రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌

మిగులు విద్యుత్‌ ఇతర రాష్ట్రాలకు పంపిణీ
పాలమూరు జిల్లాను అన్నపూర్ణ జిల్లాగా మ‌రుస్తాం..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తాం..
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

వనపర్తి, ప్రజాతంత్ర, జనవరి 09: రాష్ట్రంలో 24 గంటల నాణ్యతమైన విద్యుత్‌ను ఇవ్వడంతోపాటు మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వనపర్తి జిల్లాలో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రెండు విద్యుత్ ఉపకేంద్రాలను ప్రారంభించ‌డంతోపాటు 7 విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. గురువారం వనపర్తి జిల్లాలో ఆయ‌న‌ పర్యటించి సుమారు రూ. 23.30 కోట్ల నిధులతో  రెండు విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవంతో పాటు మరో 7 విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపనలు చేశారు. రేవల్లి మండలంలోని తల్పునూరు గ్రామంలో రూ. 2.06 కోట్లతో నిర్మించిన 33/11 కేవి విద్యుత్ ఉపకేంద్రం , గోపాల్‌పేట మండల పరిధిలోని ఎదుట్ల గ్రామంలో రూ.1.96 కోట్లతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలను  ప్రారంభించారు. అనంతరం వనపర్తి పట్టణం విద్యుత్ సబ్ స్టేషన్ ముందు వనపర్తి మండలానికి చెందిన  కాశీంనగర్, నాగవరం,  మెట్టుపల్లి, చిననగుంట పల్లి, పెద్దమందడి మండలానికి సంబంధించిన పామిరెడ్డిపల్లి, గోపాల్‌పేట‌ మండలం తాడిపర్తి, శ్రీరంగాపురం మండలానికి సంబంధించిన నగరాల ఉప విద్యుత్ కేంద్రాలకు శంకుస్థాపన చేశారు.  అదేవిధంగా ట్రాన్స్‌ఫార్మ‌ర్ కోసం దరఖాస్తు చేసుకున్న 50 మంది రైతులకు 50 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మ‌ర్ల‌ను పంపిణీ చేశారు.

అనంతరం వనపర్తి జిల్లా ఐడిఓసిపై పునరుత్పాద‌క‌ విద్యుత్ శక్తిని సృష్టించేందుకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంద‌న్నారు. పాలమూరు రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి  వెనుకబడిన పాలమూరు జిల్లాను అన్నపూర్ణ జిల్లాగా మార్చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని.. అలాగే మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఇస్తామని తెలిపారు.  ఇందుకు యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్లల్లో ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువ‌చ్చామ‌ని అన్నారు. వనపర్తి జిల్లాలో విద్యుత్ తీగలు లైన్ మార్చడం, స్తంభాలు మార్చడం వంటి ప‌నుల‌కు ఇప్పటికీ రూ.45 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

రైతు భ‌రోసాపై అంద‌రి ఆమోదంతోనే నిర్ణ‌యం
రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రతి వ్యవసాయ యోగ్యమైన  భూమికి సంవత్సరానికి రూ.12 వేల చొప్పున ఇచ్చేందుకు క్యాబినెట్లో ఆమోదం తీసుకున్నామ‌ని ఉప‌ముఖ్య‌మంత్రి  భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.  జనవరి 26 నుంచి అర్హులైన ప్రతి రైతుకు రూ.12 వేలను ఇస్తామ‌ని చెప్పారు. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని జనవరి 26 నుంచి  ప్రారంభిస్తామ‌ని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రైతు రుణమాఫీ చేశామ‌ని, ఇంకా ఎవరైనా రుణమాఫీ కానివారు ఉంటే వారికి సైతం అమ‌లు చేస్తామ‌న్నారు.

ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎన్ని సమస్యలు ఉన్నా రైతాంగానికి  ఉచిత విద్యుత్ అందిస్తున్నామ‌ని తెలిపారు. ఉచిత విద్యుత్‌ అనేది అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు.  ట్రాన్స్‌ఫార్మ‌ర్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు అందిస్తామ‌ని చెప్పారు.
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి ఆర్థిక శాఖ మంత్రి హామీతో రాష్ట్ర ముఖ్యమంత్రి  ఐదేళ్ల‌లో లక్ష కోట్లు మంజూరు చేస్తార‌ని  తెలిపారు. లక్ష కోట్ల  నిధులతో  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని రాష్ట్రంలో ముందు వరసలో పెడ‌తామ‌ని పేర్కొన్నారు.

నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి మాట్లాడుతూ.. రైతులకు ఇరిగేషన్ ఎంత ముఖ్యమో విద్యుత్ అంతే ముఖ్యమని చెప్పారు.  ఈనెల చివర్లో జిల్లాలో భారీ రుణమేలా, భారీ జాబ్ మేలా, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామ‌ని  తెలిపారు. స్థానిక శాసనసభ్యులు తుడి మేఘా రెడ్డి మాట్లాడుతూ.. అడిగిన వెంటనే వనపర్తి జిల్లాలో విద్యుత్ సమస్యల ప‌రిష్కారానికి  రూ. 40 కోట్లు మంజూరు చేశారని, నేడు మరో 24 కోట్లతో విద్యుత్ ఉప కేంద్రాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసినందున ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.  జిల్లాలో 14 సంక్షేమ వసతి గృహాలు అద్దె భవనాల్లో ఉన్నాయని వాటిని స్వంత భవనాలు నిర్మించుకునేందుకు రూ. 92 కోట్ల  నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రిని  కోరారు.

పెబ్బేరులో ఒక సబ్ స్టేషన్, 30 పడకల వైద్య ఆరోగ్య కేంద్రం, ఘనపూర్ లో డిగ్రీ కళాశాల మంజూరు చేయాల‌ని కోరారు. అలాగే వనపర్తి మున్సిపాలిటీ ని గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 కు మార్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పడిన ఏడాది కాలంలో రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి  రూ.78వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.  కార్యక్రమంలో  రాష్ట్ర విద్యుత్ శాఖ  సిఎండి ముషారఫ్ అలీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్‌ సురభి, జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, , మహబూబ్నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి,  విద్యుత్ శాఖ సీఈ యు. బాలస్వామి, డైరెక్టర్ నందకిశోర్‌, ఎస్ఈ రాజశేఖరం, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారులు, ప్రజలు తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *