మారనున్న మెట్రో ముఖచిత్రం
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఉన్న ఔటర్‌ను అనుసంధానం చేస్తూ 36 వరకు రోడ్డు మార్గాలు, నాలుగు చోట్ల రైలు మార్గాలు ఉన్నాయి. రోడ్డు, రైలు మార్గాలతో పాటు మెట్రో మార్గం కలిస్తే భవిష్యత్ ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉండే అవకాశాలున్నాయి. ఆ దిశగానే సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర హైదరాబాద్ వైపు రెండు మెట్రో కారిడార్లు, దక్షిణ హైదరాబాద్ వైపు మరో కారిడార్‌కు డీపీఆర్‌లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో మెట్రోరైలు సౌకర్యం ఔటర్ రింగు రోడ్డును దాటి నగర శివారు ప్రాంతాలకు అందుబాటులోకి రానుంది.
హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు మొదటి దశలోని జేబీఎస్ నుంచి ఎంబీజీఎస్ మార్గంలో 11 కిలోమీటర్లు ప్రస్తుతం నగరవాసులకు అందుబాటులో ఉంది. రెండో దశలో చేపట్టబోయే జేబీఎస-శామీర్‌పేట (22 కి.మీ), ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ), చాంద్రాయణ గుట్ట నుంచి ఇన్నర్ రింగు రోడ్డు మీదుగా ఆరాంఘర్, శంషాబాద్ టౌన్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు లోపలి వరకు (35 కి.మీ), అదేవిధంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీ(ఫ్యూచర్ సిటీ) వరకు (40 కి.మీ).. ఇలా మొత్తం 115 కిలోమీటర్ల మెట్రో మార్గం ఉత్తర దిక్కున ఉన్న శామీర్‌పేట ఔటర్ రింగు రోడ్డు నుంచి దక్షిణ దిక్కున ఉన్న ఫోర్త్ సిటీతో అనుసంధానం అవుతుంది.
దీంతో గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు ఉత్తరాన ఉన్న శామీర్‌పేట నుంచి సికింద్రాబాద్, ముషీరాబాద్, ఎంజీబీఎస్, చార్మినార్ మీదుగా చాంద్రాయణగుట్ట, శంషాబాద్ విమానాశ్రయం అక్కడి నుంచి ఫోర్త్ సిటీ వరకు మెగా మెట్రో కారిడార్ అవతరించనుంది. హైదరాబాద్ మహానగరంలో ఉత్తర-దక్షిణ దిక్కులను కలిపే మెగా మెట్రో కారిడార్‌లో ఎంజీబీఎస్, జేబీఎస్ వంటి బస్ స్టేషన్‌లు, ఎంఎంటీఎస్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగించే సికింద్రాబాద్, ఫలక్‌నుమా, బుద్వేల్, శంషాబాద్, అల్వాల్, బొల్లారం వంటి రైల్వే స్టేషన్‌లతో అనుసంధానం అవుతుంది.
ఇక అత్యంత కీలకమైంది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విమానాల నెట్‌వర్క్ కలిగిన విమానాశ్రయంతో కూడా ఈ మెట్రో కారిడార్ కలిస్తే అన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థలు ఒకే మార్గంలో ఉండనున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్న ప్రాంతాలను కలపడమే కాకుండా నివాస, వ్యాపార వాణిజ్య కేంద్రాలను, ఔటర్ రింగు రోడ్డు ఇంటర్‌చేంజ్ కేంద్రాలను కలిపేలా మెగా మెట్రో మార్గం అందుబాటుకి వస్తే హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థ ముఖ చిత్రం సమూలంగా మారిపోనుంది.



