హరిత భారతం – మనందరి ఉమ్మడి బాధ్యత

 “భారతదేశ ‘నికర శూన్య ఉద్గారాల’ లక్ష్యం అనేది ఎక్కడి నుంచో ఎవరో వచ్చి చేసేది కాదు. అది మన వంటగదిలో మొదలై, మన కార్యాలయం గుండా ప్రయాణించి, ప్రభుత్వ విధానాలలో ప్రతిఫలించాలి. ఈ మహా యజ్ఞంలో ప్రభుత్వం తన కొనుగోలు శక్తితో మార్గాన్ని నిర్దేశిస్తే, ప్రైవేట్ రంగం తన ఆవిష్కరణలతో వేగాన్ని అందించాలి. వీటన్నింటికీ అసలైన చోదక శక్తిగా, మనస్సాక్షిగా నిలవాల్సింది యువతరమే. ప్రతి కొనుగోలు ఒక బాధ్యతగా భావించినప్పుడే మనమందరం కలిసి ఆ హరిత భవిష్యత్తును నిర్మించగలం..” 

2070 నాటికి మనదేశం నికర శూన్య ఉద్గారాల లక్ష్యాన్ని(Net Zero_ సాధించడం అనేది ఒక పెద్ద సవాలుతో కూడుకున్నది. ఈ లక్ష్యం కేవలం భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులనో, కర్మాగారాల నియమాలనో మార్చడం ద్వారా మాత్రమే నెరవేరదు. దీని మూలాలు మన దైనందిన జీవితంలోని చిన్న చిన్న నిర్ణయాలపై ఆధారపడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఉదాహరణకు ఒక సామాన్యుడు కొనే సబ్బు నుండి ప్రభుత్వం నిర్మించే బ్రహ్మాండమైన ప్రాజెక్టుల వరకు, ప్రతి కొనుగోలు మన పర్యావరణ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఈ కొనుగోళ్ల శక్తిని, దాని ప్రభావాన్ని, మనందరి పాత్రను లోతుగా విశ్లేషించడం అవసరం. మన దేశ ఆర్థిక, పర్యావరణ వ్యవస్థలు సామాన్య పౌరులు, ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వం అనే మూడు ప్రధాన వర్గాల కొనుగోళ్లపై ఆధారపడి ఉన్నాయి.

ఒక వ్యక్తిగా మన ప్రభావం చాలా చిన్నదని అనిపించవచ్చు. కానీ 140 కోట్ల మంది ప్రజల అలవాట్లు కలిస్తే అది ఒక మహాశక్తిగా మారుతుంది. మనం వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ఫాస్ట్ ఫ్యాషన్ పరిశ్రమ వల్ల కలిగే నీటి కాలుష్యం వరకు మన ఎంపికలు పరోక్షంగా పర్యావరణంపై భారం మోపుతాయి. మనదేశ మొత్తం శక్తి వినియోగంలో గృహాల వాటానే దాదాపు 25% నుండి 30% వరకు ఉంటుంది. మనం కొనే ఆహారం కూడా ముఖ్యమే. కొన్ని పంటలకు అధిక నీరు అవసరం, మరికొన్ని ఆహార పదార్థాలు వేల కిలోమీటర్ల దూరం నుండి రవాణా చేయబడతాయి. ఈ ప్రక్రియలన్నీ కర్బన ఉద్గారాలకు కారణమవుతాయి. అదే విధంగా దేశ పారిశ్రామిక, వాణిజ్య రంగాల ఉద్గారాల వాటా దాదాపు 40% పైనే ఉన్నాయి. ఒక కార్ల తయారీ కంపెనీ తీసుకునే నిర్ణయం స్టీల్, ప్లాస్టిక్, గాజు, రబ్బరు, ఎలక్ట్రానిక్స్ వంటి ఎన్నో రంగాలను ప్రభావితం చేస్తుంది. కంపెనీలు తమ కార్యాలయాల కోసం కొనే ఫర్నిచర్, కంప్యూటర్ల నుండి ఫ్యాక్టరీల కోసం కొనే ముడిసరుకుల వరకు, ప్రతి కొనుగోలు ఒక పెద్ద సరఫరా గొలుసును నడిపిస్తుంది. ఆ గొలుసు ‘హరితంగా’ ఉంటే, దాని సానుకూల ప్రభావం వేలాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై పడుతుంది. ఈ మూడింటిలో అత్యంత శక్తివంతమైన, అతిపెద్ద కొనుగోలుదారు ప్రభుత్వమే. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాల నుండి రక్షణ పరికరాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కోసం ధాన్యం సేకరణ వరకు ప్రభుత్వం ఏటా చేసే ఖర్చు మన జీడీపీలో 22%, అంటే సుమారు ₹72 లక్షల కోట్లు. ఈ కొనుగోళ్ల కారణంగా ఏటా దాదాపు 59 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్‌కు సమానమైన ఉద్గారాలు వెలువడుతున్నాయని అంచనా. ప్రభుత్వం తన కొనుగోలు విధానంలో ‘హరిత ప్రమాణాలను’ చేరిస్తే, అది మొత్తం మార్కెట్‌కే ఒక బలమైన సందేశం పంపుతుంది.

సుస్థిరత దిశగా ప్రస్తుత అడుగులు:
ప్రస్తుతం ప్రజలలో అవగాహన పెరుగుతోంది. సేంద్రీయ ఉత్పత్తులు, రైతుల బజార్లు, పాత వస్తువులను అమ్మే పొదుపు దుకాణాలు, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వంటివి నెమ్మదిగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రైవేట్ సంస్థల విషయానికొస్తే, టాటా, ఇన్ఫోసిస్, విప్రో వంటి అనేక భారతీయ కంపెనీలు పర్యావరణ, సామాజిక, పాలనా  ప్రమాణాలను పాటిస్తూ, కార్బన్ తటస్థ లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాయి. తమ కార్యాలయాలను హరిత భవనాలుగా మారుస్తున్నాయి. ఇక ప్రభుత్వం కూడా సాధారణ ఆర్థిక నిబంధనలు 2017లో కొన్ని పర్యావరణ నిబంధనలను చేర్చింది. ఇటీవల విడుదల చేసిన వస్తువులు, సేవల సేకరణ మాన్యువల్ 2024లో సుస్థిరతకు ప్రాధాన్యతనిచ్చింది. అయితే ఇవి ఇంకా పూర్తిస్థాయిలో, దేశవ్యాప్తంగా అమలు కావడం లేదు.

యువత భూమిక :
ఈ మొత్తం మార్పు ప్రక్రియలో అత్యంత కీలకమైన పాత్ర యువతదే. వారు ఈ హరిత విప్లవానికి చోదక శక్తిగా వ్యవహరిస్తారు. కాబట్టి యువత తాము వాడే బ్రాండ్ల పట్ల చాలా స్పృహతో ఉండాలి. పర్యావరణానికి హాని కలిగించే కంపెనీలను తిరస్కరించి, సుస్థిరమైన ఉత్పత్తులను అందించే వాటిని యువత ఆదరించాలి. పర్యావరణ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు కనుగొనడానికి హరిత హ్యాకథాన్‌లు నిర్వహించడం, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు వంటి రంగాలలో కొత్త స్టార్టప్‌లు ప్రారంభించడం ద్వారా యువత ఉద్యోగ కల్పన చేయడమే కాక, పర్యావరణానికి మేలు చేయగలరు.

కలిసికట్టుగా చేయాల్సిన మార్పులు:
దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలు పాటించేలా ఒక బలమైన, స్పష్టమైన ‘హరిత కొనుగోలు’ చట్టం తీసుకురావడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. అలాగే ప్రభుత్వం కొనుగోలు అధికారులకు పర్యావరణ ప్రమాణాలపై శిక్షణ ఇవ్వాలి. ఒక ఉత్పత్తి జీవితకాల వ్యయాన్ని ఎలా అంచనా వేయాలి, పోటీకి ఆటంకం కలగకుండా ‘హరిత టెండర్లను’ ఎలా రూపొందించాలో నేర్పించాలి. దీనికి ‘మిషన్ కర్మయోగి’ వంటి వేదికలను వాడుకోవాలి. ఏది ‘హరిత’ ఉత్పత్తి, ఏది కాదు అని స్పష్టంగా నిర్వచించే ఒక జాతీయ ప్రమాణాల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇది గందరగోళాన్ని నివారిస్తుంది. హరిత ఉత్పత్తులను తయారుచేసే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థికంగా అండగా నిలవడం, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాల వంటి పథకాలలో వారికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా అవసరం. ఇక ప్రైవేట్ సంస్థలు సుస్థిరతను కేవలం ఒక వార్షిక నివేదిక అంశంగా కాకుండా, కంపెనీ ప్రధాన వ్యాపార వ్యూహంలో భాగం చేయాలి. తమ ఉత్పత్తుల పర్యావరణ ప్రభావం గురించి వినియోగదారులకు పారదర్శకంగా తెలియజేయాలి. తమ సరఫరా గొలుసు మొత్తాన్ని హరిత ధృవీకరణ చేయించాలి. సామాన్యులు కూడా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. అవసరం లేని వస్తువులను కొనకపోవడం, విద్యుత్‌ను పొదుపు చేయడం, నీటిని వృథా చేయకపోవడం వంటివి అలవాటు చేసుకోవాలి. మన వార్డులో, గ్రామంలో చెత్త నిర్వహణ, ప్రజా రవాణా, పచ్చదనం వంటి అంశాలపై స్థానిక ప్రభుత్వాలను నిలదీసి లక్ష్య చేరువలో భాగస్వాములు కావాలి.

అందరి సహకారం అవసరం:
భారతదేశ ‘నికర శూన్య ఉద్గారాల’ లక్ష్యం అనేది ఎక్కడి నుంచో ఎవరో వచ్చి చేసేది కాదు. అది మన వంటగదిలో మొదలై, మన కార్యాలయం గుండా ప్రయాణించి, ప్రభుత్వ విధానాలలో ప్రతిఫలించాలి. ఈ మహా యజ్ఞంలో ప్రభుత్వం తన కొనుగోలు శక్తితో మార్గాన్ని నిర్దేశిస్తే, ప్రైవేట్ రంగం తన ఆవిష్కరణలతో వేగాన్ని అందించాలి. వీటన్నింటికీ అసలైన చోదక శక్తిగా, మనస్సాక్షిగా నిలవాల్సింది యువతరమే. ప్రతి కొనుగోలు ఒక బాధ్యతగా భావించినప్పుడే మనమందరం కలిసి ఆ హరిత భవిష్యత్తును నిర్మించగలం.

Green India – Our Common Responsibility

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *