జి.ఎస్.ఎల్.వి-ఎఫ్16: నిసార్ తో అంతరిక్ష రంగంలో భారతదేశం కొత్త శకం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన గొప్ప ప్రయాణంలో మరో మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. జి.ఎస్.ఎల్.వి-ఎఫ్16 అనే రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జూలై 30, 2025 నాడు ప్రయోగించబోతోంది. ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు.  భూమిని అర్థం చేసుకోవడంలో విప్లవాత్మక మార్పులు తేగల “నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ (నిసార్)” అనే ఉపగ్రహాన్ని ఇది మోసుకుపోతుంది. ఇస్రో రూపొందించిన జి.ఎస్.ఎల్.వి భారీ ఉపగ్రహాలను భూమికి ఎత్తులో ఉండే కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. జాతీయ అవసరాల కోసం మన స్వంత ఉపగ్రహాలను ప్రయోగించే శక్తిని ఇది మనకు అందించింది. దీనిలో ప్రత్యేకత స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ఇంజిన్ ఉపయోగించడం గమనార్హం. దీనిని గతంలో చాలా దేశాలు మన దేశానికి ఇవ్వడానికి నిరాకరించాయి.
నిసార్ – భారతదేశ భవిష్యత్తుకు ఒక అనివార్యమైన నేత్రం:
 ‘ నిసార్ ‘ ఉపగ్రహం నాసా ఇస్రోల మధ్య ఉమ్మడి ప్రాజెక్ట్ అయినప్పటికీ, ఇది మన దేశానికి అవసరమైన ఎంతో విలువైన కీలక సమాచారాన్ని అందిస్తుంది. దాదాపు 2800 కిలోల బరువున్న ఈ భూపరిశీలనా ఉపగ్రహంలో భూ ఉపరితలం, మంచు ప్రాంతాల గురించి మునుపెన్నడూ లేని విధంగా స్పష్టమైన సమాచారాన్ని అందించే అత్యాధునిక ద్వంద్వ-ఫ్రీక్వెన్సీ (ఎల్-బ్యాండ్, ఎస్-బ్యాండ్) సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్ఎఆర్) వ్యవస్థలు ఉన్నాయి. వీటి సామర్థ్యాలు మనదేశ విపత్తుల నిర్వహణకు, సిద్ధంగా ఉండటానికి అత్యంత కీలకం. హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు తరచుగా భూకంపాలు, కొండచరియలు విరిగిపడటానికి గురవుతాయి.
నిసార్‌లోని రాడార్ వ్యవస్థ భూమిలో జరిగే అతి సూక్ష్మమైన మార్పులను గుర్తించగలదు. ఇది భూకంపాలు వచ్చే ప్రదేశాలను బాగా అర్థం చేసుకోవడానికి, కొండచరియలు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను పర్యవేక్షించడానికి, ముందుగానే హెచ్చరికలు ఇవ్వడానికి ఎంతగానో సహాయపడుతుంది. ప్రతి సంవత్సరం భారతదేశంలో వచ్చే వరదలను పర్యవేక్షించడానికి ఇది అనివార్యం. మేఘాలు అడ్డుగా ఉన్నా, రాత్రిపూట కూడా చిత్రాలు తీయగల నిసార్ సామర్థ్యం వల్ల, వరద విస్తృతిని, నీటి మార్పులను, మరియు నష్టాన్ని నిజ సమయంలో అంచనా వేయవచ్చు. ఇది వరద నియంత్రణకు, సహాయక చర్యలకు, ముఖ్యంగా వర్షాకాలంలో ఇతర ఉపగ్రహాలు నిష్ప్రయోజనంగా మారినప్పుడు అమూల్యమైనది.
వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, వాటి ప్రభావాలను తగ్గించడానికి నిసార్ ఎంతో దోహదపడుతుంది. హిమాలయాలు “ఆసియా జల గోపురం” గా, భారతదేశ నీటి భద్రతకు అత్యంత కీలకం. నిసార్ హిమాలయ పర్వతాలలోని హిమానీనదాలు,  మంచు పలకల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఇది నీటి లభ్యతను అంచనా వేయడానికి, హిమానీనద సరస్సుల నుండి వచ్చే వరదలను అంచనా వేయడానికి, వాతావరణ మార్పుల ప్రభావాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. భారతదేశ విశాలమైన వ్యవసాయ రంగం, ముఖ్యమైన అటవీ సంపద వాతావరణ మార్పుల వల్ల నేరుగా ప్రభావితమవుతాయి. నిసార్ మొక్కల గుండా చొచ్చుకుపోయి సమాచారాన్ని సేకరించగలదు.
ఇది అటవీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, వ్యవసాయానికి సంబంధించి నేల తేమను కొలవడానికి, పంటల ఆరోగ్యాన్ని, పెరుగుదలను ట్రాక్ చేయడానికి, దిగుబడులను అంచనా వేయడానికి చాలా విలువైనది. ఆధునిక వ్యవసాయానికి సహాయపడుతుంది. తద్వారా ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం మెరుగుపడతాయి. సుదీర్ఘ తీరప్రాంతం, ద్వీపాలు ఉన్న మన్ దేశంలో సముద్ర మట్టాలు పెరగడం, తీరప్రాంత కోతకు ఎక్కువగా గురవుతుంది. నిసార్ తీరప్రాంతంలో జరిగే మార్పులను కచ్చితంగా కొలవగలదు. ఇది తీరప్రాంత నిర్వహణ, పట్టణ ప్రణాళిక, ప్రమాదంలో ఉన్న ప్రజలను కాపాడటానికి సహాయపడుతుంది. దేశంలోని స్థిరమైన వనరుల నిర్వహణ విధానాలకు పర్యావరణ క్షీణతను గుర్తించడానికి అవసరమైన సహజ వనరుల గురించి, భూగర్భజలాల తగ్గుదల నుండి చిత్తడి నేలల్లో మార్పుల వరకు నిసార్ సమాచారాన్ని, సమగ్ర చిత్రాన్ని అందిస్తుంది.
నాసా-ఇస్రో సహకార సమ్మేళనం:
నాసా-ఇస్రో సహకారం ఎందుకు అన్నది సహజంగా అందరికీ తలెత్తే ప్రశ్న. అంతరిక్ష పరిశోధనలలో గొప్ప విజయాలు సాధించిన నాసాకు, ఎస్ఎఆర్ సాంకేతికతలో అపారమైన అనుభవం ఉంది. అయినప్పటికీ నిసార్ మిషన్ అనేది వ్యూహాత్మక సహకారానికి, వనరుల సమర్థవంతమైన వినియోగానికి ఒక గొప్ప ఉదాహరణ. నిసార్ మొట్టమొదటిసారిగా రెండు వేర్వేరు రాడార్ ఫ్రీక్వెన్సీలను ఒకేసారి ఉపయోగిస్తుంది. ఎల్-బ్యాండ్ (నాసా జెపిఎల్ – అందిస్తుంది) ఎస్-బ్యాండ్ (ఇస్రో అందిస్తుంది). ఈ రెండింటిని కలిపి ఉపయోగించడం వల్ల భూమి గురించి మునుపెన్నడూ లేని విధంగా సమగ్రమైన అవగాహన లభిస్తుంది. దాదాపు1.5 బిలియన్ అమెరికన్ డాలర్ల అంచనా వ్యయంతో ఇలాంటి భారీ అంతరిక్ష మిషన్లు చాలా ఖరీదైనవి. కలిసి పనిచేయడం ద్వారా నాసా, ఇస్రో ఆర్థిక భారాన్ని, సాంకేతిక నష్టాలను పంచుకుంటాయి. ఇది మిషన్‌ను రెండు సంస్థలకు మరింత సాధ్యమయ్యేలా చేస్తుంది.
నిసార్ భూమిపై ఉన్న దాదాపు అన్ని భూమి, మంచు ప్రాంతాలను ప్రతి పన్నెండు రోజులకు ఒకసారి పరిశీలిస్తుంది. ఈ ప్రపంచవ్యాప్త సమాచారం వాతావరణ మార్పులు, భూపలకల కదలికలు వంటి పెద్ద విషయాలను అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యం. ఈ సహకారం వల్ల ఎక్కువ మంది శాస్త్రవేత్తలు డేటాను ఉపయోగిస్తారు. దీనివల్ల ఎక్కువ శాస్త్రీయ ప్రయోజనం లభిస్తుంది. అంతేకాదు నిసార్ నుండి వచ్చే డేటా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు, ప్రజలకు ఉచితంగా బహిరంగంగా లభిస్తుంది. ఇటువంటి సహకారాలు దేశాల మధ్య బలమైన సంబంధాలను నమ్మకాన్ని పెంచుతాయి. ఇస్రోకు, ఈ భాగస్వామ్యం అంతర్జాతీయ స్థాయిలో ఇంత పెద్ద మిషన్‌లో పనిచేయడంలో అమూల్యమైన అనుభవాన్ని అందిస్తుంది. సామర్థ్యం పెంపుదలకు తోడ్పడుతుంది. నాసాకు, ఇస్రో వంటి సమర్థవంతమైన తక్కువ ఖర్చుతో పనిచేసే సంస్థతో కలిసి పనిచేయడం వారి లక్ష్యాలను సాధించడానికి ఒక ప్రయోజనకరమైన మార్గాన్ని అందిస్తుంది.
జి.ఎస్.ఎల్.వి-ఎఫ్16 మిషన్ నిసార్ ఉపగ్రహంతో కలిసి భారతదేశానికి ఒక ద్వంద్వ విజయం. ఇది క్లిష్టమైన భారీ ఉపగ్రహాలను ముఖ్యమైన కక్ష్యలలోకి ప్రయోగించడంలో మన దేశం సాధించిన స్వావలంబనను స్పష్టం చేస్తుంది. అంతకు మించి నిసార్ కేవలం ఒక శాస్త్రీయ ఆసక్తి మాత్రమే కాదు. ఇది ఒక అత్యంత ముఖ్యమైన సాధనం. ఇది భారతదేశానికి అత్యంత ముఖ్యమైన పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి, విపత్తుల సంసిద్ధతను బలోపేతం చేయడానికి, ఆహార నీటి భద్రతను నిర్ధారించడానికి, రాబోయే దశాబ్దాలకు స్థిరమైన అభివృద్ధి వ్యూహాలను రూపొందించడానికి మునుపెన్నడూ లేని విధంగా సమాచారాన్ని అందించే ఒక ప్రత్యేకమైన “నేత్రం” లాంటిది ఈ ప్రయోగం.
జనక మోహన రావు దుంగ 8247045230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *