ఆమె పరిస్థితి..గడియకో గండం..!

“మహిళలు స్వశక్తితో రాజకీయాల్లో ఎదగాలని, దానికి రిజర్వేషన్లు అవసరం అని అనేక మార్లు లోక్‌సభ, శాసనసభల్లో 33శాతం సీట్లను మహిళలకు కేటాయించడానికి ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో హెచ్.డి.దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే అప్పుడు కానీ ఆ తరువాత వచ్చిన అటల్ బిహారీ వాజపేయి, డా మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల హయాములో కానీ ఆ బిల్లు లోక్‌సభ ఆమోదానికి నోచుకోలేదు. అలాగే 2014లో ఏర్పడిన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండానే లోక్‌సభ గడువు ముగిసింది.మోదీ  రెండవసారి  ప్రధాని అయినా తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ‘నారీ శక్తి వందన్ అధినీయమ్’  అమలుకు నోచుకున్నా  జనగణన, డీలిమిటేషన్ తో ముడిపడడం మహిళా లోకాన్ని నిరుత్సాహపరిచింది. “

డాక్టర్ సంగని ల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్ – 9866255355

సమాజాభివృద్ధికి సామాజిక జీవనం ప్రతిపాదిక అయితే, కాలం తెచ్చిన మార్పునకు మహిళా జీవితం మచ్చుతునక. సమాజంలో సగభాగమైన మహిళల స్థితిగతుల క్రమం సమాజ ఉన్నతికి గీటురాయిగా పరిగణిస్తూ ఎన్నో దశాబ్దాలుగా ఉద్యమాలు జరిగాయి. ఇప్పటికి జరుగుతున్నాయి. సాంస్కృతికంగా స్త్రీకి ఉన్నత స్థానం ఇచ్చిన ఈ  సమాజంలోనే సామాజిక జీవనంలో వివక్ష ,అణచివేతలు వివిధ రూపాల్లో నేటికీ కొనసాగుతుండడం బాధాకరం. పుట్టడానికి వివక్ష ,బతకడానికి వివక్ష.. ప్రేమోన్మాదుల వికృత చేష్టలకు కాలిన ముఖాలు, నాలుగు గోడల మధ్య కుములుతూ రోదిస్తూ.. గుండెనిండా విషాదాన్ని నింపుకొని గడిపే బాధిత తల్లుల ఆర్తనాదాలు చూస్తే మరమనిషికి తప్ప మనసున్న మనిషికి గుండె చెదారాల్సిందే. ఈరోజు స్త్రీలు అంటే వంటింటి కుందేలు కాదు ఆకాశంలో సగభాగంగా నడిపిస్తున్న అద్భుత శక్తి . శాస్త్ర,సాంకేతిక రంగాల అభివృద్ధిని అందిపుచ్చుకున్న అత్యుత్తమ శిఖిరాలు అధిరోహించిన మహిళా మణులెందరో పురుషులకు ఏ రూపంలోనూ తామేమి తక్కువ కాదని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. వ్యాపార దక్షతలోనూ రాజకీయాల్లోనూ, మీడియా రంగంలో తమ సామర్థ్యాలతో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.ఆధునిక సామజిక జీవనం మహిళల స్వేఛ్చకు ,సాధికారతకు ఎంతగా తోడ్పడిందో ,అంతగా సమాజం నుండి సహకారం అందకపోవడంలోనూ సంక్లిష్టత ఓ ప్రతిబంధకంగా ఉన్నది. ఈ నేపథ్యం నుండి సామాజిక అభివృద్ధి లో మహిళ స్థానం ప్రశ్నర్థకం అయింది.

సమాజంలో ఆర్థిక,రాజకీయ,సామాజిక రంగాల్లో సమానావకాశాలు హక్కుల కోసం క్లారా జెట్కిన్ నేతృత్వంలో నినదించిన ఉద్యమానికి 116 సంవత్సరాలు మహిళలపై హింసను తుద  ముట్టించే కార్యాచరణకు సమయమిదే అని ఐక్యరాజ్య సమితి వేదికగా పిలుపునిచ్చినేటికి 13 ఏళ్ళు . మానవ అభివృద్ధి చరిత్రలో స్త్రీ నిర్వచించిన పాత్ర ఎంతటి ఘనమైనదో అందరు చెబుతున్నదే ఒప్పుకోక తప్పదు. కానీ, ఆచరణలోకి వచ్చే సరికి ఇప్పటికి చాలా చోట్ల వివక్ష ,అణచివేతలు ,నిర్బంధాలు కొనసాగుతున్నాయి . ప్రాంతాలు,దేశాల సరిహద్దుల ప్రమేయం లేకుండా ఏకరీతి విషయం ఏదైనా ఉన్నదంటే అది మహిళలపై జరుగుతున్న వివక్ష అణచివేతలే ,హింసా, దౌర్జన్యాలే. ఎలాంటి అనుమానం లేదు.ఇప్పటికీ  స్త్రీ ,పురుషుల వేతనాల్లో వ్యత్యాసం,చిన్నచూపూ ఎక్కడో వెనుకబడ్డ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కాదు, అత్యంత ఆధునిక వృత్తి కార్యకలాపాల్లో కూడా కొనసాగుతున్నాయని ‘మాన్ స్టర్ స్లరీ ఇండెక్స్ తన అధ్యయనాల్లో వెల్లడించింది. మానుఫ్యాక్చరింగ్ ,ఐటీ రంగాల్లో స్త్రీ,పురుషుల మధ్య వేతనాల భేదాలు ,ప్రమోషన్స్ లో వివక్ష కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మానుపాక్చరింగ్ రంగంలో 30 శాతం ఉంటే 15 శాతం ఐటీ రంగంలో ఉన్నది. అంటే శాస్త్ర ,సాంకేతిక రంగాల అభివృద్ధి పెరగడంతో పాటు, కాలం మారుతున్నా కొద్దీ వేతన వ్యత్యాసం పెరిగిపోతున్న తీరు మన సమాజం పురుషాధిక్యత అమానవీయత ఒంటినిండా నింపుకున్నది .

రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించే బిల్లును ఆమోదించడానికి ప్రయత్నించితే కుట్రపూరితంగా ఆయా రాష్ట్ర అసెంబ్లీలు రిజర్వేషన్లు  వ్యతిరేకించాయి. నాడు   కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పంచాయతీలు, స్థానిక సంస్థల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలనే రాజీవ్ ఆకాంక్ష నెరవేర్చి చట్టబద్దత కల్పించారు. అదే స్పూర్తితో రేవంత్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని అని,గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మహిళలను యజమానులుగా చేసారు.తెలంగాణ ప్రభుత్వం మహిళలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలోని మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇప్ప‌టికే బ‌స్సుల కొనుగోలు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు,డ్వాక్రా బ‌జార్ల ఏర్పాటులాంటి వాటికి శ్రీకారం చుట్టింది.ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ పథకం విజయవంతమైందని, మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు ఇప్పుడు వారిని మరింత ఆర్థిక స్థిరత్వం దిశగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. అందుకే వారితో బస్‌లు కొనుగోలుచేయించి  ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా కొత్త ఆలోచన చేసింది. గతంలో ప్రైవేటు వ్యక్తుల బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకునేవాళ్లు. నేడు మహిళా సంఘాలు వాటిని అందజేస్తున్నాయి. ఈ పథకం మహిళా సాధికారతకు, సామాజిక భద్రతకు అండగా నిలుస్తుంది.మహిళా సమాఖ్య ఖరీదు చేసిన ప్రతి బస్సుకు నెలకు రూ.69,648 అద్దె చెల్లిస్తుంది.వారికి స్థిరమైన ఆదాయం కూడా లభిస్తుండడం కోటీశ్వర్లను చేసే తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యం దిశగా పయనించడం ముదావహం.

మహిళలు స్వశక్తితో రాజకీయాల్లో ఎదగాలని, దానికి రిజర్వేషన్లు అవసరం అని అనేక మార్లు లోక్‌సభ, శాసనసభల్లో 33శాతం సీట్లను మహిళలకు కేటాయించడానికి ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో హెచ్.డి.దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే అప్పుడు కానీ ఆ తరువాత వచ్చిన అటల్ బిహారీ వాజపేయి, డా మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల హయాములో కానీ ఆ బిల్లు లోక్‌సభ ఆమోదానికి నోచుకోలేదు. అలాగే 2014లో ఏర్పడిన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండానే లోక్‌సభ గడువు ముగిసింది.మోదీ  రెండవసారి  ప్రధాని అయినా తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ‘నారీ శక్తి వందన్ అధినీయమ్’  అమలుకు నోచుకున్నా  జనగణన, డీలిమిటేషన్ తో ముడిపడడం మహిళా లోకాన్ని నిరుత్సాహపరిచింది. ఇప్పటికి లోకసభ 543గాను 74 మంది మహిళా పార్లమెంట్ కు 13.6శాతం ఎంపిక కావడం, 41మంది రాజ్యసభకు 16.9శాతం ఎంపిక చేసారని గణాంకాలు చెపుతున్నాయి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 ,మహిళా హక్కుల పోరాట దినంగా పాటిస్తూ, సమస్త రంగాల్లో స్త్రీకి సముచిత భాగస్వామ్యం కల్పించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వాలపై ఉంది.  సామాజిక అవగాహనలో మార్పు తీసుకొచ్చేందుకు సమాజమంతా కదలాల్సి ఉన్నది. నానాటికి పెరిగిపోతున్న లైంగికదాడులను, హింసాదౌర్జన్యాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. ఇన్నాళ్లు వివక్షకు గురైనా మహిళాలోకం రాజకీయ పురోగతి సాదించాలంటే చట్టబద్దత అయిన 33 శాతం మహిళా రిజర్వేషన్లలో సామాజిక న్యాయం పాటించాలి.

డాక్టర్ సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్ – 9866255355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *