రాష్ట్ర వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల చివరి రోజున జరుపుకునేదే విజయదశమి (దసరా). దసరా దుర్గాదేవి ని శక్తి రూపంలో ఆరాధించే పండుగ. భారతీయ సంస్కృతిలో పండుగలు అతిముఖ్యమైన భాగం. మన దేశం ప్రధానంగా ఆద్యాత్మికతకు పుట్టినిల్లు. మన పండుగల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం విషయానికొస్తే ఇక్కడ జరుపుకునే అన్ని పండుగల్లో కెల్లా అత్యంత ఆడంబరంగా, సంబరంగా జరుపుకునేవి బతుకమ్మ, దసరా ప్రధానమైనవి. దసరా అన్నది దశ రాత్రి మాటకు రూపాంతరంగా చెబుతారు.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులను ఘనంగా నిర్వహించిన తర్వాత పదవ రోజున విజయదశమి పేర దసరా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజులు తీరొక్క పేరుతో అమ్మవారిని అలంకరిస్తారు. జగన్మాత అయిన దుర్గాదేవి ఈ తొమ్మిది రోజులు మహిషాసురుడనే రాక్షసుడితో యుద్ధం చేసి ఆశ్వయుజ నవమి నాడు వధించి విజయాన్ని సాధించడంవల్ల ఆ రోజును విజయదశమి గా ప్రజలు వేడుకలు చేసుకోవడమన్నది ఆనవాయితీ… అయితే దీనికి మరో కథ కూడా ఉంది.
శ్రీరామచంద్రుడు లంకాధిపతి అయిన రావణాసురుడి ని సంహరించి విజయాన్ని సాధించింది కూడా ఇదే రోజునే అంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతీ విజయదశమి రోజున రావణుని ఆకృతి గల దిష్టి బొమ్మలను దగ్దం చేయడమన్నది ఆచారంగా వొస్తున్నది. అందుకే రాక్షస సంహారానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటారు. ఈ రెండు విషయాల్లో కూడా చెడుపైన ఎప్పటికైనా మంచి విజయాన్ని సాధిస్తుందన్నది స్పష్టం. అందుకే ఈ రోజును విజయదశమి గా పిలుస్తారు. ఇది కేవలం ఏదో ఒక ప్రాంతంలో మాత్రమే జరుపుకునే పండుగ కాదు. దేశ వ్యాప్తంగా వేడుకగా జరుపుకుంటారు. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రీతిన ఉత్సవాలను నిర్వహించుకుంటారు. ముఖ్యంగా దసరా అనగానే మనకు గుర్తుకు వొచ్చేది మైసూరు. మైసూరు ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహించే ఉత్సవాలకు తలమానికంగా ఉంటాయి. ఇక్కడి ఉత్సవాలకు వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ఇక్కడ జరిపే ఉత్సవా)ను తిలకించేందుకు దేశ విదేశాలకు చెందినవారు అనేకులు వొస్తుంటారు.
దసరా రోజున జమ్మి చెట్టును పూజించడం కూడా ఆచారంగా వొస్తున్నది. దీనికి కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. పాండవులు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేస్తున్న క్రమంలో వారి ఆయుధాలను ఒక జమ్మిచెట్టు మీద కట్టిపెట్టారు. దాన్ని ఇతరులెవరైనా చూస్తే అది శవాకారంగా కనిపిస్తుంది. ఆ ఆయుధాలను అరణ్యవాసానంతరం పాండవులు తిరిగి తీసుకుని, ఉత్తరగోగ్రహణాన్ని జయిస్తారు. అనంతరం కౌరవుల పైన యుద్ధం చేసి విజయం సాధిస్తారు. ఈ శమీ వృక్షానికి పూజలు చేసి తమ ఆయుధాలతో పాండవులు విజయాలు సాధించడాన్ని విజయ సంకేతంగా తీసుకుని దసరా రోజున శమీ(జమ్మి) వృక్షం వద్ద ‘శమీ శమయతేపాపం, శమీ శత్రు వినాశనకరం, అర్జునస్య ధనుర్దారి, రామస్య ప్రియదర్శినీ’ అంటూ పూజించడమన్నది ఆనవాయితీ… ఊరు బయట జమ్మి వృక్షం దగ్గర పూజలు చేసిన అనంతరం, జమ్మి ఆకులు, అక్షింతలు ఒకరికొకరు ఇచ్చుకోవడం విజయానికి సూచనగా భావించి శుభాకాంక్షలు చెప్పుకోవడమన్నది నేటికీ ఆచారంలో ఉంది.
-ప్రజాతంత్ర డెస్క్





