ప్రజా ప్రభుత్వం విజయ విలాసం..!

‘రైజింగ్ తెలంగాణ‌’తో వడివడిగా ముందుకు..

దశాబ్ద కాల సుదీర్ఘ ప్రయాణంలో విసుగెత్తి మార్పు కోరుకున్న ప్రజా పాలనలో ఎన్నో ఆర్థిక అవాంతరాలు ఎదురైనా 2024 వెనకడుగు వేయకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రేవంత్ పాలన కొనసాగింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం అడుగడుగునా చేసింది. ఆరు గ్యారెంటీల అమలు జాప్యంతో రెచ్చిపోయిన ప్రతిపక్షాలు గగ్గోలుకు జంకకుండా ఒక్కొక్కటి నెరవేర్చుతూ మన్ననలు పొందింది. తెలంగాణ పునర్నిర్మాణంలో ఆరు గ్యారెంటీలలో ఒకటి నిరుద్యోగ హామీ త్వరితగతిన పూర్తి చేయాలని డే వన్ నుంచి ఇప్పటివరకు 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి శభాష్ అనిపించుకుంది. ఆరు గ్యారెంటీలలో మరో ప్రధాన గ్యారెంటీ 2 లక్షల రైతు రుణమాఫీ మాట తప్పకుండా 25 లక్షల మందికి ఏకకాలంలో రుణమాఫీ చేసింది.రైతును రాజు చేయాలనే బలమైన కోరిక, రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలపాలనే ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. మహిళా సాధికారిత కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఐదేళ్ల‌లో రూ.లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలను అందించాలని కంకణం కట్టుకుంది. మహిళలను వ్యాపార దిగ్గజాలుగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే ప్రత్యేక చొరవ చూపుతున్నారు. రూ.442 కోట్లతో 500లకే గ్యాస్ సిలెండర్, రూ.1234కోట్లతో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అప్రతిహతంగా నడుస్తున్నది.

ఉచిత బస్ ప్రయాణాల‌ను 110 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీ 69 నుంచి 94శాతానికి పెరిగి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లాభాలతో నడుస్తోంది. ఒకప్పుడు తాగునీటి వనరుగా ఉన్న మూసీ మురికి కూపంగా మారడం, ఆక్రమణలకు గురికావడం ప్రభుత్వాలు అంటీముట్టనట్లు ఉన్న ఈ ఆక్రమణలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు హెడ్రా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం తీసుకున్న కులగణన ప్రతిపక్షాలకు నిద్రపట్టడం లేదు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. కొట్లాడి తెచ్చిన ప్రభుత్వం పోవాలి, ఆరు దశాబ్దాల కల సాకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఊరూరా మౌత్ టాక్ వినిపించిన ప్రజల కోర్కెలు తీర్చేందుకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మాదిరిగా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ముందుకు సాగింది. ఏడు లక్షల కోట్లు అప్పుల భారం మోపినా జంకకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట కోసం ప్రతి నెలా ఒకటిన బంట్రోతు నుంచి అత్యున్నత అధికారి వరకు అన్ని శాఖల్లో జీతాలను టింగ్ టింగ్ న జమచేస్తుంది.

ఐటి రంగంలో మొదటి దఫాలోనే అత్యుత్తమ ప్రాజెక్టులకు వెల్లువలా పెట్టుబడులు తెచ్చిపెట్టింది. మహానగరం విపత్తులకు అతులాకుతులం కావడానికి కారణాలను వెతికి, గత కొన్ని ఏండ్లుగా కబ్జాలకు గురైన చెరువులు, పార్కులను రక్షించే పనిలో పడింది. ఇప్పటికి 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. హైడ్రా వల్ల భయభ్రాంతులకు గురైన ప్రజలకు ఏది పాలు, ఏది నీళ్లు అనే అవగాహనతో క్రయ, విక్రయాల్లో సంపూర్ణమైన జ్ఞానం అందింది. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, మూసీ ప్రక్షాళన, ఫోర్ట్ సిటీ ఏర్పాటు వంటివి పురుడు పోసుకున్నాయి. రాష్ట్రంలోని 65 ఐటిఐలను అడ్వాన్స్ టెక్నీకల్ సెంటర్లుగా మార్చడం వల్ల రానున్న పదేండ్లలో 4.70 లక్షల మంది వృత్తి నిపుణులకు బువ్వ దొరికే పని కల్పిస్తుంది. ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధకు ఏఐకి సైతం రాజధాని హైదరాబాద్ కావాలనే ఫోర్త్ సిటీ లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ )కు పెద్దపీట వేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలో విద్యా విధానం పటిష్ఠత కోసం తొలిసారిగా విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో తనదైన శైలిలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు కోసం 18 గంటలు నిర్విరామంగా పనిచేస్తోంది ప్రజాప్ర‌భుత్వం. వ్యవసాయం దండుగ కాదు పండుగ అని నిరూపించడానికి రేవంత్ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతను కట్టబెట్టింది. అయితే ఎన్నికల ముందు రైతు భరోసా ఎకరానికి 15 వేలు అమలు చేయలేదని విపక్షం రాద్దాంతం చేస్తున్నది. ప్రభుత్వం మాత్రం సాయం ఇచ్చేందుకు ‘భూ భారతి’ లో విధివిధానాలను ఖరారు చేసింది. రైతుల పక్షాన నిలిచే అడుగడుగునా ప్రయత్నం చేస్తున్నది. సంక్రాంతికి అసలు రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రతిపక్షాలు ఎటుపోయి మహాలక్ష్మి 2500 ఇవ్వడం లేదని, శాంతిభద్రతలు క్షీణించాయని గగ్గోలు పెడుతున్నది. అయితే గత ప్రభుత్వంలో దిశ లాంటి సంఘటనలు కోకొల్లలు జరిగాయి. కాకపోతే ప్రజాపాలన సంబరాలలో అపశృతి మూటకట్టుకోవాల్సి వొచ్చింది. ఇటీవల జరిగిన భారీ ఎన్ కౌంటర్ రేవంత్ కు మద్దతు ఇస్తున్న ప్రజాస్వామ్య వాదులను ఇరకాటంలో పడేసింది.

చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు హైడ్రా విధి, విధానాలు ప్రజలకు చెప్పడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రతిపక్షాల పుణ్యమాని ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ పై ప్రజల్లో అవగాహన పెరిగింది. రైతు రాజ్యంగా దూసుకుపోతున్న క్రమంలో లగచర్ల సంఘటన విపక్షాలకు కోతికి కొబ్బరికాయ దొరికినట్టయింది. కులగణనకు ప్రజలు సహకరించలేదని విపక్షాలు జబ్బలు చరుచుకున్నా.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్ర‌భుత్వం కులగణన ద్వారా ఆర్థిక, సామజిక, విద్య, ఉద్యోగ డేటా సేకరించడంలో సఫలీకృతమైంది. వొచ్చే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో పాటు, ఇప్పటికే మిగిలి ఉన్న నామినేటెడ్ పదవుల్లో స‌ర్వ‌తోముఖాభివృద్ధికి, బీసీలకు సింహ భాగం ప్రాతినిధ్యం దొరుకుతుందని ఆశిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ ‘బంధు’ ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలపై మొసలి కన్నీరు కార్చడం విడ్డురంగా ఉంది. గత ప్రభుత్వం ప్రతికూలత, జ్ఞాపకాలకు దూరంగా రేవంత్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసి ‘రైజింగ్ తెలంగాణ’ దిశగా ముందుకు సాగుతోంది .కొత్త సంవత్సరం మొదటగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు సవాళ్లు కాంగ్రెస్ పార్టీకి పాలనపరంగా స్వాగతం పలకనున్నాయి.

-డాక్టర్ సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్-9866255355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *