వీలైనంత త్వరగా చట్టాన్ని అమలులోకి తెస్తాం
ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తాం
రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 09 : చారిత్రాత్మకమైన భూ భారతి చట్టాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రజానీకానికి మెరుగైన, సమగ్రమైన రెవెన్యూ సేవలను సత్వరమే అందించాలన్న ఆశయంతో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టాన్ని రూపొందించామని , ఈ చట్టాన్ని ఆమోదించిన గవర్నర్ కు ప్రభుత్వం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ చట్టం తీసుకురావడానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సహచర మంత్రి వర్గ సభ్యులు , ప్రజాప్రతినిధులు , రాత్రనకా, పగలనకా పనిచేసిన అధికారులు, సిబ్బందికి, అలాగే ఈ చట్టానికి పలు సలహాలు సూచనలు ఇచ్చిన మేధావులకు రాష్ట్ర భూ యజమానుల తరపున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ చట్టంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ మంత్రి పొంగులేటి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరి అభిప్రాయాలను క్రోడీకరించి సామాన్యుల సంక్షేమమే ధ్యేయంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ చట్టానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. వీలైనంత త్వరలో ఈ చట్టాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు గవర్నర్ ఆమోదించిన భూభారతి బిల్లు కాపీని గురువారం సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మంత్రికి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ చట్టం -2020 వల్ల తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, ఈ చట్టం తీసుకొచ్చి మూడు సంవత్సరాలు గడచినా కూడా విధివిధానాలను రూపొందించలేదు. భూ సమస్యలేని గ్రామం తెలంగాణలో లేదు. గత ప్రభుత్వం తమ వ్యక్తిగత స్వార్థం కోసం రెవెన్యూ వ్యవస్దను పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. గత ప్రభుత్వంలో కొందరి గుప్పిట్లోనే కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలను గ్రామస్థాయి వరకు అందించడానికి మా ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టింది అని మంత్రి తెలిపారు. గ్రామాల్లో రెవెన్యూ పాలనను చూడడానికి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించబోతున్నామని ఇందుకు సంబంధించిన కసరత్తు కొలిక్కివచ్చిందన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రెవెన్యూ విభాగం పనిచేయాలని సూచించారు. రెవెన్యూ వ్యవస్దను ప్రజలకు చేరువ చేయాలన్నదే ఈ ప్రభుత్వ ఆకాంక్ష అని ప్రజాపాలనలో ప్రజలు కేంద్రబిందువుగా ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు ఉంటాయని వాటిని దృష్టిలో పెట్టుకొని సామన్య ప్రజలు సంతోషపడేలా రెవెన్యూశాఖలో అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేయాలని మంత్రి పొంగులేటి అన్నారు.





