“వాస్తవం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఏ సుముహూర్తంలో ఈ ప్రతిపాదన తెర మీదకు తెచ్చిందో గాని ఒక్కో సమావేశంలో ఒక్కో రాష్ట్రం మడత పేచీలు పెట్టడం రివాజు అయింది. ఇందులో కూడా మరో ట్విస్ట్ లేక పోలేదు. తమిళ నాడు లో ఎన్నికలు వస్తుందనగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సమావేశాల ముమ్మరం పెంచుతుంది. అయితే ప్రతి దఫా ఏదో ఒక విఘ్నం రావడం జరుగుతోంది. ఇలా మూడు నాలుగు మార్లు జరిగింది. ఇప్పుడు వచ్చే సంవత్సరం తమిళ నాడు లో ఎన్నికలు ఉన్నందున కొంత స్పీడ్ పెంచింది . కాని ఫలించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.”

కప్పల తక్కెడలాగా వివిధ రాష్ట్రాలు! బిజెపి దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసే పన్నాగంలో భాగంగా గోదావరి కావేరి పథకాన్ని అమలు చేసేందుకు పట్టు వదలని విక్రమార్కుడు లాగా గత ఏడెనిమిది సంవత్సరాలుగా వీలైనన్ని దారులు వెతుకుతోంది. కాని ఒక్కో సమావేశంలో ఒక్కో రాష్ట్రం సరికొత్త పేచీలు పెట్టడం రివాజైంది. డిసెంబర్ 23 వతేదీ ఢిల్లీ లో జరిగిన జాతీయ జల అభివృద్ధి సంస్థ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ అడ్డం తిరిగింది. ఇచ్చంపల్లి నుండి అనుసంధానం మొదలు పెట్టాలనే ప్రతిపాదన ఒక దశకు వస్తుందనుకుంటున్న సమయంలో ఆంధ్ర ప్రదేశ్ తీవ్ర అభ్యంతరం పెట్టింది. తమకు ఈ అనుసంధానం ఆమోదం కాదని తెలంగాణ ఎక్కువ గోదావరి జలాలు వాడుకొంటుందని చెబుతూ ఛత్తీస్ ఘడ్ తమ వాటా నీళ్లు కేటాయించేందుకు రాత పూర్వకంగా ఇవ్వాలనే షరతు పెట్టింది. అసలు ఇచ్చంపల్లి వద్ద నీళ్లు లేవని చెబుతూ ప్రత్యామ్నాయ ప్రతి పాదన చేసింది. తాము ప్రతిపాదన చేసిన పోలవరం నల్లమల సాగర్ లో భాగమైన బొల్లాపల్లి నుండి కావేరికి గోదావరి జలాలు తరలించమని కోరింది.
వాస్తవంలో తెలంగాణ తొలి రోజుల్లో ఇచ్చంపల్లి నుండి కాకుండా సమ్మక్క బ్యారేజీ నుండి తరలించమని పట్టుబట్టి వుండినది. ఎప్పుడైతే ఆంధ్ర ప్రదేశ్ బనకచర్ల అనుసంధానం తెర మీదకు తీసుకువచ్చిందో తెలంగాణ ఒక మెట్టుదిగి కౌంటర్ గా ఇచ్చంపల్లి వద్ద నుండి అనుసంధానానికి అంగీకరించుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జల శక్తి శాఖ మంత్రికి లేఖ రాశారు. ఇచ్చంపల్లి నుండి మొదలు పెట్టేందుకు జాతీయ జల అభివృద్ధి సంస్థ తొలి నుండీ మొగ్గు చూపడం గమనార్హం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాయడంపై బిఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లొంగి పోయాడని ఆరోపణలు కూడా చేశారు. ముఖ్యమంత్రి లేఖ తర్వాత ఒక దఫా జాతీయ జల అభివృద్ధి సంస్థ సమావేశం జరిగింది. కొన్ని షరతులతో తెలంగాణ అంగీకారం తెలిపింది. గోదావరి నుండి తరలించే నీటిలో 50 శాతం తెలంగాణకు ఇవ్వాలని రెండు రిజర్వాయర్ లు నిర్మించాలని తదితర షరతులు పెట్టింది. అయితే ఈ సమావేశంలో కూడా ఛత్తీస్గఢ్ తన వాటా నీళ్లు ఇచ్చేందుకు అభ్యంతరం పెట్టినా దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సమావేశం ముగిసింది. తదుపరి రెండవ సమావేశం డిసెంబర్ 23 వతేదీ జరగగా ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ అడ్డం తిరిగింది. తాను ప్రతి పాదన చేసిన అనుసంధానాన్ని తెలంగాణ వ్యతిరేకించు తున్నందున అందుకు ప్రతిగా ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు అడ్డం తిరిగింది.
గమనార్హమైన అంశమేమంటే గోదావరిలో మిగులు నీళ్లు లేవని కేంద్ర జల సంఘం ఇది వరకే స్పష్టం చేసింది. కేంద్ర జల సంఘం నికర జలాల లభ్యత లేకుండా ఇంత వరకు దేశంలో ఒక్క డి పి ఆర్ ఆమోదించ లేదు. తత్ఫలితంగానే గోదావరి కావేరి అనుసంధానానికి గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఇంకా వాడుకోకుండా మిగిలి ఉన్న ఛత్తీస్ ఘడ్ వాటా నీటి కోసం ఆరేడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వెంపర్లాడుతోంది. నికర జలాల లభ్యత వుంటేనే కేంద జల సంఘం డిపిఆర్ ఆమోదించుతుంది. వాస్తవం ఇలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బొల్లాపల్లి (పోలవరం)నుండి అనుసంధానం ఏ ప్రాతిపదికన చేపట్టమని చేసిందో తెలియదు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా పోలవరం నుండి అనుసంధానం మొదలు పెట్టమని పలు మార్లు కోరి ఉన్నారు.
అయితే పోలవరం వద్ద నికర జలాలు లేవని ఈ ప్రతిపాదనను జాతీయ జల అభివృద్ధి సంస్థ తరపున ఉన్న నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ వెదిరె శ్రీ రాం తిరస్కరించిన అనుభవం ఉన్నా ఆంధ్ర ప్రదేశ్ తిరిగి ఇదే ప్రతి పాదన చేసిందంటే దాని మాటున తాము ప్రతి పాదించిన అనుసంధానం గట్టెక్కించుకోవాలనే తపన తప్ప వేరు కాదు ఈ సందర్భంలో మహారాష్ట్ర ప్రభుత్వం తమకు 35 టియంసిలు కేటాయించాలనే డిమాండ్ పెట్టింది. సందట్లో సేమియా అన్నట్లు కేరళ తమనూ నీళ్లు కేటాయించాలని కోరింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదన తెర మీద తెచ్చింది. గంగా కావేరి అనుసంధానంలో భాగంగా మహానది గోదావరి అనుసంధానం .రానున్నదని ఆ తర్వాత నీటి కొరత ఉండదని ఊరించింది. వాస్తవంలో ప్రస్తుతం గంగా నది ప్రతిపాదన లేదు.
1989 లో జాతీయ జల అభివృద్ధి సంస్థ సర్వే చేసి తొమ్మిది అనుసంధానాలను. ప్రకటించింది. అందులో తొలి అనుసంధానం మహానది గోదావరి అనుసంధానం. మహానది (మణిభద్ర) నుండి 420 టిఎంసిలు తరలించి మార్గ మధ్యలో 220 టిఎంసిలు ఇవ్వగా మిగిలిన 200 టిఎంసిలు ఆంధ్ర ప్రదేశ్ లోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద చేరునట్లు ప్రతిపాదన చేశారు. గతంలో జరిగిన సమావేశాల్లో ధవళేశ్వరం వద్ద 200 టిఎంసిలు ఏం చేసుకొంటామని ఆంధ్ర ప్రదేశ్ పెదవి విరిచిన సందర్భముంది. పైగా మహానది లో మిగులు నీళ్లు లేవని ఒడిషా లో నిన్న మొన్నటి వరకు బిజూ పట్నాయక్ ప్రభుత్వం అడ్డం తిరిగింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కూడా మహానది ప్రస్తావన తీసుకురాలేదు. ప్రస్తుతం ఒడిషా లో బిజెపి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రతిపాదన తెచ్చినట్లు ఉంది. ఛత్తీస్గఢ్ లో బిజెపి ప్రభుత్వం ఉన్నా తమ వాటా నీళ్లు ఇచ్చేందుకు ఇష్ట పడటం లేదు.
ఒడిషా లో బిజెపి ప్రభుత్వం ఉన్నా ఎంత వరకు అంగీకరించుతుందో. అంతేకాదు. తెలంగాణ లో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోదావరి కావేరి ప్రతిపాదన వచ్చినపుడు ముందుగా మహానది గోదావరి అనుసంధానం చేసిన తరువాతనే గోదావరి కావేరి అనుసంధానం ముందుకు తీసుకెళ్లమని డిమాండ్ చేసిన రోజులున్నాయి. వాస్తవం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఏ సుముహూర్తంలో ఈ ప్రతిపాదన తెర మీదకు తెచ్చిందో గాని ఒక్కో సమావేశంలో ఒక్కో రాష్ట్రం మడత పేచీలు పెట్టడం రివాజు అయింది. ఇందులో కూడా మరో ట్విస్ట్ లేక పోలేదు. తమిళ నాడు లో ఎన్నికలు వస్తుందనగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సమావేశాల ముమ్మరం పెంచుతుంది. అయితే ప్రతి దఫా ఏదో ఒక విఘ్నం రావడం జరుగుతోంది. ఇలా మూడు నాలుగు మార్లు జరిగింది. ఇప్పుడు వచ్చే సంవత్సరం తమిళ నాడు లో ఎన్నికలు ఉన్నందున కొంత స్పీడ్ పెంచింది . కాని ఫలించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.





