ఘాటైన విమర్శలు, వేడైన చురకలే యం యస్ ఆచార్య పరిచయం

“తాను సంపాదకత్వం నిర్వహించే జనధర్మ, వరంగల్‌ వాణి పత్రికల్లోని ఆయన సంపాదకీయ రచనలనిండా వ్యాపించి కన్పించే వ్యక్తిత్వ స్వరూపమే వేరు. అక్కడ ఏ అక్షరంలోనూ దైన్యం ఉండదు. అసామాన్యంగా సామాన్యత్వం ప్రస్ఫుటమపుతుంది. ఋజుత్వం కొట్టవచ్చినట్టు కన్పిస్తుంది.  అసిధారావ్రతంగా సాగిన శ్రీ ఆచార్య సంపాదక రచనలు లలిత పదవిన్యాసంతో సాగుతూనే, పదునుగా, భావ గాంభీర్యంతో, బిగువయిన రచనా సంవిధానంతో, కర్తవ్య భావనిష్ఠతో, ఏ వెరపూ లేని ధీరత్వంతో నిండి, సామాజికరంగంలో చీకాకుపరిచే రకరకాల సమస్యల చీకటి వలయాలను ఛేదించే వెల్తురు కత్తులు. సహానుభూతిని అనుభవించలేని కఠోర హృదయాల్లో కస్సున గుచ్చుకొనే వాడి వాటిలో ఉంది.”

45 జనధర్మో విజయతే

యం యస్ ఆచార్య సంపాదకీయాలు (జనదర్మ వరంగల్ వాణి) పుస్తకం 1988న ప్రచురించారు. అభినందన సంచికతోపాటు కొన్ని ఎంపిక చేసిన ఆచార్య సంపాదకీయాలను కూడా ప్రచురించారు. ఆచార్యజీవిత వివరాలు సేకరించడం ఒక ఘన కార్యమే. అందులో సిద్దంగా ఉన్న సంపాదకీయాలు తెచ్చుకోవడం సాధ్యమే కాని, వందలాది సంపాదకీయాలనుంచి కొన్ని ఎంపిక చేయడం మరో ఘన కార్యమే అవుతుంది. మొహమాటలేవీ లేకుండా వాయించ గలిగిన సాహసులు చాలా తక్కుమంది ఉంటారు. వారిలో మొదటి వారు, పాములపల్లి సదాశివరావు, యం. యస్ ఆచార్య అయితే, మూడో వ్యక్తి ఇందుర్తి ప్రభాకర్  ప్రముఖ రచయిత, జర్నలిస్టు. వి ఎల్ నరసింహారావు జర్నలిస్టు మరో అటువంటి మహానుభావుడు. ఈ నలుగురూ ఇప్పుడు లేరు. గుర్తించుకోవలసిన పెద్దలు. ఆచార్య అభినందన సంచిక ప్రచురించాలంటే ‘నాకెందుకీ సన్మానం’ అంటాడు ఆచార్య గారు. ‘‘నువ్వెవవరు నన్ను అభినందించడానికి, ఆ అభినందనలు సన్మానాలు చేయించుకోవడానికి నేనెవరు’’, అటు ఆచార్య ఇటు ప్రభాకర్.

సంపాదకీయాలలో ‘జనధర్మ’ వికాసం: ఇందుర్తి ప్రభాకర్  

జెపిఎన్ రోడ్ పై కీలకమైన సమావేశ వేదిక బాలాజీ ప్రింటింగ్ ప్రెస్. అది ఆచార్య మిత్రుడు బేతి నర్సయ్య గారి (వారి కుమార్తె, కుమారులకు వారసులని అనుకుంటునున్నాను) పెద్ద ఇల్లు.  పెద్ద హాల్ లుమూడు ఉంటాయి. అందులో ఒకటి పక్కన ఆఫీసు అంటే ఒక కుర్చీ, ఎదుట ఒక సోఫా. ఆ సోఫాలో మెత్తటి భాగం పాడిపోతే దానిమీద ప్లై వుడ్ ముక్క అతికి మొలలు కొట్టి కూచోవడానికి వీలుంటుంది. అదొకటే ఉంటుంది. మిగతావాళ్లంతా నిలబడవలసిందే. ఏం చేద్దాం జాగ ఉండదు. దర్వాజ తెరవగానే చిన్న ప్రెస్ ఉంటుంది. తను ఒకరు బలంగా తొక్కడం ద్వారా ప్రింటింగ్ చేసే స్థలం అది. పెద్ద చప్పుడు వస్తూ ఉంటుంది. ఆచార్య గారి కుర్చీ, అటుపక్కన కంపోజ్ చేసుకునేందుకు పెద్ద బల్లలు అయిదో ఆరో సెట్ లు ఉండేవి. అక్కడ నుంచి రెండో హాల్. అందులో మరో పది పన్నెండు కంపోజ్ సెంటర్ సెట్ లు ఉంటాయి. అక్కడే మేకప్ చేసే గ్యాలీలు ఉంటాయి. ఈ మూడు హాల్ చాలా విశాలంగా ఎత్తుగా ఉంటుంది. అందులో కొన్నాళ్లు దినపత్రిక ప్రారంభించేందుకు ఈ రెండు హాల్ ల పైన రెండో అంతస్తులు చెక్కతో తయారు చేసారు. జాగ్రత్తగా ఎక్కి పైన కంపోజ్ చేసే సెట్ లు పక్కనే టెలిప్రింటర్ అమర్చారు. ఆ తరువాత మూడో హాల్ లో అక్కడ పెద్ద ప్రెస్ (రెండు చిన్న పేజీలు ప్రింట్ చేస్తారు), కొన్నాళ్ల తరువాత వార్ ఫెడల్ తెచ్చారు.

అందులో రెండు దినపత్రికలు ఒకే సారి ప్రింట్ చేసే పెద్ద మెషిన్. అక్కడే ప్రింట్ అయిన తరువాత నల్ల రంగు (ఇంక్) కడిగే ప్రాంతం. మూడో హాల్ ఉంటుంది, దాని పక్కనుంచి తలుపు తెరిస్తే  నివాసపు రెండు గడులు,  ఆ తరువాత మరో మూడు గదులు, ఒక అర్రలో సోదరులు, చెల్లె, పక్కన అమ్మా నాన్న, దాని పక్కన వంట ఇల్లు. ఆ మూడు గదుల ముందు ప్రాంతంలోనే కార్యక్రమాలు ఆటలు, క్యారెంబ్ బోర్డ్ వగైరా పనులు ఉండేవి. ఈ మూడు హాల్స్ పక్కన సన్నటి సందు, అక్కడనుంచి దారి ద్వారా ఇంటికి పక్కనుంచి వెళ్లే దారి ఉండేది. విశేషం ఏమిటే మంచి నీళ్లకోసం నాలుగడుగుల లోతు నీళ్లు పట్టుకునే మెట్లు. అక్కడ నీళ్లు పట్టుకుని వంట ఇల్లు దాకామోసుకుని వెళ్లడం తప్పదు. పక్కనుంచి జాగ్రత్తగా నడుస్తూ ఇంటి ప్రాంతానికి చేరవచ్చు. అక్కడితో ఉన్న ఆ స్థలంలో న్యూస్ ప్రింట్ కాగితం కట్టలు ఒకదాని మీద మరొకటి చొప్పున పైదాకా నిలబెట్టేవాళ్లం. అంటే పక్కనుంచి నడవాలన్నమాట. అక్కడ ఆచార్యగారిని బంధువులు రాగానే, నాకు పని ఉంది, మీరు పక్కనుంచి ఇంటికి వెళ్లండి అని పంపేవారు. మరో మాట వినే పరిస్థితిలేదు. వినరు. మంచినీళ్ల గుంట, నడక, పక్కనుంచి కాగితం కట్టలు. అవి దాటితే ఇల్లు. విచిత్రమైన ఇల్లు.

కాళోజీ, పాములపర్తి, పల్లా రామాయకోటార్య, సుప్రసన్న

1971 నుంచి 1994 దాకా ఇదే ప్రెస్, ఇల్లు. అక్కడ ప్రభాకర్ అటు ఆచార్య ఇటు, ప్రేమతో నిండిన నా గొడవ. దాదాపు మూడురోజులకోసారి కాళోజీ, మిమిక్రీ వేణుమాధవ్ పల్లా రామకోటార్య, సుప్రసన్న, సంపత్కుమార, జగదీశ్వరరావు, వి ఎల్ నరసింహారావు, అప్పుడప్పుడు పాములపర్తి సదాశివరావు, బిట్ల నారాయణ వంటి పెద్దలు ఇక్కడమాట్లాడుకునే వారు. అక్కడ గొడవ, నాకెందుకు సన్మానం, అభినందన, ఏం సాధించనట్టు. దానికి ప్రభాకర్ జవాబులు. వారికి తోడుతో వెలిశాల కనకయ్యగారు, మరికొందరు మిత్రులు వాదించేవారు. మొత్తానికి వాదన ముగిసి, అభినందన సంచికలో జీవిత విశేషాలు సేకరించాలనీ, మరో పుస్తకంలో ఆచార్యగారి సంపాదకీయాలను ఎంపిక చేసినవి, వర్గీకరించి ప్రచురించాలని ఒప్పందం కుదిరింది. ఆ పని చేయడానికి ప్రభాకర్ గారు. వారికి సాయం చేయడానికి ఈ రచయిత ఇంటర్వ్యూలు చేయడం ద్వారా ఆచార్యజీవిత విషయాలు సేకరించేది. ఇందుర్తి ప్రభాకర్ ఈ సంపాదకీయాలను సేకరించి ఎంపిక చేసే పని స్వీకరించారు. ఆ కమిటీకి సంపాదకుడిగా ఇందుర్తి ప్రభాకర్ రాసిన కొన్ని సంపాదక వ్యాసాలు పేర్చారు.  ఈ రెండు పుస్తకాలు లేకపోతే ఇందుర్తి లేకపోతే, యం యస్ ఆచార్య జీవిత పుస్తకం లేదన్నట్టే. ఈ కుటుంబంవారికి ముఖ్యంగా ముగ్గురు పిల్లలకు (రెండో పిల్లవాడు ఈ రచయిత) ఏమీ తెలిసి ఉండేది కాదు.

వరంగల్లు గడ్డ

చారిత్రిక, సాంస్కృతిక ప్రాధాన్యం అవిరతంగా సంతరించుకొన్న ఈ వరంగల్లు గడ్డ అలనాటి నుండి నేటి దాకా ఎందరెందరో కవులనూ, భక్తులనూ, పండితులనూ రచయితలనూ, ఉద్యమవీరులనూ, రాజకీయవేత్తలనూ, మేధావులనూ దేశానికి సగర్వంగా అందించింది. అట్లాంటి ఈ గడ్డ మీద వర్తమాన సామాజిక జీవితంలో పండిత సామాన్య కుటుంబంనుంచి ఉదయించి కేవలం స్వయంకృషితో ప్రశస్త స్థాయికి తానెన్నుకొన్న పత్రికారంగంలో ఎదిగిన మేధావి శ్రీ యం. యస్‌. ఆచార్య. వ్యక్తిగా వ్యక్తిగా ఆయనలో కన్పించే సామాన్యత్వం, నిరాడంబరత్వం, అమాయకత్వం, మెత్తదనం. ఆయన కలంలో, ఆయన రచనల్లో ఏ మాత్రం కన్పించవు. తాను సంపాదకత్వం నిర్వహించే జనధర్మ, వరంగల్‌ వాణి పత్రికల్లోని ఆయన సంపాదకీయ రచనలనిండా వ్యాపించి కన్పించే వ్యక్తిత్వ స్వరూపమే వేరు.

 అక్కడ ఏ అక్షరంలోనూ దైన్యం ఉండదు. అసామాన్యంగా సామాన్యత్వం ప్రస్ఫుటమపుతుంది. ఋజుత్వం కొట్టవచ్చినట్టు కన్పిస్తుంది. అసిధారావ్రతంగా సాగిన శ్రీ ఆచార్య సంపాదక రచనలు లలిత పదవిన్యాసంతో సాగుతూనే, పదునుగా, భావ గాంభీర్యంతో, బిగువయిన రచనా సంవిధానంతో, కర్తవ్య భావనిష్ఠతో, ఏ వెరపూ లేని ధీరత్వంతో నిండి, సామాజికరంగంలో చీకాకుపరిచే రకరకాల సమస్యల చీకటి వలయాలను ఛేదించే వెల్తురు కత్తులు. సహానుభూతిని అనుభవించలేని కఠోర హృదయాల్లో కస్సున గుచ్చుకొనే వాడి వాటిలో ఉంది. సమస్యల చలిలో సతమతమయ్యే సామాన్యులకవసరమయిన వేడి ఉంది. అని ఈ సంపాదకీయాల పుస్తకానికి ఇందుర్తి ప్రభాకర్ ఎడిటర్ గా రచించిన మాటలు ఇవి. (జనదర్మ, వరంగల్ వాణి యం యస్ ఆచార్య సంపాదకీయాల పుస్తకం నుంచి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *