీ అన్నారు. ఆగక మళ్ళీ షూట్ పెట్టి హీరో చెవుల్లో దూది వుండలు పెట్టుకొని డ్రమ్స్ వాయిస్తాడు.ఆ విధంగా హీరోకయితే ఎలివేషన్ వచ్చింది. జనంకయితే పాట నచ్చింది. మొత్తానికి సినిమా అయితే అతుకుల బొంతలా వుందని ఆడాల్సింది ఆడకుండా పోయింది.
-బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *