గుయిలిన్ ప్రకృతి సౌందర్యాలు

“ఆర్మీ జనరల్ పార్కుకు వెళ్లాము. లోపలికి వెళ్ళగానే నన్ను ఆకర్షించింది ఒక పెద్ద పాట్. అక్కడ ఫోటో తీసుకొని దీనికి సంబంధించిన వివరాల కొరకు వెతికాను. ఒక వైపున ఆ వివరాలున్న బోర్డు కనిపించింది. దాని ప్రకారం.. దానిని థౌజండ్ మెన్ పాట్ అంటారు. దాని శిల్ప నిర్మాణాన్ని బట్టి అది క్రీ.శ.1663 లో క్వింగ్ రాజ వంశీయుల కాలం నాటిది. ఆ రోజులలో డైకాయ్ కొండమీదున్న డింగ్వ్యు దేవాలయంలో ధూపం వెలిగించడానికి ఉపయోగించే వారని చరిత్ర చెప్తుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ దళాలు ఆ దేవాలయాన్ని శిధిలం చేసాయి. ఆది ఒకటిన్నర మీటర్ల వెడల్పు , 0.8 మీటర్ల లోతు,  1000 కిలోల బరువుతో ఎంతో అందంగా ఉంది . దాని పైన కొన భాగంలో చైనా లిపిలో రాసిన శాసనాలు ఉన్నాయి.”

 గిరియానం – 9

చైనా ప్రయాణంలో భాగంగా రెండు రోజుల జియాన్ నగరంలోని వింతలు, విశేషాలన్ని చూసుకొని మేం గుయిలిన్ కు వెళ్ళాము. ఉదయం 7.45 మా ఫ్లైట్. బ్రేక్ ఫాస్ట్ ప్యాక్ చేసుకొని ఎయిర్ పోర్టుకు చేరుకున్నాము. చెక్ ఇన్ బ్యాగులో పవర్ బ్యాంకులు అనుమతించక పోవడం అందరికీ తెలిసిన విషయమే.. కానీ అసలు పవర్ బ్యాంకులు  తీసుకు వెళ్ళడానికి అక్కడ అనుమతించలేదు.  CCC ఈ మార్కు ఉన్న  పవర్ బ్యాంకులను మాత్రమే చెక్ ఇన్ బ్యాగుల్లో తీసుకు వెళ్ళడానికి అనుమతించారు. అంటే అవి చైనా దేశం సర్టిఫై చేసినవన్న మాట. నా సహ ప్రయాణికులు జియాన్ లో కొన్న పవర్ బ్యాంకుల మీద CCC మార్కు ఉండడం వల్ల వాటిని అనుమతించారు. గైడ్ జాకీ 50 యువాన్లు చెల్లిస్తే కొరియర్ లో షాంఘై పంపిస్తానని చెప్పి అనుమతించని పవర్ బ్యాంకు లను తీసుకున్నాడు.

జునియో ఎయిర్ లైన్ విమానంలో మేము రెండు గంటల్లో గుయిలిన్ లో దిగిపోయాం. సుమారు 1500 కిలోమీటర్ల దూరం. మేము లగేజీతో బయటకు వచ్చేసరికి గైడ్ లియో సిద్ధంగా ఉన్నాడు. లియో పేరు వినగానే నాకు రష్యన్ ప్రఖ్యాత రచయిత లియో టాల్ స్టాయ్ గుర్తుకు వచ్చాడు. లియో మంచి గాయకుడు. చైనా జానపద గేయాలతోపాటు క్లాసికల్ సాంగ్స్ కూడా వినిపించాడు. హిందీ పాటలు కూడా పాడడం విశేషం. మృదు స్వభావి. చైనాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో గుయిలిన్ ఒకటి. చరిత్రతోపాటు పచ్చని ప్రకృతి అందాలు అక్కడ కనువిందు చేస్తాయి. నగరం లీ నది తీరంలో ఉండడం వల్ల చాలా చల్లగా వుంది. అక్కడి పర్వత శిఖరాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

మేము ముందుగా రీడ్ ఫ్లూట్ గుహకు వెళ్ళా ము. దాదాపు రెండు కిలోమీటర్లు ఫోబో కొండ మీదకి వెళ్ళాక అక్కడినుంచి గుహలోనికి దారి ఉంది . మాలో చాలా అప్పటికే అలసిపోయి ఉండడం వల్ల ఏడుగురం మాత్రమే లోపలికి వెళ్ళాం. విద్యుద్దీపాల అమరికతో గుహ భూతల స్వర్గం లాగా ఉంది . మన తెలుగు రాష్ట్రంలో కర్నూల్ దగ్గరున్న బిలం గుహలు కూడా సున్నపు రాతితో ఏర్పడినవే .. కానీ సరైన మెయింటెనెన్స్ లేదు. అండమాన్ లోని సున్నపురాయి గుహలు కూడా అలాగే ఉన్నాయి.

దాదాపు 180 మిలియన్ సంవత్సరాల వయసు కలిగిన (Stalagmites) స్టాలగ్మెట్ల, ( stalactites) స్టాలక్లైట్ల, రాతి స్తంభాలు, రాతి కర్టెన్లు లాంటి అద్భుతమైన సహజ ఆకారాలున్నాయి. పైనుంచి కిందకు  వేలాడుతున్నట్లు కొన్ని, నేలను తాకినవి కొన్ని పలు విధాలుగా ఉన్నాయి. ఆకాశంలో సూర్యబింబం లాగా ఉన్న  ఆకారం నన్ను మిక్కిలి ఆకర్షించింది. అక్కడున్న నీటి చెలిమలలో రాతి  స్తంభాల ప్రతిబింబం దృశ్యం చూసి తీరవలసిందే.. ఇవన్నీ భిన్న వర్ణాల రాతితో ఉన్నాయి. అదే రంగు లైటింగ్ ను అక్కడ అమర్చడం వల్ల అవి ఆయా రంగుల్లో అద్భుతంగా కనిపించాయి. అక్కడక్కడ అమర్చిన చిన్న చిన్న బోర్డుల ద్వారా.. ఈ గుహ సుమారు 1200 యేళ్ళ క్రితం టాంగ్ రాజవంశం కాలం నాటిదని, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 1940లలో జపాన్ యుద్ధ సైనికులనుంచి తప్పించుకున్న శరణార్థులు ఆ క్రమంలో దానిని కనుగొన్నట్టు తెలుస్తోంది.

అక్కడినుంచి ఒక ఇండియన్ రెస్టారెంట్ కు పోయి భోజనం ముగించి హోటల్ గదికి వెళ్ళి, గంట విశ్రాంతి తీసుకొని సాయంత్రం నాలుగు గంటలకు ఆర్మీ జనరల్ పార్కుకు వెళ్లాము. లోపలికి వెళ్ళగానే నన్ను ఆకర్షించింది ఒక పెద్ద పాట్. అక్కడ ఫోటో తీసుకొని దీనికి సంబంధించిన వివరాల కొరకు వెతికాను. ఒక వైపున ఆ వివరాలున్న బోర్డు కనిపించింది. దాని ప్రకారం.. దానిని థౌజండ్ మెన్ పాట్ అంటారు. దాని శిల్ప నిర్మాణాన్ని బట్టి అది క్రీ.శ.1663 లో క్వింగ్ రాజ వంశీయుల కాలం నాటిది. ఆ రోజులలో డైకాయ్ కొండమీదున్న డింగ్వ్యు దేవాలయంలో ధూపం వెలిగించడానికి ఉపయోగించే వారని చరిత్ర చెప్తుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ దళాలు ఆ దేవాలయాన్ని శిధిలం చేసాయి. ఆది ఒకటిన్నర మీటర్ల వెడల్పు , 0.8 మీటర్ల లోతు,  1000 కిలోల బరువుతో ఎంతో అందంగా ఉంది . దాని పైన కొన భాగంలో చైనా లిపిలో రాసిన శాసనాలు ఉన్నాయి. అక్కడినుంచి  రెండు అంతస్తుల్లో ఉన్న  రాతిగుహలోకి వెళ్ళాము. కింది గుహ 20 మీటర్ల పొడుగు ఉంది  పై గుహ అడ్డంగా 12 మీటర్లు ఉంది. ఈ రెండింటి మధ్యలో అందమైన బౌద్ధ శిల్పాలున్నాయి.

క్రీశ 1100 నాటి జియాంగ్ జాంగ్ వంశపు రాజులు దీనిని ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెపుతోంది. ఆ రోజుల్లో కత్తిపరీక్ష రాయితో  (Sword testing stone ) దానిని అలా రెండు భాగాలుగా చేసారట. దానిని థౌజండ్ బుద్ధా రాక్ కూడా అంటారు. అక్కడ ఇదివరకు వందలాది శాసనాలు, బౌద్ధ శిల్పాలు ఉండేవని వాటిని సంరక్షించడంలో భాగంగా అక్కడిమంచి తరలించారని, ప్రస్తుతం 36 బౌద్ధ శిల్పాలు మాత్రమే అక్కడున్నాయని గైడ్ లియో చెప్పాడు. ఆ గుహ దాటి అవతలికి పోతే లీ నదీ అందాలు, దాని పైనుంచి వీచే పిల్ల తెమ్మెరలు మన అలసటను దూరం చేసి సేద తీరుస్తాయి. అక్కడి నుంచి మేము జియాన్ షాన్ పార్కుకు వెళ్ళాము. అది లీ నదీతీరంలో ఉంది. అక్కడ ప్రత్యేకమైన ఆకర్షణ ఎలిఫెంట్ ట్రంక్ హిల్. ఇది గుయిలిన్ నగర చిహ్నం. ఆ కొండ ఒక ఏనుగు తొండంతో నీళ్ళు తాగుతున్నట్లుగా కనిపిస్తుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చిందట.

మరునాడు ఉదయం తొమ్మిది గంటలకు ఉపారం ముగించుకొని లీ నదిలో క్రూయిజ్ లో బయలు దేరాము. మాకు కేటాయించిన సమయం 11.45 ని.లు. లోపలికి వెళ్ళి కూర్చున్నాము. లోపల ఒక కేఫ్, షాప్ ఉన్నాయి. అందులో బ్యాగులు తదితర వస్తువులు అమ్మకానికి ఉన్నాయి. కాసేపయిన తర్వాత క్రూయిజ్ పై భాగానికి వెళ్ళాను. అప్పటికే మా వాళ్ళు ఇద్దరక్కడ ఉన్నారు.అందమైన ప్రకృతిని, గుయిలిన్ లో మాత్రమే కనిపించే సహజ సిద్ధంగా ఏర్పడిన సున్నపురాతి పర్యత శిఖరాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఏ కొండకు ఆ కొండనే ప్రత్యేకం. ప్రకృతి కళ పేర్చిన బతుకమ్మలలాగా ఉన్నాయి. ఒకదాని మధ్యలో ఒకటి వరుస వెనక వరుసలు చూపరులను చూపు తిప్పుకోనివ్వవు. తదేకంగా వాటినలా చూసినప్పుడు నాలో కలిగిన ఉద్వేగ భరితమైన ఆనందాన్ని అక్షరాలలో కుదించలేను. దాదాపు గంటన్నరకు పైగా ఆ విహారం సాగింది.

 అక్కడి నుంచి యాంగ్ షూ టౌన్ లోని పశ్చిమ మార్గం గుండా ఇండియన్ రెస్టారెంట్ కు వెళుతున్నప్పుడు.. అది చారిత్రాత్మక ప్రదేశమని, మేము నడుస్తున్న ఆ దారి దాదాపు 600 సంవత్సరాల నాటిదని గైడ్ లియో చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అంత ప్రాచీనమైన ఆ దారిని చెక్కు చెదరకుండా అలాగే కాపాడుతున్న చైనీయులను మనసులోనే అభినందించాను. చరిత్ర, సంస్కృతి పట్ల వాళ్ళకున్న ప్రేమ, బాధ్యత అపారమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page