ఆమె..
తన గతానుభవాల పునాదిపై
వర్తమానపు విశ్లేషణతో
ఆశలను నిత్యనూతనం చేసుకుంటూ
ఆచితూచి భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నది..
నడిచే దారిలో ఎదురయ్యే ముళ్ళు రాళ్ళ అవరోధాలను అధిగమిస్తూ అలుపెరుగని బాటసారియై తన గమనాన్ని నిర్దేశించుకుంటున్నది..
అడుగడుగునా అవమానాల నిప్పురవ్వలు ఉవ్వెత్తున ఎగజిమ్ముతున్నా
తట్టుకొని తలెత్తుకొని నిలబడి తన ఉనికిని చాటుకుంటున్నది..
అంతరంగంలో ఉద్వేగాల కన్నీటి కడలి పొంగి పొర్లుతున్నా
పడిలేచే కెరటమై తీరం చేరుకుంటున్నది..
మనసు పొరల్లో నల్లని మబ్బులు కమ్ముకుంటున్నా
ధైర్యమే ఆయుధంగా ఆశయ సాధనకై అహర్నిశలూ శ్రమిస్తున్నది..
చుట్టూ చిమ్మ చీకట్లు అలుముకుంటున్నా
చిరునవ్వుల దీపాలతో వెలుతురు దారులను వెతికి పట్టుకుంటున్నది..
నిరాశా నిస్పృహలు నిలువరిస్తున్నా
త్యాగాల గాయాలతో రాటుదేలిన ఆమె
నిరంతర చైతన్యం తనదంటూ
మానవత్వపు పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లుతున్న ది..
తరతరాల అణచివేత చర్యలను నిరసిస్తున్నది..
అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నది..
ఆశయ సాధనకై ఉద్యమిస్తున్నది..
తనకు తాను ఊహల రెక్కలకు వ్యూహాలతో ఊపిరి పోసుకొని ఎదుగుతున్నది..
విశ్వమంతా విహరిస్తున్నది..
ఆత్మవిశ్వాసంతో విస్తరిస్తున్నది..
ఆగని సమరం తనదంటూ
సమానత్వ లక్ష్యం వైపు సాగుతున్నది..
సాగిపోతూనే ఉంటుంది!!
(-అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో..)
డా.కొమర్రాజు రామలక్ష్మి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *